"అది నేను అర్ధం చేసుకున్నాను. కాని మన ఇద్దరి కలయికవల్ల ఓ శిశువు ఉద్భవించింది"
"ప్రేమకు భగవంతుడిచ్చే ప్రతిఫలం నా అంశ నీలో జనించి ఇంకో రూపంలో జన్మించినందుకు నువ్వదృష్టవంతురాలివి."
ఒకటి, రెండు క్షణాలు మౌనంగా దొర్లాయి.
"విధి గొప్పతనం అర్ధంచేసుకోక _ ఆ శిశువు కేమయినా..."
"లేదు. నేను నెల తప్పగానే త్వరపడి ధర్మారావు అనే వ్యక్తికిచ్చి మావాళ్ళు పెళ్ళిచేసేశారు."
"ఈ విషయం ఆ ధర్మారావు అనే వ్యక్తికి తెలుసునా?"
"తెలుసునో తెలియదో తెలీదు. కాని ఏమి పట్టించుకోనట్టే ప్రవర్తిస్తాడు నేను పది లక్షల రూపాయిల ఆస్తితో అతని భార్యగా రూపొందాను."
"అతన్లో భగవానుడి లక్షణాలు ఎక్కువగా వున్నట్టున్నాయి. రహస్యం అనేది, స్వార్ధం అనే దాన్ని _ మనం అసహ్యించుకోవాలి. ఆ శిశువు..."
"తేజ అనే పేరుతో పెరుగుతుంది"
"నీకూడా తీసుకురాలేకపోయావా? ఈ స్వేచ్చా ప్రణయాశ్రమంలో తల్లీ కూతుళ్ళకి కూడా విశాల హృదయంతో ప్రవేశం లభిస్తుంది. స్వేచ్చా ప్రణయంలోని దివ్యత్వాన్నీ, అమరత్వాన్నీ ఆస్వాదించడానికి అర్హత వుంది."
"తేజ యుక్తవయస్కురాలే కాని _ ఈ గొప్ప గొప్ప భావాలు అర్ధం చేసుకునే శక్తి తనకింకా రాలేదు."
"అవును. నీకే ఇంత ఆలస్యమైనప్పుడు ఆమెకి కొంత టైము పడుతుందనుకుంటాను?"
"జీవితంలో ఎంతో పొందాను. అనుభవించాను. అయినా రోజు రోజుకూ అసంతృప్తి పెరుగుతోందే కాని తగ్గడం లేదు. అందుకే ఇక్కడికి వచ్చాను."
"ఈ అసంతృప్తులకి కారణం మనకి మనం చేసుకుంటోన్న కృత్రిమమైన తొడుగులే. ప్రపంచంలో అసంతృప్తిని తొలగించే స్థానం ఇది ఒక్కటే."
"అర్ధం చేసుకున్నాను. అందుకే వచ్చాను."
"శాశ్వత నివాసం ఏర్పాటుచేసుకోవడానికా? ఐహిక ప్రపంచంలో వుండి సభ్యత్వం పొందడానికా?"
"ప్రస్తుతానికి శాశ్వత నివాసం కుదరదు. బయటకే వుండి అవకాశ మొచ్చినప్పుడల్లా మీ సేవ చేసి తరించి వెళ్ళిపోతూవుంటాను."
"శుభం!"
ఓ రెండు, గంటల తరువాత ఆశ్రమ స్వీకరణ తంతు అంతా పూర్తయింది.
విద్యుల్లతాదేవి 'మందిరం' నుంచి బయటకొచ్చి ఆశ్రమ ఆవరణలో విశాలంగా ఆవరించివున్న వృక్ష సముదాయాల మధ్యనుంచి నడిచి వెడుతోంది.
గురువుగారిచేత ఉపదేశంలో ఇవ్వబడ్డ మత్తు వల్ల కళ్ళు ఓ రకం కైపుతో మిలమిలలాడుతున్నాయి.
వొళ్ళంతా _ నరనరాలా జివ్వుజివ్వుమన్న జలదరింపు.
అడుగులు తూలుతూ, ఒక లోకం నుంచి దిగివచ్చి యింకో లోకంలోకి ప్రయాణం చేస్తున్నట్టు తడబడుతున్నాయి. 'దివ్యత్వంలోనే దైవసన్నిధి' ఆమెను అణువణువునా కాల్చేస్తుంది.
బుజం మీద ఎవరిదో చెయ్యి పడింది. తల ప్రక్కకి త్రిప్పి చూసింది.
ఎవరో యువకుడు. ఇరవై _ పాతికేళ్ళ మధ్య వయసుంటుంది. ఎర్రగా నిగనిగలాడుతున్నాడు. ఫారినర్ లా వున్నాడు.
"నువ్వు ...మహనీయమైన ఈ ఆశ్రమంలోకి కొత్తగా చేరావా?" అన్నాడు ఇంగ్లీషులో.
"ఊ....."
"నిన్నారాధించడం ఈ క్షణం నుంచే మొదలుపెట్టాను. నిన్ను పూజించాలని నా మనస్సు ఉవ్విళ్ళూరుతుంది."
ఆమె పెదిమలు కదిలాయి _ నవ్వుతున్నాయి. తన చేతిని జాపింది _ అతని కందిస్తున్నట్టు.
అందుకున్నాడు.
ఆమెను పొదివి పట్టుకుని ప్రక్కన వున్న తన కాటేజీలోకి తీసుకెళ్ళాడు.
10
"ఎలా వుంది ఆ అమ్మాయికి?" అనడిగాడు దయాకర్ గదిలోకి వస్తూ.
ప్రజ్ఞ ఆ రోజు నైట్ డ్యూటీలో వుంది. ఉద్యోగంలో చేరి మూడునెల్లే అయినా ఆసక్తిగా, చురుగ్గా పని నేర్చుకుంటూ వుండడం వల్ల ఓ ప్రయివేట్ నర్శింగ్ హోంలో సిస్టర్ నిర్వహించవలసిన విధులు చాలా వరకూ తెలుసుకుంటోంది. నైట్ డ్యూటీ పూర్తి ఆత్మ విశ్వాసంతో చెయ్యగల సమర్ధత యింకా రాకపోయినా యింకో సీనియర్ నర్స్ సెలవు పెట్టడం వల్ల ఆమె ఆ డ్యూటీ చెయ్యాల్సి వచ్చింది.