మాలతి వెక్కి వెక్కి ఏడవటం లేదు. కనీసం ఆమె కళ్లలో నీళ్ళు కూడా తిరగలేదు. నా విఅపు నిర్లిప్తంగా చూసి, పక్కకు కొద్దిగా తప్పుకొని లోపలకి దారి ఇచ్చింది.
అది చాలు. ఆ చూపులో కనబడిన నిర్లిప్తత చాలు నా గుండెలను నిలువునా చీల్చటానికి! మనకు సన్నిహితమైన వాళ్ళకు కోపం వస్తే, మనమీద కోపాన్ని నిర్లిప్తత ద్వారా ప్రకటిస్తే, అంత కన్నా 'హెల్' యింకొకటి వుండదు.
* * *
సాయంత్రం అయిదున్నర అయింది. ప్రొద్దునుంచీ చాలా చిరాకుగా వుంది. ఏ పనిమీదా సరిగ్గా మనసు నిలవడం లేదు. నిన్నరాత్రి జరిగిన సంఘటన తరువాత మాలతిని చూడటానికే మొహం చెల్లలేదు.
కాంపౌండ్ వాల్ గేటు దగ్గిర నిలబడ్డాను. క్లబ్బులోనే కొంచెం శాంతి లభించవచ్చు అనిపిస్తున్నది. అదీగాక నిన్న డబ్బు కూడా పోయిందేమో, ఇంకా కసిగా వుంది.
పక్కన పాకవైపు చూశాను. పాకముందు రిక్షా లేదు. సోములు మీద కోపం వచ్చింది.
జంక్షన్ లో రిక్షా యెక్కుదామని రెండు అడుగులు వేసి ఠక్కున ఆగిపోయాను. ఎదురుగా కొద్ది దూరంలో కిళ్ళీబడ్డీ ముందు బల్లమీద సుద్దముక్కతో అంకె వేసి వుంది.
'ఆ....రూ... తొమ్మిది!' సందేహం లేదు. ఆరూ తొమ్మిదే.
"అంకె మీరే చెప్పండి బాబూ. ఇలాగే రూపాయి ఆడేస్తాను" అని సోములు అన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి.
ఆ బోర్డుమీద వేసిన అంకె నిన్నరాత్రి వచ్చింది అనీ, దానిమీద సోములు ఆడిన రూపాయికి డెబ్బై రూపాయలు వస్తాయనీ నాకు అర్ధమయ్యేసరికి ఏదో తెలీని ఉద్వేగం నాలో కలిగింది.
ఈ డబ్బంతా ఏం చేసి వుంటాడు? ఇడియట్. వీడికి అసలు కృతజ్ఞత అంటూ లేదేమో.
కనీసం సాయంత్రం క్లబ్బు టైమ్ కయినా మా ఇంటిముందు నాకోసం చూస్తూ వుండవచ్చుగా.
అంతలో యెదురుగా సోములు కూతురు వస్తూ కనిపించింది. "ఈ వేళ మీ నాన్న బండి కట్టలేదా?" అని అడిగాను.
నా దగ్గిరకు వచ్చి ఆగి.... "మా నాన్న ఆస్పత్రిలో వున్నాడుగా" అంది.
ఉలిక్కిపడి "ఆస్పత్రిలోనా" అన్నాను.
ఏదో పెద్ద విషయాన్ని నాకు చెబుతున్నట్టు.... "ఔను. మీకు తెలీదా? పొద్దున్న రిక్షా మీదకి లారీ ఎక్కేసిందిగా. నాన్నని ఆస్పత్రిలో చేర్చారు. కాలు తీసేయాల్ట" అంది.
"కాలు తీసేయాలా?" అని నాలో నేను అనుకొంటున్నట్టు క్షణం ఆగి.... "అసలెలా ఆక్సిడెంట్ జరిగింది" అని అడిగాను.
ఆ ప్రశ్న అర్ధంకానట్టు నా వైపు చూసి.... "అమ్మ ఏడుస్తూ నాన్నని తిడుతోంది- ప్రొద్దున్నే బాగా తాగేసి రిక్షా తొక్కడం మొదలుపెట్టేడని" అంది.
షాక్ తగిలినట్టు నిలబడిపోయాను.
క్షణంలో నా కంతా అర్ధమయింది.
అసలు బ్రాకెట్టు కొట్టటమే ఘనవిజయంగా భావిస్తారు వీళ్ళు. అందులోనూ రూపాయది. ఇంకేం? పొద్దున్నే ఆ డెబ్బై రూపాయలూ తీసికొని ఆనందం పట్టలేక. దాని పర్యవసానం యిది. శుభ్రంగా తాగేసి వుంటాడు.
ఇలా రోడ్డు పక్కగా నిలబడి ఆలోచించడంలో నా సభ్యత కొచ్చే లోపం ఏమీ నాకు కనబడలేదు.
ఇప్పుడు నన్ను వేధిస్తున్న సమస్య.... 'ఇందులో నా పాత్ర ఎంతవరకూ?' అని. ఎంత సరిపెట్టుకొందామన్నా, మనసులో ఏదో కలుక్కుమంటూంది. దేరీజ్ సమ్ థింగ్ సమ్ వేర్ రాంగ్.
"వాడు మాత్రం ఏం చేస్తాడు? తాగినప్పుడు ఒళ్ళు మరచి పోతాడు" అని మాలతి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. అయినా, ఓ డెబ్బై రూపాయలు వచ్చేసరికి అంతలా పొద్దున్నే తాగేయటమే?
ఈ ఆటల్లో వచ్చినదేమీ మిగలదనీ, అందువల్ల వచ్చినప్పుడు సంతోషించడం, పోయినప్పుడు విచారించడం అనవసరం అనీ తెలుసుకొనేటంత సంస్కారం సోములులో వుండకపోవచ్చు.
కానీ, నాకుందా?
ఈ ఆలోచన వచ్చేసరికి తృళ్ళిపడ్డాను.
నేను.... నేను మాత్రం చేసింది ఏమిటి?
అనుక్షణం నాలో జరిగే సంఘర్షణ తీవ్రస్థాయికి చేరుకొంది.
నాకూ, సోములుకీ ఈ విషయంలో భేదం లేదా?
అంత "విల్ పవర్" లేనివాడినా నేను? వ్యసనాన్ని అలవాటు చేసుకొంటూ తమ ప్రవర్తనని సమర్ధించుకొనే చాలా మందికీ, నాకూ భేదం లేదా? మానేద్దామని నేను నిశ్చయించొంటే ఈ తాగుడేమిటి, పేకాటే వదిలేయగలను.
గిరుక్కున వెనుదిరిగి "పద" అన్నాను. ఇద్దరమూ పక్కపక్కనే నడవసాగాము.
మనసంతా తేలికపడ్డట్టు హాయిగా వుంది. అంతవరకూ మనసులో పేరుకుపోయిన బాధ అంతా ఒక్కసారి పోయినట్టు అనిపించింది. నిన్న ఎంత తాగినా పోనీ ఈ మానసిక వ్యధ, ఒక్క నిర్ణయంతో పోవటం నాకే ఆశ్చర్యంగా వుంది.
"మరేం" అంది పాప. ఆలోచనల నుంచి తేరుకొనిచూచాను. ఏదో చెప్పాలన్న తహతహ కనిపించింది.
"ఏమిటి" అన్నాను.
"నిన్నటి పావలా దొరికింది" ఆ పాప వయసు ఎంత చిన్నదంటే, తనకి సంబంధించినంత వరకూ, తన తండ్రి కాలు పోవడం కన్నా తన పావలా తిరిగి దొరకటం- అది నాకు చెప్పాలనుకోవటం... ఇవే తనకి ముఖ్యమైన విషయాలు.
"ఎప్పుడూ!" అన్నాను ఆశ్చర్యంగా.
ఏదో ఘనవిజయం సాధించిన దానిలా, తన విజయాన్ని అర్ధం చేసుకోగలిగేవాణ్ణి నేనే నన్నట్టు.... "ప్రొద్దున్న....! అసలు నిన్న సాయంత్రమంతా వెతికాను. దొరకలేదు. ప్రొద్దున్న మళ్ళీ వెతికాను. దొర్కకేం చేస్తుంది" అంది గర్వంగా.
నవ్వి- "గుడ్" అన్నాను.
ఇదే పాప అరగంట క్రితం ఈ మాట చెబితే ఇలా నవ్వగలిగి వుండేవాణ్ణి కాదు. తేలిగ్గా తీసి పడేసి వుండేవాణ్ణి. అప్పుడే గాని ఈ పాప.... "ప్రొద్దున్నకూడ చాలా సేపు వెతికాను. అయినా దొరకలేదు" అని బిక్కమొహం పెట్టివుంటే, బిగ్గరగా నవ్వగలిగివుండేవాడ్ని.
ఒక మంచి నిర్ణయం తీసుకోవడంలో వుండే ఆనందం తెలుస్తున్నది.
* శుభం *
(28వ ఎపిసోడ్ నుంచి "ఒర్ ఇడియట్" అనుకున్న అరిటాకు కథ వస్తుంది.)