Previous Page Next Page 
భారతి పేజి 25

    భారతి ఆశ్చర్యపడుతూ  కధ విన్నట్లు  అతను చెప్పినదంతా  విన్నది. అప్రయత్నంగా  అతనివంక నిశితంగా చూసింది. అయితే తన జీవితంలో  ఈ పరిణామం  రావటానికి  కారకుడు నాగరాజు కాదా?

    నాగరాజు ఆమెవంక  జాలిగా  చూస్తున్నాడు.

    "మరైతే....మరైతే నువ్వు నామీద కక్ష సాధించలేదా?"

    "కక్షా? నీమీద కక్ష సాధించటానికి  నాకే మధికారం వుంది భారతీ? నన్ను నేనే హింసించుకుంటున్నాను."

    ఆమెకేమీ అర్ధంకాలేదు కళ్ళముందు అంధకారం వ్యాపించినట్లయింది. "అయితే ఇలా ఎందుకు  జరిగింది?" అన్నది అయోమయంగా.

    "ఎలా?"

    భారతి అతని మాటలు నమ్మింది. "చూస్తున్నావుగా? నా స్థితి గురించి వినే వుంటావుగా. అందుకు తెలిసిందా? అందుకు."

    నాగరాజు  ముఖంమీద ఆవేదన  స్పుటంగా కనబడింది. అప్రయత్నంగా  అతను కొంచెం  ముందుకు కదిలాడు. "నీ స్థితికి కారణం తెలుసుకుందామనే ఈవేళ తెగించి  నీ దగ్గరకు వచ్చాను భారతీ. ఎందుకు నీకు అన్యాయం జరిగింది? ఎందుకు నీ జీవితం  దుఃఖభాజన మయింది?" అనడిగాడు చలించే కంఠంతో.

    "నీకు నిజంగా  తెలియదు కదూ?"

    "తెలియదు, నాకేమీ తెలియదు, నన్ను నమ్ము భారతీ!"

    "అయితే నువ్వు చాలా  వెనకబడి వున్నావన్నమాట. నేనే చెబుతున్నాను విను. కారణం నేను కుష్టురోగిని, తెలుసా? అందుకే వదిలేశారు  వాళ్ళు నన్ను."

    "భారతీ!" అని కేకకు అదిరిపడి విస్మయంగా  చూసిందామె. బంగారు బరిణవు, చందనపు బొమ్మవు, అజంతా శిల్పానివి ,గంగాజలంలోని తుషార బిందువువి, తాకటానికి భయపడే ధవళిను నీది....నీకు....నీకు... కుష్టురోగమా?" అన్న భావాలు అతని కళ్ళ నుండి రాలుతున్నాయి.

    "నువ్వు కుంటివాడివని  అధిక్షేపించాను ఒకనాడు. ఆ వార్తవిని సంతోషించవేం?" అనుకుంటూంది భారతి.
    అతను మతి చలంచినట్లు  కళ్ళు పెద్దవి చేసి  ఆమె వంక చూస్తున్నాడు.

    "ఇది నీరోజు. ఆనందించవేం?" అన్నట్లు  కదులుతున్నాయి భారతి పెదవులు.

    నాగరాజు కళ్ళు చూస్తుండగానే  అశ్రుజలపూరితాలయి పోయాయి. పెల్లుబుకుకుని  బయపడదామని  ప్రయత్నిస్తూన్న  ఆవేదనను త్రొక్కివుంచటానికి  విశ్వ ప్రయత్నం  చేస్తూ మనిషి కదిలిపోతున్నాడు. హఠాత్తుగా రెండుచేతులూ  జోడించి ఆమెకు నమస్కరించాడు. "సెలవు భారతీ! మళ్ళీ కలుస్తాను" రుద్దకంఠంతో  అని వెనక్కి తిరిగి అక్కడి నుండి  కుంటుకుంటూ  బయటకు  వెళ్ళిపోయాడు.

    ఆమె విస్మయంగా  కళ్ళప్పగించి  చూస్తూ  నిలబడిపోయింది. రాధమ్మ వచ్చి ఆమె ప్రక్కన నిలబడి ప్రశ్నార్ధకంగా ఆమె వంక చూడటం కూడా  ఆమె గమనించలేదు.


                               *    *    *    *


    రోజులూ ,వారాలూ ,నెలలూ  గడిచిపోతున్నాయి. భారతి తను కొత్త జీవితానికి రోజురోజూ  అలవాటు పడిపోతుంది. కాని యిల్లు దాటి బయటకు మాత్రం పోవటంలేదు.

    మల్లిక వచ్చినప్పుడు  మాత్రం ఆమెకు ఎంతో సంబరం. మల్లిక చందరాల వచ్చినప్పుడు  ఒక్కొక్కసారి  రాత్రిళ్ళు భారతి యింట్లోనే పడుకునేది. స్నేహితురాళ్ళిద్దరూ  అర్దరాత్రి వరకూ  కబుర్లు చెప్పుకునే వారు.

    గుంటూరు నుండి మల్లికా ఉత్తరాలు  రాస్తే మాత్రం  భారతి  జవాబిచ్చేదికాదు. కలుసుకున్నప్పుడు మాత్రం ఆమె ఎప్పుడైనా  ఆ విషయం ప్రస్తావిస్తే "ఉత్తరాలు ఏం రాస్తాను మల్లికా! నా దగ్గర విశేషాలు ఏముంటాయి?" అనేది నిర్వేదంగా.  

    మల్లిక తల్లి భారతిని వచ్చిపొమ్మని  అనేక పర్యాయాలు  కబురు చేసింది. భారతి నిర్లిప్తంగా ఊరుకున్నదేగాని ,ఏనాడూ  గుమ్మం కదిలిపోలేదు. శారదమ్మగారికి మనసు ఉండబట్టలేక  అప్పుడప్పుడూ ఆవిడే  వచ్చి చూసి పోతూంది. ఆ పిల్లని చూస్తే  ఆవిడి గుండె చేరువైపోతూంది. శారదమ్మగారి ఆరోగ్యం  కొంచెం  మెరుగ్గానే వుందీమధ్య.

    వేసవిలో  ఓ రాత్రి భారతీ, మల్లికా  పెరట్లో ఆరుబయట మంచాలు వేసుకుని పడుకున్నారు. చలిగాలి పడదని రాధమ్మగారు ఇంట్లోనే పడుకుంది.

    వెన్నెల పిండారబోసినట్లుంది. భారతి కళ్ళు విప్పుకుని మెరిసే నక్షత్రాలనీ  వెలిగే జాబిల్లినీ  అవాసక్తంగా చూస్తూంది.

    "మీ ఆయన రూపం  నీకు గుర్తుందా?" అడిగింది మల్లిక.

    "చాలా స్పష్టంగా వుంది."

    "ఈ ప్రశ్న  ఎందుకడిగానంటే...." అంది మల్లిక. "మహా అయితే నువ్వతన్ని  మూడు నాలుగుసార్లకంటే  ఎక్కువ చూసి వుండవు. పది పదిహేను సార్లు చూసినవారి రూపం కూడా పరోక్షంగా నెమరువేసుకున్నప్పుడు  ఒక్కోసారి నాకు గుర్తురారు."

    "పది పదిహేనుసార్లు  చూసినవారి రూపం  నేనూ మరిచిపోతుంటాను" అన్నది భారతి. "కాని విచిత్ర మేమిటంటే  అందులో ఏ ఒక్కరూ నా పెనిమిటి కాదు!"

    మల్లిక  ఉలికిపడినట్లయింది. "నువ్వు సారధిని ప్రేమించి పెళ్ళి చేసుకోలేదు, అవునా?" అంది కొంచెం ఆగి.

    భారతి అవునన్నట్లు  తల ఊపింది.

    "మొదట్లో పెళ్ళి కూడా నీ కిష్టం లేదు."

    భారతి మళ్ళీ తల ఆడించింది.

    "పెళ్ళయ్యాక కాపరం చేయటం  మాట అటుంచి, పట్టుమని పది మాటలు కూడా మాట్లాడి వుండవు. అటువంటిది అతని రూపం  నీలో ఎందుకని  స్థిరపడి పోయింది? నీదింత చక్కని మనసు కదా. అందులో అలాంటి దుర్మార్గుడి కెందుకు  చోటిచ్చావు" మల్లికా కోపంగా అడిగింది.

    "అతను దుర్మార్గుడు కాదే!" అంది భారతి మృదువుగా.

    "కాదూ? కాకపోతే  అంత పట్టుపట్టి పెళ్ళి చేసుకున్నవాడు ,అతని తండ్రి నిన్ను యింట్లోంచి వెళ్ళగొట్టాక  ఒకసారయినా  ఇటు వైపు  తొంగి చూశాడా? కనీసం ఒక ఉత్తరం ముక్కయినా  రాశాడా? నీ మీద ఏమయినా అనురాగం వుంటే  ఆ ముసలాడు  ఆడమన్నట్టల్లా ఆడతాడా?"

    "అయినా, అతను దుర్మార్గుడు కాదే!"

    "పోనీ పిరికివాడు దుర్మార్గుడిలో  కనీసం  హీరోయిజం  అయినా వుంటుంది. పిరికివాడైతే  మరీ ఏవగించుకోవాలి."

    ఆనాడు గాలివాన కురుస్తున్నప్పుడు తోటలో  అతనితోటి సన్నివేశం ఆమె స్మృతిపథంలో  మెదిలింది. "భారతీ! చాలా పిరికివాణ్ణి నేను నీ అండదండలు లేకుండా  నేను బ్రతకలేను, ఎప్పుడూ నన్ను కనిపెట్టుకు వుండవూ?" అని వణికే గొంతుతో  అతననటం, అప్పుడు గుండెల్ని కలిచివేసేలా వున్న అతని రూపం  ఆమె కళ్ళఎదుట  నిలిచింది.

    ఆమె హృదయం  అతనిపట్ల  సానుభూతితో నిండిపోయింది. నిజానికి  తానే దుర్మార్గురాలు. అతని అభ్యర్ధనను  త్రోసిపుచ్చి, అతన్ని కనిపెట్టకుండా  వచ్చేసింది.

    "పిరికివాళ్ళంతా  ఏవగించుకునే వ్యక్తులు  కాదు మల్లికా! అందులో కొందరు గుండెల్ని పిండేస్తారు" అనుభూతి నిండిన కంఠంతో అంది.

    మల్లిక ఆమె వైపు తీవ్రంగా చూసింది. "నువ్వు ఇంత సెంటిమెంటల్ ఫూల్ గా తయారవుతావని  ఎప్పటికీ అనుకోలేదు నేను" అంది అక్కసు పట్టలేక.

    భారతి నవ్వింది. "నేను అసలైన హిందూ వనితను. పుట్టి పెరిగిందా శుద్ధపల్లెటూళ్లో. ఇహ సెంటిమెంట్లకి అతీతంగా ఎలా వుంటావు చెప్పు" అంది మృదువుగా.
 

 Previous Page Next Page