డాక్టర్ ఉలిక్కిపడ్డాడు. అతని మొఖంలో రంగులు మారిపోయినయ్-
"ఓర్నాయనో! ఇప్పుడే వస్తానుండు" అంటూ హాస్పిటల్లోని ఇంజెక్షన్ రూమ్ వేపు పరుగెత్తాడు డాక్టర్.
ఓ పెద్దమనిషి నాలుగు సూట్ కేస్ లతో ఒక ఎయిర్ లైన్స్ బుకింగ్ కౌంటర్ దగ్గరకొచ్చాడు.
"చూడండి మిస్! ఈ నాలుగు సూట్ కేసుల్లో ఒకటి లండన్ వెళ్ళాలి- రెండోది న్యూజిలెండ్, మూడోది సింగపూర్, నాలుగోది మెల్ బోర్న్ వెళ్ళాలి- నేనేమో కాలిఫోర్నియా కెళ్ళాలి- ఇదిగో నా టికెట్-" అంటూ టికెట్ ఆ అమ్మాయి కిచ్చాడు.
"సారీ సార్- లగేజ్ అంతా మీరెక్కడికెళ్తే అక్కడికే వస్తుంది గానీ వేర్వేరు సిటీలకు పంపటం సాధ్యం కాదు-" అందా అమ్మాయి అతన్నో పిచ్చాడిలాగా చూస్తూ.
అతను ఆశ్చర్యపోయాడు.
"సాధ్యం కాదా? అదేంటి? మరి కిందటి సారి నేను అమెరికా వెళ్ళినప్పుడు నా లగేజ్ నేను అడక్కుండానే నాలుగు దేశాలకు పంపించారు కదా!"
ఆ అమ్మాయి గాల్లోకి చూసింది.
వర్కర్స్ ప్రాబ్లెమ్ తో బాస్ విసిగిపోయాడు.
ఒక వర్కర్ ని పిలిచి ఆప్యాయంగా మాట్లాడాడు.
"చూడు! నీకు జీతం రోజుకి అయిదొందలు పెంచుతున్నా! మరి ఇంక మానకుండా పనిచేస్తావా?"
అతను ఓ క్షణం ఆలోచించాడు.
"జీతం ఓకేగానీ- రోజు=కి రెండు షిప్ట్ లు పనిచేస్తా-"
ఒక ఇండియన్ శాటిలైట్ లో ఎందుకయినా మంచిదని ఒక ఫోటో గ్రాఫర్ ని కూడా పంపించారు.
శాటిలైట్ కిందటి తిరిగి వచ్చాక అందరూ ఆ ఫోటోగ్రాఫర్ చుట్టూ మూగారు.
"భూమి పైనుండి ఫోటోలు తీశావా?" అడిగారు వాళ్ళు.
"తీశాను కానీ-- ఒక్క ఫోటో కూడా సరిగ్గా రాలేదు-"
అందరూ ఆశ్చర్యపోయారు.
"అదేంటి? ఎందుకని రాలేదు?"
"ఎందుకేంటండీ! భూమ్మీద జనం ఒక్క క్షణమయినా కదలకుండా నిలబడితేనా?"
పిల్లలిద్దరూ రోజూ ఐస్ క్రీమ్, చాక్ లెట్లు కావాలని గొడవ చేయడంతో తల్లిదండ్రులు వాళ్ళకి 'కిడ్డీ బాంక్' బొమ్మలు కొనిచ్చారు.
"ఐస్ క్రీమ్, చాక్ లెట్స్ కొనకుండా ఆ డబ్బు కిడ్డీ బాంక్ లో వేసి దాచుకోండి! బాగా డబ్బుపోగయ్యాక అప్పుడూ ఏవయినా అవసరమయిన వస్తువులు కొనుక్కోవచ్చు-" అన్నారు తల్లిదండ్రులు.
"మాకా కిడ్డీ బాంక్ లు వద్దు!" అన్నారు పిల్లలు.
"ఎందుకని?"
"ఎందుకంటే ఇలా డబ్బులు ఖర్చు చేయకుండా దాయటం అలవాటయిపదేళ్ళయ్యేసరికి పరమ పిసనారులైపోతాం! మేమలా అవటమే కాకుండా మిమ్మల్నిద్దరినీ దోపిడీ దొంగలుగా తయారు చేసిన వాళ్ళమవుతాం!"
"అదేంటి?"
"అవును మరి! మా కిడ్డీ బాంక్ లో నుంచి డబ్బు కాజేసేది మీరే కదా-"
హైద్రాబాద్ లో జరుగుతోన్న బుక్ ఎగ్జిబిషన్ లో చాలామంది మీటింగ్ లో ఉపన్యాసాలు ఇచ్చారు. ఆఖర్లో ఓటాఫ్ థాంక్స్ చెప్పేముందూ ఎగ్జిబిషన్ నిర్వాహకుడు మాట్లాడాడు.
"ఇప్పుడు చెప్పండి సోదరసోదరీమణులారా! ఈ ప్రముఖుల స్పీచ్ లు విన్నాక ఇప్పుడు పుస్తకాల మీద మీకో చక్కని అవగాహన ఏర్పడి ఉంటుందనడంలో నాకెలాంటి సందేహం లేదు. మీకు ఎలాంటి బుక్ జీవితాంతం తోడుగా ఉండాలను కుంటున్నారో ఎవరయినా లేచి నిలబడి చెప్పగలరా?" అడిగాడతను.
ఓ యువతి మధ్యలో నుంచి లేచి నిలబడింది.
"జీవితాంతం నాలాంటి యంగ్ మారీడ్ గాళ్ కి ఒకే ఒక్క బుక్ తోడుండాలని పిస్తోంది సార్"
"అలాగామ్మా! ఏం బుక్ అది? ఎవరు రాశారు?"
"మా డాడీ రాశారండీ. దాని పేరు చెక్ బుక్-"
కాలనీ సెంటర్లో ఒక క్రికెట్ బాట్ పట్టుకుని వంటరిగా కూర్చున్న ఓ కుర్రాడిని పలుకరించాడు ఓ పెద్దమనిషి.
"నీపేరేంటి బాబూ?"
"సల్మాన్ ఖాన్!"
"అలాగా! నీ వయసెంత?"
ఆ కుర్రాడు తలకొట్టుకున్నాడు.
"అదే తెలీక ఛస్తున్నానంకుల్! స్కూల్ రికార్డ్స్ లో ఏడేళ్ళు అని ఉంది. రేషన్ కార్డులో 14 ఏళ్ళు అని ఉంది. ఓటర్స్ లిస్టులో 24 ఏళ్ళు. ఆ తఃరువాత నేను ఎడల్ట్స్ సినిమాకెళ్తే నా వయసు పందొమ్మిది 19 సంవత్సరాలు- అంతా అయోమయంగా ఉందనుకోండి"
ఓ స్వామీజీ ఇచ్చిన ఆధ్యాత్మిక ఉపన్యాసం విని ఒక జాలీ టైప్ మధ్య వయస్కుడు వెంటనే మారిపోయాడు. ఆ సిటీలో ఉన్న గాళ్ ఫ్రెండ్స్ అందరినీ వెంటనే వదిలేశాడు. అంతే గాకుండా తనెప్పుడో సింగపూర్ వెళ్ళి లైఫ్ ని ఎంజాయ్ చేయాలని కొనుక్కున్న విమానం టిక్కెట్టు కాన్సిల్ చేసి పారేశాడు. సింగపూర్ లో గాళ్స్ తో ఎంజాయ్ చేయాలని దాచుకొన్న రెండు లక్షల రూపాయలు వెంటనే తీసుకెళ్ళి ఆ స్వామీజీకే విరాళంగా ఇచ్చేశాడు.
"మీరు ఇచ్చిన ఉపన్యాసం విన్నాక నేనెంత రాంగ్ ట్రాక్ లో ఉన్నావో అర్ధమయింది స్వామీ! అందుకే తుచ్చమయిన సుఖాలన్నీ వదిలేశాను- ఓ వారం రోజుల్తర్వాత వచ్చి మీ ఆశ్రమంలో చేరిపోతాను" అని చెప్పి వెళ్ళిపోయి వారం తర్వాత తిరిగి వచ్చాడు - కాషాయ దుస్తుల్లో-
కానీ ఆశ్రమానికి తాళం కనిపించింది.
ఆ చుట్టుపక్కలాళ్ళను స్వామీజీ గురించి అడిగాడతను.
"ఆ మధ్యన వాడెవడోగానీ స్వామీజీకి రెండు లక్షలు విరాళం ఇచ్చాడంట! ఆ రెండు లక్షలూ తీసుకుని స్వామీజీ సింగపూర్ వెళ్ళిపోయాడు. లైఫ్ ఎంజాయ్ చేయాలంటే సింగపూర్ లోనే ఎంజాయ్ చేయాలని ఆయన కోరిక. కానీ డబ్బులేక ఇంతకాలం వెళ్ళలేకపోయాడు పాపం-"
"నువ్వెప్పుడయినా చేయరాని పొరబాట్లు చేశావా" క్లబ్బులో మందుకొడుతూ ఒక డాక్టర్ ఇంకో డాక్టర్ నడిగాడు.
"ఒకసారి చేశాను" విచారంగా అన్నాడు రెండో డాక్టర్.
"ఏమిటది?"
"ఒకతనికి గాల్ బ్లాడర్ ఆపరేషన్ చేశాను. తీరా ఆపరేషనంతా అయిపోయి డిశ్చార్జ్ తీసుకుని వెళ్ళిపోతూంటే తెలిసింది- అతను ఆ ఆపరేషన్ కోసమని పాతిక లక్షలు సిద్దంగా ఉంచుకున్నాడట! ఆ సంగతి ముందే తెలుస్తే- ఆ పాతిక లక్షలకు సరిపడా ఆపరేషన్లు చేసేవాడిని కదా-" బావురుమని ఏడుస్తూ చెప్పాడతను.
ఒక కోటీశ్వరుడితో ఇన్సూరెన్స్ చేయించాలని వచ్చాడు ఒక ఏజెంట్.
కోటీశ్వరుడు ఓ మూల నెత్తిన బట్టవేసు క్కూర్చొని ఉన్నాడు. అతని భార్య బయటికొచ్చి ఏం కావాలని అడిగింది.
"అదే మేడమ్! ఆయన్తో కోటి రూపాయలు ఇన్సూరెన్స్ చేయిద్దామని వచ్చాను-" ఆమె ఏజెంట్ ని చూసి జాలిపడింది.
"పిచ్చివాడా! పదిరోజుల క్రితమే వ్యాపారంలో విపరీతమయిన నష్టం వచ్చి మొత్తం ఊడ్చుకుపోయింది. కోట్ల అప్పులు మిగిలాయ్-" అందామె.