ఇద్దరికీ నచ్చచెపుతూ వారి భుజాలను తట్టాడు రాజశేఖర్.
"మమ్మల్ని అపార్ధం చేసుకోవద్దు బాబూ. మీ ఇద్దరినీ తీసుకెళ్ళడానికే వచ్చామురా చిట్టితండ్రులూ" అనుపమ వారిని దగ్గరకు తీసుకునే ప్రయత్నం చేసింది.
ఆమె చేతులను విదిలించుకుని ఇద్దరూ పారిపోబోయారు.
అనుపమ అడ్డుపడి వాళ్ళిద్దరినీ అక్కున చేర్చుకుంది.
ఎవరో బలవంతంగా ఎత్తుకుపోతున్న భీతి కలిగింది వారికి.
"అన్నా....మేం నిన్ను వదిలి వెళ్ళం అన్నా..." అంటూ బావురుమన్నారు.
అప్పుడు మారాయి రాజశేఖర్ ముఖంలో రంగులు.
"వాళ్ళను వదిలేయండి."
అనుపమ ఉలిక్కిపడి వాళ్ళిద్దరినీ వదిలేసింది.
"జన్మతః గొడ్రాళ్ళు అయినప్పటికీ వారిలోనూ తల్లి మనస్సు పిల్లలకోసం తహతహ లాడుతుంటుంది. కానీ కొందరు గొడ్రాళ్ళు శారీరకంగానే కాదు మానసికంగా కూడా మనసు లేని మనుషులు.....పాషాణ హృదయులు....మీ ఇద్దరూ ఆ కోవకే చెందినవారు. అందుకే ఈ లేత హృదయాలు మిమ్మల్ని చూసి భీతిల్లుతున్నాయి. తల్లి మనస్సుని పసి మనసులే అర్ధం చేసుకుంటాయనేది నూటికి నూరుపాళ్ళు నిజం. మిమ్మల్ని చూడగానే భూతాన్ని చూసినట్టు తల్లడిల్లి పోతున్న వీరికి మీరు తల్లిదండ్రులు కాలేరు. ప్లీజ్ గో ఎవే."
రాజశేఖర్ గొంతు బొంగురుపోయింది.
అవి మాతలుకావు. మొనతేలిన శర పరంపరలు. సూటిగా ఆ దంపతుల హృదయాలను తాకాయి. అవును. అతను చెప్పింది యదార్ధమే!
నిజంగానే తామిద్దరమూ గొడ్రాలు పదానికి సరిపోయిన వాళ్ళమే. తమకు ఈ జన్మలో అమ్మా....నాన్నా అనిపించుకునే అదృష్టంలేదు. కాదు. కాదు....ఆ అవకాశాన్ని తామిరువురూ చేజేతులా జారవిడుచుకున్నారు.
వాళ్ళ మనసు గతంలోకి పరుగుపెట్టింది. ఆలోచనలు ఇరవై సంవత్సరాల వెనుకకు మరలాయి.
* * *
ముద్దుల భార్య అముపమా వచ్చిన తొలి రోజులు అవి.
ఉన్నత కుటుంబం నుంచి వచ్చినందువల్లకానీ....భార్యమీద మోజు తీరనందువల్లకానీ ఉన్న ఒక్కగానొక్క కొడుకు కళ్యాన్ ను ఒక పని వానిగా చూసినా అదేమని అనుపమను పల్లెత్తు మాటకూడా అనలేక పోయేవాడు ధీరజ్.
అసలు పెల్లికాక్ మునుపే ఆమె కొన్ని షరతులు విధించింది! వాటన్నింటికీ తలొగ్గే ఆమెను భార్యగా చేసుకున్నాడు.
రెండవ పెళ్ళి చేసుకుంటున్నానని తెలిస్తే తన బంధువులలో చిన్నతనంగా వుంటుందని అసలు ఆ ప్రసక్తే ధీరజ్ చేత రానివ్వలేదు.
ఎనిమిదేళ్ళ కొడుకు వున్నాడంటే మరింత చులకనై పోతానని భావించి పెళ్ళి సమయంలో అతనిని కొడుకుగా ఎవరికీ పరిచయం చేయలేదు.
ఏ పని పిల్లవాడో, తెలిసిన బంధువుల అబ్బాయోనని అనుకున్నారంతా.
పెళ్ళయ్యాక ఇంటికొచ్చిన తరువాత అదే సర్దుకుంటుందిలే....మారుటి తల్లి అయినప్పటికీ ఎంతయినా తల్లి కాలేకపోతుందా అని భావించి, ఆమె మాటకు ఎదురు చెప్పేవాడు కాదు ధీరజ్.
కాపురానికి వచ్చాక ఆ అభిప్రాయం మరింత బలపడిందే కాని ఒక తల్లి కొడుకును ఆడరించినట్టు దగ్గరకు తీయలేకపోయింది అనుపమ.
అది గమనించిన ధీరజ్ కు చివుక్కుమన్నా బయటపడేవాడు కాదు. ఎందుకంటే ఇంతకు ముందు వరకూ లేని కొత్త పెళ్ళాం, ఏరి కోరి అపురూప సౌందర్యరాశిని సొంతం చేసుకున్నాడు. ఆమెకు కష్టం కలిగించడం సుతరామూ ఇష్టం లేదు అతనికి.
అందుకే అంతవరకూ కళ్యాణ్ ను కన్నతల్లి, తన సహధర్మ చారిని అయినా శాంతిమీద వున్న మమతానురాగాలు ఒక్కటోక్కటిగా అతడిని వీదిపోయాయి. ఇప్పుడతనికి కంటికి కనిపించేది అనుపమ మాత్రమే.
నిన్నటి వరకూ తన జీవితాన్ని పంచి, వంశాంకురాన్ని ఇచ్చి, ఎన్నడూ తనకు ఉన్న హ్రుద్రోగాన్ని గూర్చి ఒక్కసారయినా చెప్పకుండా తనలో తనే దాచుకుని కుమిలిపోయి హారతి కర్పూరంలా కరిగి పోయి, చివరికి ఈ లోకాన్ని వదిలేసినా శాంతిపట్ల చూపిన నిర్లక్ష్యాన్నే ప్రస్తుతం కళ్యాణ్ పట్ల చూపుతున్నాడతను.
ఎప్పుడూ డ్యూటీపట్ల వుండే సిన్సియారిటీతో పగలూ, రేయీ, శాంతిని నిర్లక్ష్యం చేసేవాడు. అయినా ఆ సాధ్వీమణి భర్తను నిందించేది కాదు. తూలనాడేది కాదు. కనీసం పరుషంగా కూడా మాట్టాడి ఎరుగదు.
భార్య సుఖ సంతోషాలను పట్టించుకోకుండా తిరుగుతున్నాననే ధ్యాస కూడా ధీరజ్ కు వుండేది కాదు. కళ్యాణ్ పుట్టిన తరువాత కూడా అతని ప్రవర్తనలో మార్పు రాలేదు.
తన తలవ్రాతకు తనలో తనే కుమిలిపోయేదే కాని ఎలాంటి సమయంలోనూ కట్టుకున్న భర్తను వేలెత్తి చూపకపోగా పసివాడయిన కళ్యాణ్ కు సయితం తండ్రిపట్ల విధేయతను నూరిపోసేది.
శాంతి స్థానాన్ని తన హృదయం నుంచి చెరిపివేసి అనుపమకు ఇచ్చేటప్పుడు కానీ, ఆమెను తన సహధర్మచారిణిగా ఇంట అడుగు పెట్టించినప్పుడు కానీ......ఒక పసివానికి తల్లిని తెస్తున్నానన్న భావన కంటే తోడులేని తన జీవితానికి జోడు తెచ్చుకుంటున్నడానికే ఎక్కువ విలువ ఇచ్చాడు ధీరజ్.
అదే బాటలో ప్రయాణించిన అనుపమ కంటికి కళ్యాణ్ ఒక నలుసులా కనిపించాడు. కనిపించిన ప్రతిసారీ విసుక్కునేది. తప్ప ఉన్నా లేకపోయినా చీదరించుకునేది. చేసినా చేయకపోయినా చీవాట్లు పెట్టేది. అయినా దానికీ, కానిదానికీ అతనిని రాచి రంపాన పెట్టేది. అయినా, పెదవి విప్పకుండా మౌనంగా భరించాడు కళ్యాణ్.
ఆ రోజున...
కాన్వెంట్ నుంచి తిరిగి వచ్చేసరికి ఇంట్లో నుంచి వినిపిస్తున్న మాటలకు శిలా విగ్రహంలా బయటనే నిలబడిపోయాదతను.
"కళ్యాణ్ వస్తాడేమో."
"వస్తే ఎక్కడకు పోతాడు.....బయటనే కూర్చుంటాడు."
"అది కాదు డియర్....ఈ సమయంలో మనం గదిలో వుండడం వాడు చూస్తే బాగుండదు."
"ఏం ఫరవాలేదు. మూసిన తలుపులు తెరచే వరకూ అలానే కూర్చుని వుంటాడు."
ధీరజ్ ఇంకేదో చెప్పబోయాడు. అనుపమ అతని మాటలను కొట్టి పారేసింది.
ఎంతకూ కళ్యాణ్ ఇంటికి రాకపోవడంతో ఎప్పుడో అర్దరాత్రి దాటినా తరువాత అనుమానం వచ్చి తలుపులు తీసి బయటకు వచ్చిన ధీరజ్ కు మెట్లపై పుస్తకాల సంచి కనిపించింది.