Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 28

    ఆ స్పందనలో అనుకోకుండా ఒక ప్రశ్న అడిగేసింది. "మీరు డాక్టర్ పాసయ్యారు, ప్రాక్టీస్ చేస్తూ లైఫ్ లో సెటిల్  అయ్యాక ...మీరింకా ...ఎందుకు పెళ్ళి ... చేసుకోలేదు"

    "ఊ ..."

    "మీరింకా ..."

    "నాకు నచ్చిన అమ్మాయి ... దొరకలేదు"

    "దొరకలేదా ? కనిపించలేదా ?" అనడిగింది ప్రజ్ఞ నవ్వుతూ.

    "పోనీ కనిపించలేదు."

    "మీకు నచ్చిన అమ్మాయి అంటే ఎలా వుండాలి?"

    "ఈ రోజుల్లో స్పీడ్ ని చూస్తుంటే నాకు భయమేస్తుంది. అలా కాకుండా కుదురుగా ..." అంటూ  ఆమె  ముఖంలోకి చూస్తూ ఆగిపోయాడు.

    'అణువణువునా లాలిత్యం, స్నిగ్ధ సౌందర్యం  కలబోసి మలచినట్టు రమణీయ కావ్యంలా గోచరిస్తున్న ఆమె శరీరం ...వెన్నెల కురిసే ఆ కళ్ళు ...'

    ఈ అమ్మాయి ...

    అప్రతిభుడై ఉండిపోయాడు.

    ఆమె "ఆగిపోయారేం ?" అని అడగలేకపోయింది. శరీరంలో చిన్న వణుకు బయల్దేరింది.


                *                     *                   *


    ప్రొద్దుట ఏడు గంటల వేళ ప్రజ్ఞ హాస్పటలు నుంచి బయటకు వచ్చి ఇంటివైపు నడుస్తుంది.

    ఒక కొత్త ఆలోచన ఆమె నరనరాలా వ్యాపించి   గిలిగింతలు పెడుతోంది.

    అతనికి నచ్చిన  అమ్మాయి గురించి తానడిగింది. కాని  అనుకోకుండా ఓ కొత్త సత్యం ...అతను తనకి నచ్చిన అబ్బాయిగా ...

    "ఊహు. తప్పు" అని సరిదిద్దుకోపోయింది.

    కాని ...

    ఈ కొత్త ఉత్సాహాన్ని అరికట్టలేకపోతోంది. ఒకానొక అమృతపు జల్లు ఆమె మనసంతా ఆవరించినట్లయి పరవశించి చేస్తుంది. ప్రక్క నుంచి ఏదో కదిలినట్లు ఆ ఉత్తేజంలో గమనించలేదు.

    చెవిలో ఓ కంఠస్వరం ఊదినట్లయింది. "నిన్నే అంటే వినిపించుకోవేం?"

    ఉలిక్కిపడి తలత్రిప్పి చూసేసరికి _ యోగి! స్కూటర్ లేదు. ప్రక్కప్రక్కనే ఆనుకున్నట్లు నడుస్తున్నాడు.

    వళ్ళు ఝల్లుమంది. కాళ్ళలోంచి  చిన్న వొణుకు బయల్దేరింది.

    "ఏం ప్రజ్ఞా! నైట్ డ్యూటీ చేసి వస్తున్నావా?"

    ప్రజ్ఞ జవాబివ్వలేదు.

    "పాపం రాత్రంతా నిద్రలేదు కాబోలు. కొంతమంది  అమ్మాయిలు నీరసంగా ఉన్నప్పుడూ, అలసిపోయి  ఉన్నప్పుడూ వాళ్ళ అందం మరింత కవ్విస్తూ ఉంటుంది సుమా!"

    "........"

    ఎదురుగా ఓ కారు వస్తోంది. తప్పుకోవడానికి ప్రజ్ఞ ఓ అడుగు ప్రక్కకి వేసింది. ఆమెతోబాటు  యోగి ప్రక్కకి జరిగాడు. భుజం భుజం రాసుకున్నాయి. శరీరం భగ్గుమన్నట్లయింది.

    యోగి నవ్వాడు. "ప్రజ్ఞా! నువ్వెంత దూరం పోవటానికి ప్రయత్నించినా నేను నీ మీద మీదకి వస్తూంటాను. ఈ నిజాన్ని నువ్వు తెలుసుకుంటే మంచిది."

    ప్రజ్ఞ ధైర్యం తెచ్చుకుంది. "అహంకారంతో యిష్టంలేని ఆడపిల్ల మీదమీదకు రావటం గొప్ప అనుకోకు. నువ్వంటే నా కసహ్యం" అంది.       
   
    "ఇలా ప్రగల్భాలు పలికిన అమ్మాయిల్ని చాలామందిని చూశాను. నీలాంటి వాళ్ళని ఎలా లొంగదీసుకోవాలో నాకు బాగా తెలుసు"

    "ఏం చేస్తావు?"

    "నేను తల్చుకుంటే ఏమయినా  చెయ్యగలను. నాపేరు చెబితే యీ ఊళ్ళో  పిట్టలు నీళ్ళు తాగవు. నిన్ను వున్న పళంగా ఎత్తుకుపోయి మెళ్ళో తాళి గట్టగలను. లేకపోతే రేప్ చేసి పారెయ్యగలను"

    "ఛీ, నీకు సిగ్గులేదూ?"

    యోగి నవ్వాడు "సిగ్గా?" ఆ మాట కర్ధం తెలీనట్టు.

    "చూడూ! ఓ ఆడపిల్లను బలవంతాన జయించాలనుకోవటం అవివేకం. నా ప్రాణాలైనా పోగొట్టుకుంటాను  కాని నీకు నేను లొంగటం కల్ల"

    "నీ ప్రాణాలతో నిన్ను నాదాన్ని చేసుకోకపోతే నా పేరు యోగి కాదు."

    "ఓ ఆడపిల్ల జీవితమంటే అంత తేలిక అనుకోకు. అవసరమొస్తే నా ప్రాణాలు తీసుకుంటాను. లేకపోతే నీ ప్రాణాలు తీస్తాను. అంతే కాని నీకు మాత్రం దక్కను."

    "చూద్దాం"

    ప్రజ్ఞ అతని వంక నిరసనగా చూసి విసురుగా ముందుకెళ్ళిపోయింది. "చూద్దాంలే" అంటూ.

    అంత ధైర్యం తనకెలా వచ్చిందో ఆమెకే అర్ధం కాలేదు.


                     *                       *                   *


    టేబుల్ మీద విస్కీ సీసా, సోడాలూ సరంజామా అంతా వున్నది.

    యోగి మూడో పెగ్గు పూర్తిచేసి నాలుగో పెగ్గులోకి వచ్చాడు. అతని ప్రక్కనే సోఫాలో కాంచన వుంది. ఆమెకు యిరవై రెండూ, యిరవై మూడేళ్ళు వుంటాయి. నొక్కు నొక్కుల జుట్టు, చాలా అందంగా వుంది. కవ్వించే విగ్రహం. పమిట జారిపోయివుంది. జాకెట్ హుక్స్ వూడి వున్నాయి.
 

 Previous Page Next Page