"ఇంత పరాధీనపు మనిషివి ఎప్పుడయిపోయావే భారతీ! నీకు వ్యక్తిత్వం లేదా!" మల్లిక సూటిగా అడిగింది.
"వ్యక్తినే మరొకరికి అంకితమైనప్పుడు వ్యక్తిత్వంలో సంపూర్ణత్వం ఎక్కడ వుంటుంది మల్లికా?"
"అంకితమేమిటే అంకితం? ఇంత అమూల్యమైన సంపదను తీసుకుపోయి ఓ బుద్ధిహీనుడికి అంకితమిచ్చానని డబ్బాలు కొడుతున్నావు. నీకు సిగ్గులేదుటే?"
"లేదు. లేదని చెప్పుకోవటానికి కూడా సిగ్గుపడటం లేదు."
"నువ్వతన్ని ప్రేమిస్తున్నావా?"
"ప్రాణాధికంగా"
"ఆరాధిస్తున్నావా?"
"ప్రేమలేనిదే ఆరాధన ఎక్కడి నుంచి వస్తుంది?"
మల్లిక పూర్తిగా ఆమె వైపు తిరిగి కళ్ళు పెద్దవి చేసి చూసింది. "జీవితం నీకు నేర్పిన గుణపాఠం యిదా?" అని నిట్టూర్పు విడిచింది.
భారతి స్నేహితురాలివైపు జరిగి ఆప్యాయంగా భుజంమీద చేయి వేసి అన్నది! "ఇప్పుడు నన్ను చూస్తే నీకు అసహ్యం వేస్తోంది కదూ?"
"ఉహూఁ!" మల్లిక తల అడ్డంగా త్రిప్పింది.
"మరేమిటి?"
"ఇది...." ఈ మాట అంటూంటే ఆమె ఇహ దుఃఖం ఆపుకోలేక పోయింది. కళ్ళవెంబడి నీళ్ళు జలజలా రాలి, ఆ వెన్నెల్లో తళతళా మెరిశాయి.
"మల్లికా!" అంటూ భారతి దుఃఖోద్వేగంతో పూర్తిగా స్నేహితురాలి ప్రక్కమీదకు దొర్లిపోయి, ఆమెను ఆలింగనం చేసుకుంది. "ఛీ! ప్రతి చిన్న విషయానికీ ఏడుస్తారా ఎవరైనా? ఊరుకో" అంటూంది.
"నన్నేం ఓదార్చనక్కర్లే. నా ప్రక్కలో ఏమీ పడుకోనక్కర్లే అంటూ మల్లిక ఆమె నుంచి విడిపించుకుని దూరంగా తొలగిపోవటానికి ప్రయత్నం చేస్తూంది.
భారతి ఆమెను కదలకుండా మరింత గట్టిగా పట్టుకుని, ఉహు! తప్పించుకుంటావేం నువ్వు. అది నీకు సాధ్యంకాదు. తెలుసా?" అని ముఖాన్ని బలవంతంగా తనవైపు త్రిప్పుకుని, కన్నీటితో తడిసిన రెండు చెంపలూ ముద్దు పెట్టేసుకుంది.
మల్లిక ఇహ పెనుగులాడటం మాని కళ్ళు మూసుకుని నిశ్శబ్దంగా ఏడుస్తూంది.
ఆమె ముఖంమీద తన ముఖం చేర్చి భారతీ ఏడ్చింది.
ఇద్దరి కన్నీళ్లూ కలిసి ఒకే కాలువ కట్టాయి.
* * *
కొన్నాళ్ళకు మల్లిక పరీక్షలు జరిగాయి. చివరి నెలరోజులూ ఆమె నిద్రాహారాలు మాని ఏక దీక్షగా చదివింది. ఆమె జీవితానికి ఒక గమ్యం వుంది .ఆమెలో పట్టుదల వుంది .పుస్తకం ముందు పెట్టుకుని కూర్చుంటే ఆమె ప్రపంచాన్ని మరిచిపోగలదు. అలాగే మరిచిపోయింది.
పి యు సి ఫస్టుక్లాసులో పాసయింది.
"తరువాత ఏం చేస్తావు?" అనడిగింది భారతి.
"ఎప్పుడూ చెప్పేదే .డాక్టరుకోర్సు చదువుతాను."
శారదమ్మగారు ఘోష పెట్టింది .తండ్రి రామానాయుడుగారు కూడా వారింపజూశారు. ఆమె అన్నయ్యలు కూడా కొంచెం విసుక్కున్నారు. కాని మల్లిక చలించలేదు తన పట్టుదల సడలించలేదు.
చివరకు అందరూ ఒప్పుకోక తప్పింది కాదు.
మల్లిక ఎమ్ బి.బి.ఎస్ కు అప్లయిచేసింది సీటు కూడా వచ్చింది.
* * *
మరో ఆరునెలలు గడిచాక భారతి ఓ సాయంత్రం పెరట్లో బావిదగ్గర నిలబడి సూర్యాస్తమయాన్ని తిలకిస్తూంది. ఈ మధ్యకాలంలో ఆమెలో చాలా మార్పు వచ్చింది. అప్పటి భారతికీ, ఇప్పటి భారతికీ పోలికేలేదు. మనిషి శుష్కించిపోయి సగానికి పైగా తీసింది. శరీరపు రంగు పాలిపోయినట్లు అయిపోయింది. కళ్ళు లోతుకుపోయాయి. జుట్టు పోషణలేకనో ఏమో పలుచబడినట్లు కనిపిస్తూంది.
"భారతీ!" అన్న పిలుపు వినబడి ముఖం త్రిప్పి చూసింది.
మల్లిక!
"మల్లికా!" అంటూ ప్రాణం లేచివచ్చినట్లు చిరునవ్వు ముఖంతో ఆమె వైపు ఆత్రుతగా నడిచింది.
మల్లిక రెండు నెలలబట్టీ ఈ వూరు రావడంలేదు. ఆమె తల్లికి మళ్ళీ రోగం తిరగబెట్టడం మూలాన గుంటూరు హాస్పిటల్ లో చేర్పించి, తను కనిపెట్టుకుని వుంటూంది. కాలేజి, తల్లి....ఇవీ ఆమె వ్యాపకాలక్కడ.
"అమ్మగారు కులాసాగా వున్నారా? తీసుకొచ్చారా ఇక్కడికి?"
మల్లిక స్నేహితురాలి రూపాన్ని చూసి చలించిపోయి, ఆమెను మరింత పరీక్షగా చూస్తూ, "కులాసాగానే వుంది. ఇక్కడకు తీసుకొచ్చాంగాని, ముందు నీ విషయం చెప్పు ఏమిటీ అవతారం? అంది బాధగా.
భారతి ముఖం వెలవెలపోయింది. "నాకేం ఇప్పుడు?" అంది తిరిగి నవ్వటానికి వ్యర్ధప్రయత్నం చేస్తూ.
"ఏమయిందా? ఎప్పుడన్నా అద్దంలో చూసుకుంటున్నావా?"
భారతికేం జవాబు చెప్పాలో తోచక కళ్ళప్పగించి చూస్తూంది.
"చూసుకుంటూ వుండవచ్చు. కాని నీ కళ్ళు నిజాన్ని గమనించే శక్తిని కోల్పోయి వుండవచ్చు. ఒక్క నిమిషం....ఒక్క నిమిషం నా కళ్ళు పెట్టుకుచూడు, తెలుస్తుంది.
భారతి కళ్ళముందు చీకటి తెరలు కదిలినట్లుగా కాగా "ఏమిటి, మల్లికా" అని అస్పష్టమైన కంఠంతో అని, ప్రక్కకి తిరగటానికి ప్రయత్నించింది.
మల్లిక ఆమె భుజాలమీద చేతులు వేసి గట్టిగా పట్టుకుని తన వైపు మంచి తిరగనియ్యలేదు. "ఈ కొద్దిరోజుల్లో ఎంత మార్పు! ఒకానొకనాడు నీ వీపుమీద రెండేరెండు మచ్చలు చూపించావు. వాటి ట్రీట్ మెంట్ కోసం ఎన్నిసార్లు హెచ్చరించినా అలక్ష్యం చేస్తూ వచ్చావు. ఇప్పుడు చూడు, ఏం జరిగిందో! మీ ముఖంమీద, చేతులమీద, ఒంటినిండా మచ్చలు వచ్చేశాయి. మనిషివా....చిక్కి శల్యమైనావు" అంది దగ్గుత్తికతో.
భారతి ఆమెను బలవంతంగా తప్పించుకుని దూరంగా వెళ్ళిపోయింది. "నన్ను ముట్టుకోకు" అంది బలహీనమైన స్వరంతో.
మల్లిక "నీకేమైనా పిచ్చిపట్టిందా?" అంటూ ఆమె వైపు అడుగు వేయబోయింది.
"వద్దంటూంటే వినిపించటంలేదూ?" అంది భారతి కఠినంగా కంఠం పెద్దదిచేసి.
"నీ ఆజ్ఞల్నీ, కోపతాపాల్నీ నేను లెక్కచేయనుగానీ, ఎందుకలా అంటున్నావు చెప్పు?" అంది మల్లిక ఆమెకేసి ఒక అడుగు వేసి.
"అర్ధంకాలేదూ?" అంటూ భారతి స్నేహితురాలి ముఖంలోకి సూటిగా చూసింది. ఇద్దరి కళ్ళూ కదులుతున్నాయి. ఇద్దరి కనుపాపలూ వింతగా చలిస్తున్నాయి. ఈ మారు భారతి నవ్వగలిగింది. "నేను కుష్ఠు రోగిని నాది అసహ్యమైన వ్యాధి. భరించలేని అంటువ్యాధి, మల్లికా. ఈ వ్యాధితో నేను మగ్గిపోతున్నాను. వయసు ఉండనీ, ఉండకపోనీ నా జీవితంలో చాలా అధ్యాయాలు గడిచిపోయాయి కాని, నువ్వు! చక్కగా చదువుకుంటున్నావు, ఇంకా పెళ్ళి కాలేదు బంగారు కలలు నిజాలై రూపొందబోయే శుభదినాలెన్నో ఉన్నాయి. నన్ను ముట్టుకుని నాతో గడిపి పండువంటి నీ జీవితం పాడుచేసుకోకు.
"అలాగా?" అంటూ మల్లిక బాణం దూసుకుపోయినట్లు వేగంగా ముందుకు వచ్చింది. స్నేహితురాలిని ఆబగా, ఆశగా రెండు చేతులతోనూ పొదివి పట్టుకుంది.
"వదులు, మల్లికా! నా ఒళ్ళంతా మచ్చలతో నిండిపోయి ఎలా వికారంగా వుందో చూడు! ఆ మచ్చలు నీ కంటుతాయి"
మల్లిక గుండె చెరువైపోయింది. కళ్ళు జలపాతాలయ్యాయి. "అలా ఆపకపోతే, నిస్సహాయంగా, వ్యర్ధంగా జీవితానికి అలా లొంగిపోకపోతే. జీవితాన్ని ఛాలెంజ్ చెయ్యలేవూ?"
భారతి ప్రశ్నార్ధకంగా చూసింది.