"ఏమిటి, వికెట్ పడిందా?" ఆదుర్దాగా నా దగ్గరకొచ్చి అడిగిందామె.
"అవును" అన్నాను ఇంకేమనాలో తెలీక.
"ఎవరవుటయ్యారు?"
ఇండియన్ ఆటగాళ్ళలో నాకు మూడే పేర్లు తెలుసు.
గవాస్కర్, కపిల్దేవ్, కిర్మానీ!
"గవాస్కర్!" అని చెప్పానామెకి.
చుట్టుపక్కలున్నవాళ్ళందరూ ఘొల్లుమన్నారు. "బౌలింగ్ చేసేది ఇండియాయేకదా! గవాస్కర్ అవుటయ్యాడంటారేమిటి-" అడిగిందామె నవ్వాపుకుంటూ.
"సారీ! సరిగ్గా వినలేదు! కపిల్ దేవ్ అవుటయ్యాడు."
ఆమె మాట్లాడకుండా తన సీటుకెళ్ళికూర్చుంది.
ఆఫీసర్ దగ్గర్నుంచీ కబురొచ్చింది. లోపల అప్పటికే రామకృష్ణ ఉన్నాడు.
"దేనికిప్పుడేలీవ్? టి.వి.లో క్రికెట్ మాచ్ చూడ్డానికి కదూ!" కోపంగా అడిగాడు ఆఫీసరతనిని.
"అబ్బే కాదండీ మా అమ్మమ్మ చనిపోయింది!"
"వ్వాట్? మీ అమ్మమ్మ చనిపోయిందా?"
"అవునండి?"
"మరి పాకిస్తాన్ టెస్ట్ మాచ్ జరిగినప్పుడు కూడా మీ అమ్మమ్మ అప్పుడే చనిపోయిందని లీవ్ తీసుకున్నావుగా?"
"అదా! అదే.... అది.... నిజమేనండీ! మా అమ్మమ్మ అప్పుడే చనిపోయింది. ఆ కారణంగా మా తాత ఇప్పుడు మళ్ళీ పెళ్ళిచేసుకుంటున్నాడండీ! అందుకని సెలవుకావాల్సార్! సొంత తాతయ్య పెళ్ళికి నేను వెళ్ళకపోతే ఏం బావుంటుంది."
ఆఫీసర్ చిరాకుగా చూసి "ఆల్ రైట్-గో" అన్నాడు ఈసడింపుగా.
రామకృష్ణ ఆనందంగా వెళ్ళిపోయాడు.
"ఫైలురడి అయిందా?" అడిగాడు ఆఫీసర్.
"ఇంకో అరగంటపడుతుందండీ"
"కపిల్ ఎన్ని ఓవర్స్ చేశాడు?" అడిగారాయన.
"పదకొండండీ!" ఠక్కున నోటికొచ్చింది చెప్పేశాను.
"మెయిడెన్స్-ఎన్ని?"
"ఇరవైమూడండి!"
"యూకెన్-గో-" మండిపడుతూ అన్నాడాయన. ఆయనకంతకోపం ఎందుకొచ్చిందో. అర్ధంకాలేదు.
ఆ తరువాత రెండు రోజులు శెలవుపెట్టి ఇల్లు కదలకుండా కూర్చుని కామెంటరీ విన్నాక నాకు చాలా విషయాలు తెల్సినయ్. తీరా ఆ మర్నాడు ట్రాన్సిస్టర్ ఆన్ చేస్తే ఎక్కడా కామెంటరీ రావటంలేదు. వెంటనే అది నాకు అమ్మినవాడి షాపుకు పరుగెత్తాను.
"వారం క్రితం మీ దగ్గర కొన్న ట్రాన్సిస్టర్ చెడిపోయిందయ్యా?" అన్నాను దబాయింపుగా.
అతను పరీక్షించి "బాగానే వుంది కదండీ! అన్నాడు ఆశ్చర్యంగా.
"బాగుంటే మరి క్రికెట్ కామెంటరీ ఎక్కడారాదేం?"
అతనునవ్వాడు, "ఇవాళ రెస్టుకదండీ! మర్చిపోయినట్లున్నారు."
నేనో వాజమ్మని అతను అనుకోగల ప్రమాదం ఉంది గనుక క్రికెట్ గురించి నాకు ఎంతో తెలుసునని కొంచెం ఓవరాక్షన్ చేస్తేగాని లాభం లేదనిపించింది.
"ఓ అయామ్ సారీ! పూర్తిగా మర్చిపోయాను. ఇవాళ వెస్టిండీస్ కి రెస్ట్ డే కదూ?"
అతను ఈసారి జాలిగా నవ్వాడు.
"క్రికెట్ ఈజ్ గేమ్ అని పుస్తకం ఉందండి. చాలా చక్కగా రాశారాపుస్తకంలో! అది చదివితే మొత్తం క్రికెట్టంతా తెల్సిపోతుంది" అన్నాడు.
నేనింక అక్కడ వుండటం వల్ల నా పరువుకి ఎక్కువహాని జరిగే అవకాశం ఉందని ఇంటికొచ్చేశాను.
మర్నాడు పొద్దున్నే మా అమ్మమ్మ హడావుడిగా వచ్చి నన్ను నిద్రనుండి లేవగోట్టేసింది.
"ఏమిటి? ఏం జరిగింది" అన్నాను ఖంగారుగా.
"కొంప మునిగిందిరా నాయనా! వద్దురా అంటే మన నూకలపాలెం బంధువులతో పోట్లాడావ్. ఇప్పుడు చూడు వాళ్ళేం చేశారో! మనకి చేతబడి చేశారు."
నేను అదిరిపడిలేచి నిలబడ్డాను.
"చే... చే. చేతబడా?"
"అవును, రా! బయట చూడు మన తలుపుకి-"
పరుగుతో బయటకెళ్ళి చూశాను.
తలుపు మీద ఎర్రరంగుతో మూడుగీతలు గీసి ఉన్నాయ్.
"అలా చూస్తావేంరా! వెళ్ళి మంత్రాలేసే వాడినెవర్నయినా తీసుకురా త్వరగా, లేకపోతే ప్రాణాలు పోతాయి."
మా గొడవకి చుట్టుపక్కల పిల్లలు పోగయ్యారు.
"అది చేతబడి కాదంకుల్! వికెట్స్ మీ తలుపుమీద గీశాం మేమే! నిన్న శెలవుకదా! క్రికెట్ ఆడాం ఇక్కడ." నాకు పోయిన ప్రాణం తిరిగి వచ్చింది.
ఆరోజు మా ఆఫీసర్ చాలా సరదా మూడ్ లొ వున్నాడు. నేను ఫైలు తీసుకెళ్ళగానే నోట్ చదవకుండా సంతకం పెట్టేశాడు. అతని పక్కనే ట్రాన్సిస్టర్ లొ క్రికెట్ కామెంట్రీ మోగిపోతోంది.
"చూశావా మనాళ్ళు బ్రహ్మాండంగా ఆడేస్తున్నారు" అన్నాడు ఆనందంగా.
"అవునండీ దుమ్ముదులిపేస్తున్నారు" అన్నాను రెడ్డి మాటలు గుర్తుకు తెచ్చుకుని.
ఆఫీసర్ అదిరిపడి నాకు షేక్ హాండిచ్చాడు.
"సిక్సర్-కపిల్-సిక్సర్ కొట్టాడు. బ్రిలియంట్ షాట్! సూపర్బ్! హి ఈజ్ నేచురల్ ప్లేయర్! ఒండర్ ఫుల్ బాట్స్ మెన్"
"అవున్సార్! నేచురల్ ప్లేయర్."
"అన్నట్లు నీ ఇంక్రిమెంట్ ఆగిపోయిందన్నావ్ కదూ?"
"అవునండీ!"
"వెంటనే ఒక అప్పీల్రాసి పుటప్ చెయ్! నేను రికమెండ్ చేసి హెడ్డాఫీస్ కి పంపిస్తాను. నాలుగురోజుల్లో నీ ఇంక్రిమెంట్ వచ్చేస్తుంది."
నేను సంతోషంతో పొంగిపోయాను. ఇంక్రిమెంటంటే షుమారు అన్నీ కలిసి రెండు వందలరూపాయలు జీతం పెరుగుతుంది.
"అలాగేసార్ ఇప్పుడే తెస్తాను" నాటో పరుగెత్తుకెళ్ళి త్వరత్వరగా టైప్ చేసి తీసుకెళ్ళి కాగితం ఆయనముందుంచాను. ఆయన సంతకం పెట్టబోతుండగా మళ్ళీ ట్రాన్సిస్టర్ గట్టిగా మోతెక్కిపోయింది.
ఆఫీసర్ చెవి దాని దగ్గర పెట్టి విన్నాడు ఠక్కున ట్రాన్సిస్టరు ఆఫ్ అయిపోయింది.
"అవుట్!" అన్నాడు మొఖం కోపంగా పెట్టి.
"ఏమయింది సార్!"
"కపిల్ దేవ్ అవుట్!" ఇంకా కోపంగా అన్నాడాయన.
"అలాగా! పాపం! ఒండర్ ఫుల్ ప్లేయర్ సార్! నేచురల్ ప్లేయర్ సార్!" ఆయనను సముదాయించాలని అన్నాను.
"డోంటాక్!" అరిచాడాయన. "కపిల్ దేవ్ ఆట చేతగాని వాజమ్మ! ఫ్లూక్ ప్లేయర్! హోప్ లెస్ ప్లేర్! ఇర్రెస్పాన్సిబుల్ క్రీచర్!"
అర్జంటుగా నేనూ ప్లేట్ మార్చకపోతే ప్రమాదం తప్పదనిపించింది నాకు 'అవున్సార్! కపిల్ దేవ్ ని అసలు ఎవరు సెలక్ట్ చేశారో నాకు తెలీటం లేదు! అస్సలు ఆటరాదు. బాటింగ్ వీక్- బౌలింగ్ మరీ వీక్- ఫీల్డింగ్ హారిబుల్-"