Previous Page Next Page 
విషవలయం పేజి 25

    అతనికి వొంటరిగా కూర్చోవటానికి విసుగనిపించి, ఆర్చీ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు. అక్కడికి సముద్రం దగ్గరవటంచేత చలిగాలి చప్పున తిరుగుతోంది. ఎదురుగుండా ఖాళీ స్థలంలో పిల్లలు ఆడుకుంటూ కేరింతలు కొడుతున్నారు. కొద్దిదూరంలో వున్న కాన్వెంట్ స్కూల్లోంచి లీలగా గోలవినవస్తోంది ఆ ప్రక్కనే దగ్గర్లో ఆ పరిశుద్ద వాతావరణానికి మరింత శోభను చేకూరుస్తూ చర్చి.

    "ఏమిటి చూస్తున్నారు?" కాసేపటికి వెనకనుంచి సుధా కోమల కంఠం వినవచ్చింది.

    అతను వెనక్కి తిరిగి "అందమైన మీ ఇంటి పరిసరాలను" అంటూనే ఆమె చేతిలోని పళ్ళెంమీద దృష్టిపడి, ఉలికిపడి "ఇదేమిటి? నేను ఒక్కడ్ని తినటానికే యీ సరంజామా అంతా?" అన్నాడు దిగులుగా.

    "ఎంతేమిటండీ అలా కంగారు పడుతున్నారూ?" అంటూ ఆమె పళ్ళెం వంక క్రీగంట చూసింది. అందులో రెండు పూతరేకులూ, బాదం హల్వా, జీడిపప్పు పకోడీలూ వున్నాయి. "రండి కూర్చుని బుద్దిమంతుడిలా తినండి."

    అతను కుర్చీలోకి వచ్చి కూర్చుంటూ "మీరో?" అన్నాడు.

    ఆమె పళ్ళెం అతని చేతికిస్తూ "నేనింకా ఇవన్నీ తినలేదనే అనుకుంటున్నారా? మా ఇంట్లో అంతా భోజనప్రియులం. అందుచేత ఏవో తినుబండారాలు రోజూ వుంటూనే వుంటాయి. ఉండేది ఇద్దరమే అయినా వచ్చీపోయే చుట్టాలకు అంతులేక పోవడంవల్ల, వస్తువు చలామణికి లోటులేదు. ప్రక్కన పంక్తి లేనిదే నాన్నగారి నోట్లోకి ముద్దపోదు కూడానూ" అన్నది.

    సత్యానందంగారు ఇక్కడ్నుంచి విదేశాలకు తాటిపీచు తయారుచేసి ఎగుమతిచేస్తూ భారీ ఎత్తున వ్యాపారం చేస్తున్నాడు.

    "ఇలా చుట్టాలు అడపా తడపా వచ్చిపోతూ వుండటం కూడా మంచిదేలెండి. లేకపోతే బావురుమనే ఈ భవంతిలో ఇద్దరం బిక్కు బిక్కుమంటూ వుండటం కూడా కష్టమే...అన్నట్లు మీ పరీక్ష అయిపోయిందిగా_విదేశాలు వెళ్ళే విషయం ఏం చేశారు?"

    ఈ విషయాన్ని గురించే యిందాక రిక్షాలో వస్తూ ఆలోచించాడతను. నిరాశా-నిస్ప్రుహలు ప్రస్పుటమౌతున్న ముఖంతో "ఇప్పుడదంతా అడియాశ అయిపోయిందండీ సుధగారూ! నాన్నగారు పోవటంతో అనుకొని బాధ్యతలన్నీ నెత్తినపడి ఊపిరాడనియ్యలేదు. మనఃస్థిమితం బొత్తిగాలేదు" అన్నాడు.

    సుధ అతనివంక ఆశ్చర్యంగా చూస్తూ "అది అంత భరింపరాని బారువా? నేను అనుకోవటం లేదే" అన్నది.

    "మీకు తెలీదు. మా నాన్న పెద్ద లిటిగెంట్. అనేక పీటముడి వ్యవహారాలు ఇనప్పెట్టెలో పెట్టి పదిలంగా తాళంవేసి పోయారు. నేను దగ్గర వుండి చూసుకోకపోయినట్లయితే యీ ఆస్తంతా మన్నూ మశానమూ అయేటట్లుంది. విదేశాలనుంచి తిరిగి వచ్చేసరికి ఇక్కడి ఏమీ మిగల్దు."

    "పోనీ ఐ. ఏ ఎస్ కి చదవండి" అని సలహా యిచ్చింది సుధ.

    "ఉహు. లాభం లేదండే. ఇన్ని చికాకుల మధ్య ప్రస్తుతం నాలో చదివే శక్తి సన్నగిల్లిపోయింది. ఇహ ఆనర్సుతోనే స్వస్తి చెప్పక తప్పదు."

    ఆమె అతని ముఖవంక పరీక్షగా చూస్తూ ఏమయినా మీలో చాలా తేడా కనిపిస్తూన్నదండీ, మారిపోయారు" అన్నది నమ్మకంగా.

    సత్యమూర్తి కలవరబడ్డాడు. తన రహస్యం బట్టబయలై పోయినట్లు సిగ్గుతో కుంచించుకుపోయాడు. "మారానా? లేదే!" అన్నాడు తొట్రుపాటు పడుతూ.

    తనకు ఇష్టంలేనిది జరుగుతున్నట్లు సుధ అతనివంక జాలిగా చూసింది. "అసలు ఇలాంటి విషయాలు మీ మనసులో దూరవనీ, మీరు వీటన్నిటికి అతీతులనీ అనుకున్నాను ఇదివరకు. ఇంత తాపత్రయం మీలో వున్నదనుకోలేదు" అంది చలించే కంఠంతో.

    ఈ మాటలు అతనికి ముల్లుకుల్లాగా గ్రుచ్చుకున్నాయి. తనమీద తనకే అసహ్యం వేసింది.

    అతని ముఖంమీద క్రమ్మివేస్తోన్న విషాదచ్చాయలు చూసి ఆమె హఠాత్తుగా గట్టిగా నవ్వుతూ "బలేవారే! ఏదో కొంప ముంచుకుపోయినట్లు అలా కంగారు పడిపోతారేమిటి...? అదేమిటి అలా వొదిలేస్తున్నారు? అదేం వీల్లేదు. పళ్ళెం సుభ్రంగా ఖాళీ చేయవల్సిందే." అని తన దరహాస చంద్రికలతో వాటిని పారద్రోయాలని ప్రయత్నించింది.

    అతను మెదలకుండా కూర్చుని, బలవంతంగా ఆ పదార్ధాలను నోటిలోనికి పంపించసాగాడు.

    "ఉండండి ఇప్పుడే వస్తాను" అని సుధ లేచి లోపలకు వెళ్ళింది.

    నలువైపులనుంచీ చీకటి అలుముకుంటూ వస్తున్నది. సుధ యిందాకే లైటువేసి వచ్చింది. సత్యమూర్తి యాంత్రికంగా చేతిని, నోటినీ కదిలిస్తూ, అదికూడా శక్తికి మించాక పళ్ళెం నేలమీద పెట్టేసి కూర్చున్నాడు.

    సుధ ఒకచేత్తో మంచినీళ్ళగ్లాసూ, మరో చేతితో షర్భత్ లాంటి పానీయం వున్న గ్లాసూ తీసుకుని అక్కడకు వచ్చింది. "అదేమిటి? ఎంత చెప్పినా మీరు నా మాట వినకుండా మొండికేశారు. ఆ హల్వా నేను స్వయంగా నా చేతితో తయారు చేశాను తెలుసా? పోన్లెండి. ఏం చేస్తాం? చెయ్యి కడిగేసుకుని యీ డ్రింక్ తీసుకోండి" అంది.
   

 Previous Page Next Page