చివరకు ప్రసవించింది. అప్పటికి రాత్రి రెండు దాటిపోయింది. ప్రజ్ఞ నీరసంగా కాంపౌండింగ్ గదిలోకి వచ్చి వాష్ బేసిన్ దగ్గర ముఖం కడుక్కుని నేప్ కిన్ తో తుడుచుకుంటోంది.
వెనక నీడ పడినట్టయింది. తల త్రిప్పి చూసేసరికి ద్వారం దగ్గర దయాకర్ నిలబడి వున్నాడు.
"అలసిపోయావు కదూ?" అన్నాడు నవ్వుతూ.
"లేదు. మీరు పగలంతా పనిచేసి నైట్ కూడా విశ్రాంతి లేకుండా కష్టపడుతూండగా లేనిది యీ మాత్రం మేము చేస్తే అలసిపోతామా ?" అంది ప్రజ్ఞ.
"యింకా నీకు అలవాటు కాలేదుగా."
"ఇప్పుడలవాటయిపోయింది" అంటూ అతని ముఖంలోకి చూసింది. పగలు అంతమంది పేషంట్స్ ని చూస్తూ వాళ్ళ సమస్యల్ని పరిష్కరిస్తూ, అవసరమయిన కేసులకు ఆపరేషన్ చేస్తూ _ యిప్పుడు కూడా నిద్రలేకుండా కష్టపడుతున్నా ఎంత స్వచ్చంగా, నిర్మలంగా ఉన్నాడు ! జుట్టు కొంచెం రేగి ముఖం మీదకు పడుతోంది. అంత పరీక్షగా అతని వంకెప్పుడూ చూడలేదు. ఎంతో అందంగా, హాయిగా ఉన్నట్లనిపించింది.
అప్రయత్నంగా అతనామె వైపు చూశాడు. చప్పున కళ్ళు వాల్చుకుంది.
ఎందుకో తడబడినట్లయింది. "మీకో విషయం చెప్పాలి" అంది ఏమనాలో తోచక.
ప్రశ్నార్ధకంగా చూశాడు.
"ఇందాక ...డెలివరీ కోసం ఎడ్మిట్ అయిన వాళ్ళిద్దరూ ..."
"......"
"తల్లీ ...కూతుళ్ళు ..." అంటూ తాను విన్నదంతా ...మెల్లగా చెప్పేసింది.
"భర్తపోయాక తన ముగ్గురు పిల్లల్ని వదిలేసి యింకో పురుషునితో వెళ్ళిపోయి యింకా పిల్లల్ని కంటోంది. అదేగా మీ మనస్సుని వేధిస్తోన్న విషయం."
ప్రజ్ఞ అవునన్నట్లు తలాడించింది.
"తల్లి కూతుళ్ళిద్దరూ యించుమించు ఒకేసారి ఎడ్మిట్ అయి కొన్ని గంటల తేడాతో ప్రసవించడం కూడా నీ మనస్సుని కలచివేసింది"
ప్రజ్ఞ మౌనంగా వూరుకుంది.
దయాకర్ నవ్వాడు. "ప్రపంచం మన యిష్టాయిష్టాలతో సంబంధం లేకుండా నడిచి పోతూ ఉంటుంది. మనం అంగీకరించినా అంగీకరించక పోయినా అనుక్షణం వివిధ అనుభవాలతో సాగిపోయే యీ సమాజం మధ్య మనం బ్రతుకుతూ ఉండాలి. నీలాగే నాదికూడా సున్నితమైన మనస్తత్వమే. కాని ఓ డాక్టరుగా జీవితం ప్రారంభించాక ఎన్నో విచిత్రమైన సత్యాలను చూశాను. అన్నదమ్ముల పిల్లలు _ వరసకు అన్నా చెల్లెళ్ళయినవారు ప్రేమించి పెళ్ళిచేసుకోవటం చూశాను. పద్నాలుగేళ్ళ బాలికలు పరిస్థితులకులోనై గర్భస్రావాలు చేయించుకోవటం చూశాను. తాతల వయస్సులో ఉన్న వాళ్ళ వికృతమైన కామకృత్యాలూ చూశాను. నాగరికత పేరుతో యీ ప్రపంచం అర్ధం కానంత వేగంతో ముందుకెళ్ళిపోతోంది. సూటైన, స్వచ్చమైన జీవితాన్ని మానవుడు ప్రక్కలకు, _ వికృత మనస్తత్వాల వైపు వెళ్ళిపోతున్నాడు. విపరీతమైన భావాలు, విశృంఖలత్వం, రాక్షస ప్రవృత్తి _ ఈనాడు మానవ జాతిని పరిపాలిస్తున్నాయి. మేధస్సు మంచివైపుకన్నా చెడువైపు పరుగులు తీస్తోంది. తృష్ణ, పైకి రావాలన్న తపన, డబ్బు సంపాదించలేకపోతున్నామన్న బాధ _ నీతిని గురించిన ఆలోచనల్ని చంపేస్తున్నాయి. మనిషికి రెండు వైపులనుంచి దూసుకువస్తోన్న పోటీ, యితరులు అవలంబించే పద్దతులు మంచిగా ఉంటే బ్రతకలేమన్న భావనను పెంపొందిస్తున్నాయి. ప్రతిక్షణం పడగలు విప్పుతున్న కోరికలు, కనీసం కొంత విలాసవంతమైన జీవితాన్ని గడపాలన్న ఉత్కంఠ, పరిస్థితుల్తో రాజీ పడలేని బలహీనత 'యింతకుతప్ప గత్యంతరం లేదు' అన్నట్టు మనిషిని ప్రక్కదారులు పట్టిస్తోంది. ఆకర్షణే నిజమని భ్రమించిన మానవుడు రోజు రోజుకూ నైతికంగా దిగజారిపోతున్నాడు."
ప్రజ్ఞ అతని వంక ఆశ్చర్యంగా చూసింది అతని భావాలూ, ఆలోచనలూ _ ఆమె కెంతో నచ్చినట్లనిపించింది.