Previous Page Next Page 
రాధ-కుంతి పేజి 28


                         "ఒరే ఇడియట్"
             అనుకున్న అరిటాకు కథ

    "మీరెక్కడ వరకూ వెళుతున్నారు?"
    కిటికీలోంచి బయటికి కదులుతున్న చెట్టనూ, గుట్టలనూ చూస్తున్న శైలజ ఉలిక్కిపడి తలతిప్పి చూసింది. రాఘవ ఆమెనే చూస్తున్నాడు.
    రైలు కూత పెట్టుకుంటూ ముందుకు సాగిపోతోంది. కంపార్ట్ మెంటులో నలుగురైదుగురు కన్నా ఎక్కువమంది లేరు. ఇద్దరు నిద్రకి జోగుతున్నారు. ఇంకొకాయన పొద్దుటి పేపరు ఇంకా దీక్షగా చదువుతున్నాడు. రాత్రి తాలూకు చీకట్లు కొద్దికొద్దిగా అలుముకుంటున్నాయి.
    "సామర్లకోట" అంది శైలజ. ఆమె సన్నగా నాజూగ్గా వుంది. పలుచటి చెక్కుళ్ళూ. గడ్డంమీద ఎడమవైపున చిన్న పుట్టుమచ్చ, కొద్ది నిర్మలంగా ఉన్న తీక్షణమైన కళ్ళూ... పది మందిలో అందగత్తెలా అనిపించదు కానీ.... విడిగా కొద్దిపాటి స్నేహంతో ఆమె చాలా కాలం జ్ఞాపకం ఉండిపోతుంది. ఆమె ముక్త సరితనం చూసి అతను మళ్ళీ ఇంకో ప్రశ్న వెయ్యటానికి సాహసించలేదు.
    చాలాసేపు మౌనంగా వుండి "హైదరాబాదులో పని చేస్తున్నారా?" అని అడిగాడు.... దాదాపు గంట అయ్యాక. ఎక్స్ ప్రెస్ కాబట్టి ఎక్కడా ఆగకుండా పోతోంది రైలు.
    "అవును.... సెక్రటేరియట్ లో"
    "ఏం చదివారు?"
    "బి.ఏ."
    మళ్ళీ చాలాసేపు మౌనం. ఆమె ప్రక్కనే కూర్చుని జోగుతున్న ముసలామె ఇక అలా కూర్చోవటం సాధ్యం కాదన్నట్టూ.... కొంచెం కాళ్ళు సాగించి, సర్దుకుని, నడుం వాల్చింది.
    బాగా చీకటి పడింది. టి.సీ.వచ్చి సీటు నెంబర్లు చెక్ చేసి వెళ్ళిపోయాడు. శైలజ బాగ్ లోంచి ఆర్ధర్ హెయిలీ పుస్తకం తీసి చదవటం ప్రారంభించింది.
    రైలు కాజీపేటలో ఆగింది.
    అతను లేస్తూ- "మీరేమైనా తీసుకుంటారా?" అని అడిగాడు. ఆమె కొద్ది మొహమాటంతో "అబ్బే వద్దండీ...." అంది.
    "ఏవీ తీసుకోకుండా ఎలా వుంటారు?"
    "అరటి పళ్ళున్నాయి."
    రాఘవరావు నవ్వి "అంత మొహమాటం అయితే ఎలా" అంటూ బయటికి నడిచాడు.
    ఆ రోజెందుకో అంత రష్ గా లేదు. ప్లాట్ ఫాం పల్చగా ఉంది. ఆమె చూస్తూ వుండగానే అతను చేతిలో ఏదో పొట్లంతో వస్తూ కనిపించాడు. మరీ అంత పొడుగూ పొట్టీ కాదు. తెల్లప్యాంటూ చొక్కా కొంచెం విశాలమైన మొహం. క్రాపు నుదుటిమీదకి పడెయ్యాలనే తాపత్రయం.
    కంపార్ట్ మెంట్ లోకి వచ్చి "తీసుకోండి" అన్నాడు.
    ఆమె అదే మొహమాటంతో "థాంక్స్" అంది.

    అతడు తన బాగ్ లోంచి సీసా బైటకి తీసి, పంపులో నీళ్ళు పట్టుకొచ్చేసరికి ఆమె తినటం పూర్తిచేసి ఆకులు బయటకు వేస్తోంది. అతడు అందించిన నీళ్ళు తీసుకొని, కొద్దిగా తాగి, సీసా తిరిగి ఇచ్చేసింది.
    ట్రైన్ కూత పెట్టింది. నెమ్మదిగా కదిలింది.
    ఈ చర్యతో ఆమెకి స్త్రీ సహజమైన జంకు పోయింది. "మీరెందాకా వెళ్ళాలి?" అని అడిగింది.
    అతడు చెప్పాడు. ఆమె కిటికీలోంచి బైటకు కొద్దిసేపు చూసి, తిరిగి పుస్తకం తెరవబోతూ వుంటే, "మీరు దిగిన తర్వాత ఇంకా నేను ఎంతసేపు ట్రైన్ లో ప్రయాణం చెయ్యాలి?" అని అడిగాడు.
    ఆమె చెప్పింది.
    "లాంగ్ లీవ్ పెట్టి వెళుతున్నారా?"
    "లేదండీ, నాల్గురోజులు పెట్టాను" అందామె.
    "మీరెక్కడ పని చేస్తున్నారు?"
    "ఏ.జి. ఆఫీసు" అన్నాడతను.
    మళ్ళీ ఆమె పుస్తకం చదవసాగింది. అతను సీట్లో ఏమీ తోచక ఇబ్బందిగా అటూ ఇటూ కదలటం తెలుస్తూనే వుంది. పుస్తకం మూసి- "మీరు ఇటువైపు రావటం మొదటిసారా?" అడిగింది.
    ఆమె పుస్తకాన్ని మూయడం అతడికి ఆనందాన్ని కలిగించిందని అతడి మొహమే చెబుతోంది. "అవునండీ" అన్నాడు. "మాది తెలంగాణా".
    "ఏజీ ఆఫీసంటే కాంపులెక్కువ వుంటాయా?"
    అతను ఉంటాయన్నట్లు తలూపాడు.
    తరువాత ఏం మాట్లాడాలో అతనికి తెలియలేదు. కానీ అతనే అన్నాడు- "మీరు బాగా పుస్తకాలు చదువుతూ వుంటారా?"
    ఆమె చిరునవ్వుతో "ఏమీ తోచదండీ, అందుకని...." అంటూ అర్ధోక్తిలో ఆపుచేసింది.
    అతను సమర్ధిస్తున్నట్టూ "అన్నిటికన్నా ఇది మంచి అలవాటండీ" అన్నాడు.
    "మీరూ చదువుతారా?"
    "ఆఁ! అంత కాకపోయినా - కొద్దిగా"
    ఆమె కొద్ది ఉత్సాహంతో "మీ అభిమాన రచయిత లెవరు?"
    చప్పున ఏదో ఒకటి రెండు పేర్లు చెప్పటానికి రాఘవరావు తటపటాయించాడు. అయినా ఏదో ఒకటి చెప్పాలి. కనుక-వారపత్రికల్లో కనబడే నలుగురయిదుగురు పేర్లు చెప్పాడు.
    ఆమె  అతడి జవాబుతో కొంచెం నిరాశ చెందినట్లు కనిపించినా, దాన్ని కప్పిపుచ్చుకుంటూ "బుచ్చిబాబు, చలం...." అని ఆగి, "పోనీ, 'అమృతం కురిసిన రాత్రి.... గోపీచంద్".
    రాఘవరావు అస్పష్టంగా తలూపి, "మీరు సినిమాలు చూస్తారా" అన్నాడు.
    "అప్పుడప్పుడు" అందామె.
    రాఘవరావు వేలు విడిచిన మావయ్య ఒకడు మద్రాసులో ఈ ఫీల్డులో స్థిరపడ్డాడు. అతడేం చేస్తూ వుంటాడో ఎవరికీ తెలియదు. కానీ అక్కడి విశేషాలన్నీ విశ్లేషణల్తో కలిపి వర్ణిస్తూ ఉంటాడు. ప్రస్తుతం ఆ పనిని రాఘవరావు తీసుకున్నాడు. విషయం ఈ టాపిక్ మీదికి వచ్చేసరికి ఇక అతడు తడుముకునే అవసరం లేకపోయింది. ఆమెకూడా ముందుకు వంగి, అతడు చెప్పేది ఉత్సాహంగా వినసాగింది. అతడు చెప్పటం పూర్తి చేసేసరికి ఆమె అభినందిస్తున్నట్టు "మీకు ఈ విషయాలు చాలా తెలుసే" అంది.
    "మీలాంటి అందమైన అమ్మాయి- ఎదురుగా ఉంటే ఏమో తెలియకపోయినా చాలా మాట్లాడవచ్చు-" అన్నాడు.
    ఈ మాటల్లో ఏదైనా లేకితనం వుందా అని ఆమె అతడి వైపు చూసి, అటువంటిదేమీ కనబడకపోవటంతో "థాంక్స్ ఫర్ ది కాంప్లిమెంట్" అంది దానిని తేలికగా తీసుకుంటూ.
    "ఎప్పుడూ నేను మాట్లాడటమే. మీరేమీ మాట్లాడరేం?" అన్నాడు.
    ఆమె చిరునవ్వుతో "ఏం మాట్లాడను" అంది.
    "మాట్లాడాలనుకుంటే ఏమైనా మాట్లాడవచ్చు. రొమాన్స్ నుంచి రోదసీ యానం వరకూ."
    అతని ప్రాసకి ఆమెకి నవ్వొచ్చింది. నిజానికి ఆమె స్నేహితులతో చాలా హుషారుగా, చిలిపిగా వుంటుంది.
    అయితే మగవాళ్ళతో మాత్రమే స్త్రీ సహజమైన రిజర్వ్ డ్ నెస్ తో మసలుకొంటుంది. అయితే ఇతడి కలుపుగోలుతనం ఆమె బిడియాన్ని పోగొట్టింది. ఆమె వొరేషియన్ రీడర్, ఆ కారణంగా ఆమె మాట్లాడాలనుకొంటే తడుముకొనే అవసరమేమీ లేదు.

 Previous Page Next Page