తన ఫ్రెండ్సంతా ఏంచేస్తున్నారో!
స్కూల్!
చదువు!
ఎంత పోటీపడి చదివేది! ఎన్ని ఆటలు ఆడేది!!
సరిగ్గా ఆ సమయానికి కారు డ్రైవ్ చేస్తూ డాక్టర్ అశోక్ అటుకేసి వస్తున్నాడు. ప్రక్కన జూలీ వుంది.
చీకటిపడింది. హెడ్ లైట్స్ వెలిగించాడు.
అతనికాదారి కొత్త ఆ సంఘటన జరిగినప్పట్నుంచీ ప్రతిరోజూ సాయంత్రం ప్రశాంతతకోసం జూలీని తీసుకుని ఎటో ఓవైపు డ్రైవింగ్ కి వెళుతున్నాడు. "అశోక్ డియర్! ఈమధ్య చాలా ముభావంగా వుంటున్నావు. కారణం ఎంత తరచి అడిగినా చెప్పటంలేదు. చెప్పవా?" అనడిగింది.
"నిజంగా ఏమీలేదు జూలీ"
"మరి?"
"నేను మామూలుగానే వుంటున్నాను."
"అశోక్! చీకటి పడిందా?"
"పడింది."
ఆమె అతనికి దగ్గరగా జరిగి భుజంమీద తల ఆన్చింది. "ఎందుకంటే మీ ఇండియాలో అన్నీ తప్పు ప్రతిదానికీ పెడర్ధం తీస్తారు. భర్తకు యిలా దగ్గరగా, ఆనుకుని కూర్చోవాలన్నా...."
అతను ఎడమచేతిని ఆమె భుజంచుట్టూ పోనిచ్చి మరింత దగ్గరగా లాక్కున్నాడు.
"అశోక్! నువ్వు నాకు దూరమవుతావని భయంగా వుంది."
"అలా ఎన్నటికీ జరగదు జూలీ!"
"అశోక్! మనం ఎటువైపు పోతున్నాం."
"తెలీదు. ఈ దారి నాకూ కొత్త."
"కొత్త దారే బావుంటుంది అశోక్! నీక్కూడా బావుంది కదూ?"
"చాలా."
డాక్టర్ అశోక్ కు దూరంగా నడుస్తూ, ఎదురుగా వస్తున్న పాప కనిపించింది.
మొదట మసక మసగ్గా కనిపించింది. తర్వాత గుండె గబగబ కొట్టుకుంది.
"అశోక్! ఏమిటిది?"
ఆమె దేన్నిగురించి అడుగుతుందో అర్ధంకాలేదు.
"నీ చెయ్యి ఎందుకలా వణికింది?"
"ఎదురుగా ఓ పాప..."
"ఊ"
"కారుకు అడ్డుగా వస్తుంది" అప్రయత్నంగా బ్రేక్ వేసేశాడు.
"అశోక్! కారాపేశావేం?"
"పాప...."
అప్పటికి రాధ కారుదగ్గరకు వచ్చేసింది.
"మరీ చిన్నపిల్లా? తప్పుకోవటం రానంత చిన్నవయసులో వుందా? పాపం తెలీదేమో, దిగి చూద్దాం అశోక్."
".....వద్దులే."
"ఏమిటి అశోక్. నువ్వేనా యిలా మాట్లాడేది? ప్లీజ్! డోర్ తియ్యి."
డాక్టర్ అశోక్ కి తప్పలేదు. వంగి ఆమెవైపు డోర్ తెరిచి, తర్వాత తనవైపు డోర్ తెరుచుకుని దిగి, చుట్టూ తిరిగి వచ్చి, జూలీకి చెయ్యి అందించి, బయటకు దింపాడు.
అప్పటికి రాధ కారుకు రెండడుగుల దూరంలోకి వచ్చేసింది.
డాక్టర్ అశోక్ జూలీ చెయ్యి పట్టుకుని ఆమెకు దగ్గరగా వెళ్ళాడు.
"పాపా!" అన్నాడు.
అడుగులో అడుగు వేసుకుంటూ వస్తున్న రాధా ఉలికిపడింది.
ఈ గొంతు....ఆమెగుండె దడదడ కొట్టుకున్నది. ఎక్కడో విన్నట్టుంది.
"ఎవరు మీరు?" అంది.
"నేనూ, నా భార్య యిటుపోతుంటే నువ్వు ఆడ్డుగా వస్తున్నావు అందుకని కారాపాను."
"అదిసరే ఎవరు మీరు?"
"నేను.... నేనెవరో నీకు తెలీదు."
"బేబీ! ఇలా కారుకెందుకు అడ్డుగా వస్తున్నావు?" అనడిగింది జూలీ.
ఆమె గొంతులోని తియ్యదనానికి రాధ ముగ్దురాలయింది. ఆమె కాన్వెంట్ లో చదువుతూ వుండటంవల్ల ఇంగ్లీషు కొద్దిగా వచ్చు చిన్న చిన్న మాటలు మాట్లాడగలదు కూడా కాని జూలి ఉచ్చారణ ఆమెకు అర్ధంకాలేదు.
"ఐ...ఐ...కాన్ట్ సీ" అంది ఆమెప్రశ్నలోని భావాన్ని కొంతవరకూ అర్ధంచేసుకుని.
జూలీకి అర్ధమయింది. "మైగాడ్! ఎందుకని?" అనడిగింది ఆశ్చర్యంగా.
రాధ జవాబు చెప్పటానికి పెదవులు కదిపింది. కాని డాక్టర్ అశోక్ అందుకుని "పాపకి చూపులేదు" అన్నాడు.
"హారిబుల్" అంది జూలీ. చేయిజాపి తడిమి పాపచెయ్యి అందుకుంది.
"బేబీ! ఐ టూ కాన్ట్ సీ.'
రాధకు అర్ధమయింది. "అయ్యో!" అంది. "మీకు....మీకేం జరిగింది?" అని అడిగింది తెలుగులో, జూలీకి తెలుగు రాదని తెలియక.
"నా భార్య జూలీకి అమెరికాలో వున్నప్పుడు కారు ప్రమాదంలో చూపు పోయింది."
"పాపం" అంది రాధ జాలిగా. "నాకు ఏదో జబ్బు వచ్చి...." అని టూకీగా జరిగింది చెప్పి, "రెండు కళ్ళూ పోయాయి" అన్నది చివరకు.
"ఏమిటి అంటున్నది?" అనడిగింది జూలీ.
"తనకు మొదట్నుంచీ చూపులేదట" అన్నాడు డాక్టర్ అశోక్. అతని కంఠం కొద్దిగా వణికింది. శరీరానికి చెమటలు పడుతున్నాయి.
"ఏదో ఆపరేషన్ అంటున్నది."
"ఆపరేషన్ జరిగితే వస్తుందేమోనని చాలా ప్రయత్నించారుట. కాని ప్రయోజనం లేకపోయిందని చెబుతున్నది."
"నీకంటే పెద్ద డాక్టరు ఎవరుంటారు అశోక్? నువ్వు హాస్పిటల్ కి పిలిపించి ప్రయత్నించకూడదూ?"
"అలాగే"
"పాప చాలా అందంగా వుందా?"
"బహుశా.... కళ్ళు వుంటే చాలా అందంగా వుండివుండేది."
"బేబీ! ఐ లైక్ యూ" అంది జూలీ రాధచేతిని ముద్దుపెట్టుకుంటూ.
"మీ భార్య అందంగా వుంటారా?" అనడిగింది రాధ అతన్ని.
"నా కళ్ళకి చాలా అందంగా వుంటుంది."
"ఐ టూ లైక్ యూ" అంది రాధ జూలీచేతిని తిరిగి ముద్దుపెట్టుకుంటూ.
"ఐ లైక్ యువర్ స్వీట్ వాయిస్ ఆల్సో" అంది తిరిగి.
రాధకు తనగురించి అతను భార్యతో గబగబ చెప్పటంవల్ల సరిగ్గా అర్ధం కాకపోయినా అందులో ఏదో అపశ్రుతి వున్నట్లనిపించింది. కాని అడిగితే సభ్యతగా వుండదని ఊరుకుంది.
కాని ఎక్కడో విన్నట్లున్న ఆ గొంతు....
"బేబీ! ఇవాల్టినుంచీ మనమిద్దరం ఫ్రెండ్స్" అంది జూలీ ఆమె ఆలోచనకు అంతరాయం కలిగిస్తూ.
కొంచెం దూరంలో సునీత గుడినించి నడిచి వస్తూ రాధరోడ్డుమీద ఎవరితోనో మాట్లాడుతూ వుండటం ఆ చాలీ చాలని వెల్తుర్లో చూసింది.