Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 26

 

    న్యూస్ పేపర్ ఆఫీసులు చుట్టూ , పోలీస్ అధికారుల చుట్టూ తిరిగారు వాళ్ళెవరూ తనను ఏ మాత్రం పట్టించుకొకపోవటంతో తను మరింత పట్టుదలతో వాళ్ళు చేసిన దారుణం, వాళ్ళకు పోలీసులు చేస్తున్న సాయం గురించి వున్నదున్నట్లు వివరిస్తూ కరపత్రాలు వేయించి ప్రతి ఇంట్లోనూ పంచాడు. తనమీద అందరికీ జాలి కలిగింది గానీ ఎవ్వరూ ఏమీ చేయలేక పోయారు.
    రాజకీయ నాయకులకూ, పోలీసులనూ ప్రశ్నించే ధైర్యం ఎవరికీ లేరన్న నిజం తనకు తెలిసింది.
    తనకు అన్నిటికన్నా అశ్చర్యం, బాధ కలిగించిన విషయం.....మార్తాండ్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించటం! అప్పుడు కోర్ట్ ని ఆశ్రయించాడు తను.
    తను పెట్టిన కేసు నాలుగేళ్ళు, రోజురోజుకీ బలహీనపడిపోతూ చివరకు మార్తాండ్ కు సముఖంగానే జడ్జిమెంట్ వచ్చింది.
    సాక్ష్యాధారాలు చాల్లేదని కోర్టు వారి ప్రకటన.
    కానీ తనకు తర్వాత తెలిసింది.
    ఆ జడ్జికి, మార్తాండ్ కీ బంధుత్వం వుందని,
    ఆ నాలుగేళ్ళూ తాము అవినీతి ఆరోపణతో యాంటికరప్షన్ వాళ్ళ కేస్-
    ఉద్యోగం నుండి సస్పెన్షన్!
    రాజాకీయనాయకుల కక్ష సాధింపు చర్యలకు పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు అవినీతి నిరోధక శాఖ కూడా ఉపయోగపడుతోందా?
    తనూ , సీతా ఎన్నో రోజులు ఒక్కమాట కూడా మాట్లాడుకోలేక పోయారు.
    తన సంసారం ఓ పక్క సర్వనాశనం అవుతోంటే, తామిద్దరూ మానసింగా కృంగి కృశించిపోతుంటే, మరో పక్క మార్తాండ్ రోజు రోజుకీ ఎదిగిపోతున్నాడు. అతని రాజకీయ ప్రాబల్యం పెరిగిపోతోంది. ఎన్నో సభల్లో అతను సమాజానికి నీతులు బోధిస్తున్నాడు. ఎన్నో సన్మానాల్లో అతను న్యాయం , ధర్మం గురించి లెక్చర్లు యిస్తున్నాడు.
    జనం చపట్లు కొడుతున్నారు.
    అతని మాటలు వింటున్న తనకు రక్తం వుడికిపోయేది.
    అతని మాటలకు చప్పట్లు కొడుతూ అతనికి సన్మానాలు చేస్తున్న సన్మాన సంఘాల మీద వాళ్ళను అక్కడికక్కడే నరికి చంపాలన్న కోరిక కలిగేది.
    వాడిచ్చే పదివేల రూపాయల కోసం ఈ సన్మాన సంఘాలు ఎంత నీచానికి దిగాజారుతున్నాయో తలచుకుంటే అసలు జీవితం మీద విరక్తి కలిగింది.
    మార్తాండ్ కొడుకు యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ అయ్యాడు. ఆ పదవి అండతో అతను చేసే అరాచకాలు మరింత మితిమీరిపోయాయి.
    ఈ గత స్మృతులన్నీ ఆ కొద్ది సెకండ్లలో రామచంద్రమూర్తి కళ్ళ ముందు కదిలినాయి.
    బయట ఇంకా ఆ గుండాలు అరుస్తూనే వున్నారు.
    "ఇదే లాస్ట్ వార్నింగ్ రోయ్! నీ బిడ్డకు పుట్టిన గతే నీకూ పెండ్లానిగ్గుడా పడుతుంది బే! జరా సంబాలించుకో."
    మళ్ళీ రాళ్ళ వర్షం!
    కిటికీ అద్దాలన్నీ పగిలిపోతున్నాయి.
    అతి కష్టం మీద కోపం అణచుకుంటున్నాడు.
    తన కోపం వాళ్ళ తన కుటుంబం ఇంకా నష్టపోకోడదు సీతకు హాని జరగకూడదు.
    కొద్దిసేపటి తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు.
    అప్పుడు చుట్టుపక్కల వాళ్ళు ఇళ్ళల్లో నుంచి బయటికొచ్చారు.
    నటరాజ్ వారందరినీ నిందిస్తూన్నాడు.
    "ఇప్పుడు ఎందుకొచ్చారు బయటకు? వెళ్ళి పడుకోండి. ఇన్ని కుటుంబాలున్నాయి గానీ అందరూ కలిసి ముగ్గురు గుండాల నేదుర్కోవటం చేతకాదు. ఇవాళ మా ఇంటి మీద రాళ్ళు వేశారు. రేపు మీ ఇళ్ళల్లో దూరి మీ పిల్లలనో, మీ పెళ్లాల్నో బయటికీడుస్తారు అయినా బయటకు ఎవ్వరూ రారు. ఈ గుండాల్నే పల్లెటూళ్ళల్లో ఎవడింటిమీదకయినా వెళ్లమనండి చూద్దాం! మొత్తం వూరంతా ఏకమయి వాళ్ళను కర్రలతో కొట్టి అక్కడి అక్కడే సమాధి చేస్తారు. ఆ ఐకమత్యం మనదగ్గరెందుకు లేదు వెళ్ళండి! ఇంకా చూస్తారేం! నిద్రపోండి! నిద్ర పాడయిపోతుంది పాపం! పొండి" అంటూ తలుపులు మూసేశాడు.
    రామచంద్రమూర్తికి, సీతకూ ఇంకా నిద్ర పట్టలేదు.
    తెల్లవార్లూ ఆలోచిస్తూనే వున్నారు.
    "ఇవ్వాళ్ళే ఎలక్షన్ నుంచి విత్ డ్రా చేసుకుంటాను" అన్నాడతను ఉదయం కాఫీ తాగుతూ.
    సీత మందహాసం చేసింది.
    "ఆ నటరాజ్ మాటలు వినద్దంటే విన్నారా?"
    నటరాజ్ ముఖం చిన్నబోయింది.
    బావుంది! ఆడలేక మద్దేలోడు అన్నట్లు - ఏదో పాపం అవస్థల్లో వున్నారు. ఈ ఎలక్షన్ వంకతో ఆ మల్లేశ్ దగ్గర పదివేలు తీసుకుంటే నాల్రోజులు యిబ్బందుల్లేకుండా గడుస్తుందని చెప్పాను. అంతేగానీ నిజంగా ఈయన గెలుస్తాడనా, జనాన్ని ఉద్దరిస్తాడనా?" అన్నాడు కోపంగా రొట్టెల నుండి పిసుకుతూ.
    వాళ్ళు ఫలహారం చేస్తుండగా ఇంటి ముందో అటో ఆగింది.

 Previous Page Next Page