"ఎప్పట్నుంచో చూస్తున్నాను! హాయ్ ఈజ్ అన్ ఫిట్!" అన్నాడాయన.
"నేనూ చిన్నప్పట్నుంచీ కనిపెడుతున్నాను. ఇలాగే హోప్ లెస్ గా ఆడుతున్నాడు సార్."
సరిగ్గా అప్పుడే ట్రాన్సిస్టరు మళ్ళీగోల.
"గెటౌట్! అన్నాడాయన కోపంగా నావేపు తిరిగి! "ఆ కాయితం మీద సంతకం" అడిగాను భయంగా కాగితం చింపి చెత్తబుట్టలో పారేశాడు.
ఇంకలాభం లేదని బయటికొచ్చేశాను..
సీటు దగ్గర కూర్చుని ట్రాన్సిస్టరు చెవి దగ్గర పెట్టుకున్నాను. ఈ క్రికెట్ అంతుతేల్చుకోవలసిందే! లేకపోతే జీవితమే సర్వనాశనం అయిపోతుంది.
సన్ దీప్ పాటిల్ మళ్ళీ ఓ బౌండరీ కొట్టాడు. అంతా గొడవ.
"వాడ్డూయూ సే ఎబౌట్ దిస్ షాట్" కామెంటేటర్ స్పెషలిస్ట్ నడిగాడు.
"మాగ్నిఫిసెంట్ షాట్! ఇలాంటి బ్యాటింగ్ ఇంతకుముందు డబ్బింగ్స్ ఒక్కడే చేయగా నేను 1948 లో ఇంగ్లాండు వెళ్ళినప్పుడు చూశాను. సన్ దీప్ పాటిల్ పొద్దుట్నుంచీ కూడా ఎంతో ఆత్మవిశ్వాసంతో అద్భుతంగా ఆడుతున్నాడు. పూర్తిగా సెటిలయ్యాడు. అతను వెస్టిండీస్ బౌలింగ్ కి ఒక ఛాలెంజ్!" అంటూ హిందీలో చెప్పాడతను.
సరిగ్గా ఆ తర్వాత బాలుకే సన్ దీప్ పాటిల్ అవుటయిపోయాడు.
ట్రాన్సిస్టర్ లో కొద్దిక్షణాలు పెద్ద కోలాహలం.
"సూపర్ కాచ్ అండ్ హి ఈజ్ అవుట్. వాడ్డూయోసే ఎబౌట్ దిస్ షాట్" మళ్ళీ స్పెషలిస్టునడిగాడు కామెంటేటర్.
"ఇటీజే ఫూలిష్ షాట్! ఇంత చచ్చు దరిద్రపు బాటింగ్ నేను 1953లొ మూసర్ మూర్ ఆస్ట్రేలియాలో ఆడగా చూశాను. అంతే! ఆ తర్వాతెవరూ ఇంత చెత్తగా ఆడలేదు. అసలు ప్రొద్దుటి నుంచీ సన్ దీప్ పాటిల్ చాలా వరస్ట్ గా ఆడుతున్నాడు. ఆ బౌలింగ్ ని ఎదుర్కోవటమే చేతకావటంలేదు. ప్రతిబాల్ కీషేక్ అయిపోతున్నాడు. ఇన్నిగంటలు ఆడినా ఇంకా సెటిలవలేదు. ఇర్రెస్పాన్సిబుల్ ప్లేయింగ్!" అన్నాడతను హిందీలో.
నాకు అయోమయంగా ఉన్నాయతని మాటలు.
సాయంత్రం రెడ్డీ, నేనూ కలిసేవెళ్ళాం ఇంటికి.
"మనాళ్ళందరూ ఎందుకంత త్వరగా అవుటయిపోయారు?" అడిగాను రెడ్డిని.
"కామెంటరీ వినలేదా నువ్వు?"
"విన్నాను-"
"మరి ఆ స్పెషలిస్ట్ అన్నీ వివరంగా చెప్పాడు కదా! పిచ్ చాలా డేంజరస్ గా ఉందిట! ఎంత మొనగాళ్ళయినా సరే ఈ పిచ్ మీద బుల్లెట్ తగిలిన పిట్టల్లా రాలిపోవాల్సిందేనట!"
"అంటే ఈ ఆట చాలా ఫేక్టర్స్ మీద ఆధారపడి ఉందన్నమాట!"
"అవును! పిచ్, వికెట్ టర్న్ తీసుకోవడం, స్పిన్నయిపోవడం, లైటు ఎక్కువవడం, షేడ్ రావడం, లైటు తక్కువవడం, వర్షం కురవడం, కొత్తబంతి తీసుకోవడం, ఇలా లక్షాతొంభయ్ విషయాల మీద ఆధారపడి ఉంటుంది."
మర్నాడు ఆఫీసులో విమలముందు నా పరిజ్ఞానం ప్రదర్శించాలని నిర్ణయించుకున్నాను.
"మనాళ్ళు హాప్ లెస్ లీ పూర్ ప్లేర్స్" అందామె టైప్ చేసిన కాగితం నాకిస్తూ.
"అదేంకాదు! పిచ్ డేంజరస్ గా ఉంది! అదీగాక కొత్తబంతి! ఈ పిచ్ మీద ఎంత మొనగాళ్ళయినా సరే బుల్లెట్ తగిలిన పిట్టలా రాలిపోవలసిందే" అన్నాను తడుముకోకుండా.
ఆమె పగలబడి నవ్వింది.
"అలాగా?" అంది నవ్వాపుకున్నాక.
"అవును! ఏం"
"మరి వెస్టిండీస్ ఇవాళ అలా సెంచరీలు కొడుతున్నారేమిటి?"
నేను అదిరిపడ్డాను.
"సెంచరీలా?"
"అవును!"
నాకేం చెప్పాలో తెలీలేదు. ఆసమయంలో రెడ్డి పక్కన ఉంటే ఏం చెప్పేవాడో అనిపించిందిగానీ రెడ్డి లేడు మరి!
"ఎలా కొడుతున్నారబ్బా?" అన్నాను ఆశ్చర్యం నటిస్తూ నిజానికి అపాయింటునాకేం అర్ధంకావటం లేదు.
"అందుకే చెప్పేది! పిచ్చీలేదు కాకరకాయలేదు! అవన్నీ సాకులు!"
అంటూ వెళ్ళిపోయిందామె. మళ్ళీ విమల దగ్గర పరువుపోయింది.
"ఇప్పుడెవరు బ్యాట్ చేస్తున్నారు?" అడిగిందామె.
"పొద్దున్నుంచీ వాళ్ళు ఇద్దరేగా ఆడుతున్నారు?" అన్నాను అంతకుముందు వరకూ ట్రాన్సిస్టర్ లొ విన్నపేర్లు గుర్తుకి తెచ్చుకుంటూ.
"ఎవరు?"
"అదే సిలిమాడాన్, ఇంకోకతను డీప్ స్క్వేర్ లెగ్! సిలిమాడాన్ మాత్రం అద్భుతంగా ఆడుతున్నాడు."
ఆమె మళ్ళీ కిలకిల నవ్వేస్తూ అక్కడి నుంచి వెళ్ళి అందరితోనూ చెప్పినవ్వసాగింది. నాకు తల కొట్టేసినట్లయిపోయింది. ఈ పరిస్థితిలొ ఆమె నన్ను ప్రేమించడం కల్ల!
ఎలాగయినా సరే- మరో మాచ్ పూర్తయేసరికల్లా మొత్తం నేర్చుకోవాలని ప్రతిజ్ఞ చేసేసుకుని రెండోమాచ్ టైమ్ కి మా ఆఫీస్ ఎగ్గొట్టి లక్ష్మణరావ్ గాడింట్లో టి.వి. చూస్తూ రోజులు గడిపేయసాగాను.
రాన్రాను నాకూ క్రికెట్ మీద ఆసక్తి పెరిగిపోయింది. ఆ తరువాత మాచీలన్నీ కూడా ఆఫీస్ ఎగ్గొట్టి చూశాను. చివరికేలా అయిందంటే నాకు తెలీని విషయం అంటూ ఏమీ మిగిలినట్లు నాకనిపించలేదు. ఆ తరువాత మాచ్ జరిగే సమయంలో వీరుడిలా ఆఫీసులో అడుగుపెట్టాను. అందరూ క్రికెట్ మాచ్ గురించి మాట్లాడుకుంటుంటే మధ్యలో దూరి స్పీచ్ మొదలెట్టేశాను.
"ఇది బ్యాట్స్ మెన్ పిచ్! అంచేత బ్యాటింగ్ మొదలెడితే వాళ్ళకు ఎడ్వాంటేజ్! ఇండియా టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే గాని గెలిచే అవకాశాలు లేవు" అన్నాను పెద్దఫోజిచ్చి.
అందరూ తెల్లబోయి నావంక చూడసాగారు.
ఆట మొదలయింది. ఇండియన్ వికెట్లన్నీ టపీటపీమని పడిపోతున్నాయ్. అప్పుడే ఆఫీసరు కారు దిగి లోపలికి వస్తూ నా దగ్గర ఆగి "ఎన్ని వికెట్లు పడిపోయాయ్?" అనడిగాడు.
"పార్టీ ఫర్ ఫైవ్!"
ఆయన నీరసంగా నా కెదురుగ్గా ఉన్న కుర్చీలో కూలబడిపోయాడు.
"ఏమిటంత ఘోరం? బౌలింగ్ మరీ సివియర్ గా ఉందేమో!" అన్నాడు.
దొరికిందే అవకాశమని అందుకున్నాను.
"నో సార్! యూ ఆర్ మిస్టేకెన్! మన బ్యాట్స్ మన్ కొంచెం కేర్ లెస్ గా ఆడారు! అంతే! ప్రతి బ్యాట్స్ మన్ కనీసం యాభయ్ పరుగులు చేయాల్సిన పిచ్ ఇది! కిందటిసారి అంటే పదేళ్ళ క్రితం వెస్టిండీస్ అక్కడ ఆడినప్పుడు కూడా అద్భుతంగా పరుగులు సాధించారు. మనవాళ్ళు! అంతకుముందు ఆస్ట్రేలియాటీమ్...."
"అంటే ఇప్పుడొచ్చిన బ్యాట్స్ మన్ అయినా కనీసం ఇండియాపరువు నిలబెడతారంటావా?" దిగులుగా అడిగాడాయన.
"ఓ, యస్! చూస్తుండండి! మన అసలయిన బ్యాట్స్ మన్ ఇంకా ఆడలేదుకదా! వాళ్ళు దంచేస్తారు." అన్నాను ధీమాగా.
"ఎవరువాళ్ళు?"
"రోజర్ బిన్నీ, మదన లాల్, కిర్మానీ"
"వాళ్ళు బ్యాట్స్ మన్ ఏమిటి నామొఖం? బౌలర్స్ కదా! కిర్మానీ వికెట్ కీపర్!"