Previous Page Next Page 
విషవలయం పేజి 26

        "నాకోసం అనవసరంగా బజారునుంచి తెప్పించారా?" అన్నాడు సత్యమూర్తి విచారంగా.

    ఆమె ఫక్కున నవ్వి "అలా విచార పడకండి మరి ప్రతి చిన్న విషయానికీ. అయినా బయటనుండి తెప్పించలేదు లెండి. బజారు వస్తువులు సాధారణంగా మా ఇంట్లో తినరు. ఇంట్లోనే తయారు చేస్తూనే వుంటాము. తీసుకోండి" అని అందిచ్చింది.

    మరో అరగంతవరకూ ఇతర విషయాలేవో మాట్లాడుకుంటూ కాలం గడిపారు. ఇంకా సత్యానందంగారు ఇంటికి రాలేదు. ఒక్కోసారి వచ్చేసరికి ఎనిమిది దాటుతుందాని చెప్పింది సుధ. ఇంకా తను కూర్చుంటే భావ్యంగా వుండదని వెళ్తానని లేచాడు సత్యమూర్తి.

    "మరి రేపు పార్టీ విషయమేం చేశారు?" అనడిగింది సుధ నవ్వుతూ.

    "రేపు మధ్యాహ్నం మూడు గంటలకు నాన్నాగారితో కలిసిరండి. ఇంతసేపూ కూర్చున్నా ఆయన్ని కలుసుకోలేక పోయాను, రమ్మని మరీ మరీ కోరినట్లు చెప్పండి."

    సుధ కొంచెం ఆశ్చర్యపోతూ "బలేవారే! సరదాకి అన్నానండీ. అంత సీరియస్ గా తీసుకున్నారేమిటి?" అంది.

    "ఇందులో సీరియస్ కి, తమాషాకి అంత బ్రహ్మాండమైన ప్రయత్నమేం లేదుకదండీ. ఎలానూ మీరు మా ఇంటికి వచ్చి చాలారోజులయింది. కొంచంసేపు సరదాగా గడిపినట్లుంటుంది వస్తారు కదూ?" అన్నాడతను విడవకుండా బలవంతంచేస్తూ.

    ఆమె ఇంకేమీ అనలేక "అలాగే" అని తల ఊపింది.

    సత్యమూర్తి మెట్లుదిగి క్రిందకు వస్తూంటే వెనకనే గేటుదాకా వచ్చి దిగబెట్టింది దగ్గర్లో రిక్షా ఏమీలేదు అందుకని, అతను వొంతెన వైపుగా నడవసాగాడు.

    ఈరోజు సంభాషణలో ఎలాంటి చర్చ వచ్చినా సుధ మాత్రం అతనిలో విపరీతమైన ఆకర్షణను కలిగించింది. అతని మనసులో స్పందన కలిగిన మాట నిజం. ఊహించలేనంత సౌకుమార్యం, హుందాతనం ఆమెలో కనిపించి అతన్ని విబ్రాంతుడ్ని చేశాయి.

    ఉష గుర్తుకు వచ్చింది. హఠాత్తుగా సుధ ముందు ఉష ఎంత అనిపించింది. తన జీవితంలో బాగా సన్నిహితంగా వచ్చిన మొదటి స్త్రీ ఆమె అవసరంలో సాయపడింది. అందుచేత ఏమాత్రమూ కలవరపాటు కలిగించి వుండవచ్చు. ఆమె ఓ స్నేహితురాలు ఎలాంటి ఆవేశమూ, ఉద్విగ్నతా లేని వ్యక్తి మొదట్లో తరుచూ గుర్తు వచ్చేది. ఇప్పుడు అంతగా జ్ఞాపకం రావటంలేదు అంతేకాదు. ఆమెని గురించి ఆలోచించాలంటే భయంగా కూడా వుంది. ఎందుకని? తను ఏం చేశాడు?

    ఆనాటి దృశ్యాలు కళ్ళముందు మెదలసాగాయి. ఉష స్టేషన్ కి రావటం. మళ్ళీ ఎప్పుడు అని అడగటం, ఆ చూపులు...

    అతను భరించలేకపోయాడు. తను కిరాతకుడా?

    లోకంలో మంచివాళ్ళు అనిపించుకున్న వాళ్ళు ఇంత సులభంగా కిరాతకుల క్రింద మారుతుంటారా? ఆ మంచితనం కూడా వ్యక్తిత్వ లోపం చేతనేనా?

    అసలు సుధాకూ తనకూ సంబంధమేమిటి? ఎందుకు ఇంత ఆకస్మికంగా ఆమెకు అగ్రస్థాన మిస్తున్నాడు? ఆమెతో పరిచయం కాకపోతే ఉషకోసం మునుపటిలాగే ఆరాటపడుతూ వుండేవాడా?

    అతనికి అర్ధంకావటంలేదు. హృదయంలో కలిగే యీ సంచలనం క్రుంగదీస్తుంది. తనమీద తనకే అసహ్యం కలుగుతోంది. తనని చూసి తనకే సిగ్గువేస్తుంది. "ఓరి చంచలుడా! మతి స్థిమితంలేని మనిషీ" అని వెయ్యి కంఠాలు అరుస్తూ వెక్కిరిస్తున్నాయి.

    నిస్పృహగా, నీరసంగా రిక్షాలో ఇంటికి వచ్చాడు.

    గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని, వంటవాడిని వడ్డించమని కేకేసి, ఉస్సురని కుర్చీలో కూర్చుంటూ, అప్పుడు చూశాడు బల్లమీద కవరు.

    ఉలిక్కిపడ్డాడు. శరీరం గగుర్పొడిచింది. కవరు మీది అక్షరాలు ఆ దస్తూరీ అతన్ని సవాలుచేస్తున్నట్లు ఫీలయ్యాడు. శరీరమంతా నిస్త్రాణ క్రమ్మివేసింది.

    కవరు చింపుదామా, మాన్దామా అని ఆలోచిస్తున్నాడు. అంత పిరికి వాడయ్యాడు.

    చివరకు బలహీనతనలూ, భయాలూ జయించి కవరు చేతుల్లోకి తీసి, చింపి చదివాడు.

    "మూర్తిగారూ!

    మీలో ఏదో మార్పు వచ్చింది. అది స్పష్టంగా తెలుస్తూనే వుంది. నాలోనూ వచ్చింది. అందుకే యీ ఉత్కంఠను అణుచుకోలేకుండావున్నాను.

    మీరు దగ్గరగా వున్నప్పుడు నాకోసం నేను ఆరాటపడ్డాను. దూరంగా ఉన్నప్పుడు మీకోసం నేను ఆరాటపడుతున్నాను. చూశారా ఎంత చిత్రమో! ఎంత మార్పో!

    నేనిలా రాశానని అహంభావంతో మీరు గర్వించకండి. నాకు కోపం రాగలదు. మీ బలహీనతలూ, లోపాలూ నామీదుగా మీలో ప్రతిఫలించటం నేను సహించలేను.
   

 Previous Page Next Page