ఊరిచివర ఒకసారి వారివైపు వస్తున్న త్రాచుపామునునాయుడి మనిషిని పిస్టల్ తో పేల్చి చంపాడు. ఒకసారి విశాల జారిపడితే ఆమె కాట్టే విశేషమైన దెబ్బలు తగలకపోయినా ఒకడు పరుగునవచ్చి ప్రథమ చికిత్సకు అవసరపడే మందులిచ్చి వెళ్ళాడు. ఒకసారి గోపీ మోటార్ సైకిల్ ట్యూబు పంక్చరైతే-ఒకడు స్వయంగా దాన్ని తోసుకునివెళ్ళి బాగుచేయించి తీసుకుని వచ్చాడు.
వీటన్నింటికీ గోపీ ఎంతగానో వినోదించాడు. విశాల మాత్రం "ఏ చీకూ చింతా లేకుండా ఇలా తిరుగుతూంటే ఈ ఫిరమ్గిపుఇరమ్ ఎంతో రమణీయమైనదని అనిపిస్తున్నది. ఇన్నాళ్ళుగా ఉంటూ ఈ ఊరి అందాలనిప్పుడే గుర్తించగలిగాను-" అన్నాడొకసారి.
"ప్రకృతి ఎక్కడైనా అందంగానే ఉంటుంది. ఈ అందాన్ని చూసి పరవశించడానికి బదులు-మనిషి సమస్యలు సృష్టించుకుని బెంబేలుపడుతూ ఎంతో మంచి సమయాన్ని వృధా చేసుకుంటాడు-" అన్నాడు గోపి.
గోపి ఫిరంగిపురం బయల్దేరడానికి ముందే అతడికి ముగ్గురు డూప్స్ తయారుచెయ్యబడ్డారు. ముఖంలో పోలికలు మాత్రమేకాక-వారు నడక వగైరా తీరుతెన్నులలో పూర్తిగా గోపిని అనుసరించగలరు. రూపురేఖలు మాస్కుసాయంలో మార్చుకొనడం జరుగుతుంది. అలాంటి వాడొకడు గోపితోపాటు ఫిరంగిపురంవచ్చి మామూలుగా అక్కడే జీవిస్తున్నాడు. చందూను వెళ్ళమని చెప్పి గోపి ట్రాన్స్మిటర్ ద్వారా వాడితో మాట్లాడి బస్ స్టాండుకు వెళ్ళమన్నాడు. వాడు అచ్చం గోపిలా తయారై బస్ స్టాండుకు వెళ్ళి చందూను కలుసుకున్నాడు. చందూవాడు గోపియేననిమోసపోయాడు. ఇద్దరూ కలిసి చందూ సూచించిన ఊరు వెళ్ళారు.
మొదటిరోజున నకిలీ గోపి చందూతో-కనబడిన ఓ అమ్మాయిని చూపించి-"మనిద్దరిలో ఎవరామె ప్రేమను పొందగలిగితే వారు జయించినట్లు. సాయంత్రందాకా టైము-" అన్నాడు.
ఇద్దరూ ఆమె వెంటబడ్డారు. ఆమెతో పరిచయం సంపాదించుకున్నారు. తమగురించి వర్ణించి చెప్పుకుని-"మా ఇద్దరిలో ఒకరిని వరించాలి నువ్వు. లేకుంటే నీ జీవితం నరకమవుతుంది-" అన్నారు.
ఆమె తెల్లముఖంవేసి- "నాకు మా బావతో పెళ్ళి నిశ్చయమయింది. మీరు స్నేహంగా మాట్లాడాలని సంతోషించాను. ఇలా మాట్లాడతారనుకోలేదు-" అన్నది.
చందూ ఖచ్చితంగా-"నీ పెళ్ళితో మాకు నిమిత్తంలేదు. ఇది మా ఇద్దరికీ పరీక్ష. చెప్పినట్లు వినకపోతే నువ్వూ వుండవు-నీ బావా ఉండడు-" అన్నాడు.
వాళ్ళు అన్నింటికీ తెగించిన మనుషులని గుర్తించిన ఆమెకు చాలా భయంవేసింది. ఆమె వారిని దూషించి ప్రయోజనంలేదని మంచి మాటలాడ్డానికి ప్రయత్నించింది. ఆమె మాట్లాడినకొద్దీ రెచ్చిపోయాడు చందూ. ఆమె అవస్థచూసి జాలిపడి చివరికి నకిలీ గోపి-"నువ్వు వెళ్ళమ్మా నీకేం భయంలేదు-" అన్నాడు.
చందూ కోపంగా గోపీవంక చూసి- "నువ్వేమంటున్నావో నీకు తెలుసా?" అన్నాడు.
"తెలుసు. ఈ పోటీలో నేనోడిపోయాను. ఆడవాళ్ళ విషయంలో కరకుగా ప్రవర్తించలేను-" అన్నాడు గోపి.
"అయితే మనం స్వతంత్రంగా బ్రతికే అవకాశం లేదు. నువ్వూ నాయుడి పక్షంలో చేరాలి. అంతేనా?" అన్నాడు చందూ దిగులుగా నటిస్తూ.
"అప్పుడే ఎక్కడయింది? జీవితంలో ప్రేమ ఒక్కటే కాదు మనిషి సత్తాను తేల్చేది..... అన్నాడు గోపి.
"సరే-నీ యిష్టం-" అన్నాడు చందూ.
మర్నాడు గోపి ఓ శేఠ్ దుకాణం చూపించి- "ఎవరిందులోంచి ఎక్కువ డబ్బు తేగలిగితే వారిదే జయం-" అన్నాడు చందూ వుత్సాహంగా అంగీకరించాడు. అతడు ఆ రోజంతా తిరిగి దుకాణం గురించి వివరాలు సంపాదించాడు.
నకిలీ గోపి సుఖంగా తన హోటల్ గదిలో విశ్రాంతి తీసుకున్నాడు.
చందూ రాత్రి గ్యాస్ బాంబు వుపయోగించి శేఠ్ అందులో పాతికవేలకుమించి క్యాషు వుంచలేదు.
మర్నాడు తెల్లవారుజామునే అతడు గోపీ గదికివెళ్ళి తలుపుతట్టాడు. నకిలీ గోపి ఆవులిస్తూవచ్చి తలుపు తీశాడు.
"నేను పాతికవేలు తెచ్చాను. నువ్వెంత తెచ్చావు?" అన్నాడు చందూ.
నిద్రమత్తులో ఉన్న గోపీకి చందూ మాట్లాడుతున్నదేమిటో అర్ధం చేసుకునేందుకు కాసేపు పట్టింది. తర్వాత అతడు- "నేను వెళ్ళేసరికే నువ్వు ఇనప్పెట్టె కాళీ చేశావు. నాకేమీ మిగల్లేదు. ఇందులో కూడా నేనోడిపోయాను-" అన్నాడు.
"ఇంకా ఏమైనా పరీక్షలు మిగిలాయా?" అన్నాడు చందూ.
అప్పటికి గోపి వాకబుచేసి ఆ ఊళ్ళోని పెద్దవస్తాదుగురించి తెలుసుకున్నాడు. ఆ వస్తాదు కొండల్ని పిండిగా కొట్టగలడని పేరు. కుస్తీలో అతడికి తెలియని పట్టులేదంటారు. ఆ పెద్దవస్తాదుని కుస్తీలో ఓడించాలన్నాడు గోపి.
సాయంత్రానికి పోటీ ఏర్పాటైంది. చందూ ఉదయమే బైటకువెళ్ళి మొత్తం వస్తాదు గురించిన వివరాలన్నీ షేకరించాడు. చందూకు కుస్తీ పోటీలలో అంతగా అనుభవం లేదు. అతడు పూర్తిగా తన బలంమీదనే ఆధారపడ దలిచాడు.
పోటీముందు చందూకీ వస్తాదుకీ మధ్య జరిగింది.
చందూ తన కండబలాన్ని వస్తాదుపై చూపించాలనుకున్నాడు. కానీ వస్తాదు అతడికి చిక్కకుండా అతణ్ణి పట్టడానికి ప్రయత్నించి కొంత విజయం సాధించాడు. వస్తాదు పట్టులో చిక్కుకుని చందూ కాసేపు నానా అవస్థాపడ్డాడు గిలగిలా తన్నుకున్నాడు. ఓటమికి దగ్గరలో ఉండగా అతడి చేతికి పట్టు దొరికింది. వస్తాదు చేతిని అతడు శక్తి కొలదీ పిడికిలితో పట్టాడు.
వస్తాదు కెవ్వుమన్నాడు.
ఆ తర్వాత పోటీ స్వరూపమే మారిపోయింది. చందూ విజయం సాధించాడు.
నకిలీ గోపి వస్తాదుతో పోట్లాడలేదు- "నువ్వు బలంతో అతడిని నెగ్గావు. నా కాంత బలంలేదు-" అనేశాడు గోపి.