Previous Page Next Page 
భారతి పేజి 28

    "పోనీ, మీరు చూడండి. ఈమే పేషెంటు. చాలా దూరం నుంచి వచ్చాము" అంది భారతిని చూపించి.

    అతను భారతి వైపోసారి  చూసి "లోపలకు రండి" అని రెండో గదిలోకి నడిచాడు.

    అతని టేబుల్ కెదురుగావున్న  కుర్చీల్లో  ఇద్దరూ  కూర్చున్నాక మల్లిక స్నేహితురాలి వ్యాధి గురించి, అది ఎప్పుడు మొదలయిందీ, ఎలా మొదలయిందీ  ఆ వివరాలన్నీ  విపులంగా  చెబుతూంటే భారతి అపరాధినిలా  తల వంచుకుని మెదలకుండా కూర్చుంది.

    అంతా విని, అతను భారతివంక చూస్తూ "దయచేసి ఇక్కడకు వచ్చి కూర్చోండి" అన్నాడు ఎగ్జామినేషన్ టేబిల్ చూపిస్తూ.

    భారతి వేటగాడిని చూసిన పావురంలా వణికిపోయింది. తను కుష్ఠురోగి. తన ఒంటినిండా మచ్చలు, ఈ రూపంతో, ఈ స్వభావంతో  ఈ వ్యాధి నివారణకోసం, ఈ వ్యాధిచిహ్నాలు అతనికి ప్రదర్శించే నిమిత్తం  అతని ముందు నిలబడబోతూంది. ఆమె తల భూమిలోకి  దించుకుపోయినట్లయింది. ఎట్లా లేచి బల్లదగ్గరకు వెళ్ళిందో ఆమెకే తెలియదు.

    పరీక్షచేస్తూ  అతను ఎన్నో ప్రశ్నలు అడిగాడు. "కళ్ళు మూసుకుని చెప్పింది. ఈ దూదితో ఎక్కడ రాశాను? స్పర్శ తెలుస్తూందా? ఇదిగో. ఈ సూది గుచ్చుతున్నాను, నెప్పి  తెలుస్తున్నదా? నెప్పి ఎక్కడ ఎక్కువగా వుంది? చూడండి. ఈ టెస్టుట్యూబ్ లో నీళ్ళు పోసి మీ శరీరానికి తాకిస్తున్నాను. వేడిగా వున్నదా, చల్లగా వున్నదా?"

    ఇలా  ఇంకేవేవో  పరీక్షలు చేసి, భారతిని  తిరిగి కుర్చీలో కూర్చోపెట్టి  తన సీట్లో అతను ఆసీనుడై, "డయాగ్నసిస్  గురించి  వేరే ఆలోచన అక్కర్లేదు. మీకూ  ఇదివరకే  తెలిసినట్లు  కనబడుతోంది. ఇంతకాలం  ఎందుకు ఆలక్ష్యం చేశారు?" అన్నాడు.

    అంటే మీ ఉద్దేశ్యం__లెప్రసీయేనా?" అనడిగింది మల్లిక. అతను  కాదంటాడేమోనని  ఆమెలో  చాటుగా మిణుకు మిణుకు మంటున్న  ఆశ అంతరించిపోయింది.

    ఆ మాట ఉచ్ఛరించటానికి  అతనికే  కటువుగా  తోచినట్లయింది. సానుభూతిగా చూస్తూ తల ఊపి  ఊరుకున్నాడు.

    "అలక్షం చేశామంటున్నారు, ఆలస్యమైపోయిందా?" అనడిగింది మల్లిక ఆత్రుతగా. అతనేమంటాడోనని  ఆమె వణికిపోతుంది.

    "ఆలస్యమయిందిగాని, సమయం మించిపోలేదు. మీ స్నేహితురాలికి తప్పకుండా  నయమవుతుంది"

    మల్లికకు ఈ మాటలు అమృతపు  వాక్కులుగా వినిపించాయి. దుఃఖమంతా ఒక్క త్రుటిలో ఎగిరిపోయినట్లయింది.

    "ఎంత కాలం పడుతుందంటారు? రెండు మూడు నెలల్లో మా భారతి మళ్ళీ మామూలు మనిషి అయిపోతుందంటారా?" అనడిగింది. ఆదుర్దాగా ఆమె ఎమ్.బి.బి.ఎస్. మొదటి సంవత్సరం చదువుతున్న పిల్ల. ఉత్సాహమైతే వుందిగాని  లోతుపాతులింకా  తెలియవు.

    డాక్టర్ సాగర్ పెదవులమీద చిరుమందహాసం  మరింత  విస్తృతమైంది. "చూడండీ, మీ ఆత్రుతను నేనర్ధం
చేసుకోగలనుగాని, నన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తే మాత్రం  చాలా  ఇబ్బందిపాలయిపోతాను. నాకు బాగా టైమివ్వండి; గుణం కనిపించటానికి  కొన్ని నెలలు పట్టవచ్చు: పూర్తిగా  నయమవటానికి  సంవత్సరాలమేర  పట్టవచ్చు" అన్నాడు.

    "కానివ్వండి, ఎంతకాలమైనా సరే. మా భారతి తిరిగి  మామూలు మనిషయిపోతే  చాలు" అంది మల్లిక నిట్టూరుస్తూ.

    "ఆమె మామూలు మనిషే  తనలో ఏదో లోపంవుందని  కృశించిపోతే మాత్రం  ఆమె తనకు తాను  చాలా కీడు చేసుకుంటూందన్న మాట. ఆమె మీకంటే, నాకంటే  కూడా చాలా ఆరోగ్యంగా వుంది.

    'డాక్టరుగారి మాటలు  వింటున్నావా!' అన్నట్లు  స్నేహితురాలి వైపు చూసింది  మల్లిక. భారతి ముఖం  ప్రక్కకి త్రిప్పుకుని గోడనున్న  కాలెండర్ వైపు  చూస్తూంది.

    "మరి ట్రీట్ మెంట్ గురించి  చెప్పండి. మాది చందరాల. ప్రతిరోజూ  అంత దూరంనుంచీ  రావాలంటే కష్టం. మందులూ అవి రాసిస్తారా. ఇంజక్షనులేమయినా  చేస్తారా?" అని అడిగింది మల్లిక. ఆమె తల్లి గురించి  తరుచు  డాక్టర్లచుట్టూ  తిరుగుతూ  వుండటంచేత  వాళ్ళతో మాట్లాడే పద్ధతి, ఆ రకం సంభాషణలు ఆమెకు కొట్టిన పిండయి పోయాయి.

    "ప్రతిరోజూ  రావక్కర్లేదు. మందులూ ,టానిక్కులూ అవీ రాసిస్తాను. ఎలా  వాడాలో  చెబుతాను.ఆ ప్రకారం యింటిదగ్గర వాడుతూ, పదిహేనురోజుల కొకసారి  వచ్చి  కనిపిస్తే చాలు. ఏమన్నా మార్పులు చేయవలసివస్తే అవసరాన్ని బట్టి  అప్పుడప్పుడూ  చేస్తూ వుంటాను"

    ఆయన రాసివ్వటం  అయాక  "మరి వస్తామండీ, సెలవు" అని మల్లిక లేచి నిలుచుంటే, ఆమెతోపాటు  భారతి కూడా నిశ్శబ్దంగా  నిలబడింది.

    ఒక అడుగువేసి, ఇంతలో ఏదో తోచినట్లయి ఆగిపోయి "అన్నట్లు  మరిచేపోయాను. మీ ఫీజు విషయం చెప్పారు కాదు!" అంది మల్లిక.

    అతను చిన్నగానవ్వి  "ఫీజా? చూద్దాం లెండి. ఇంకా చాలాకాలం వుందిగా!" అన్నాడు.

    భారతి తల ఎత్తి  కృతజ్ఞతా పూర్వకంగా  అతనివంక చూసి  చలిస్తూన్న చేతులను జోడించి నమస్కారం చేసింది. అతనామె  కళ్ళలోకి  చూశాడు. 'మీకేం భయంలేదు. మీకు త్వరలోనే  స్వస్థత చేకూరుతుంది' అన్నట్లున్నాయి అతని చూపులు.

    తరువాత  ఇద్దరూ  బయటకు  వచ్చేశారు.


                                                               *    *    *    *


    ఇద్దరూ తిరిగి  చందరాల  చేరుకునేసరికి  దాదాపు  పన్నెండయింది. శీతాకాలం కావటంవల్ల  ఆకాశమంతా  మబ్బులుపట్టి, ఇంకా చలిచలిగానే  వుంది శీతాకాలంలో రాత్రివేళ వేసే చలి నిర్దయగా కరుస్తూన్నట్లు  వుంటుంది? పగటి చలి, అప్పుడప్పుడూ  వీరెండతో కూడా  మిశ్రితం అవుతూ  కితకితలు  పెడుతూ, ఆహ్లాదంగా వుంటుంది.

    మల్లికను వాళ్ళ  ఇంటిదగ్గర  దింపేసి, తను మెల్లగా  యింటికి చేరుకోగానే వాకిట్లో కారాగి  వుండటం చూసి  భారతి  నిర్ఘాంతపోయింది, ఆమె గుండె దడదడ కొట్టుకుంది. ఆ కారు ఆమెకు బాగా గుర్తు.

    ఎలానో  దిటవు చేసుకుని తడబడుతూన్న  కాళ్ళతో  మెల్లగా లోపలకు వెళ్ళింది. హాల్లో ఈజీచైర్ లో వెనక్కి జారగిలబడి  కూర్చుని  గంగాధరంగారు పైప్ కాల్చుకుంటున్నారు.


                               *    *    *    *


    అలికిడి విని గంగాధరంగారు  తలత్రిప్పి  చూసేసరికి గుమ్మం దగ్గర  నిలబడి గుండెమీద చెయ్యివేసి అదుముకుంటూన్న  భారతి  కనిపించింది.

    ఆమెవంక  చూస్తూ  ఆయన  పొగ గప్ గప్ మని వదిలాడు. అవే క్రౌర్యాన్ని వెదజల్లే  పెద్ద మీసాలు, అవే చింతనిప్పులవంటి కళ్ళు.

    "వచ్చావా?" నీ కోసమే  చూస్తున్నాను" అన్న ఆయన  కంఠస్వరం  వినిపించిందామెకు.

    మాట్లాడకుండా  ఆయనవంక  చూసి తలవంచుకుంది.

    "లోపలకు రా భారతీ!"

    ఆమె యాంత్రికంగా  లోపలకు నడిచి  ఆయనకు కొంచెం దూరంలో నిలబడింది.

    గంగాధరంగారు  ఆమెను నఖశిఖ పర్యంతం  పరీక్షగా  చూస్తున్నాడు. ఎంత తలవంచుకుని నిలబడ్డా ఆ చూపులు ఆమెకు తెలిసినట్లయి, ఒళ్ళంతా తేళ్ళూ, పాకినట్లయింది. అలా  కొంతసేపు  చూశాక ఆయన పెదవులమీద వికృతమైన చిరునవ్వొక్కటి  మెదిలింది.

    "నీకు వ్యాధి బాగా  పెరిగిపోయినట్లుందే!"

    ఆమె గుండెలో  గునపంలా దిగబడింది. ఒక్కక్షణం  కలవరపడిపోయి, పెనుగాలికి చిగురుటాకులా  వణికిపోయింది. ఒక్కక్షణం....అంతే....వెంటనే తన్ను తాను  నిగ్రహించుతుంది.

    'అవును'అన్నట్లు  తల వూపింది.

    "పాపం! ఎక్కడా  వైద్యం  చేయించుకున్నట్లు లేదు!"

    'లేదు' అన్నట్లు  తల ఆడించింది.
 

 Previous Page Next Page