ఆమె గాబరాగా లేచి నిలబడింది.
"అయ్ మీన్ అయామ్ న్యూసూపర్ వైజర్!?"
"ఓ! మీరేనా? ఇందాకే విజయ్ చందన్ ఫోన్ చేసి చెప్పారు నా పేరు దీపిక."
"ఓ.కే. నేనోసారిబార్, రెస్టారెంట్ చెక్ చేసుకొస్తాను. ఏమయినా కంప్లయింట్స్ వుంటే నోట్ చేసి వుంచండి."
"షూర్!"
"బైదిబై మీ హాబీస్ ఏమిటో చెప్పలేదు?"
ఆమె మళ్ళీ కలవరపడింది.
"హాబీలా?"
"యస్! హాబీస్."
ఆమె ఆలోచనలో పడింది. "హాబీస్ అంటే వెల్! పాటలు పాడతాను, వింటాను."
"వెరీగుడ్! ముందా, తర్వాతా?"
ఆమె మళ్ళీ కన్ ఫ్యూజయింది.
"ఏమిటిముందా, తర్వాతా?"
సురేష్ చిరాకు నటించాడు. "యూ ఆర్ వెరీ స్లో మిస్ దీపికా! అయ్ పిటీ యూ!" వెళ్ళిపోయాడు.
బార్, రెస్టారెంట్ అన్నీ చాలాసందడిగా జనంతోనిండిపోయి ఉన్నాయి. ఆడా, మగా అందరూ తాగుతూ తింటున్నారు.
దేశంనాలుగు మూలల్నించీ సెమినార్ కొచ్చిన డాక్టర్లలో నలుగురు లేడీ డాక్టర్లు అందంగా ఉన్న ఓ మగ డాక్టర్ని ఓ మూల టేబుల్ దగ్గర ఆటలు పట్టిస్తూండటం గమనించాడు సురేష్.
వాళ్ళ టేబుల్ దగ్గరికి చేరుకుని వినయంగా వంగి ఒకామెను అడిగాడు.
"ఎనీ ప్రాబ్లెమ్ విత్ ఫిమేల్ కంపెనీ డాక్టర్?"
"నో ప్రాబ్లమ్ ఎటాల్!" నవ్వుతూ చెప్పిందామె.
"రాత్రికి మా రూమ్ కొస్తావా డాక్టర్? మంచి మ్యూజిక్ విందాం" సెక్సీగా వున్న ఓ డాక్టర్ అడిగిందతనిని.
అతను సిగ్గుపడుతూ సురేష్ వేపు చూశాడు.
"కమాన్ యస్ ఆర్ నో.....క్విక్" దబాయించిందామె.
"ఓ.కే. వస్తాను! ఒక షరతు" భయంగా అన్నాడు.
"ఏమిటా షరతు?"
"కేవలం మ్యూజిక్ వినడానికయితే వస్తాను."
"కేవలం మ్యూజిక్కే విందాం."
"అసభ్యకరమయిన ప్రవర్తన ఉండదని మాట ఇవ్వాలి."
"అలాంటిదేమీ ఉండదు."
"ఒక వేళ నాకా మ్యూజిక్ నచ్చకపోతే?"
"అప్పుడు మీ డ్రస్ మీకిచ్చేస్తాం! వేసుకుని మీ రూమ్ కెళ్ళిపోవచ్చు"
అందరూ ఘల్లున నవ్వేశారు.
కుర్ర డాక్టర్ మొఖం ఎర్రబడిపోయింది.
లేచివడివడిగా రూమ్ కెళ్ళిపోయాడు. వాళ్ళు విరగబడినవ్వుకోసాగారు అతనిని చూసి.
"నిన్న మాణింగ్ నేనేం చేశానో తెలుసా?" ఒకామె అడిగింది.
"ఏంచేశావు?"
"అతని ఎయిర్ పిల్లోకి చిల్లుపెట్టేశాను...గుండు సూదితో."
అందరూ మళ్ళీ నవ్వుకున్నారు.
"నేనేం చేశానో తెలుసా? అతని కళ్ళజోడు అద్దం మార్చేశాను" రెండో డాక్టర్ అంది.
మళ్ళీ నవ్వారందరూ.
"నేనేం చేశానో తెలుసా? మనం సెమినార్ కొచ్చిన మొదటి రోజునే అతని సూట్ కేస్ ని మారుతాళం చేతులతో ఓపెన్ చేసి లోపలున్న కాంట్రాసెప్టివ్స్ కి సన్నగా చిల్లులు పొడిచాను" అన్నాడు సురేష్ నెమ్మదిగా కల్పించుకుని.
ఇద్దరు గట్టిగా నవ్వారుగానీ, మిగతా ఇద్దరు మాత్రంపారిపోయిన ముఖంతో....."మైగాడ్" అంటూ అరచిస్పృహ తప్పారు.
సురేష్ చప్పునవాళ్ళ ముఖంమీద నీళ్ళు జల్లికిందకు పడిపోకుండా పట్టుకున్నాడు. అందరూ సైలెన్స్ అయిపోయారు.
"చూశారా! ఇతరులకు హానిచేయువారు తామేచెడిపోవుదురు" అన్నాడు సురేష్. ఒకామె లేచి నిలబడిందిగానీ రెండో ఆమె లేవలేకపోయింది.
ముగ్గురూ లేచి ఆమెను నెమ్మదిగా నడిపించుకుంటూ లిఫ్ట్ వేపు వెళ్ళిపోయారు.
హోటల్ అంతా తిరిగి రిసెప్షన్ దగ్గరకొచ్చేసరికి దీపిక ఓ కాగితం అతని కిచ్చింది.
దాన్నిండా కంప్లయింట్స్ రాసి ఉన్నాయ్.
నెంబర్ వన్ కంప్లయింట్ సూపర్ వైజరు సురేష్.
కంప్లయింట్ బై లేడీ డాక్టర్స్ ఫ్రమ్ రూమ్ నెంబర్ 686.
మిగతా కంప్లయింట్స్ అన్నీ చెక్ చేసుకుని ఆఖర్లో రూమ్ నెంబర్ 686కి చేరుకున్నాడు.
"హలో డాక్టర్స్ నా గురించి కంప్లయింట్ చేశారట" గడపలో నిలబడి అడిగాడు.
"యస్! మీరు చేసిన పనివల్లమాకు ఎంత ప్రాబ్లమ్ వచ్చింది చూడండి" అంది ఒకామె కోపంగా.
"డాక్టర్స్ కి ఇలాంటివి ప్రాబ్లమ్ ఎలా అవుతాయి డాక్టర్. ఎంతో మంది ప్రాబ్లమ్స్......ఐ మీన్..... ఇలాంటివి సాల్వ్ చేస్తూంటారు కదా?"
"అవన్నీ మాకు తెలుసు! కానీ ఇప్పుడీ స్పృహ తప్పినవాళ్ళిద్దరూ మారీడ్ గాళ్స్! నీకు తెలుసా ఆ విషయం?"
సురేష్ ఆనందంగా వాళ్ళవేపు చూశాడు.
"అయితే ప్రాబ్లమ్ పూర్తిగా సాల్వ్ అయిపోయినట్లే మేడమ్ వీళ్ళ ఎడ్వెంచర్స్ అన్నీ హాపీగా కవరయిపోతాయ్ కదా?"
"డోంటాక్ నాన్సెన్స్! వాళ్ళ భర్తలు ఎప్పుడో వేసెక్టమీ చేయించుకున్నారు"
"చూశారా అక్కడ దెబ్బతినేశారు. చాలా ఫూలిష్ డెసిషన్ అది! అందుకే ఎప్పుడూ మీరే ఆపరేషన్ చేయించుకోవాలి. టోటల్లీ సేఫ్!"
"మీ మీద మీ మేనేజ్ మెంట్ కి కంప్లయింట్ చేస్తున్నాము. ఈ సంగతి చెప్పటానికే పిలిచాము."
"సరే! ఎలాగు కంప్లయింట్ ఇస్తున్నారు. ఎలాగూ మీకు ప్రాబ్లమ్ వచ్చేసింది. మరినేనిక్కడే ఉండిపోవచ్చా?"
ఆమె అతనిని బయటకు తోసి తలుపేయబోయింది.
"ఆగండాగండి. ఇందాక నేను జోక్ చేశాను అంతే! ఆ చిల్లులు పెట్టనేలేదు."
పడుకున్న ఇద్దరూ అదిరిపడి లేచికూర్చున్నారు.
"అయ్యో! ఇప్పుడు కొంప పూర్తిగా మునిగిపోయింది" అంది ఒకామె.
"ఇందాకే మునిగిందా!" ఆశ్చర్యంగా అడిగాడు.
"నీమాటనమ్మి, మీ వేసక్టమీ ఆపరేషన్ ఫెయిలయిందని మావారితో ఫోన్లో చెప్పేశాను"
"అయితే అసలు ప్రాబ్లమెలేదు డాక్టర్! నేను సహాయం చేస్తాను మీకు."
అతనిని పూర్తిగా గెంటి తలుపేసేసింది డాక్టర్.
సూపర్ వైజర్ రూమ్ లో కెళ్ళబోతుంటే....దీపిక చిరునవ్వు నవ్వింది.