Previous Page Next Page 
క్షమించు సుప్రియా! పేజి 27

   

      జయదేవుడు తోక తొక్కిన తాచులాగా అయిపోయి, ప్రతాపున్ని బంధించి, చెరసాలలో పెట్టించమని ఉత్తర్వునిచ్చాడు.
   
    ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్దితో వచ్చినవాడు కాదనీ, తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లూ పడ్డాడనీ, అతన్ని వెంటనే చెర విడిపించి, తమ కిద్దరికీ వివాహం చెయ్యమనీ దీనంగా వేడుకున్నది.
   
    "ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం బోధించకు. నిన్ను ఎలాటి వాడికిచ్చి పెళ్ళిచెయ్యాలో నాకు బాగా తెలుసు" అని జయదేవుడు తన కుమార్తెను విదిలించి పారేశాడు.
   
    ఆ సాయంకాలమే ఆయన చెరసాలకు వెళ్ళి, ప్రతాపున్ని కలుసుకుని "బుద్దిహీనుడా, ఈ రాజ్యంలో అడుగు పెట్టటం అపాయమని తెలిసికూడా ఎందుకు అడుగుపెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికిపందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీయిస్తే అడ్డేదెవరు?" అని అడిగాడు.
   
    ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు. కాని అలాటిదేమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, "నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమంకోసం కాదు, మీ రాజ్యం క్షేమంకోరి నేను బాహాటంగా రాదలిస్తే సైన్యాలతోనే రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్కరోజులో స్మశానం మారిపోతుంది. నేను వచ్చినది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి, మీ రాజ్యాన్ని నేల మట్టం చెయ్యటానికి కాదు" అన్నాడు.
   
    "నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా?" అని జయదేవుడు అడిగాడు.
   
    "తెలుసుకున్నాను. నన్ను పెళ్ళాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది" అన్నాడు ప్రతాపుడు.
   
    "పిరికిపందవు! నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్ళాడి, ఆ విధంగా నా రాజ్యం హరించుకుందామనుకున్నావు. నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు?" అన్నాడు జయదేవుడు.
   
    "మీ కుమార్తెను పెళ్ళాడటంతోబాటు మన రాజ్యాలు రెండూ ఏకం కావాలన్నకోరిక కూడా నాకున్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి. మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చేయాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెర పెట్టించారు" అన్నాడు ప్రతాపుడు.
   
    "నువ్వు ఎంతో పిరికిపందవై వుంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కనుక పెట్టాలని పెట్టాలని చూడవు. నీకు శిరచ్చేదమే తగినశిక్ష" అన్నాడు జయదేవుడు.
   
    ప్రతాపుడు ఆశ్చర్యంగా, "మీరు మహా పరాక్రమవంతులని దేశ దేశాలా చెప్పుకుంటున్నారు. శత్రువును నిరాయుధుడుగా పట్టి శిరచ్చేధం చేసేవాడికన్నా పిరికిపంద ఎక్కడుంటాడు?" అన్నాడు.
   
    జయదేవుడి ఆగ్రహం నషాళం అంటింది. ఆయన ఆ కోపాన్ని నిగ్రహించుకొని "నేను ఉదారస్వభావంతో నిను విడిచిపుచ్చితే ఏం చేస్తావు?" అన్నాడు.
   
    "మీరు అలాటి సాహసమే చేస్తే, నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలుపడితే ద్వంద్వ యుద్దంలో మీ ప్రాణాలు తీసేస్తాను" అన్నాడు ప్రతాపుడు.
   
    జయదేవుడు కళ్ళు మెరిశాయి. ఆయన ప్రతాపుడితో "ఇప్పుడే నీకు వీలు కలుగజేస్తాను" నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి" అన్నాడు.
   
    అప్పటికప్పుడే ప్రతాపున్ని చెరవిడిపించారు. జయదేవుడు శస్త్ర చికిత్సకులను రప్పించి, ప్రతాపుడికి ఒక కత్తి యిచ్చి, తనొక కత్తి తీసుకుని యుద్దానికి సిద్దంగా నిలబడ్డాడు.
   
    యుద్దంలో చాలాసేపు జయదేవుడూ, ప్రతాపుడూ సమ ఉజ్జీలుగా కనబడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కాని ఆఖరులో జయదేవుడు ప్రతాపుడి చేతి కత్తిని ఎగర గొట్టాడు.
   
    ప్రతాపుడు అమితాశ్చర్యంతో "ఈ కళ నేనెన్నడూ ఎరగనే!" అన్నాడు.
   
    జయదేవుడు ప్రతాపుడి భుజం తట్టి, "అల్లుడూ! నువ్వు నేర్చుకోవలసిన కళలు ఇంకా ఒకటి రెండున్నాయి. వాటిని నీకు అల్లుడి కట్నంకింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలిరమ్మని మీ దేశానికి కబురు పంపు" అన్నాడు.
   
    మంచి ముహూర్తాన ప్రతాపుడికీ, చారుమతికీ వివాహం అయిపోయింది. కోసల, విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెంటికీ ప్రతాపుడే రాజై, తన తండ్రి చివరి కోరికలు పూర్తిచేశాడు.
   
    బేతాళుడీ కథ చెప్పి, "రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపున్ని ద్వంద్వ యుద్దంలో ఓడించికూడా, ఆకస్మికంగా అతన్ని తన అల్లుడుగా చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా? లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే, తన అల్లుణ్ణి చేసుకోదలచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్దానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసికూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది" అన్నాడు.
   
    దానికి విక్రమార్కుడు "జయదేవుడు ప్రతాపుడికి తన కూతురునిచ్చి చెయ్యాలని నిర్ణయించింది ద్వంద్వ యుద్ధం అయ్యాకనే.....! ప్రతాపుడి తండ్రి జగత్ప్రసిద్దుడైన భీరువు, ప్రతాపుడి ప్రవర్తన కూడా పిరికివాడి ప్రవర్తనలాగే జయదేవుడికి కనపడింది. అతను మహావీరుడో, పిరికివాడో తేల్చుకోవటానికే జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధం సాగించాడు. ప్రతాపుడు ద్వంద్వ యుద్దంలో జయదేవుడికి సమానం కాకపోయినా, అతను గొప్ప వీరుడన్నది మటుకు రూఢీ అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక, కత్తి యుద్దంలో తాను ఎరుగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. అధీ నిజమైన వీరుడి లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికిచ్చి చెయ్యటానికి నిశ్చయించాడు" అన్నాడు.
   
    రాజుకీ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు.
   
   
                                                                                                 (చందమామ- 69)
           
   
                                   -- * * * --

 Previous Page Next Page