"గౌరవించుకోవటం ఎందుకు? మామూలుగా ఉండొచ్చు కదా!"
"ఏ జాతికయినా స్తీయే ఫౌండేషన్ అన్న విషయం గుర్తుంచుకోండి"
"నిజమేగానీ ఆ ఫౌండేషన్ ఎవరువేశారో కూడా మీరు గుర్తుంచుకోండి!"
"ఛీ! మీతో మాట్లాడడం నాదీ తప్పు!" అంటూ ఆమె చివాలున ఇంట్లోకెళ్ళి తలుపేసుకుంది.
సురేష్ తాళంతీసి ఇంట్లోకి నడిచాడు.
ఒక్కసారిగా తీయని సువాసన అతన్ని పరవశుడ్ని చేసింది. తులసి వాడే పరిమళం అది. ఆమె లేకపోయినా ఇంటిని అంటి పెట్టుకునే వుంది.
సురేష్ నీరసంగా కూర్చుండిపోయాడు. తులసిలేని ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించటంలేదు. తులసి తనకు ఇంత ఎడిక్షన్ అయిపోయిందన్న విషయమే తనకు తెలీదు. మనసంతా కలిచివేస్తున్నట్లు బాధ! ఎందుకిలా అయిపోతున్నాడు తను?
అలా ఎంతసేపు కూర్చుండిపోయాడోతెలీదు. తులసిమాటలు, తులసినవ్వూ, మొఖంమీద కప్పేసే ఆమె చిక్కని జుట్టూ, ఎప్పుడూ తాకుతుండే పెదాలు..... అన్ని తన శరీరాన్ని అంటిపెట్టుకునేవున్న ఫీలింగ్....
"ఇదిగో కాఫీ" అన్న మాటలతో ఉలిక్కిపడి స్పృహలోకొచ్చాడు.
గంగాభవాని బయటే నిలబడి కాఫీ కప్పు అందిస్తోంది, ఆశ్చర్యంగా ఆమె కళ్ళల్లోకి చూశాడు.
"చూశారా! నేను చెప్పలేదా? అద్దె అన్నీ కలిపి అన్న విషయము ఇప్పుడు గుర్తుకొచ్చి కాఫీ ఇస్తున్నారు కదా?"
"హు! ఎన్నిసార్లు చెప్తే ఏముంది?" కోపంగా అంది.
"అరెరె! మూతి అలా బిగించేస్తారేమిటి? కొంచెం స్పోర్టివ్ గా వుండండి మేడమ్! పెళ్ళయిన కొత్తలో మీరు షటిల్ కాక్ ఆడేవారటకదా! మరాస్పోర్ట్స్ మెన్ స్పిరిట్ ఏమయింది? పోనీ స్పోర్ట్స్ వుమెన్ స్పిరిట్ అయినా ఉండాలికదా! బైదిబై నేను సాయంత్రం అయిదు గంటలకల్లా వచ్చేస్తానింటికి!"
"ఎందుకు?" డేగ చూపు వచ్చేసింది.
"మీకిష్టమైన ఆట ఆడదాం.....షటిల్ కాక్....."
"నేనేమి ఆడను.....మీరు రానక్కర్లేదు" అనేసి వెళ్ళిపోయి తలుపేసుకుంది. సురేష్ నవ్వుతూ కాఫీ తాగాడు.
త్వరత్వరగా రడీ అయి బయటకునడిచాడతను.
పర్సనల్ మేనేజర్ విజయ్ చందన్ అతనిని చూస్తూనే ఆనందంగా కరచాలనం చేశాడు.
"సో ...... యూహావ్ కమ్"
"సో...... ఐ హావ్ కమ్!"
"ఆర్ యూ రడీ!"
"క్వయిట్ రెడీ!"
"దెన్ లెటజ్ స్టార్ట్!"
అతనితోపాటు బయటకునడిచాడు.
హేమాదర్శన్ అతనిని చూస్తూనే విష్ చేసింది.
"మైగాడ్! యూ హావ్ కమ్!"
"ఎట్ లాస్ట్!" నవ్వుతూ చేయిచాపాడుకానీ ఆమె చేయిచాపలేదు.
"ఆరోజు మీరన్నమాటకు ఇంటికెళ్ళాక అర్ధం తెలిసింది. యూ వెరీ నాటీ!" అందామె కోపం నటిస్తూ.
"అయితే వప్పుకుంటున్నారా?"
ఆమె చిలిపిగా నవ్వింది.
"డోంట్ గో దట్ ఫాస్ట్! దెబ్బతింటారు."
"ఏమీలేకుండా ఆఖర్లో పశ్చాత్తాప పడటంకంటే దెబ్బతిని పశ్చాత్తాప పడటం బెటర్ అనేది నా పాలసీ! ఎలావుంది?"
"మన ఫారిన్ పాలసీలాగా అధ్వాన్నంగా వుంది!" వెళ్ళిపోతూ అంది.
"ఆ రోజు నేను చెప్పాను గుర్తుందా? ఆ బ్లూ డ్రస్ అమ్మాయి గురించి?" అడిగాడు విజయ్ చందన్.
"గుర్తా? కనురెప్పలమీద ఆఫ్ సెట్ లో ప్రింట్ అయిపోయింది."
"అదిగో రిసెప్షన్ లో వుందిప్పుడు. పేరు సుచిత్రాదత్! ఇంట్రడ్యూస్ చేస్తాను పద!"
ఇద్దరూ రిసెప్షన్ దగ్గరకు నడిచారు. ఇద్దరమ్మాయిలూ చాలా ఆధునికమయినా గెటప్ లో ఉన్నారు.
"సురేష్.....న్యూసూపర్ వైజర్" పరిచయం చేశాడతను.
"హాయ్" అంది సుచిత్రాదత్.
"ఆల్ దిట్వంటీ ఫోర్ అవర్స్" అన్నాడు సురేష్.
ఆమె అర్ధంకానట్లు పక్కనున్న అమ్మాయివేపు చూసింది.
"నైస్ టు మీట్ యూ" అంది రెండో ఆమె.
"నైసర్ ఇఫ్ వుయ్ వర్క్ టు గెదర్"
ఆమె ముఖంలో చిరాకు కనిపించింది గానీసుచిత్ర సేన్ చిన్నగా నవ్వింది. తిరిగి వచ్చేస్తుంటే విజయ్ ని అడిగాడు.
"ఆ సుచిత్రా సేన్ కథేమిటి?"
"అదేనువ్వు తెలుసుకోవాలి! నేను డీప్ గా వెళ్ళటంబావుండదు ఆఫ్టరాల్ అయామ్ బాస్"
"లీవిట్ టు మీ....."
అతనిని స్టాఫ్ అందరికీ పరిచయంచేశాడు విజయ్ చందన్.
"ఇవాళ రాత్రి షిఫ్ట్ కి వచ్చేసేయ్! అంటే పది గంటలకు రావాలి. టెన్ టూ మాణింగ్ సిక్స్!"
"ఫైన్! తులసి లేకుండా రాత్రుళ్ళు ఎలాగడపాలా అని ఒకటే వర్రీ అవుతున్నాను...... ఉదయం నుంచీ!"
అతను ఇంటికి చేరుకునేసరికి చీకటి పడిపోతోంది.
గంగాభవాని టి.వి. చూస్తోంది.
"హలో......వచ్చేశాను!" అన్నాడు గడపలో నిలబడి.
ఛటుక్కున లేచి నిలబడింది.
"వస్తేనాకెందుకు చెప్పటం?"
"భలేవారే! నాకు మీరూ, మీకు నేనేగా ఈ నాలుగ్గోడలమధ్య"
"చాల్లే.... ఇంక వెళ్ళండి."
"లోపలికేనా?" లోపలికి నడవబోయాడతను.
ఛటుక్కున చేయి అడ్డంగా పెట్టింది.
"ఇటు కాదు అటు...."
సురేష్ కోపంగా చూశాడు.
"తులసి రానీండి! మీ సంగతంతా చెప్తాను" బెదిరింపుగా అని తలుపుమూసేసుకుంది. కిటికీలోనుంచి అరిచాడతను.
"రాత్రిపదకొండింటికి ఎడల్ఫ్ మూవీ వచ్చినప్పుడు నన్ను నిద్రలేపండి."
ఆమె కిటికీకూడా మూసేసింది.
పదిగంటలకల్లా హోటల్ కి చేరుకున్నాడతను.
రిసెప్షన్ లో కొత్త అమ్మాయి వుంది.
"నా పేరు సురేష్! ఈ నైట్ కి మీమీద నాకు అధికారముంది" కౌంటర్ మీదకు వంగి అన్నాడతను.