Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 26


    నవ్వాను. "పాపా, అదిగో ఆ చెట్టంత ఎత్తు ఎగరేసి పట్టుకుంటే రూపాయి ఇస్తాను" అని పర్స్ తీసి చేతిలో పట్టుకొన్నాను.
    ఒక్కక్షణం నా చైల్డిష్ నెస్ కి తెల్లబోయినా, సవాల్ చేస్తున్నట్టు తల వూపింది. నిన్న టేబిల్ ముందు కూర్చోబోయే ముందు జోషి చూసిన చూపు జ్ఞాపకం వచ్చింది.
    బంతి విసిరినట్టు పావలాని పైకి విసిరింది. కాసు గాలిలో పైకి....పైపైకి.... నెమ్మదిగా క్రిందికి దిగి.... అంతలోనే.... ఏదీ?
    అసలు పడిన స్పాట్ గూడా గుర్తించలేకపోయాను. పాపబిక్కమొహం వేసి వెదకటం ప్రారంభించింది.
    ఆఖరి నోట్ల కట్ట నా ముందుకు తోసినప్పుడు కూడా జోషి మొహంలో అలాంటి నిస్సహాయతే కనిపించింది.
    నవ్వుకొని ముందుకు నడిచాను. కావాలనుకొంటే ఓ పావలా ఆ పాప కివ్వగలను. కానీ నా కది ఇష్టంలేదు. ఒకవేళ తను ఈ పందెంలో గెలిచి వుంటే నేను ఓడిపోయినప్పుడు నన్ను చూసి జాలిపడి ఎవరూ దాన్ని నా కివ్వరుగా అనే భావం నన్ను ఆ పావలా యివ్వకుండా చేసింది.
    తాపీగా నడవసాగాను.అంతలో వెనుకనుంచి సోములు రిక్షా తీసుకొచ్చి నా ప్రక్కన ఆపేడు. నేనెప్పుడు బయటికి వెళతానో వాడికి బాగా తెలుసు. రిక్షా ఎక్కుతూ అప్రయత్నంగా ఇంటివైపు చూచాను. కిటికీ ఊచల్ని పట్టుకొని నిలబడి వుంది మాలతి. చటుక్కున తలతిప్పి "పోనీరా" అన్నాను.
    రిక్షా నెమ్మదిగా నడుస్తూంది. సోముల్ని చూశాను. కండల్లో బలం ఇప్పుడిప్పుడే తగ్గిపోతూంది. ఎక్కువగా తాగటంవల్లననుకొంటా- వయసు తక్కువైనా వృద్ధాప్యం వచ్చేసినవాడిలా కనబడుతున్నాడు. ఎందుకో వాణ్ణి మాట్లాడించాలనిపించింది. "ఈ రోజెంత సంపాదించావురా?" అని అడిగాను.
    "మీదే బోణీ బాబూ! ప్రొద్దున్నుంచీ రాబడి లేదు" అన్నాడు.
    "నిన్న?"
    ఒక్కక్షణం ఆలోచించి "అయిదో, ఆరో వచ్చింది బాబూ" అన్నాడు. 
    "అబ్బో, చాలా సంపాదించావే" అన్నాను.
    "ఏం సంపాదన బాబూ? రెండు తాగుడుకీ, రెండు బ్రాకెట్టుకీ, పోతే మిగిలిందేముంది?" అన్నాడు నిస్పృహగా.
    ఏదో కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయినట్లు వాడు మాట్లాడుతూ వుంటే నాకు నవ్వొచ్చింది. "పోనీ, బ్రాకెట్టు మానెయ్యకూడదా?" అన్నాను.
    "మానేసేం చేయనయ్యా? అదుంటే రాత్రి ఒంటిగంటవరకూ బజార్లో గడిపి క్లోజింగ్ వచ్చేసిన తరువాత యింటికొచ్చి పడుకోవచ్చు. తొందరగా ఇంటికెళితే దానితో సాధింపులూ, గొడవేగా...."
    వెనుక సీటుకి జారపడుతూ అడిగాను. "వీటిలో ఏమైనా లాభం వస్తుందా?"
    "ఏం లాభమో బాబూ! ఈ రోజు రూపాయి వస్తే రేపు రెట్టింపు దానికి పోతుంది".
    "మరెందుకు ఆడటం?"
    "చెప్పేను కదా బాబూ! తొందరగా యింటికెళితే వెళ్ళిన దగ్గిర్నుంచీ ఎధవ గొడవ...."
    నాకు అకస్మాత్తుగా మాలతి జ్ఞాపకం వచ్చింది. నేను ఇంటికి వెళ్ళటం ఎంత ఆలస్యమైనా ఏ మాత్రం విసుగ కనపడని ఆ కళ్ళు, ఆ సంస్కారం... ఎదుటి మనిషిని నొప్పించకుండా యెలా ప్రవర్తించాలో మాలతికి బాగా తెలుసు. మా ఇద్దరిమధ్యా ఎప్పుడూ కలహం రాలేదు. రాదుకూడా. 'నేనూ, నా సాన్నిధ్యం నీకు ఇంతకు ముందిచ్చేటంత ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయా శ్రీ" అని మాలతి ఇన్నమాటలు జ్ఞాపకం వచ్చాయి. నేనెందుకు పేకాడుతున్నాను? డబ్బు సంపాదిద్దామనా? ఈ రిక్షా వాడికి కూడా తెలుసే- ఈ ఆటల్లో ఏమీ మిగలదని. మరి ఎందుకు?
    నా ఆలోచనలని తెంపేస్తూ సోములు అన్నాడు- "మా కెక్కడా నాడందడం లేదుబాబూ. ఓపెనింగొస్తే క్లోజింగ్ ఆపోజిట్ ఇచ్చేస్తున్నాడు." నేను మాట్లాడలేదు. మళ్లీ వాడే అన్నాడు. "మొన్న ఎవరో బాబూ, బాగా చదువుకొన్నాయిన్లాగానే వున్నాడు. 'ఈ రోజు డబుల్ జీరో ఆడేయిరా' అన్నాడు. ఎందుకైనా మంచిదని పది పైసలు ఆ అంకెలమీద పడేశాను. పొద్దున్నకల్లా చూస్తే వచ్చేసింది" వాడు అంటూ వుండగానే క్లబ్బు వచ్చింది.
    రిక్షా దిగి జేబులో నుంచి రూపాయి తీసి ఇచ్చాను. అందుకొంటూ "చిల్లర లేదు బాబూ" అన్నాడు. వాచీ చూసుకొన్నాను. పెద్ద ముల్లు పన్నెండు మీదా చిన్న ముల్లు ఆరుమీదా.... అందరూ వచ్చేసి వుంటారు.
    "ఫర్లేదు, వుంచుకోరా, ఆ మిగతా డబ్బెట్టి బ్రాకెట్టాడెయ్యి" అన్నాను నవ్వి.
    హుషారుగా "నంబరు మీరే చెప్పండి బాబూ. ఈ రూపాయి ఇలాగే ఆడేస్తాను" అన్నాడు.
    వాడి చనువుకి కొంచెం ఆశ్చర్యపడ్డా, నవ్వుకొంటా- "ఆరూ- తొమ్మిది మీద ఆడేయ్" అన్నాను లోపలకి అడుగు లేస్తూ.
                    *    *    *   
    ఎనిమిదయింది. బయటికొచ్చాను. క్లబ్బులోంచి ఇంత తొందరగా బయటికి రావటం ఇదే మొదటిసారి. రెండు గంటల్లో నిన్నొచ్చిన వెయ్యి కాక, ఇంకో పదిహేను వందలు పోయింది. పోయినందుకు కాదు. వచ్చేస్తూంటే ఆ జోషి చూసిన చూపు- ఓహ్.... హెల్- 
    కొంచెం జ్వరమొచ్చినట్టు వుంది. నుదుట మాటిమాటికి చెమట పడుతోంది. ఏమిటో అర్ధంకాని కసి లోపలినుంచి పుట్టుకొస్తూంది. ఎవరిమీదో తెలియటం లేదు. నిన్న- ఇదే సమయానికి ఎంత హుషారుగా ఆడుతున్నాను; నిన్న నా దగ్గిర పార్టీ తీసుకొన్న ఫ్రెండ్స్ లో యెవ్వరూ కంపెనీ ఇవ్వరు. సానుభూతి మాత్రం కావలిసినంత చూపిస్తారు. కావాలంటే "బెస్ట్ లక్ నెక్స్ ట్ టైమ్" అని విష్ చేస్తారు. అంతే.
    ఎదురుగా బార్ లైట్లు ఆహ్వానిస్తూ కనపడ్డాయి. ఈ సమయంలో బాధ పోవాలంటే యింకో మార్గం ఏదీ కనబడలేదు. అప్రయత్నంగానే లోపలికి నడిచాను. కౌంటర్ కి కొద్దిదూరం- సరిగ్గా నిన్న కూర్చున్నదగ్గిరే కూర్చున్నాను. తల పగిలిపోతోంది. వేళ్ళను జుట్టు మధ్యలో జొప్పించి కణతల్ని అరచేత్తో నొక్కుకున్నాను. అంతలోనే బేరర్ వచ్చాడు.
    "టూ పెగ్స్, సోడా చిప్స్" ఆర్డరిచ్చాను. బేరర్ కౌంటర్ దగ్గిరగా వెళ్లి అల్మైరాలో నుంచి బాటిల్ తీసి గ్లాసులో వంపుతున్నాడు. బాటిల్ మీద ఆరూ తొమ్మిది- బాటిల్ తిరగబడినప్పుడు కూడా ఆరూ తొమ్మిది లాగానే కనిపిస్తూంది. ఇంటాక్సీకేషన్ లో అన్ని వస్తువులూ తిరగబడ్డట్టే కనిపించినా, ఆరూతొమ్మిదిమాత్రం అలానే కనిపిస్తూందన్న మాట. అంత చిరాకు లోనూ నవ్వుకొన్నాను.అంతలో బేరర్ ట్రే తీసుకొచ్చాడు.
    అరగంటలో బార్ నుంచి బయటికొచ్చాను.
    రిక్షా ఎక్కి ఇంటి అడ్రస్ చెప్పాను. తలనెప్పి మాత్రం తగ్గింది. ఆందోళన మాత్రం పోలేదు. ఇంకా యెక్కువైందేమో కూడా. శరీరం కంట్రోల్ లో లేకపోయినా మనసు ఆలోచిస్తూనే వుంది. ఇంటికెలా చేరానో నాకే తెలీదు. ప్రహరీ గేటు తీసుకొని, గుమ్మం దగ్గిరకు చేరుకొని, తలుపు దబదబా బాదాను. ఒక నిముషం ఆలస్యమైంది. ఆ నిముషంసేపు నిలబడటానికే చాలా విసుగ్గా అనిపించింది. ఇంకోసారి తలుపు బలంగా కొట్టబోతూ వుంటే మాలతి తలుపు తీసింది. ఆ ఊపుతో ముందుకు తూలి పడబోతూ బలంగా నిలదొక్కుకున్నాను.
    ఆ క్షణం నా సంస్కారం ఏమయిందో నాకు తెలీదు. "ఇంతసేపూ ఎక్కడేడుస్తున్నావ్?" అన్నాను.
    మాలతి క్షణంసేపు మాట్లాడలేదు. నా వైపు పరీక్షగా చూస్తూ- "ఈ రోజు కూడా తాగేరు కదూ" అంది.
    అంతే. అప్పటివరకూ నాలో అంతర్గతంగా పేరుకుపోయిన కసి ఒక్కసారి కట్టలు తెగి ప్రవహించింది. ఈ రోజు కూడా....." ఏదో హేళన నన్ను వెక్కిరిస్తున్నట్టు వినిపించింది. ఒక్కక్షణం నేనేం చేస్తున్నానో నాకే తెలియకుండా ఆమె చెంపలమీద బలంగా చేయి సాచి కొట్టాను.
    కొంచెంసేపు భయంకరమైన నిశ్శబ్దం మా ఇద్దరిమధ్యా నాట్యం చేసింది. నా మత్తు కొద్దికొద్దిగా పొగమంచులా వాడిపోయింది.

 Previous Page Next Page