సినిమా యాక్టర్ శ్రీనాద్ ఓ సూట్ కేస్ తీసుకుని చిరునవ్వుతో లోపలికొచ్చాడు కొంచెంగా తూలుతూ! "గుడ్ మార్నింగ్! రాత్రి కొద్ది మందే , పొద్దున్నే తాగేశానని అపార్ధాలు చేసుకోకండి ఎందుకిలా చెప్తున్నానంటే మా సినిమా వాళ్ళకు అపార్ధాల సీన్లంటే భయం. హీరో వాళ్ళఫీసులోని ఓ అమ్మాయితో స్టాక్ మార్కెట్ కుంభకోణం గురించి మాట్లాడుతుంటాడనుకొండి! వాళ్ళ మాటలు హీరోయిన్ కిటికీ వెనుక నుంచి వాళ్ళను అపార్ధం చేసుకుంటుంది. అంటే హీరోయిన్ అపార్ధం చేసుకోడానికి వీలుగా వాళ్ళ దైలాగులుంటాయన్న మాట "ఎంత పని చేశావ్ రాజూ! ఎంతో కాలం నుంచీ మనం కంటున్న కలలన్నీ ఇక కల్లలేనా?"
అంటే ఇద్దరూ చాలా రోజులనుంచి షేర్లు కొంటూ ధనవంతులయిపోవచ్చని కళలు కన్నారన్నమాట. కానీ హీరోయిన్ కి ఆ విషయం తెలీదు కాబట్టి అపార్ధం తీసేసుకున్న వాళ్ళిద్దరూ పాట ప్రేమికులను కుంటుంది.
"విధి బలీయం రాదా! ఇలా అవుతుందని నేనూ అనుకోలేదు అంతా మనం అనుకున్నట్లే జరుగుతుందనుకున్నాను."
"ఇప్పుడెం చేద్దాం రాజూ! మనిద్దరి జీవితాలు నాశనం అయ్యాయి. మన ఆశాసౌధాలు కూలిపోయాయి."
"మనిద్దరం ఆత్మహత్య చేసుకోవటం తప్ప గత్యంతరం కనిపించటంలేదు. లేదా మనసు యిలాంటి దుస్థితికి తెచ్చిన ఆ హర్ష ను చంపి వేస్తాను."
ఆ డైలాగ్ విని హీరోయిన్ ఉలిక్కిపడుతుంది.
ఎందుకంటే ఆ అమ్మాయి పేరు హర్షవర్ధిని . పైగా ఆమె చదువు సంధ్యలు లేనిది. అంచేత మెహతా అంటే ఎవరో తెలీదు.
అంచేత అంతవరకూ డైలాగులు విని ఏడుస్తూ పరుగెత్తి గంగలో దూకుతుంది. నిజంగా అయితే గంగలో దూకినోళ్ళు చస్తారు కాని సినిమాల్లో ఎవరూ చావరు. ఎన్ని రోజులు నీళ్ళల్లో వున్నా సరే! పైగా వీళ్ళు కూడా వాళ్ళని చంపవు. ఊరికే ఒడ్డుకి తోసేస్తాయి. అక్కడేమో యిలాంటి వాళ్ళను అమాంతం పట్టుకెళ్ళి పోషించడానికి జాలరి వాళ్ళు రడీగా వుంటారు. ఏమిటలా చూస్తున్నారు? బోరు కొడుతున్నానా?"
"అబ్బే లేదు" అన్నాడు రామచంద్రమూర్తి.
"పొద్దున్నే మీ కోసం గది శుభ్రం చేయించాను. రండి చూద్దురు గాని" అంది సీత.
నటరాజ్ సూట్ కేస్ తీసుకుని గదిలోకి నడిచాడు శ్రీనాద్ వెనుకే.
"ఆహా! ఒండరఫుల్ రూమ్! సౌత్ మోడల్ చాలా బాగుంది. అంత పెద్ద కిటికీలు ఈ మధ్య కాలంలో ఎక్కడా చూడలేదు. అవును! ఈ కిటికీ మూసేశారేమిటి?" అంటూ తీయటానికి కిటికీ దగ్గరకెళ్ళాడు గానీ నటరాజ్ చప్పున అడ్డు వచ్చాడు.
"అమ్మమ్మమ్మ! అది మాత్రం తెరవకండి! కొంపలు మునిగిపోతాయి లైట్లారిపోతాయి."
శ్రీనాద్ ఆశ్చర్యపోయాడు.
"అదేమిటి?"
"ఆ కిటికీ తెరిచావంటే ఎదురుగ్గానే ఉమాదేవి బెడ్ రూమ్ కిటికీ ఉంది. ఉమాదేవి వంక మనం చూడటం గానీ, మనవంక ఉమాదేవి చూడటం గానీ సీతమ్మగారికి నచ్చదు. తర్వాత మీ యిష్టం."
సీత నవ్వేసింది.
"అతని మాటలు నమ్మకండి! కిటికీ తెరిస్తే ప్రైవసీ వుండదని మూసెశాను" నటరాజ్ వైపు కోపంగా చూస్తూ అందామె.
శ్రీనాద్ హుషారుగా విజిల్ వేశాడు.
"ఉమాదేవంటే యిందాక అటో దిగుతున్నప్పుడు ఆ పక్కింటి అరుగు మీద నిలబడింది ఆ అమ్మాయేనా?"
"అమ్మాయేమిటిలెండి ! పెళ్ళయి వుంటే ఈ పాటికి నలుగురు పిల్లల తల్లి అయ్యుండేది" అంది కొంచెం కోపంగానే. ఎంత కాజువల్ గా అనడానికి ప్రయత్నించినా ఆమె గొంతులో చిరాకు కనబడుతూనే వుంది.
"నోనోనో ! అట్లా అనకండి! మంచి పర్సనాలిటీ! మంచి నిష్పత్తి ఇలాంటి వాళ్ళు సినిమా ఫీల్డ్ లో అడుగు పెట్టాలె గాబీ, దున్నేస్తారు. ఫామిలి టైప్ ముఖం, సెక్సీ ఫిగర్ వుండటం చాలా రేర్ కాంబినేషనండి!"
"ఆఫ్ కోర్స్, ఆ మాట నిజమే!" వప్పుకున్నాడు. రామచంద్రమూర్తి.
సీతకు చాలా అనీజీగా వుందా సంభాషణ. అతను ఉమాదేవినలా పొగడటం ఆమెకు ససేమిరా నచ్చటం లేదు.
"మీకు తెలీదేమో! ఆమె ఏజ్ ఎంత అనుకున్నారు?" అడిగిందామె.
"ఏంతంటారు ?"
"దగ్గర దగ్గర నలభై ఏళ్ళు."
"ఏం ఫర్లేదు! సినిమాల్లో చేరే వాళ్ళంతా చిన్న పిల్లలనుకుంటున్నారా ఏమిటి? ఓసారి ఓ తమాషా జరిగింది. మా డైరెక్టర్ గారు నేను కొత్తగా ఫీల్డులో కొచ్చినప్పుడు టీనేజ్ డ్ గా వున్న నాతో , మా హీరోయిన్ తో డబుల్ రోల్ చేయించాలనుకున్నాడు. అంటే తండ్రీ, కొడుకులగానూ, తల్లీ కూతుళ్ళుగానూ అన్నమాట. కానీ మేమిద్దరం మరీ లేత వయసులో వుండటం చేత ఎక్కువ వయసు చూపితే అసహజంగా వుంటుందేమోనని మేకప్ మేన్ తో మా వయసు పెంచి చూపించమన్నాడు. మేకప్ మేన్ మా యిద్దరినీ అయిదు నిమిషాల్లో తీసుకెళ్ళి డైరెక్టర్ ముందు నిలబెట్టాడు.
"అరె! చాలా వయసున్న వాళ్ళలాగానే సహజంగా కనబడుతున్నారే. ఏం మేకప్ వేశావ్ వీళ్ళకు?" అనడిగాడు.
"నేనేమీ చేయలేదండీ! ఇందాక లేతగా కనబడ్డానికి వేసుకున్న మేకప్ కడిగేశాను. అంతే" అన్నాడు మేకప్ మేన్.