"అహ...." తల అడ్డంగా వూపాడు. నీలిరంగు ఓణీతో లే ఎండలా మెరిసే పసిమిచెంపల్ని చూస్తూ వుండిపోయాడు క్షణంపాటు.
"ఇందాక పొడుపు కథకి జవాబు."
"నువ్వే?"
"ఏం....నేను మొద్దబ్బాయిననుకున్నావా?"
"అబ్బే....పప్పుముద్దవనుకున్నాను."
"అలా అంటే వెళ్ళిపోతాను."
"పళ్ళు రాలగొడతాను"
"అంతా నీ ఇష్టమేనా...." ఎంత ఇష్టమైతే మాత్రం ఆడపిల్ల దబాయించడం అస్సలు నచ్చలేదు. "రమ్మని గోల పెట్టావు....వచ్చాక నోటి కొచ్చినట్లు మాట్లాడుతున్నావు."
"నోటికొచ్చినట్టు కాదు. వెళతానని నువ్వంటే నీ నోటిలోని పళ్ళు వూడదీస్తానంటున్నాను అదిగో అలా ఆడపిల్లలా అలక్కూడదు....సరే చెప్పు."
"పచ్చని పొదలో విచ్చుకొని వుంటుంది. తెచ్చుకోవాలంటే గుచ్చుకుంటుంది. అదేగా?" గుర్తు చేసుకుంటున్నట్టుగా అన్నాడు.
"మరేం...." మళ్ళీ ఆకతాయిగా నవ్వింది.
"అదేం బూతు పదం కాదు నవ్వడానికి."
"ఛీ సిగ్గులేకుండా...." చిరుకోపంతో బిడియంగా తలవాల్చేసింది. "బూతని ఎవరన్నారు?"
"ఎవరూ అనలేదు."
"మరి?"
"ఇందాక నేనే అనుకున్నాను."
"ఎందుకు?" కోపంగా చూసింది. "నీ ఇష్టమేనా అనుకోడానికి. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు?"
"అదికాదు సావేరీ..." ప్రేమగా పిలిచి, ఇప్పుడు పెళుసుగా మాట్లాడుతుంటే బోలెడంత బెదిరిపోయాడు. పైగా క్లాసులో అప్పుడప్పుడూ లెక్చరర్ల దగ్గరా సావేరి ప్రదర్శించే విశ్వరూపం గుర్తుకొచ్చిందేమో.... నీరుగారిపోయాడు. "నువ్వు అనలేదు నేనూ... నాకలా అనిపించింది."
"ఎందుకు?"
తడబడిపోయాడు. "మ....మరేమో.... పచ్చని పొదలో....అంటే....ఇంకా గుచ్చుకుంటాదని అన్నావుగా....?"
"అంటే...." పుల్ల విరిచినట్టుగా నిలదీసింది. "అందులో తప్పేముంది?"
"నేను....నేను అనుకున్నదే అయితే తప్పేగా మరి....అదన్న మాట" నచ్చచెప్పడానికి పదాలు కూర్చుకోవడం చాలా కష్టమైపోతుంటే చాలాసేపు హైరానాపడి అప్పుడు చూశాడామె కళ్ళని.
ఆమె విశాలనేత్రాల అంచున భావం గడ్డకట్టుకుంది. వెనువెంటనే అల్లరిగా కదిలే ఆమె కనుపాపలు ఏ ఆలోచనల తూపులకో బెదిరి మరుక్షణం కుదురుగా ఆగి అక్కడ సిగ్గు దొంతరాలు ముద్దగా ముగ్ధ సింగారంగా కదిలి ఆమె రెప్పలు అరమోడ్పులయ్యాయి.
"ఛీ ఛీ...." ఆమె స్వరం రవంలా మూలిగింది. చుబుకాన్ని మోకాళ్ళపై ఆనించుకొని బిడియంతో నేలచూపులు చూస్తూ అంది "నువ్వు అమాయకుడివి కాదు, వట్టి గడుగ్గాయివి."
"అదేం?"
"ఇంత సేఫ్టీగా ఆలోచిస్తున్నావుగా...."
"నువ్వూ గడుసుపిల్లవే!"
"ఏం?"
"నీకూ తెలిసిపోయిందిగా...."
"ఏమిటి?"
"అందులో బూతేమిటో" టపీమని అన్నాడు.
ఫకాలున నవ్వు వినిపించింది. అలా నవ్వింది మంగ! ఇక్కడో తొలిసారి గూడు దాటిన గువ్వపిట్టలు కువకువలాడుతుంటే చూడటానికి రెండు కళ్ళూ చాలనట్టు పడీపడీ నవ్వుతూంది.
ఓ నీరెండ కిరణం సావేరి చెంపల అరుణిమని తాకి పసిమినీ పుక్కిలిస్తూంది.
"చెప్పు" కలలోలా అంది. "పచ్చని పొదలో విచ్చుకుంటుంది. తెచ్చుకొబోతే గుచ్చుకుంటుంది"
"మొగలి పువ్వు...."
"ఎలా తెలిసింది?" విస్మయంగా అడిగింది. శంకూ అమాయకుడేమోకానీ తెలివిలేనివాడు కాదన్న ఆలోచన సావేరికి చాలా ఆనందాన్నిచ్చిందేమో, ఆ ఉత్సాహంతోనే "చెప్పమంటూంటే..." ఉద్విగ్నంగా చేయి పట్టుకుంది.
అంతే...ఆమె క్రీగంట చూపులు తాకిన తూర్పు హృదయాన అతడు అప్పుడే పుట్టిన సూర్యుడుకాగా, ఆమె స్పర్శ నిన్న అతడు పారేసుకున్న ఉనికిని గుర్తుచేసి సుషుప్తిలోకి జారిన ప్రత్యూషపు సింధూరాంబరపు దిగంతరేఖగా కుదిపింది....కదిపింది.
వయసు అంటించిన అగ్నిలో ఎవరు సమిధులయ్యారో, ఏ ఆలోచనలే ఆజ్యంగా మారుతున్నాయో "నిన్నే...." అంది ఓ సన్నని స్వరంతో.
"ఏమిటి?"
"ఏదైనా...."
"అమ్మ కడుపునా పుట్టాను. అంత సుఖంగానూ వున్నాను నీచేదెబ్బలు తిన్నాను" నిశ్చలంగా అంటున్నాడు "నిలువునా ఎండాను. నిప్పుల గుండం తొక్కాను. గుప్పెడు బూడిద అయ్యాను."
అది కవితే అనుకుందో, కనిపించని వెతగా వినిపించిందో ఆమె కనుకొలకుల్లో కన్నీటిబొట్టు.
"ఏమైంది?" ఆమె తన నెచ్చెలి అన్న భావమేమో ఆత్రంగా అడిగాడు.
"ఇంకెప్పుడూ మనం బ్రతికినంతకాలం అలా అనవు కదూ?"
ముందు శంకూ పెదవులు రవ్వంత విచ్చుకున్నాయి. మరుక్షణం రివ్వున ఎగిరే ప్రేమవిహంగపు రెక్కల చప్పుడులా గట్టిగా నవ్వాడు.
"ఏంటా నవ్వు?"
"ఎందుకా ఏడుపు?"
"నువ్వలా అంటే ఏడుపు రాదేమిటి?"
"నేనన్నది నా గురించి కాదు" మళ్ళీ రిపీట్ చేశాడు యిందాక అన్నదే "నీకు నేనిచ్చే పొడుపు కథ! ఆ...."
"నిజం?"
"ఒట్టు" ఆమె తలపై చేతినుంచాడు.
మంగ చూస్తూంది దేవతని ఆశీర్వదించే ఓ భక్తుడి దివ్య దృశ్యాన్ని!
"రేపు చెప్పాలా?"
"మరేం...."
"చెప్పకపోతే?"
ఆమె పెదవుల్ని చూస్తూ ఉడుకుగా ఏదో అనబోయి నిగ్రహించు కున్నాడు. "రేపు చెబుతా ఏం చేస్తానో!"
* * * * *
"షికారుకెళ్ళావా సావేరీ?" ఇంటి ఆవరణలోనే సావేరికి ఎదురయ్యాడు రాజేందర్.
కలలోలా నడుచుకు వస్తున్న సావేరి స్వప్నం భగ్నమయినట్టు కోపంగా చూసింది.
"నీకెందుకు?"
"క్షణం ఆగు" జేబులోంచి ఏదో తీశాడు. "ఇంటి లోనికి వెళ్ళాక నీతో వివరంగా మాట్లాడటం కుదరదు సావేరీ!"
"ఏమిటి మాట్లాడేది?"
"నన్ను దుర్మార్గుడంటారంతా!"
"ఆ విషయం నాకూ తెలుసు."
"నాకు భార్యని కావాల్సిన నీకు తెలీని విషయాలు మరికొన్ని వున్నాయి నేను సామాన్యంగా మనుషుల ప్రాణాలు తీయించను చాలా అవసరమయితే తప్ప! కాబట్టే చాలామంది నన్ను పెద్దమనిషి అంటే, కొందరు మాత్రం హంతకుడూ అంటారు."