Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 26

    అంతకు ముందు రెండు రోజుల క్రితం యీ అమ్మాయి నిండు నెలలతో ఎడ్మిట్ అయింది. సాయంకాలం డాక్టరుగారు  యింటికి వెళ్ళేదాకా బాగానే వుంది. రాత్రి పది గంటలు దాటాక వున్నట్టుండి  నొప్పులు ఎక్కువగా రాసాగాయి. ప్రజ్ఞ భయపడి డాక్టరుగారికి ఫోన్ చేసింది.

    "పెయిన్స్ బాగా వస్తున్నాయి. లేబర్ రూంలో పడుకోబెట్టాను" అంది ప్రజ్ఞ.

    దయాకర్ లోపలకు వెళ్ళి  ఆ అమ్మాయిని ఎగ్జామిన్ చేశాడు. ప్రజ్ఞ ప్రక్కనే వుంది. మెంబ్రెన్స్  రప్చర్  అయినాయి. ప్రైమీ కావటం వల్లా చాలా టైము పట్టవచ్చు. కాని ప్రజ్ఞకు  ఎక్కువగా అనుభవం లేకపోవటం వల్ల ఆమె భయపడుతోంది. ఏమయినా  కాంప్లికేషన్స్ వస్తే తట్టుకోలేదు. అందుకని డెలివరీ అయ్యేదాకా అక్కడే వుండదల్చుకున్నాడు.

    ఆ అమ్మాయితోబాటు వచ్చిన ఒకరిద్దరు బయట వరండాలో వెయిట్ చేస్తున్నారు. బాధలకు తట్టుకోలేక ఆమె వుండి వుండి  అరుస్తోంది _ హృదయ విదారకంగా.

    ప్రజ్ఞకు ఆ రోజు నిస్సహాయస్థితిలో ఓ మంత్రసాని సాయంతో అక్కయ్యకు పురుడుపోసిన సన్నివేశం గుర్తొచ్చింది. వళ్ళంతా ఒక్కసారి జలదరించినట్లయింది.

    ఓ అరగంట పోయాక గేటు ముందు రిక్షా ఆగింది. అందులోంచి ఓ నడివయసు స్త్రీ దిగి రిక్షా అతనికి డబ్బులిచ్చి పంపేసి త్వరత్వరగా వచ్చింది.

    నెలలు నిండి వున్నట్లు, ఏ క్షణమైనా  ప్రసవించడానికి సిద్దంగా వున్నట్లు, ఆమె కడుపు ఎత్తుగా వుంది.

    అప్పుడే లేబర్ రూంలోంచి బయటకు వస్తోన్న ప్రజ్ఞ ఆమె  వంక ప్రశ్నార్ధకంగా చూసింది.

    "నాకు నొప్పులొస్తున్నాయి ఇక్కడ ప్రసవించడానికి వచ్చాను" అంది ఆయాసపడుతూన్నట్లుగా.  

    ప్రజ్ఞ ఆమె వంక ఆశ్చర్యంగా చూసింది. "మీకూడా ఎవరూ రాలేదా?"

    "ఎందుకూ? నాకు ఎవరూ  అవసరం లేదు. నాకోసం వచ్చే వారెవరూ లేరు."

    "డాక్టరుగారితో చెప్తాను" అంటూ ప్రజ్ఞ లోపలికి వెళ్ళింది.

    దయాకర్ మొదట ఆమెను ఎగ్జామిన్ రూమ్లోకి తీసుకువెళ్ళి పరీక్ష చేశాడు.

    "ప్రజ్ఞా! ఈమెను వెంటనే లేబర్  రూంలోకి తీసుకెళ్ళి రెండో టేబుల్ మీద పడుకోబెట్టు. పదినిమిషాల్లో డెలివరీ వచ్చేస్తుంది" అన్నాడు.

    ప్రజ్ఞ ఆమెను చెయ్యి పట్టుకుని  లోపలికి తీసుకెళ్ళింది. లేబర్ రూమ్ లో మొదటి టేబుల్ మీద యిందాకటి అమ్మాయి పడుకుని వుంది. రెండో టేబుల్ వైపు వెళ్ళాలంటే ఆమెను దాటి వెళ్ళాలి. అదే సమయానికి బాధను తట్టుకోలేక ఆ అమ్మాయి  హృదయవిదాకరంగా మూలిగింది. నడివయసు స్త్రీ అప్రయత్నంగా ఆమెవైపు చూసి నిర్ఘాంతపోయినట్లు నిలబడిపోయింది.

    "పదండి ప్లీజ్" అంది ప్రజ్ఞ.

    ఆమె కళ్ళు ఆ అమ్మాయి వైపు నుంచి త్రిప్పుకుని లోపలకు నడిచింది. ఆమెను టేబుల్ మీద పడుకోబెట్టిన ప్రజ్ఞ ఇద్దరి మధ్యా వున్న స్క్రీన్ _ ఒకరికొకరు కనిపించకుండా లాగేసింది.

    తర్వాత డాక్టర్  దయాకర్ లోపలకు వచ్చాడు. అతను చెప్పినట్లుగానే పది నిమిషాల్లో కొత్తగా వచ్చిన స్త్రీకి డెలివరీ అయిపోయింది.


                              *                      *                    *


    ఆ అమ్మాయి యింకా నొప్పులు పడుతూనే వుంది. డాక్టర్ దయాకర్ సాయంతో శిశువుకు చెయ్యవలసిన తతంగమంతా పూర్తిచేసి తిరిగి లేబర్ రూమ్ లోకి అడుగు పెడుతున్న ప్రజ్ఞ లోపల్నుంచి మాటలు వినిపించి ఆగిపోయింది.

    "తల్లీ! నీ బాధ  చూడలేక  పోతున్నానే. ఎలా వుందమ్మా?" అనడుగుతోంది అంతకు ముందే ప్రసవించిన స్త్రీ.

    "అమ్మా! ఈ బాధ పడలేకపోతున్నానే. చచ్చిపోవాలనుందే!" అన్నాదా  అమ్మాయి దీనంగా ఏడుస్తున్నట్లుగా.

    "ఓర్చుకోమ్మా, మొదటిసారి కదా. కొన్ని గంటలు యిలాగే వుంటుంది. తర్వాత అంతా సవ్యంగా జరిగిపోతుంది"

    "...అమ్మా! ఎన్నాళ్ళయింది నిన్ను చూసి? ఎలా వున్నావే నువ్వు?"

    "బండలై బ్రద్దలైపోయిన జీవితం ఎలా వుంటుంది తల్లీ?"

    "అమ్మా! ఎందుకే అలా చేశావు! నాన్న పోయాక ప్రాణంగా చూచుకోవాల్సిన మా ముగ్గుర్ని తాతయ్య దగ్గర వదిలేసి ఎందుకే అలా వెళ్ళిపోయావు?"

    "........"

    "అమ్మా మాట్లాడవేం?"

    "చేసిన తప్పుని సరిదిద్దుకోలేక ఆ తప్పునే వెతుక్కొంటూ  వెళ్ళిపోయాను హేమా!"

    "అమ్మా! తిరిగి వచ్చేయమ్మా. ఆయన చాలా మంచివారు. ఎలాగైనా ఒప్పించి నిన్ను యింట్లో  పెట్టుకుని ప్రాణప్రదంగా చూసుకుంటానమ్మా."

    "...నా జీవితానికి ఆ అదృష్టం  లేదమ్మా! ఆ ఊబిలోంచి మళ్ళీ బయటకు రాలేను..."

    "అమ్మా...!" అన్నదా అమ్మాయి బాధ భరించలేనట్లు.

    "ఏమిటమ్మా?"

    "నొప్పి. తట్టుకోలేక పోతున్నానమ్మా!"


                   *                      *                      *


 

 Previous Page Next Page