Previous Page Next Page 
భారతి పేజి 27

    "గుంటూరు రా తీసుకుపోతాను. అక్కడ పెద్ద పెద్ద డాక్టర్లు బోలెడుమంది వున్నారు నిన్ను దగ్గరుండి స్వయంగా బాగుచేసుకుంటాను. నువ్వెంత అద్భుతంగా తయారుకాగలవో  నిరూపిస్తాను"

    ఆమె ఆవేశం  చూసి భారతి వణికిపోయింది. ఇంత స్నేహాన్ని  అనుభవించగల యోగ్యత తనకు వుందా? మల్లిక ఖేదం చూసి ఆమె హృదయం ద్రవించింది.

    భూమిమీదకు క్రమంగా  చీకటిఛాయలు  దిగివస్తున్నాయి.

    "ఎందుకే అంత తాపత్రయం  నీకు? ఎవరికోసం నేను నయం చేసుకోవాలి ఎవరున్నారు నాకు?" అని ప్రశ్నించింది చివరకు.

    "ఇద్దరికోసం"

    భారతి  తల ఎత్తి  చూసింది.

    "నా కోసం, నీ కోసం."

    భారతి ఏదో చెప్పబోతుంటే "ఉండు. అడ్డు చెప్పటానికి  ప్రయత్నించకు. నా కోసం ఎందుకో నీకు తెలుసు. ఇహ మనిషి తన ఉనికిని తాను ప్రేమించగలగాలి. ఎప్పటికప్పుడు  తన స్థానాన్ని  సుస్థిరం చేసుకోగలగాలి. ప్రతికూలంగా  ఎన్ని పరిస్థితులైనా  వుండనీగాక, మన మనుగడను  మనమే  నాశనం  చేసుకోగూడదు" అంది మల్లిక.

    భారతికి తన జీవితం, పరిస్థితులూ గుర్తు వచ్చాయి. రానురానూ తన బ్రతుకు ఎంత దుర్భరమై పోతూ వుందో ఆమెకు తెలుసు. ఊళ్లో తన గురించి ఎంతగా  గుసగుసలు చెలరేగుతున్నాయో, అంతా తనని వెలివేసినట్లు  ఎలా చూస్తున్నారో ఆమెకు తెలియక పోలేదు. ఒక్క మునసబుగారు మాత్రం తరచు వస్తూ వుంటారు. ఆమెకు మిగిలిన ఆస్తిపాస్తుల విషయంలో  జోక్యం  కలుగజేసుకుని, ఆర్ధికంగా  ఆమెకు అండదండలుగా నిలబడ్డాడు ఆయన.

    క్రమంగా  భారతిలోని  శక్తి సన్నగిల్లిపోతున్నట్లు  అనిపించింది. మల్లిక వాదనముందు  బలహీనురాలైపోయింది.

    చివరి ప్రయత్నం  చేస్తూ "నాలో వ్యాధి ముదిరిపోయింది మల్లికా! ఇది నయమవుతుందన్న  నమ్మకం నాకు లేదు" అంది.

    "నాకు వుంది" ఆమె ఆత్మవిశ్వాసంతో  "మీనమేషాలు  లెక్కబడుతూ  కూర్చుంటే  సమయం మించిపోయి, వున్న అవకాశాలు  చెయ్యి దాటిపోతాయి. బహుశా  యింతకన్నా  అసాధ్యమైన  వాటిని కూడా డాక్టర్లు క్యూర్ చేయవచ్చను కుంటాను."

    మల్లిక ఎంతో  చెప్పిన  మీదట  భారతి  అంగీకరించింది కానీ....తనను డాక్టర్ల వద్దకు  తీసుకువెడతారు. వాళ్ళు  తన శరీరాన్ని  గ్రుచ్చి గ్రుచ్చి చూస్తారు. ఏవో పరీక్షలు  చేస్తారు. తన శరీరం వాళ్ళకు శరీరంలా కనబడదు. రోగపు చర్మంలా కనబడదు.

    "కాని నేను గుంటూరు రాను మల్లికా!" అంది ప్రాధేయపూర్వకంగా. "అక్కడ నాకు అంతా కొత్త వాళ్ళ చూపుల్ని, వాళ్ళ పరీక్షల్ని నేను భరించలేను. బెజవాడలో  నాకిదివరకు పరీక్షచేసి చెప్పిన డాక్టరున్నాడు. అతను సమర్ధుడులాగే  కనిపించాడు."

    'పోనీ, అక్కడికే పోదాం. రేపు  ప్రొద్దున్నే  బెజవాడ ప్రయాణం గుర్తు పెట్టుకో."

    ఇద్దరూ  పెరట్లోంచి  లోపలకు  వచ్చారు. మల్లిక కాసేపు  కూర్చుని, రాధమ్మను కూడా పలకరించి తరువాత వెళ్ళిపోయింది.

    భారతికి తండ్రి జ్ఞాపకం  వచ్చాడు. కనుకొలకులలో నీళ్ళు నిలిచాయి. తాను చాలా నెమ్మదిగా ప్రయాణం చేస్తున్నట్లు, అప్పుడప్పుడూ స్పురిస్తూ వుంటుంది. కాని  నిశితంగా  చూస్తే మార్పులు ఎంత త్వరత్వరగా సంభవిస్తున్నాయి.

    రాధమ్మ వచ్చి భోజనానికి లెమ్మన్నట్లు  సంజ్ఞలు చేస్తూంది.

    అంత ఏడుపులో కూడా  భారతికి నవ్వు వచ్చింది. రాధమ్మ భోజనం విషయం గుర్తు చేసినప్పుడల్లా  తను జీవితాలు ఎంత  దుర్భరమైనవో ఆమెకు  స్పురిస్తూ వుంటుంది.


                                                                      *    *    *

    బెజవాడలో  బస్సు దిగి, రిక్షాచేసుకుని, డాక్టరుగారి దగ్గరకు బయల్దేరారు  స్నేహితురాళ్ళిద్దరూ. భారతి ఆ డాక్టరుగారి దగ్గరకు  ఒకేసారి వచ్చింది, రావలసిన పేట వచ్చాక ఒక్కొక్క ఇల్లూ  చూసుకుంటూ ,ఒక ఇల్లు కనబడగానే, "ఇక్కడే, అబ్బాయి, ఆపు" అంది రిక్షావాడితో.

    ఇద్దరూ దిగి, రిక్షావాడికి డబ్బులిచ్చి  పంపేశారు.

    బయట  ఉన్న  బోర్డువంక  చూస్తూ మల్లిక  "డాక్టర్ కె. విద్యాసాగర్" అని చదివి, "ఈయనేనా  నిన్ను పరీక్ష చేసింది?" అనడిగింది.

    భారతి  తల ఊపి, "అప్పుడు  పేరు తెలుసుకోలేదు నాన్నతో వచ్చాను. ఇంకేం తెలియదు" అన్నది.

    "పద. లోపలికి పోదాం" అని మల్లిక లోపలకు దారితీసింది.

    చాలా చిన్న డిస్పెప్చరీ అది. అందులోనే  స్త్రీ పురుషులు కూర్చోవటానికి మధ్య విభాగం  చేస్తూ సిమెంటు రేకులతో చేసిన స్క్రీన్ ఒకటి అడ్డుపెట్టి  ఉంది. గోడల  కానుకుని  నాలుగయిదు  కుర్చీలూ, రెండు బల్లలూ వేసివున్నాయి. అయితే  అందులో ఒకరు  కూడా కూర్చుని లేరు. అన్నీ ఖాళీగా ఉన్నాయి.

    మల్లిక  అక్కడి  పరిస్థితి  అంతా చూసి కళ్ళు త్రిప్పుతూ, "అబ్బో డాక్టరుగారిది  చాలా పెద్ద ప్రాక్టీస్ లాగా  వుందే, హాస్పిటలంతా  పేషెంట్లతో  కిటకిటలాడి  పోతోంది!" అన్నది  వెటకారంగా.

    భారతి ఆమె చెయ్యి  మెల్లగా  నొక్కి. "ఉష్! నీకు పుణ్యముంటుంది, మెల్లగా మాట్లాడు. ఆయన వింటే  బాధపడతారు" అన్నది మృదువుగా.

    "అంత బాధపడేవాడు  డాక్టరు వృత్తికేం  పనికివస్తాడుగానీ...." నిర్లక్ష్యంగా అని, "ఏడీ మీ డాక్టర్? కనిపించడేం? ఇంతకీ చిన్నవాడా? తలనెరిసిన అనుభవజ్ఞుడా?" అనడిగింది  మల్లిక కుతూహలంగా.

    "అవేం ప్రశ్నలే, తల్లీ! పెద్దవాడే! యాభయి ఏళ్ళు ఉంటాయి."

    భారతి మాట పూర్తి అయీ అవకముందే  లోపలి గది నుండి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని డాక్టరు బయటికి వచ్చాడు.

    మెళ్ళో స్టెతస్కోప్  వ్రేలాడుతూ  వుండకపోతే, భారతి చెప్పిన మాటలను బట్టి  అతను డాక్టరు అనుకునేందుకు అవకాశం లేదు. అతనికి  యాభయి ఏళ్ళూలేవు, తలా నెరిసిపోలేదు. పాతికేళ్ళయినా  నిండీ నిండనట్లున్న  స్పురద్రూపి  అయిన యువకుడు. సన్నగా, పొడవుగా, ఠీవిగా వున్నాడు. పెదవులమీద  చిరుమందహాసం  అతని  వ్యక్తిత్వాన్ని  వెల్లడిస్తూ  వెలుగుతూంది.

    "ఏం కావాలండీ?" మర్యాద  ఉట్టిపడుతూన్న  కంఠంతో  అడిగాడతను.

    భారతి తనతో  అబద్దమాడిందనుకుంటూన్న  మల్లిక బిత్తర పోయినట్లయి పోయి  ఏం చెప్పాలో తోచక దిక్కులు చూస్తూంది.
    భారతి  తడబడే  కంఠంతో  "డాక్టరుగారు...." అన్నది.

    "ఎస్, నేనే."

    భారతి ధైర్యం తెచ్చుకుని  "కొంతకాలం  క్రిందట  ఇక్కడికి  వచ్చినప్పుడు  మరో డాక్టరుగారు వుండేవారు....ఆయన...."

    ఆమె మాట పూర్తిగాకముందే అతను  "ఓహో! గోవిందరావుగారి  గురించా మీరడిగేది. ఆయన యుద్ధంలో ఆర్మీ డాక్టరుగా పనిచేసి, తరువాత రిజైన్ చేసి ప్రవేటు ప్రాక్టీస్ లోకి  వచ్చారు. ఈ మధ్య అనుకోకుండా  గవర్నమెంటు  సర్వీస్ లోంచి ఆఫర్ వస్తే  మళ్ళీ వెళ్ళిపోయారు. నేను యిందులోకి  క్రొత్తగా  వచ్చాను" అన్నాడు. అతని మాటలు ఏ మాత్రం దురభిమానం, ఉపేక్షాభావం  లేక  సంస్కారం ఉట్టిపడుతూన్నట్లున్నాయి.

    స్నేహితురాళ్ళిద్దరికీ  ఏం చెయ్యాలో  వెంటనే  పాలుపోలేదు. వచ్చిన విషయమా__చాలా సున్నితమైన వ్యవహారం. ఇతడేమో నవ యువకుడు.

    వాళ్ళు తటపటాయించటం  చూసి  అతను  "మీరు డాక్టర్ గోవిందరావుగారి దగ్గర యిదివరకు ట్రీట్ మెంట్ తీసుకున్నారా? ఆయన కావాలంటే మీరు డిసప్పాయింట్ అయినట్లే" అన్నాడు.

    మల్లిక  అతని ముఖంలోకి ఒక నిమిషం  నిశితంగా  చూసింది. నల్లని విశాల నేత్రాలూ....వాటిలో కనబడే ఆత్మవిశ్వాసం....ఆమెకు అతనిమీద సదభిప్రాయం ఏర్పడి నమ్మకం కుదిరినట్లయింది.
 

 Previous Page Next Page