Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 27


    "మనసు బాగోలేనప్పుడు- అప్పుడప్పుడూ కాలుస్తాను డాడీ."
    
    "మనసెందుకు బావుండదు"? ఏమిటి నీకొచ్చిన కష్టాలూ?

    "సి.ఎ. చాలా కష్టం డాడీ. ఎంత కష్టపడి చదివినా టూ పర్సెంట్, త్రీ పర్సెంట్ కంటే పాస్ చెయ్యరు. అందుకని దాన్ని గురించి ఆలోచించనప్పుడు భయమేసి, ఆ భయంతో మనసు బావుండదు డాడీ!"
    
    "అంతేనా?"
    
    "అంతే డాడీ."
    
    రాజాచంద్రకు జాలివేసింది. "నీకెందుకూరా మనసు బావుండకపోవడం ఎగ్జామ్స్ ఈవేళ కాకపోతే రేపు పాసవుతావు నీ వెనక మేమంతా లేమా?" అని ఓదార్చాలనిపించింది. కాని విశారదకు కోపమొస్తుందని ఊరుకున్నాడు.
    
    "ఏమయినా నువ్వు సరిగ్గా ఉంటే మంచిది" అన్నాడు.
    
    "అలాగే డాడీ."
    
    తరువాత మనోజ్ వైపు తిరిగాడు. "నీ గురించి చాలా వింటున్నాను."
    
    మనోజ్ ఏ తప్పు చేయనట్లు నిశ్చలంగా ఉన్నాడు. "ఏమిటి డాడీ?" అన్నాడు చాలా క్యాజువల్ గా.
    
    "నువ్వు ఎక్కువగా అమ్మాయిలతో తిరుగుతున్నావని విన్నాను."
    
    "తిరగటం అనేమాట మోటుగా ఉంది డాడీ. నాకు చాలామంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నమాట నిజమే అన్నాడు. మనోజ్ ఒప్పుకుంటున్నట్టుగా.
    
    "అదే ఎందుకు అని?"
    
    "దానికేముంది డాడీ? ఈరోజుల్లో గర్ల్ ఫ్రెండ్స్ ఉండటం కామన్ లేకపోతే వాణ్ణి ఓ చవటను చూసినట్లు చూస్తారు. అందులో నేను హ్యాండ్ సమ్ గా ఉంటానేమో మిగతావారి కంటే కొంచెం ఎక్కువగా ఉంటారు."
    
    "ఏడిశావ్! నీ హ్యాండ్ సమ్ నెస్ నువ్వూనూ అనబోయి మొహంలోకి పరీక్షగా చూసి ఆగిపోయాడు. "రాస్కెల్! నిజంగా హ్యాండ్ సమ్ గానే ఉన్నాడు. అమ్మాయిలు ఎగబడ్డారంటే ఎగబడరు మరి?" అనుకున్నాడు. తన అభిప్రాయాన్ని బయటకు చెబుదామనుకున్నాడుగాని భార్యకి కోపమొస్తుందని ఊరుకున్నాడు.
    
    "ఏడిశావ్ లేరా! నీ హ్యాండ్ సమ్ నెస్ నువ్వూనూ! డాడీ చిన్నప్పుడు ఇంతకన్న అందంగా ఉమ్డేవారు తెలుసా?" అన్నాడు రాఖేష్.
    
    రాజాచంద్ర గర్వపడబోయి విశారద ముఖంలోకి చూసి ఆగిపోయాడు.
    
    "అది సరే ఐ డోన్ట్ వాన్ట్ ఆల్ దోజ్ పాయింట్స్ గర్ల్ ఫ్రెండ్సు అదీ అని టూమచ్ గా తిరగటం....దటీజ్ వెరీ బాడ్" అన్నాడు ఖచ్చితంగా మాట్లాడుతున్నట్లు.
    
    "అయ్యో! అది తిరగటం కాదు డాడీ. సోషల్ గా మూవ్ అవటం. ఇప్పటి రోజుల్లో బాయ్స్, గర్ల్స్ ఇలాగే ఉంటారు డాడీ. మనస్సులో ఏమీ ఉండదు. ఎవరి లైఫ్ వారిదే!"
    
    "అంతేనంటావా?"
    
    "అంతే డాడీ."
    
    "సరే మీరిద్దరూ లోపలికెళ్ళండి" అని కొడుకులిద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోయాక "వినూత్నా ఇలారా! నా ఎదురుగా నిల్చో" అన్నాడు రాజాచంద్ర.
    
    వినూత్న సోఫా చుట్టూ తిరిగి వచ్చి తండ్రికెదురుగా నిలబడింది.
    
    రాజాచంద్ర కాఠిన్యం తెచ్చుకుంటున్నాడు. వినూత్న మౌనంగా నిలబడింది.
    
    "నువ్వు... ఎవరో అబ్బాయితో స్కూటర్ మీద తిరుగుతున్నావని తెలిసింది."
    
    "అతను ధర్మేన్ డాడీ. నా స్నేహితుడు. చాలా మంచివాడు."
    
    "మంచివాడయితే మాత్రం, అలా ఆడపిల్ల పరాయి మొగాడితో స్కూటర్ మీద తిరగటం మంచిది కాదని తెలీదా?"
    
    "ఈరోజుల్లో ఆడపిల్ల బయటికివెడితే ఒకరితో మాట్లాడకుండా, ఒకరికి తన శరీరం తగలటం తప్పయినట్లుగా మడిగట్టుకు కూచుంటే జరగదు డాడీ! క్లాస్ మేట్స్, అనేక పరిస్థితుల్లో పరిచయమైన బయటివాళ్ళు- వీళ్ళందరితో సభ్యతకోసం ఎంతో కొంత చనువుగా ప్రవర్తించాల్సి వస్తుంది- ఒకరితో హోటలుకు వెళ్ళినంత మాత్రాన, స్కూటర్ వెనక కూర్చుని వచ్చినంత మాత్రాన ఏదో ప్రళయం జరిగిపోతున్నట్లు అనుకోబోకండి- మా హద్దులు ఏమిటో, ఎవర్ని ఇంతలో ఉంచాలో మాకూ తెలుసు."
    
    ఈ మాటలనేసి వినూత్న కొంచెం విసురుగానే లోపలికెళ్ళిపోయింది.
    
    రాజాచంద్ర స్తబ్దుడైపోయినట్లు కూర్చుండిపోయాడు.
    
    ఇంత జరుగుతున్నా విశారద ఒక్కమాట కూడా మాట్లాడకుండా, మెదలకుండా కూర్చుంది.
    
                                         * * *
    
    ఓ గంటపోయాక రాజచంద్ర, విశారద ఇద్దరూ బెడ్ మీద పక్క పక్కన పడుకుని వున్నారు.
    
    "మనం పిల్లల్ని ఇంకా కొంచెం విశాలదృక్పథంతో అర్ధం చేసుకోవాలనుకుంటాను" అన్నాడు రాజాచంద్ర మెల్లగా.
    
    విశారద మాట్లాడలేదు.
    
    "వాడు సిగరెట్లు తాగాడంటే.... మరి ఈ రోజుల్లో అలాంటి చిన్న చిన్న అలవాట్లు లేకుండా ఉండదు. దాన్ని పెద్ద తప్పుగా తీసుకోకూడదు."
    
    విశారద మౌనంగా ఉండిపోయింది.
    
    "మనోజ్ చుట్టూ ఆడపిల్లలు మూగుతున్నారంటే.... సోషల్ గా మూవ్ అవటం, ఈరోజుల్లో ఫ్యాషనైపోయింది. అందులో వాడు...." హ్యాండ్ సమ్ గా ఉంటాడు' అనబోయి నోరు మూసుకున్నాడు.
    
    విశారద జవాబు చెప్పకుండా అలానే ఉంది.
    
    "వినూత్న అలా స్కూటర్ మీద రావటం కొంతవరకూ తప్పే అనుకో. కాని అది చెప్పినట్లు... అంత తెలివైన ఆడపిల్ల దాని లిమిట్స్ లో అది తప్పకుండా ఉంటుంది."
    
    విశారద ఊఁ అనలేదు ఆ అనలేదు.
    
    "నే నిందాకటి నుంచీ ఎన్నో పాయింట్లు చెబుతుంటే నువ్వు మాట్లాడవేం? అసలేమిటి నీ ఉద్దేశం... నేను"

 Previous Page Next Page