ఒక శెట్టిగారు ఒక జ్యోతిష్కుడితో మాట్లాడుతుండగా అక్కడికి ఓ పేద కుర్రవాడు వచ్చాడు. జ్యోతిష్కుడు శెట్టిగారికి ఆ కుర్రవాణ్ణి చూపించి "వీడి తండ్రి కూలి చేసుకొని బతుకుతాడు. అయితేనేం? వీడికి త్వరలో ధనయోగం వున్నది. వీడి తండ్రి సుఖపడిపోతాడు" అన్నాడు.
జ్యోతిష్కుడిమీద మంచి గురివున్న శెట్టిగారు ఆ కుర్రవాడి తండ్రిని వెతుక్కుంటూపోయి, "నీ కొడుకు భారం కొంతకాలం నాకు వదిలిపెట్టు, నీకు రెండువందల వరహాలిస్తాను" అన్నాడు.
కూలివాడికి ఏదో అనుమానం వేసి, "ఏ ఉద్దేశ్యంతో అడుగుతున్నారని అన్నాడు.
"దురుద్దేశమేమీ లేదు. వాడంటే ముచ్చటపడ్డాను. వాడికి మా ఇంట రాజోపచారంగా జరుగుతుంది. కావలిస్తే ఇంకో మూడు వందలు తీసుకో అన్నాడు శెట్టిగారు.
కూలివాడికి అయిదువందలు ముట్టాయి. వాడి కొడుకుకు శెట్టిగారి ఇంట రాజోపచారంగా జరుగుతున్నది. నెల గడిచినా వాడికి డబ్బేమీ రాలేదు.
శెట్టిగారు జ్యోతిష్కుడివద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, "ఆ కుర్రవాడికి ఇంతదాకా ధనయోగం పట్టలేదే?" అన్నాడు.
"పట్టకపోవడ మేమిటి? నువ్విచ్చిన డబ్బుతో వాడి తండ్రి పది గేదెలను కొని, నిక్షేపంగా వ్యాపారం చేసుకుంటున్నాడు" అన్నాడు జ్యోతిష్కుడు.