వీరేంద్రనాథ్ రచనల్లో పాఠకుల్లో ఆకర్షించేవి లెక్ఖలు, రచయిత పరిజ్ఞానం, పాత్రల (ముఖ్యంగా హీరో హీరోయిన్ లు వేసే) ట్రిక్కులు వగైరా, ఇరవై సంవత్సరాల క్రితం కథల్లోనే అలాటి గిమిక్స్ మనకి కనపడతాయి. ఉదాహరణకి ఈ రెండు కథలూ చదవండి -
చెల్లు
ఒక ఊళ్ళో రామయ్య అనే అమాయకుడు ఉండేవాడు. ఒకసారి అతనికి అవసరంగా అయిదువందల రూపాయలు కావలసి వచ్చింది. ఊరంతా తిరిగి నిస్పృహచెంది ఇంటికి వస్తూ, దారిలో గుడి తగిలితే లోపలికి వెళ్ళి, చివరి ప్రయత్నంగా దేవుణ్ణి ప్రార్ధించి, "స్వామీ! ఇవాళ నాకు ఎంత దొరికినా అందులో సగం నీకిస్తాను" అని అనేశాడు.
చాలా చిత్రంగా ఆ రోజు అతను తన పొలంలో పని చేసుకుంటూ వుంటే ఏనాటిదో ఒక సంచీ దొరికింది. అందులో వెయ్యి రూపాయలున్నాయి. రామయ్య ఎంతో సంతోషించి, ఆ డబ్బుతెచ్చి భార్యకిచ్చి, తన దేవుడి మొక్కు సంగతి చెప్పాడు.
"గుడి ధర్మకర్త అంతా స్వాహా చేస్తాడు. అందుచేత దేవుడి పేరు చెప్పి బీదలకు సంతర్పణ చెయ్యటం మంచిది" అని రామయ్య భార్య సలహా ఇచ్చింది. రామయ్య వెంటనే గ్రామాధికారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి తాను బీదలకు సంతర్పణ చెయ్యబోతున్నానన్నాడు. గ్రామాధికారి ఎంతో సంతోషించి, మర్నాడు బీదలకు సంతర్పణ జరుగుతుందని చాటింపు వేయించాడు.
కానీ గుడి ధర్మకర్త దుర్మార్గుడు. రామయ్య మొక్కుకున్న సంగతి పూజారిద్వారా వినివున్నాడు. ఆ రామయ్యే బీదలకు సంతర్పణ చేస్తున్నాడని విని ఆయన గ్రామాధికారి దగ్గరికి వచ్చి "సంగతి ఏమిటి?" అని అడిగాడు. గ్రామాధికారి రామయ్యకు వెయ్యి రూపాయలు దొరికిన సంగతి చెప్పాడు.
"రామయ్య దేవాలయానికి సగం ఇస్తానని మొక్కుకున్నందువల్లనే ఆ డబ్బు దొరికింది. న్యాయంగా అందులో సగం ఆలయానికి చెందాలి. ఆ డబ్బును అతను ఇలా ఖర్చు చెయ్యటం అక్రమం" అని దుర్జనుడు పేచీ పెట్టాడు.
ధర్మకర్త దుర్జనుడు డబ్బు తినటంలో అఖండుడని గ్రామాధికారికి తెలుసు. కానీ, ఆయన చెప్పేది సబబుగానే వున్నట్టు కనబడింది. అందుచేత గ్రామాదికారి రామయ్యను పిలిపించి అయిదువందలు ఆలయానికే ఇవ్వమని తీర్పు చెప్పాడు.
రామయ్య విచారంగా ఇంటికి వెళ్ళాడు. ఏం జరిగిందని భార్య అడిగింది. రామయ్య ఆమెకి జరిగింది చెప్పి, "బీదవాళ్ళకు సంతర్పణ చెయ్యటం ఏ పరిస్థితిలోనూ మానను. మిగిలిన అయిదు వందలూ ఆలయానికి ఇచ్చేస్తాను" అన్నాడు.
రామయ్య భార్యకు హఠాత్తుగా ఒక ఆలోచన వచ్చింది. ఆమె దాన్ని తన భర్తకు రహస్యంగా చెప్పింది.
మర్నాడు ఆ గ్రామంలో పేదలకు బ్రహ్మాండమైన సంతర్పణ జరిగింది. కాని రామయ్య ధర్మకర్తకు అయిదువందలూ తెచ్చి యియ్యలేదు. ఒళ్ళు మండి దుర్జనుడు గ్రామాధికారి వద్దకు వచ్చి రామయ్యమీద ఫిర్యాదు చేశాడు.
గ్రామాధికారి రామయ్యను పిలిపించి సంజాయిషీ అడిగాడు.
రామయ్య చేతులు జోడించి "దేవుడి డబ్బు వుంచుకుంటానాండీ? ఇవ్వాలనే అనుకున్నాను-" అని ఆగాడు.
"మరి ఇంకెందుకు ఆలస్యం? అన్నాడు ధర్మకర్త కోపంగా.
"డబ్బు ఇద్దామనే మర్నాడు మళ్ళీ గుడికి వెళ్ళి ఇంకో వెయ్యి రూపాయలు దొరికేటట్లు చెయ్యమనీ, అందులో కూడా సగం ఇస్తాననే మొక్కుకొన్నానండి. మొత్తం వెయ్యి దేవుడికే ఇచ్చేద్దాంగదా అనుకున్నానండి. కాని ఆ రోజు నాకు ఏమీ దొరకలేదండి. నేను మొక్కుకున్న వెయ్యి రూపాయలు దేవుడికే కదా, దాన్ని ఆయనే వుంచేసుకుని నా బాకీ చెల్లుబెట్టుకున్నాడు అనుకున్నానండి" అన్నాడు రామయ్య.
గ్రామాధికారి నవ్వి, ధర్మకర్త దుర్జనుడు చేసిన ఫిర్యాదు కొట్టిపారేశాడు.
(చందమామ-70)
-- * * * --