Previous Page Next Page 
అర్ధచంద్ర పేజి 26


    "మనోజ్ కి ఆడపిల్లల పిచ్చి బాగా ఉంది. వాడు చాలామంది అమ్మాయిలతో మూవ్ అవుతూ ఉండడం చూశాను" అంది విశారద.
    
    "ఈ రోజుల్లో ఆడపిలల్లు డేషింగ్ గా ఉన్నప్పుడు అబ్బాయిలు వాళ్ళతో మూవ్ అవక ఏం చేస్తారు? అందులో వాడు నీలాగా చాలా అందంగా, గ్లామరస్ గా ఉంటాడు"
    
    విశారద అతనివంక కోపంగా చూసింది.
    
    "అంటే నా ఉద్దేశం చెడిపొమ్మని కాహ్డు. అది మనం సహజంగా తీసుకోవాలేమో అంటున్నాను"
    
    "వినూత్న ఆడపిల్లయి ఉండి కూడా వేళకి ఇంటికి రావడం లేదు. పైగా అది ఎవరో అబ్బాయితో స్కూటర్ మీద కూర్చుని షికార్లు చేస్తుంది"
    
    రాజాచంద్ర నిజంగా బాధపడ్డాడు. అది ఆలోచించవలసిన విషయమేనని ఒప్పుకున్నాడు. కాని తన కూతుర్ని గురించి చేదుగా ఆలోచించడానికి అతని అంతరంగం ఒప్పుకోవడంలేదు.
    
    వినూత్న తెలివిగల పిల్ల ప్రస్తుతం సొసైటీలో జరుగుతున్న పద్ధతుల్నిబట్టి కొంతమంది మగపిల్లలతో సోషల్ గా ఉంటే ఉండవచ్చు. అంతమాత్రం చేత అంత తేలిగ్గా అపార్ధం చేసుకోకూడదు.
    
    "వినూత్నని  కూడా ఎలా సపోర్టు చేద్దామని ఆలోచిస్తున్నారా?"
    
    "అబ్బే,  అదేంలేదు. దాని ప్రవర్తన చూసి నాక్కూడా ఒళ్ళు మండిపోతుంది" అన్నాడు రాజాచంద్ర.
    
    "ఊరికే ఒళ్ళు మండిపోవటం కాదు. క్రియలో చూపించాలి"
    
    "ఏం చెయ్యాలంటావు?"
    
    "వాళ్ళని గట్టిగా మందలించాలి"
    
    "అలాగే"
    
    "అలాగే అంటే కాదు మీకు కోపం తెచ్చుకోవడం చేతకాదు. వాళ్ళని తలలు వాచేటట్లుగా చివాట్లు పెట్టాలి."
    
    "నాకు కోపం తెచ్చుకోవడం చేతకాదంటావా? చూస్తావుగా?" అన్నాడు రాజాచంద్ర గంభీరంగా ఉండడానికి ప్రయత్నిస్తూ.
    
                                                              * * *
    
    ఓ అరగంట గడిచే లోపల ఒక్కొక్కరుగా ముగ్గురూ ఇంచుమించు పది నిముషాలు పది నిముషాల తేడాతో ఇంటికి వచ్చారు.
    
    విశారద, రాజాచంద్ర సోఫాలో పక్కపక్కన కూర్చుని ఉన్నారు. వల్ల మొహాలు సీరియస్ గా ఉన్నాయి.
    
    మొదట వినూత్న వచ్చింది. "హాయ్!" అంది తల్లిని చూసి నవ్వడానికి ప్రయత్నిస్తూ.
    
    విశారద నవ్వలేదు.
    
    "ఏమిటి మమ్మీ ఇద్దరూ అలా ఉన్నారు? ఒంట్లో బాగా లేదా?" అనడిగింది.
    
    ఇద్దరూ మాట్లాడలేదు.
    
    వినూత్న పెదవి విరిచి లోపల కెళ్ళిపోయింది.
    
    తర్వాత మనోజ్ వచ్చాడు. తల్లీ తండ్రీ గంభీరంగా ఉండడం చూశాడు. ఒక అరక్షణం మెదలకుండా నిలబడి లోపలకెళ్ళిపోయాడు.
    
    ఆ తర్వాత రాఖేష్ వచ్చాడు. తల్లీ, తండ్రీ అలా కూర్చుని ఉండడం పట్ల ఆశ్చర్యపోతున్నట్లు చూశాడు. తల తిప్పుకుని లోపలకు పోబోతున్నాడు.
    
    "ఒరేయ్ ఆగు" అని అరిచాడు రాజాచంద్ర గట్టిగా.
    
    రాఖేష్ ఉలికిపడినట్టయి ఆగిపోయాడు.
    
    "వాళ్ళిద్దర్నీ కూడా బయటకు పిలు. మీతో మాట్లాడాలి" అన్నాడు రాజాచంద్ర అదో టోన్ మెయిన్ టైన్ చేస్తూ.
    
    రాఖేష్ తల ఊపి లోపలికి వెళ్ళి తమ్ముడ్నీ, చెల్లెల్నీ కూడా బయటకు తీసుకొచ్చాడు.
    
    రాఖేష్ సోఫాకి ఈవైపు నిల్చున్నాడు. వినూత్న మనోజ్ వెనకపక్క నిలబడ్డారు.
    
    రాజాచంద్ర కోపం తెచ్చుకుంటూ గొంతు సవరించుకున్నాడు.
    
    ఒకటి... రెండు... మూడు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి.
    
    విశారద సహనం కోల్పోతోంది. ఏ మడగాలో తెలీనట్లు కూర్చున్న భర్తకేసి కోపంగా చూసింది 'అడగరేం?' అన్నట్లు.
    
    రాజాచంద్ర పూర్తిగా ఆగ్రహం తెచ్చుకున్నాడు. 'ఒరేయ్! వినూత్నా నువ్వు కూడా మీ ప్రవర్తన నాకు నచ్చలేదు' అన్నాడు గట్టిగా అరుస్తున్నట్లు.
    
    "మేమేం చేశాం డాడీ?" అనడిగాడు రాఖేష్ చాలా మామూలుగా.
    
    "ఏం చేశావా?" అంటూ రాజాచంద్ర అతని మొహంలోకి చూశాడు. ఏమీ కల్మషం లేనట్లు, నిర్మలంగా ఉన్నట్లు కనిపించింది.
    
    "నువ్వు....సరిగ్గా చదవటంలేదు" అన్నాడు.
    
    "చదువుతున్నాను డాడీ! చాలా కష్టపడి చదువుతున్నాను."
    
    "అవునా?"
    
    "అవును డాడీ"
    
    "నువ్వు వేళపట్టున ఇంటికి రావటంలేదు."
    
    "పగలంతా కష్టపడి చదువుతాను కదు డాడీ బుర్ర వేడెక్కిపోయి ఉంటుంది. అందుకని రిలక్సేషన్ కోసం ఫ్రెండ్స్ ఇళ్ళకీ, మధ్య మధ్య సినిమాలకీ పోయి వచ్చేసరికి ఆలస్యమవుతూ ఉంటుంది."
    
    "అవునా?"
    
    "అవును డాడీ"
    
    "నువ్వీ మధ్య చెడు అలవాట్లు కూడా నేర్చుకుంటున్నావు."
    
    "చెడు అలవాట్లా?"
    
    "అవును."
    
    "నాకేమీ చెడు అలవాట్లు లేవు డాడీ!"
    
    "నువ్వు... సిగరెట్లు కాలుస్తున్నావని తెలిసింది."
    
    రాఖేష్ తల వంచుకున్నాడు.
    
    "మాట్లాడవేం?"

 Previous Page Next Page