కిలకిల నవ్వేసింది కుసుమ.
* * *
జానకి మాధవకు ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తుంది. ఇంచుమించు ప్రతి ఉత్తరంలోనూ "మీ ఆస్తి మీరు స్వాధీనపరుచుకోండి" అని రాస్తూనే ఉంది. మాధవ జానకి ఉత్తరాలకూ ఆదరంగా సమాధానం రాస్తూనే ఆస్తి ప్రస్తావన మాత్రం ఎగరగొట్టేసేవాడు. జానకి మరీ మరీ గట్టిగా రాసినప్పుడు మాత్రం 'అక్కడకొచ్చి అన్ని సంగతులు మాట్లాడతాను" అని ఒక్క వాక్యం రాసేవాడు.
జానకి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం చదువుకుంటూ మంచం మీద పడుకున్నాడు మాధవ.
జానకి ఎంతో సభ్యతగా, అతి మర్యాదగా మాములు వ్యవహారాలు మాత్రమే రాసింది. అయినా ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరంలోనూ ఏదో ఆప్యాయత కనిపించసాగింది మాధవకు.
"ఏమిటంత దీక్షగా చదివేస్తున్నావ్?"
ఉలిక్కిపడి ఉత్తరం మూసి లేచి కూచున్నాడు మాధవ. సరళ చిరునవ్వుతో కుర్చీ మంచం దగ్గరకు లాక్కుని కూచుని "ఉత్తరం ఎవరి దగ్గరనుంచి" అంది.
"మా ఊరి నుంచి...."
"రైతులు రాశారా?"
సరళ ప్రశ్నకు సూటిగా సమాధానమివ్వకుండా మాట తప్పిస్తూ "పరీక్షలేలా రాశావ్?" అన్నాడు.
"బాగానే రాశాను. ఇవాళతో ఆఖరు. కాలేజి నుండి ఇంటి కెళ్ళకుండా ఇలా వచ్చేశాను. ఆయామ్ సారీ! వారం రోజుల నుండి నీకు కనిపించటం లేదు కదూ! నువ్వెంత బాధపదతావో నాకు తెలుసు.ఏం చెయ్యను మాధవ్! వెధవ పరీక్షలు. ఇప్పుడు కాస్త కష్టపడకపొతే సంవత్సరమంతా చదివింది వృధా అయిపోతుంది. అక్కడికీ శ్రద్దగా పాఠాలు చదువుతోంటే మధ్యలో నువ్వు గుర్తొచ్చి ఒక్కసారి నీ దగ్గరికి వచ్చేయ్యాలనిపించేది. నీ దగ్గర కొచ్చి నీతో కబుర్లాడేస్తున్నానంటే చదువు మీద అసలు మనసు నిలపలేనని భయమేసి రాలేదు. సరేలే! ఇంక పరీక్షలయిపోయాయిగా! రోజులన్నీ మనవే!" అతి అమాయకంగా, సంతోషంగా మెరిసే కళ్ళతో సరళ గడగడ మాట్లడేస్తోంటే నవ్వాలో, ఏడవాలో అర్ధం కాలేదు మాధవకి.
"ఇన్ విజిలేషన్ కారణంగా ఇక్కడున్నాను. ఈ సెలవుల్లో మా ఊళ్లోగడపాలనుకుంటున్నాను."
ఒక్క క్షణం సరళ ముఖం చిన్నబోయినా , అంతలో హుషారుగా నవ్వింది. "భలే! మంచి ఐడియా! ఎండల్లో పల్లెటూళ్ళు చాలా బాగుంటాయి. నీతో నేనూ వస్తాను. మీ అత్తయ్యగారు కూడా లేరుగా! ఒక్కడికీ ఏం తోస్తుంది నీకు?"
గొంతులో పచ్చి వెలక్కాయ పడింది మాధవకి.
"నువ్వెందుకు అక్కడికి?" అన్నాడు పొడిగా.
ఆ ధోరణికి తెల్లబోయింది సరళ.
"నేనెందుకా! నిన్ను విడిచి ఉండలేను గనుక. నన్ను విడిచి నువ్వు ఉండలేవని నాకు తెలుసు కనుక. నీకు మరీ ఇంత చాదస్తం పనికిరాదు. అమ్మావాళ్ళు ఎలాగూ ముహూర్తాలు చూస్తున్నారు. ఈ నెలలో కాకపోతే పై నెలలో పెళ్ళయిపోతుంది మనకి. అలాంటప్పుడు కలిసి మీ ఊరికి వెళ్ళటంలో తప్పేముందీ?"
గదమాయిస్తున్నట్లుగా అంటున్న సరళ ముఖంలోకి కొన్ని క్షణాలు చూసి చూపులు తిప్పుకున్నాడు మాధవ. ఇంక లాభం లేదు. చెప్పేయాలి సరళకు చెప్పేయాలి.
"సరళా! ఒకవేళ ఏ కారణం చేతనైనా మన పెళ్ళి కాకపోతే?"
మాధవ మాటలు పూర్తీ కాకుండానే సరళ ఒక్క ఉదుటున కుర్చీ లోంచి లేచి అతని మంచం మీద కూచుని తన చేత్తో నోరు నొక్కేసింది.
"వద్దు, వద్దు. వేళాకొళానీకైనా ఇలాంటి మాటలు సహించలేను. ఇంకెప్పుడూ ఇలాంటి వేళాకోళాలు చెయ్యకు."
అతి ప్రయాసతో తన నోటి మీదున్న సరళ చెయ్యి తొలగించాడు మాధవ.
"సరే ! వెళ్ళి ఆ కుర్చీలో కూర్చో"
చటుక్కున మాధవ నల్లెసుకుంది సరళ.
"ఊహూ! అక్కడ కూచోను. ఇలాగే ఉంటాను. ఇప్పుడు నువ్వన్న పిచ్చి మాటలతో నా గుండె ఎలా దడదడలాడుతుందో విను. నీకు ఒక్క క్షణం దూరం కావాలన్నా భయంగా ఉంది నాకు"
ఆ పరిస్థితి నుండి ఎలా బయటపడాలో అర్ధం కాలేదు మాధవకు. చటుక్కున ఒక ఉపాయం తోచింది.
"ఇలా ఇంట్లో వుంటే ఏం తోస్తుంది? సినిమా కెళ్దాం పద"
చిరునవ్వుతో లేచింది సరళ. "అదీ అలా సరదాగా వుండాలి. అంతేకాని అపశకునం మాటలు మాట్లాడకూడదు."
ఒక్క నిట్టుర్పూ విడిచాడు మాధవ.
లాభం లేదు. సరళ ముఖం మీద తనేమీ చేప్పలేడు. అంతా వివరంగా ఉత్తరం రాసెయ్యాలి. తరువాత ఏదయితే ఆదవుతుంది.
* * *
ఇంటిముందు పూల మొక్కలకు గొప్పులు తవ్వుతున్న సరళ మాధవను చూడగానే చకచకా చేతులు కడుక్కొని చిరునవ్వుతో "రా! నిన్ను గురించే ఆలోచిస్తున్నాను" అంది.
బాల్కనిలో సరళ చూపించిన కుర్చీలో కూచుని తన చేతిలో ఉత్తరాన్ని సరళ కందించాడు మాధవ.
ఆశ్చర్యంగా అందుకుంది సరళ.
"ఇదేం వింత? పోరుగూళ్ళో ఉన్నప్పుడు ఒక్క ఉత్తరం కూడా రాయవు. కాని, ఊళ్ళో ఉండి ఉత్తరాలు అందిస్తున్నావా? ఆ అపూర్వ విషయమేదో నీ బంగారు నోటితోనే చెప్పరాదూ?"
"చదువు" అన్నాడు మాధవ పొడిగా.
"అదేం అలా ఉన్నావు? ఉండు కాఫీ తెస్తాను"
"ఇప్పుడు నాకేం అక్కర్లేదు.
"అంతా నీ యిష్టమే! కాఫీ తాగితే గాని వీల్లేదు. నీ ముఖంలో ఉన్న అలసట ఆ మాత్రం అర్ధం చేసుకోలేననుకున్నావా?"
మాధవ వారిస్తున్నా కాఫీ తేవడానికి సరళ లోపలి కెళ్ళిపోయింది. సరళ కాఫీ కప్పుతో తిరిగొచ్చేసరికి మాధవ అక్కడ లేడు. సరళకు తల గిర్రున తిరిగినట్లయింది. కొంతసేపు అలానే అయోమయంగా నిలబడి యంత్రంలా కప్పు లోపల పెట్టేసి, దడదడలాడే గుండెలతో కవరు విప్పింది.
సరళా!
ఒకనాడు నిన్ను పెళ్ళి చేసుకోవాలని అనుకున్నప్పుడు నా మనసులో ఏ దురుద్దేశ్యమూ లేదు. మనసారా నిన్ను కోరాను. కాని ఆ తరువాత పరిస్థితులు నా చెయ్యి దాటి చిత్రచిత్రంగా తిరిగిపోయాయి. పోయిన ఏడాది సెలవుల కెళ్ళినప్పుడు అత్తయ్య నా పెళ్లి ప్రస్తావన తెచ్చింది. అప్పుడే నీ సంగతి చెప్పాలనుకొన్నాను. మన కులాలు ఒకటి కాకపోవటం మనకు సమస్య కాకపోయినా, పూర్వాచారపరాయణురాలయిన మా అత్తయ్యకు ఈ విషయం కొంత బాధ కలిగిస్తుందని నాకు తెలుసు. అనురాగం రూపు కట్టిన ఆ సౌమ్యమూర్తిని నొప్పించే సాహసం చేయలేక , నీ విషయం తరువాత చెప్పవచ్చునని వాయిదా వేశాను. చూసినంత మాత్రంలో ఏమవుతుందని అత్తయ్యను సంతోషపెట్టడానికి పెళ్ళి చూపులకు వెళ్ళాను. నిన్ను మనసులో నిలుపుకుని 'నచ్చలేదనే' చెప్పాను.
కాని, సరళా!
ఆ అమ్మాయి జానకి కన్నీళ్ళతో నన్ను ప్రాధేయపడి అడిగింది. నాకు తెలియని ఏదో శక్తి నన్ను వశపరచుకుంది. కరిగిపోయాను. ఆమె మెడలో తాళి కట్టేశాను. ఇప్పుడిక నా చేతుల్లో ఏమీ లేదు. నేను తప్ప 'నా' అనేవారు లేని ఆ అభాగ్యురా'లిని అన్యాయం చెయ్యలేను . నీకు రూపం, చదువు, డబ్బు అన్నీ ఉన్నాయి. నాకంటే అన్నివిధాల యోగ్యుడైన వాడు నీకు భర్తగా వస్తాడు. దయచేసి నన్ను మరిచిపో! క్షమించు.
మాధవ.