Previous Page Next Page 
టు హెల్ విత్ లవ్ పేజి 27


    "బహుశా యిది మీకు ఉద్యోగంలో మొదటిరోజు, ఆఖరిరోజు కూడా అనుకుంటాను!" టీజింగ్ గా అంది.
    "ఉద్యోగందేముందిలెండి! మనకిది ఆఖరిరోజు కాదు కదా!"
    "ఎందుక్కాదు? మీ అధికారం తెల్లారేసరికి ముగుస్తుంది"
    "అధికారంతోకాని పనులు ప్రేమతో సాధించుకోవచ్చని మా ఫ్రెండ్ ఒకమ్మాయి అంటూండేది!" ప్రేమగా ఆమె చేయి నిమిరి తనగదిలోకి వెళ్ళిపోయాడు.
    నిద్ర ఎప్పుడు పట్టిందోతెలీదు. ఫోన్ మోగుతున్న చప్పుడు విని చటుక్కున కళ్ళుతెరిచాడు.
    దూరంలో ఫోన్ మోగుతున్న శబ్దం తప్పితే అంతా నిశ్శబ్దం.
    లేచి రిసెప్షన్ కౌంటర్ దగ్గరకు నడిచాడు.
    దీపిక కనిపించలేదక్కడ.
    ఆపరేటర్ రూమ్ లోనూ, స్టాఫ్ రూమ్ లోనూ కూడా కనిపించక పోయేసరికి ఆశ్చర్యం కలిగిందతనికి.
    టైమ్ చూసుకున్నాడు. మూడవుతోంది.
    ఫోన్ తీసి మాట్లాడాడతను.
    "హలో!"
    "హలో! నేను ఎయిర్ పోర్టునుంచి మాట్లాడుతున్నాను. ఏ.సి. రూమ్ ఒకటి ప్రొవైడ్ చేయగలరా?"
    ఆక్యుపేషన్ రిజిష్టర్ తీసి చూశాడతను. చాలా రూమ్స్ ఖాళీగా వున్నాయి.
    "యస్! యూ కెన్ గెటిట్ సర్!"
    "ఓ.కే. అయామ్ కమింగ్!"
    ఫోన్ డిస్కనెక్ట్ అయ్యింది.
    నిద్రపోతూన్న బేరర్ని లేపాడతను.
    "దీపిక ఏది?"
    వాడు కంగారుపడ్డాడు.
    "పిల్చుకొస్తాసార్!"
    "ఎక్కడినుంచి?"
    "కాసేపు నిద్రపోతానని రూమ్ లో కెళ్ళింది"
    పరుగుతో వెళ్ళాడు. అప్పటికే కారుదిగి లోపలకు వచ్చేశాడు ఫోన్ చేసినతను. అతని వెనుకే నిద్రమత్తులో అందంగా మత్తుగా చూస్తోంది ఒకామె.
    "యూ కెన్ టేక్ రూమ్ నెంబర్ ఫోర్ జీరో త్రీ ప్లీజ్! చెప్పాడు సురేష్.
    "వాటెబౌట్ రైటింగ్ ఇన్ ది రిజిష్టర్?"
    "రేపు మాణింగ్ రాయవచ్చు. అయ్ థింక్ యూ నీడ్ గుడ్ రెస్ట్ ఇమీడియట్లీ....."
    వాళ్ళు లిఫ్ట్ దగ్గరకెళ్ళేసరికి లిఫ్ట్ లో నుంచి బయటికి వచ్చింది దీపిక.
    "అయామ్ సారీ! కాసేపు నిద్రపోదామని....."
    "అయ్ థింక్.....ఇవాళ మీక్కూడా ఆఖరి రోజనుకుంటాను"
    "వాళ్ళు కంప్లయింట్ చేశారా?" గాబరాగా అడిగింది.
    "అవును!"
    "అవును!"
    "మైగాడ్!" కుర్చీలో కూలబడిపోయింది. "ఇప్పుడెలా?"
    "రేపట్నుంచి ఇద్దరం కలిసి వెదుకుదాం ఉద్యోగానికి!"
    "కానీ మీరు తల్చుకుంటే నాకు సహాయం చేయవచ్చు"
    "ఎలాంటి సహాయం?"
    "నేను రూమ్ లో కెళ్ళి నిద్రపోయినట్లు బాస్ కి చెప్పకూడదు!"
    "మరి నామీద కంప్లయింట్ సంగతేమిటి?"
    "అదీ చింపిపారేద్దాం! ఓ.కే.?"
    "క్విట్స్" అన్నాడు చేయి చాపుతూ.
    "క్విట్స్" అందామె చేయి కలుపుతూ.
    ఉదయం హాట్ కాఫీ తాగబోతుంటే లోపలికొస్తూ విష్ చేసింది సుచిత్రాదత్. ఆమెను చూస్తూనే స్టన్ అయిపోయాడు సురేష్.
    ఈ డ్రస్ లో ఆమె అందం మిరుమిట్లు గొల్పుతోంది. డ్రస్సేకాదు! హెయిర్ స్టయిల్, మేకప్, నెయిల్ పెయింట్, లిప్ స్టిక్ కలర్..... అన్నీ మారిపోయాయ్. తులసి తర్వాత అంతగా కళ్ళప్పగించి చూసే అందం ఎక్కడా కనిపించలేదు ఇన్ని రోజులుగా!
    మొదటిసారిగా మనసూ, శరీరం అన్నీ తన అధీనం తప్పిపోయినయ్.
    "మీ కాఫీ షేర్ చేసుకోవచ్చా?" అడిగిందామె ఎదురుగ్గా కూర్చుంటూ....చిరునవ్వుతో.
    "ఓ! కాఫీయేకాదు! రడీ టు షేర్ ఎనీథింగ్!" రెండో కప్పులో ఆమెకు కాఫీ పోసిస్తూ అన్నాడు.
    "ఎలా వుంది మీ ఫస్ట్ నైట్?" చిరునవ్వు అలానే చిలుకుతోంది.
    సురేష్ అదిరిపడ్డాడు.
    తననుమించిపోయిందీ కేస్!
    "ఆ విషయం నా పార్టనర్ నడగాలి మీరు!" కోలుకుంటూ అన్నాడు.
    "పార్టనర్ ఎవరు?"
    "దీపిక!"
    "ఓ! బాడ్ లక్!"
    "ఎందుకు బాడ్ లక్?"
    "అదే! దీపిక .... అంటార్కిటికా ప్రాంతానికి చెందిన వంశం వాళ్ళు కదా!" టీజింగ్ గా అంది.
    ఆమె లెవల్ చూస్తూంటే వింతగా ఉందతనికి.
    ఆ షాప్ లో ఆంగ్లో ఇండియన్ పిల్ల.... ఇప్పుడీ రిసెప్షనిస్ట్...
    తన సర్వీసులో వీళ్ళిద్దరే తనను మంచినీళ్ళు తాగించారు.
    కాఫీ త్రాగేసిందామె.
    "థాంక్యూ సూపర్ వైజర్!" లేచివెళ్ళిపోతూ అంది.
    ఆమె నడక, హొయలు....ప్రాణాలు లాగేస్తున్నట్లుంది.
    ఆమె గురించే ఆలోచిస్తుంటే విజయ చందన్ హడావుడిగా లోపలికొచ్చాడు.
    "హల్లో డియర్! ఎవ్విరి థింగ్ ఓ.కే."
    "యస్ బాస్! ఎవ్విరి థింగ్ ఓ.కే.!"
    "వెరీగుడ్! ఏ కంప్లయింట్ లేకుండా డ్యూటీ చేయటం నీ అదృష్టం. అన్నట్లు ఇవాళ సుచిత్రాదత్ ని చూశావా?"
    "ఓ! కాఫీ షేర్ చేసుకున్నాంకూడా!"
    విజయ్ చందన్ ఉలిక్కిపడ్డాడు.
    "కాఫీ షేర్ చేసుకున్నారా?"

 Previous Page Next Page