అతని వెనుకనే వచ్చిన అనుపమ ముఖం చిట్లించుకుంది.
"వెధవ....పుస్తకాలు ఇక్కడ పడేసి ఎక్కడికో పోయినట్టున్నాడు. తెల్లవారాక రానీ, వాడి పని చెబుతాను.... మీరు రండి!" అని భర్తను లోపలకు లాగి తలుపు వేసేసింది.
తెల్లవారింది. కానీ, కళ్యాణ్ రాలేదు...
ఏమయ్యాడోననే అనుమానం ఆ తండ్రికి అప్పుడు కలిగింది.
"పేపర్లకిస్తే మన పరువు గంగాపాలవుతుంది. పోలీసులకు రిపోర్టు ఇస్తే పోలీస్ ఆఫీసరు కొడుకు మాయమయ్యాడా అని అవహేళన చేస్తారు." ఆమె మాటలు కర్కశంగా వినిపించాయి.
"అలా అని వూరుకోమంటావా?"
"అవును. అంతకు మించి మనం చేసేది ఏముంది? పసివాడేమీ కాదుగా...ఎక్కడకు వెళ్ళినా తిరిగి తిరిగి వాడే వస్తాడు"
పోతేపోయాడు. వచ్చినా రాకపోయినా ఫర్వాలేదు. పీడా విరగడై పోయిందని మనస్సులో సంతోషించిందామె.
తన కడుపు పండకపోతుందా, తనకు సంతానం కలగకపోతుందా అనే ధీమావల్ల అలా ప్రవర్తించింది ఆ స్త్రీ హృదయం.
పరువు, మర్యాదలను కాపాడుకోవడానికి తన కన్నా మమకారాన్ని చంపుకున్నది ఆ పితృ హృదయం.
ఎవరికి వారే స్వార్ధంతో ఆలోచించారే తప్ప ఆ పసివాడు ఏమైపోయాడో వూహించలేకపోయారు.
ఒక కన్నతల్లి ఆత్మను క్షోభ పెట్టినందుకు కానీ, నిష్కల్మషంగా భర్తను వదిలివెళ్ళిపోయిన ఒక ఇల్లాలి ఆత్మను తల్లడిల్ల చేసినందుకుగానీ, సాటి స్త్రీ మాతృత్వపు మమకారాన్ని నిర్దాక్షిణ్యంగా ఒక స్త్రీ హృదయం కాలరాచినందువల్ల కానీ.....ఆ ఇద్దరికీ సంతాన యోగం లేకపోయింది.
తాము చేసిన తప్పిదం ఎలాంటిదో ఇప్పుడు తెలిసివస్తున్నది వారికి.
ఉన్న మమకారాన్ని కావాలని దూరం చేసుకున్నారు ఒకప్పుడు...
కానీ, ఇప్పుడు ఆ మమకారం కావాలంటే ఎలా లభ్యమవుతుంది?
చేజేతులా జారవిడుచుకుని, తిరిగి అదే ఫలం దక్కాలని ఆశపడడం పిచ్చితనం కాక మరేమిటి?
బ్రతికి వున్న చిన్నారి మనసును క్షోభ పెట్టి, చచ్చి స్వర్గాన వున్న ఆమెనూ క్షోభకు గురిచేసిన ఫలితం తమకు పిల్లలు పుట్టకపోవడమేనని ఇప్పుడు తెలిసివస్తోంది వారికి.
కన్నులకు కట్టినట్టు జరిగిపోయిన సంఘటనలు తలపుకు రావడంతో నీళ్ళు నిలచిన కనుకొనలకు అద్దుకుంటూ భారమయిన హృదయాలతో బయటకు కదిలారు ఆ దంపతులు ఇద్దరూ....
ఆ పిల్లల ముఖాలలో నూతనోత్సాహం చోటుచేసుకుంది.
రాజశేఖర్ నయనాలలో ఎర్రజీర చోటుచేసుకుని వుంది. అతని ముఖం గంభీరంగా వుంది...
అనుపమ షాక్ కు గురై కుప్పలా కూలిపోయింది.
ఇన్ స్పెక్టర్ ధీరజ్ ఆమెను పొదివి పట్టుకున్నాడు.
డాక్టరుకు ఫోన్ చేశాడు రాజశేఖర్!
* * *
"అధికారీ! మనం కొల్లగోట్టుకున్న డబ్బంతా ఏం చేస్తున్నావు నువ్వు....?"
ఎప్పటినుంచో అడగాలనుకొంటున్న ప్రశ్నను అప్పుడు అడిగింది సంజీవి.
"మనకు డబ్బుతో అవసరమేముంటుంది? తిండి తిప్పల కోసం ఇంటి అద్దెకు వెరసి రెండువేల రూపాయలు మాత్రం వుంచి మిగిలిన సొమ్మునంతా ఒక సంఘసంస్కర్త ఖజానాలో జమచేశాను."
"ఎవరతను?"
అనుమానంగా ప్రశ్నించిందామె.
"ఎవరై తేనేం!"
"దాపరికాలా....అంటే నావద్ద కూడా దాస్తున్నావా?"
"ఆడవారి నోటిలో నువ్వుగింజ కూడా దాగదు అంటారు. అందునా నీలాంటి వసపిట్టకు సీక్రెట్స్ చెబితే ఇంకేమయినా వుందా?"
అంతే...ఆమె ముఖం ఎరుపెక్కింది. చివుక్కున తల తిప్పుకుంది.
ఆమె కోసం చూసేసరికి అధికారికి జాలివేసింది. "అదే వద్దంది. ఆ మంకుపట్టుదలకు మాత్రం తక్కువేమీ లేదు, అసలు ఏది పట్టుకుంటే అదే. సరేలే చెబుతా. అయినా నీ దగ్గర దాపరికాలేముంటాయి."
"అవసరంలేదు!" బుంగమూతి పెట్టింది సంజీవి.
"దేవిగారు క్షమించాలి. ఈ భక్తుడిని శపించకండి. అయినా మూడవ వ్యక్తి గురించి నీతో ఎందుకు గొడవపెట్టుకోవాలి? అతనిపేరు రాజశేఖర్. మద్రాసులో వుంటాడు. నేరస్థులను చేరదీసి వారిని మంచివారుగా తీర్చిదిద్దుతూ వుంటాడు. అనాధ బాలలను ఆదుకొని తన శరణాలయంలో ఆశ్రయం కల్పిస్తుంటాడు. నిరుద్యోగ యువకుల పాలిట కల్పవృక్షం లాంటివాడు. ఎలాంటి స్వార్ధం లేకుండా నేరస్థులను మంచివారుగా మార్చడంలోనే తన జీవిత కాలాన్ని అంకితం చేసిన మహానుభావుడు."
అతను చెబుతున్నంతసేపు కళ్ళింత చేసుకుని ఆశ్చర్యంగా వింటున్నది సంజీవి.
"అంత గొప్ప వ్యక్తి నీకెలా తెలుసు?" విస్మయంగా అడిగింది.
"నాలాంటి అనాధలను దేవుడులాంటి వ్యక్తి. ఆయన చేసే మంచి పనులకు ఈ విధంగానయినా ఆర్ధిక సహాయం అందజేయాలని నా తాపత్రయం. నాలాగా ఎవరూ అనాధలుగా మిగిలిపోకూడదనే నా తపన. అందుకు నేను ఎన్నుకున్న మార్గం ఇది."
"అంటే నువ్వు అంతకుముందు కొల్లగొట్టిన కోటి రూపాయల వెండిని కూడా ఆ రాజశేఖర్ కే ధారపోశావా?"
"అవును.....అన్నకు నేను ఏమి ఇచ్చినా నా రుణం తీర్చుకోలేను. అందుకే ఇంతకాలం దోపిడీ చేసిన సమస్త సంపదనూ అన్నకే పంపిస్తూ వచ్చాను."
"నీకేమీ మిగలకపోతే ఎలా? పూర్తిగా అన్నకే దోపిడీ సొమ్ము ఇచ్చేస్తే నీ జీవితం ఏమవుతుంది." ఉండబట్టలేక ప్రశ్నించింది సంజీవి.
"నా జీవితం ఎలాంటి ఒడిదుడుకులకు లోనయినా నేను బాధపడను."
"నీ ఆశయం మంచిదే. కాదనను. కానీ ఎంత కాలం ఇలా కొడిగట్టిన దీపంగా శ్రమిస్తుంటావు? రేపు ఏదయినా నీకు జరగరానిది జరిగితే నేను తట్టుకోలేను."