"నాది కాని దానిని నా దగ్గర ఉంచుకోలేను. మీకక్కర్లేకపొతే చింపేయ్యండి. దానం చేసుకోండి. నేను రేపు వెళ్ళిపోతున్నాను" మరొక్క మాట కవకాశమియ్యకుండా గబగబ అక్కడి నుండి వెళ్ళిపోయింది జానకి.
* * *
కాత్యాయని మరణించినా ఆ ఇంట్లో కాత్యాయని తిరుగుతున్నట్లే ఉంది జానకికి.
గాడనిద్రకు నోచుకోని జానకి కలత నిద్రలోనే కళ్ళు మూసుకుంది. తలుపు తట్టిన చప్పుడుకు నిద్ర చెదిరి మత్తుగా కళ్ళు విప్పింది. అంతలో ఒక మనవాకారం లోపలికి ప్రవేశించటంతో అప్రయత్నంగా కెవ్వున కేకపెట్టింది.
"నేను! నేను జానకి కంగారుపడకు" అంటూ ఒక చేత్తో జానకిని దగ్గరికి తీసుకుంటూ మరో చేత్తో లైట్ వేశాడు మాధవ.
విద్యుద్దీపకాంతిలో మాధవ కౌగిలిలో ఇమిడిపోయివున్న తనను చూసుకుని లజ్జతో కుంగిపోయింది జానకి. నెమ్మదిగా అతని కౌగిలి నుండి విడిపించుకుని దూరంగా తొలగి నుంచుంది.
"సారీ! నీకు ఇబ్బంది కలిగిస్తున్నాను" తొట్రుపడుతూ అన్నాడు మాధవ.
జానకి ఒక్కసారి తలెత్తి చూసి కనురెప్పలు వాల్చుకుంది. ఆ బెదురు చూపులకు మాధవ మనసు విలవిలలాడింది.
"భయపడకు నేను నిన్నేం చెయ్యను. కొంచెం మాట్లాడదామని వచ్చాను"
"ఫరవాలేదు కూచోండి.'
మాధవ వెంటనే జానకి మంచం మీద కూచున్నాడు. జానకిని చెయ్యి పట్టుకుని తన దగ్గరగా లక్కోవాలన్న కోరికను బలవంతాన అణచుకున్నాడు.
"నాకు భయపడి నువ్విక్కడి నుండి పారిపోనక్కర్లేదు జానకీ! నన్ను నమ్ము నీకు నా ప్రేమలో విశ్వాసం కుదిరి నన్ను స్వీకరించే వరకూ ఎన్నడూ నీకే చిరాకూ కలిగించను. నువ్వు నిశ్చింతగా ఇక్కడుండు"
"అది కాదు.."
"చెప్పేది విను. ఆ ఆస్తి నాదైనా నీదైనా దానిని నేను చూడలేను. ఇక్కడే ఉండి ఆ ఆస్తిని నువ్వే చూసుకో. ఏం, ఈ మాత్రం సాయం చెయ్యలేవూ!"
"కాని అది మీ పేర...."
మాధవ నవ్వాడు.
"అలాగే! నా పేర రాయించుకుంటాలే! నిదానంగా చెయ్యాలి ఆ పనులు. అంతవరకూ నువ్వు ఆ ఆస్తిని చూసుకుంటూ ఉంటావుగా?"
తల ఊపింది జానకి.
"ఇది చెప్పటానికే వచ్చాను వెళ్తాను"
మాధవ లేచి వెళ్ళిపోయాడు. ఇంక ఎంత ప్రయత్నించినా నిద్ర రాలేదు జానకికి. మాధవ లేని గది. మాధవను మరవలేని మనసు. మాధవతో కలియగలదన్న ఆశ లేని జీవితం.....అంతటా శూన్యమే తోచసాగింది. ఈ సంఘటన తరువాత జానికికి మాధవ దగ్గర బెరుకు చాలా తగ్గింది. అతనికేవేళ కది కనిపెట్టి చూడటంతో కొంత చనువు ఏర్పడింది. మాధవ కూడా జానకితో ఆప్యాయంగా, స్నేహంగా మాట్లాడసాగాడు. అప్పుడప్పుడు సాయంత్రాలు ఇద్దరూ తోటలోకి వెళ్ళేవారు. మాధవ తన కాలేజీ గురించీ, తోటి లెక్చరర్ల గురించీ , విద్యార్ధుల అల్లరి గురించి రకరకాల కబుర్లు చెప్పేవాడు. అతడేం చెప్పినా శ్రద్దగా వినేది జానకి . వేరు వేరు గదులలో పడుకున్నా రెండు గదులకూ మధ్య తలుపులు తెరిచే ఉండేవి.
మాధవ చాలా పుస్తకాలు చదివేవాడు. తను చదివిన వాటి గురించి రాత్రుళ్ళు జానకికి చెపుతుండేవాడు. ఒక్కొక్కసారి పన్నెండూ, ఒంటిగంట కూడా అయిపోయేది. అప్పుడప్పుడు కాత్యాయని లేని లోటు మనసును బాధిస్తున్నా రోజులు కులాసాగా దొర్లిపోసాగాయి.
జానకి చాలాసార్లు ఆస్తిని మాధవ పేర మార్పించటం గురించిన ప్రస్తావన తీసుకొచ్చింది.
"ఇదిగో! రేపే వెళ్ళి మన లాయరు గారితో మాట్లాడతాను" అనేవాడు మాధవ. ఆ 'రేపు' రాకుండానే అతడు ప్రయాణమయి వెళ్ళే రోజు వచ్చేసింది.
మాధవ బట్టలు పెట్టెలో జానకే సర్దింది. ఎంత ఆపుకున్నా జానకికి దుఃఖం ఆగటం లేదు. రెండుసార్లు బాత్ రూంలోకి వెళ్ళి కన్నీళ్లుగా గుండెల బరువు దింపుకుని ముఖం కడుక్కుని వచ్చింది. అయినా కళ్ళు ఉబ్బి ఎర్రగా కనిపిస్తూనే ఉన్నాయి.
"మరి నే వెళ్ళిరానా?" అన్నాడు మాధవ.
మళ్ళీ జానకి కళ్ళల్లో నీళ్ళు నిండాయి. చటుక్కున ముందు కడుగేసి ఆమెను దగ్గరకు తీసుకుని, కళ్ళు తుడిచాడు మాధవ. శరీరం పులకింత కాగా కొద్దిగా వెనక్కు వాలింది జానకి. ఆమెను వదిలి "సారీ!" అన్నాడు జానకి నవ్వింది.
సంతృప్తితో ఆ చిరునవ్వును చూస్తూ "నాకు ఉత్తరాలు రాస్తావుగా!" అన్నాడు.
:ఏముంటుంది రాయటానికి?" అంది జానకి.
ఆశ్చర్యపోయాడు మాధవ. మూగాదేవతలా అతి అమాయకంగా కనిపించే జానకిలో చిలిపితనం కూడా ఉంది కావలసినంత!
"రాస్తుంటే అదే వుంటుంది" కవ్వింపుగా అన్నాడు మాధవ.
"అన్నట్టు మీ ఆస్తి....."
"మరే! ఎప్పటికప్పుడు జామా ఖర్చుల వివరాలు రాస్తుండూ! నేను మళ్ళీ సెలవులకు వచ్చినప్పుడు స్వాధీనపరుచుకుంటాను."
సాహసించి జానకి చేతిని తన చేతులోకి తీసుకున్నాడు మాధవ. అతని చేతిలో తన చెయ్యి వణుకుతున్న వెనక్కు తీసుకోలేకపోయింది. ఆ చేతిని మృదువుగా నొక్కి "వస్తాను . ఉత్తరాలు తప్పకుండా రాయి. లేకపోతే నాకు పిచ్చెక్కుతుంది" అన్నాడు.
పాలేరు తెచ్చిన బండిలో కూర్చున్నాడు మాధవ. ఆ బండి కనుమరుగయ్యే వరకూ వీధి గేటు దగ్గరే నిలబడిపోయింది జానకి. కదులుతోన్న బండిలో కూచున్న మాధవ మనసులో ఆమె మూర్తి స్థిరపడిపోయింది.
8
తనను చూసిన శ్యామ్ చిరునవ్వు నవ్వగానే తన తల ఎందుకు భూమిలోకి దిగిపోతోందో అర్ధం కావటం లేదు కుసుమకి. అతడి చిరునవ్వును నిర్లక్ష్యం చెయ్యాలని ఎంత ప్రయత్నించినా సాధ్యం కావటం లేదు. ఎదుటివాళ్ళ గుండెలలోకి చొచ్చుకుపోయి హృదయాన్ని ఝల్లుమనిపించే లక్షణం ఉందా చిరునవ్వులో.
"ఇది చాలా అన్యాయం" అన్నాడు శ్యామ్ అల్లరినవ్వుతో.
ఆఫీసు వదిలి బయటకువస్తోన్న కుసుమ ఆశ్చర్యంగా చూసింది.
"ఏది అన్యాయం?"
"నేను మిమ్మల్ని సినిమాకి తీసుకెళ్ళాను. మీరు నన్ను తీసికెళ్ళాలి. ఇది న్యాయం. మీరేమో తప్పుకు తిరుగుతున్నారు."
"బాగుంది . నన్ను సినిమాకి తీసికెళ్ళమని మిమ్మల్నడిగానా?"
"అడగలేదు. నేనే పిలిచాను. పిలవగానే మీరు వచ్చారు. అంటే రావటం ఇష్టమనేగా! అలాగే మీరు నేను అడక్కుండానే పిలవాల్సింది. నోరువిప్పి అడిగినా , ముఖం తిప్పుకుంటున్నారు."
పొంగివస్తున్న నవ్వును పెదిమల మధ్య బిగించుకుంది కుసుమ.
"సరే! నేనూ సినిమాకు తీసికేల్తాను మిమ్మల్ని. ఈ బుణం నుండి బయట పడితేనే నాకు శాంతి.'
"ఋణాలు అంత తేలిగ్గా ఎలా తీరుతాయిలెండి! అసలూ తీరినా వడ్డీ ఉంటూనే ఉంటుంది."
'అయ్యా బాబోయ్! వడ్డీ ఒకటా! సింపుల్ ఇంట్రరేస్టా, కాంపౌండ్ ఇంటరెస్టా?"
"అన్ని సందర్భాలలోనూ సింపుల్ గా ఉంటే రాణించదు కదండీ! సరే! రేపు మీరు నన్ను సినిమాకి తీసుకెళ్తున్నట్లే కదా!"