"నో నో నో! అయాం సారీ! రియల్ బ్యాట్స్ మన్ వాళ్ళు ముగ్గురే! కావాలంటే హిస్టరీ చూడండి! వన్ డే క్రికెట్ లోనూ, త్రీడే క్రికెట్ లోనూ, సిక్స్ డే మాచ్ లోనూ సూపర్బ్ ఫెర్ఫారమెన్స్! టేక్ ది స్టాటిస్టిక్స్! రోజర్ బిన్నీ యావరేజ్ 36.6 రన్స్! మదన్ లాల్ 38.9 రన్స్ కిర్మానీ! 30 రన్స్! బౌలింగ్ అనాలిసిస్ రోజర్ బిన్నీ-26 ఓవర్స్-6 మెయిడిన్స్ 68 రన్స్-త్రీ వికెట్స్- మదన్ లాల్-" ఆఫీసరుగారు కుర్చీలో నుంచీ లేచి నిలబడ్డారు.
"ఓకే మిష్టర్! తర్వాత మాట్లాడదాం!" అనేసి తన రూమ్ లొ కెళ్ళిపోయారాయన. అందరూ నావంకే ఈర్ష్యగా చూచారు. ఆ సాయంత్రం ఆయనే నన్ను గదిలోకి పిల్చాడు.
"నువ్ చెప్పింది ఎగ్జాక్ట్ లీ కరెక్ట్! బిన్నీ, మదన్ లాల్, కిర్మానీ అద్భుతంగా ఆడబట్టే మన స్కోర్ బాగా పెరిగింది!" అన్నారాయన ఆనందంగా.
"ఇలా లాస్ట్ వికెట్ పార్ట్ నర్ షిప్ వెరీరేర్ సర్! 1927లొ ఇంగ్లీష్ టీంలో కూడా సర్ గారీకో బన్, విర్ మీర్ చేతన్ కూడా ఇలాగే మాక్సిమమ్ స్కోరింగ్ చేసి రికార్డ్ నెలకొల్పారు. ఆ తరువాత ఆస్ట్రేలియాలో..."
"ఓకే-ఓకే" అన్నారాయన నన్నాపే ఉద్దేశ్యంతో.
కానీ నేనెంత ప్రయత్నించినా బ్రేకులు పడడం కష్టంగా ఉంది.
"ఎనీవే- ఇంక్రిమెంటు ఆగిపోయిందన్నావు కదూ! అప్పీలు తీసుకురా! నేను రికమెండ్ చేసి హెడ్డాఫీస్ కి పంపిస్తాను! నాల్రోజుల్లో వచ్చేస్తుంది!" నాకు ఆనందం ఆగలేదు.
క్రికెట్ పుణ్యమా అని ఇంక్రిమెంటు వచ్చేస్తోంది.
త్వరత్వరగా అప్పీల్ రాసేసి పరిగెత్తుకెళ్ళి ఆయన ముందుపెట్టాను.
"వచ్చేవన్ డే మ్యాచ్ గురించి ఏమంటావ్! మనకేమయినా ప్రాస్పెక్టస్ ఉంటుందా?" అడిగారాయన.
"టు టెల్ యూది ఫాక్ట్- నో ఛాన్స్ సర్! గవాస్కర్ ఈపిచ్ మీద బాగా ఆడలేడు! అలాగే గయక్ వాడ్! ఎట్ దిమోస్ట్ పద్దెనిమిది పరుగుల కంటే ఎక్కువ తీయలేడు. ఆ తరువాత వెంగ్ సర్కార్ మంచి ఫామ్ లోనే ఉన్నాడుగానీ- మార్షల్ కూడా మంచి ఫామ్ లో ఉండటం వల్ల...."
"ఓకే-ఓకే" అంటూ నన్నాపబోయాడాయన.
ట్రాన్సిస్టర్ ఎక్స్ పర్ట్ కామెంటేటర్ ని కామెంటేటర్ అడుగుతున్నాడు హిందీలో.
"కపిల్ దేవ్ ఈ మధ్య సరిగ్గా బ్యాటింగ్ చేయలేకపోతున్నాడు. బహుశా అందుక్కారణం ఈ కెప్టెన్సీవల్ల మీదబడిన అదనపు బాధ్యత అని నేననుకుంటున్నాను. మీరేమంటారు?"
ఎక్స్ పర్ట్ కామెంటేటర్ దగ్గాడు.
"యస్! అఫ్ కోర్స్! యూ ఆర్ సెంట్ పర్సెంట్ కరెక్ట్! దిసీజ్ రియల్లీ ట్రెమండస్ రెస్పాన్సిబులిటీ! ఇంత బాధ్యత మీద ఉన్నప్పుడు అది తప్పక అతని ఫెర్ఫారమెన్స్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది! దిసీజ్ టూమచాఫ్ రెస్పాన్స్ బులిటీ! ఇంత బాధ్యత, బరువు మీదపడితే సరిగ్గా కాన్ సంట్రేషన్ ఉండటం కష్టం." ఆఫీసర్ ట్రాన్సిస్టర్ కట్టేశాడు. నేను ఇంక నిగ్రహించుకోలేకపోయాను.
"ఆ ఎక్స్ పర్ట్ కామెంటేటర్ చెప్పేదంతా బోగస్! మీరు నమ్మకండి! బాధ్యతలేదూ గాడిదగుడ్డూ లేదు. అదే నిజమైతే ఆ బాధ్యత వెస్టిండీస్ కెప్టెన్ లాయిడ్ ఫెర్ఫారమెన్స్ కి ఎందుకు ఎఫెక్ట్ ఇవ్వలేదు? ఆస్ట్రేలియా కెప్టెన్ కిమ్ హ్యూగ్స్ ఇంగ్లీష్ కెప్టెన్ బాబ్ విల్లీస్ మాటేమిటి? పాకిస్తాన్ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మాటేమిటి? శ్రీలంక కెప్టెన్...."
"దట్సాల్ రైట్ అయిదవుతోంది" అన్నాడాయన.
"అసలు క్రికెట్ ఈజ్ గేమాఫ్ లక్ అని చాలామంది అంటారు. మీ అభిప్రాయం ఏమిటి?"
"నాదీ అదే అభిప్రాయంగాని ఇంకా మనం రేపు మాట్లాడుకుంటే...."
"ట్రాష్!" అరిచాను. ఆయన అదిరిపడ్డాడు.
"ఏమిటి?"
"మీ అభిప్రాయం ట్రాష్! క్రికెట్ ఈజ్ లైక్ ఎనీ అదర్ గేమ్! ప్రోఫిషియెన్సీ, ఎఫిసియెన్సీ, అండ్ టాలెంట్! అందుకే వెస్టిండీస్ మనని తుక్కురేగ్గొట్టేశారు. అంతేకాదు ఫర్ ఇన్ స్టెన్స్ టేక్ వరల్డ్ కప్..."
"ఇంకచాల్లే! వెళ్ళు!" అన్నాడాయన. కానీ ఆపటం నావల్ల కాలేదు.
"వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ మీద మనాళ్ళు ఆడినప్పుడు అందరూ ఏమనుకున్నారు?"
"ప్లీజ్ గెటవుట్" కోపంగా లేచి నిలబడ్డాడాయన.
నేను ఏమాత్రం బెదర్లేదు. ఏదో శక్తి ఆవహించినట్లయింది.
"ఇంగ్లీష్ టీమ్ ఎలా ఓడిపోయింది?" ఆటరాకా? కాదు! ఎఫిషియెన్సీలేకా? కాదు! ఒక్కసారి ఇండివిడ్యుల్ ఎనాలిసిస్ చూడండి.
బాబ్ విల్లీస్ 1982 లొ లార్డ్స్ లో ఆడినప్పుడు ఒక మాచ్ లో 46 ఓవర్స్ లో 20 మేడిన్స్- 83 రన్స్- సిక్స్ వికెట్స్- అలాగే ఇయాన్ బౌతుమ్---"
ఆఫీసర్ చేతిలో నా ఇంక్రిమెంటు కాగితం చిత్తయిపోయి చెత్తబుట్టలో పడిపోయింది.
"బయటికెళ్తావా లేదా?" మీదకొస్తూ అడిగాడాయన.
"56 ఓవర్స్-13 మైడెన్స్" బాగా దగ్గరకొచ్చేశాడతను.
"33 రన్స్ త్రీవికెట్స్" ఆ తరువాత మాట్లాడటం కుదరలేదు. ఏదో బలంగా నా మొఖం మీద తగిలి కిందపడ్డాను.