Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 28

 

    "అలాగే" అన్నట్లు తల ఊపి వెళ్ళిపోయింది కుసుమ.
    సాధారణంగా కుసుమ చాలా నిరాడంబరంగా ఉంటుంది. ఆరోజు అంత శ్రద్దగా ఎందుకు అలంకరించుకోవాలని బుద్ది పుట్టిందో ఆమె ఆలోచించలేదు. వెకిలిగా లేకపోయినా, చూసీ చూడగానే "స్టయిల్" అనిపించే విధంగా అలంకరించుకుని సినిమాహాలు దగ్గరకొచ్చింది. అప్పటికే హాలు దగ్గర శ్యామ్ ఎదురు చూస్తున్నాడు.
    ఒక్కసారి చిరునవ్వుతో కుసుమకు నఖశిఖ పర్యంతం పరిశీలించాడు శ్యామ్. ఆ చూపులోని భావం అర్ధం చేసుకుని తల దించుకుంది కుసుమ. అంతటితో ఊరుకోలేదు శ్యాం.
    "ఇవాళ మీరు ప్రత్యేకంగా కనిపిస్తున్నారు" అన్నాడు చిలిపిగా.
    అతనలా స్పష్టంగా అనేయ్యటంతో కొద్దిగా ఉడుక్కుంది కుసుమ. విసురుగా ముఖం తిప్పుకుని "థాంక్స్" అంది నిర్లక్ష్యంగా.
    అతని చేతికి పది రూపాయల కాగితం అందిస్తూ "టికెట్స్ కొని తీసుకురండి" అంది.
    "కొనేశాను పదండి"
    "అదేమిటి? నన్ను తీసికెళ్ళమన్నరుగా!"
    "ఫరవాలేదు . ఈ టికెట్ డబ్బులు మీ దగ్గర వసూలు చేసుకోలేకపోను"
    'అంటే.....?"
    "అలా కనుబొమ్మలు ముడవకండి. రండి. హల్లో కూర్చుని దెబ్బలాడుకుందాం!"
    "దెబ్బలాడుకుందాం' అని అదోరకంగా సాగదీసి అన్నాడు శ్యామ్. నవ్వొచ్చింది కుసుమకు. తన మనసు శ్యామ్ కు తెలిసిపోతోందన్నమాట!
    సినిమాహాలులో కుసుమ పక్కన కూచున్నాక శ్యామ్ మెల్లిగా అడిగాడు.
    "మీ బామ్మగారిని తీసుకురాలేదేం?"
    ఫకాలున నవ్వేసింది కుసుమ. శ్యామ్ కూడా నవ్వాడు తనకు సహజమైన అల్లరి ధోరణిలో.
    ఈ నవ్వులతో తమ మధ్య వాతావరణంలోకి ఏదో మాధుర్యం ప్రవేశించినట్లు అనుభూతి కలిగింది కుసుమకి.
    సినిమా జరుగుతుండగా కొద్దిగా కుసుమ మీదకు వొంగి ఏదో వ్యాఖ్యానం చేశాడు శ్యామ్. అతని ఊపిరి ఆమె చెంపకు వెచ్చగా తగుల్తోంది. ఏదో అంటూ అతి మెల్లగా కదుల్తోన్న అతని పెదవులు ఎంతో అందంగా ఉన్నాయి. తన ముఖానికి అతి దగ్గరగా ఉన్న ఆ పెదవులు చెంపను తాకుతాయాఅనిపించింది. ఈ తలపుతో ఆపాడమస్తకమూ ఝల్లుమంది. అణవుణువూ ప్రచండ వేగంతో సంచలించింది. మనసు దిమ్మబోయింది.
    "ఏమంటారు?"
    ఉలిక్కిపడింది కుసుమ.
    "ఏమిటీ?" అంది.
    శ్యామ్ కర్ధమయిపోయింది. కుసుమ కళ్ళల్లో కళ్ళు పెట్టి కొంటెగా చిరునవ్వు నవ్వాడు. లజ్జతో తలవాల్చుకోకుండా ఉండటం కుసుమ తరం కాలేదు. దేనికైనా అనుభవించటం కంటే ఆ అనుభూతి కోసం వ్యగ్రతతో ప్రతీక్షించటంలో ఎక్కువ అనందముంది.
    శ్యామ్ చటుక్కున తన నడుం చుట్టూ చెయ్యి వేస్తాడేమో! చెక్కిలి ముద్దాడేస్తాడేమో!
    అధమం తన చేతిని అతని చేతిలోకి తీసుకుంటాడెమో!
    హాలులో ఉన్న రెండున్నర గంటలూ ఊపిరి బిగపట్టి కూచుంది కుసుమ.
    ఏదీ జరుగలేదు. మధ్య మధ్య యేవో అల్లరి వ్యాఖ్యానాలు చేస్తూ శ్యాం నవ్వాడు కుసుమ మీదకు కొద్దిగా వంగి అంతే!
    హాలులోంచి బయటికి వచ్చేసరికి తనకే తెలీకుండా కుసుమలో ఏదో నిరుత్సాహం చోటు చేసుకుంది.
    "వస్తాను" అంది రిక్షా కోసం చూస్తూ.
    "అదేం! స్వరం అంత నీరసంగా ఉంది! కాస్త కాఫీ తాగుతారా?"
    "ఏం వద్దు"
    "పోనీ కూల్ డ్రింక్ "
    నిజంగానే తనకు చాలా దాహంగా ఉన్నట్లు తోచింది కుసుమకి. మాట్లాడకుండా ఊరుకుంది. ప్రక్కనున్న కూల్ డ్రింక్ షాప్ లో డ్రింక్ కొని కుసుమ కిచ్చాడు.
    షాప్ వాడికి డబ్బు లివ్వబోయింది కుసుమ.
    ఆమెను వారిస్తూ తనిచ్చేశాడు శ్యాం.
    "ఉండనియ్యండి. అన్నీ ఒక్కసారే వసూలు చేసుకుంటాను" అన్నాడు చలోక్తిగా.
    "ఎప్పుడు? ఈ ఋణభారం ఎక్కువయిపోతోంది రోజు రోజుకి...."
    "రేపు పార్కులో...."
    "ఇది చాలా బాగుంది. పార్క్ కేవరోస్తున్నారు?"
    "నేనోస్తున్నాను. మీ దయ"
    శ్యాం కొంచెం బతిమాలి అంటే 'తప్పకుండా ' రానని అనాలనుకుంది కుసుమ. 'మీ దయ' అంటూ సంభాషణను తుంచేయ్యటంతో ఏం చెయ్యలేక ఊరుకుంది. రిక్షా మాట్ల్డుకుని 'గుడ్ నైట్' చెప్పి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా శ్యామ్ చిరునవ్వు మనసులో నుండి తొలగిపోలేదు కుసుమకి. తనకు శ్యామ్ కావాలని తేలిపోయింది. అతనికీ తనమీద నిజమైన అపేక్ష ఉంటె, అదంతా అల్లరి కాక నిజమైన అనురాగమే అయితే!
    తీయని కలల మధ్య కమ్మని నిద్రలోకి జారిపోయింది కుసుమ.
    ఆ మరునాడు ఆదివారం. పార్క్ కి వెళ్దామా వద్దా అని తర్జన భర్జనలు పడలేదు కుసుమ. వెళ్ళడానికే మనసారా నిర్ణయించుకుంది. సాధ్యమైనంత చక్కగా అలంకరించుకుని బయలుదేరింది.
    పార్క్ దగ్గర కుసుమను చూడగానే అర్ధం చేసుకున్నట్లు నవ్వాడు శ్యామ్. ఆ చిరునవ్వు కుసుమాలో సిగ్గు తెరలు సృష్టిస్తూ గిలిగింతలు పెట్టినం సాహసించి తన చిరునవ్వుతో సమాధానమిచ్చింది.
    అతని కళ్ళు సంతోషంతో తళుక్కుమనటం గమనించిన కుసుమ హృదయం ఆనందంతో ఊగిపోయింది. ఒత్తుగా పెరిగిన గడ్డిలో ఇద్దరూ కూచున్నాక కుసుమ వంక ఓరగా చూస్తూ "ఇవాళ బాగున్నారు" అన్నాడు శ్యామ్ లోలోపల బెడురుతూనే.
    కుసుమ చిన్న నవ్వుతో "ఇవాళ మాత్రమేనా?" అంది కవ్విస్తునట్లు.
    కుసుమ అలా మాట్లాడటంతో శ్యామ్ లో బెదురూ పూర్తిగా పోయింది.
    "రోజూ బాగుండేవారు . ఇవాళ మతి పోగొడుతున్నారు" అనేశాడు.
    "జాగ్రత్త! అంత తేలిగ్గా మతి పోగొట్టు'కోకండి" కుత్రిమ గాంభీర్యంతో అంది కుసుమ.
    ఆ గద్దింపుకి కొద్ద్దిగా జంకి, గడ్డిపరకలు తుంపసాగాడు శ్యామ్.
    "ఏదో మాట్లాడతానన్నారు...." అందించింది కుసుమ.
    "మేటర్ గురించి ఆలోచిస్తున్నాను." బయటపడటమా మానటమా అని సందేహిస్తూనే అన్నాడు శ్యామ్. ఆ సందేహాన్ని అతని కళ్ళలో చదివింది కుసుమ.
    "మేటర్ గురించి ఆలోచించవలసిన దశ రెండు సందర్భాల్లో వస్తుంది. ఒకటి, అక్కడవున్న మేటర్ తెలియకపోవటం , రెండు ఆ మేటర్ లో ఇంటరెస్టు లేకపోవటం. ఆ రెంటిలో మీ సందర్భం ఏది?"
    ఒక పక్కకి ఒరిగి కూచున్న శ్యామ్ ఆ మాటలతో ఎలర్ట్ గా కుసుమ వైపు తిరిగాడు.
    "ఇంటరెస్టు లేకపోవటం కాదు. తెలియకపోవటమే!' అన్నాడు గబుక్కున.
    "అయితే మీరిక ఎన్నటికీ తెలుసుకోరులెండి" అంటూనే కుసుమ లేచింది.
    లేచిన కుసుమ రెండు చేతులు పట్టుకుని "కుసుమా!" అన్నాడు శ్యామ్ బెదురుగా , ప్రేమగా, ఆత్రంగా.

 Previous Page Next Page