Previous Page Next Page 
ఎర్ర సముద్రం పేజి 26


    బలమైన కర్రముక్క విరగొట్టిన శబ్దం వచ్చింది.....ఆ  దెబ్బకు నేల కరవాల్సిందే మరొకరయితే....నాగ్ ఆ దెబ్బతిని ఓర్చుకుంటూ ముందుకు దూకాడు___ఆ  దూకుడులోనే నాగ్  సాహితి కారు ముందుకు తూలాడు....అప్పటికే డ్రైవర్  విసురుగా సాహితిని కార్  లోనికి ఓ వస్తువును లాగినట్లు లాగటం, ఆ వెంటనే నాగ్ కార్ డోర్ నిమూయటం- ఇటు వైపు తిరిగి చేతులురెండూ బార్లాచాపి బిర్క్ ఖాన్  దెబ్బలను కాచుకోటానికి సిద్దపడటం అంతా క్షణాల్లో జరిగిపోయింది.
    జరుగుతున్నదేమిటో గ్రహించిన మిగతా విద్యార్థులు రేసుకుక్కళ్ళా ఖాన్, బిర్క్ ల వైపు దూసుకువచ్చారు.
    అప్పటికే అ ఉపద్రవాన్ని గ్రహించిన బిర్క్, ఖాన్ సీన్ లోంచి తప్పుకుని కార్మికుల మధ్యలోకి జొరబడ్డారు.
    మరో పది నిమిషాలకి పరిస్థితి అదుపులోకి వచ్చాక చూస్తే బిర్క్  గానీ, ఖాన్ గానీ లేరు.
    అప్పటికే  వారి జీప్ సరస్వతి చేతుల్లో అరవై కిలోమీటర్లవేగాన్నందుకొంది.
    అప్పుడు డోర్ తెరుచుకొని సాహితి క్రిందకు దిగింది. ఆమె  నుదుటి నుంచి స్రవిస్తున్న రక్తంతో ఆమె  జాకెట్, చీర తడిసిపోయాయి.
    జరిగిన దుష్పరిణామానికి కార్మికులు సిగ్గుతో తలొంచుకున్నారు.
    ఆదిత్య ముఖాన నెత్తురుచుక్క లేదు....ఎంలో దయార్థ హృదయంతో మునిగిపోతున్న కొన్ని వందల కార్మిక కుటుంబాల్ని నిలబెట్టాలని వచ్చిన మేడమ్ కి ఇలా జరిగిందేమిటి......? దీన్ని ఆమె క్షమించగలుగుతుందా? తమ గోడు వింటుందా?  ఈ ప్రశ్నలే ఆదిత్యను, మిగతా కార్మిక వర్గాన్ని క్షోభ పెడుతున్నాయి.
    ఎవరూ ఏం మాట్లాడలేక బిక్కచచ్చిపోయారు.
    సాహితి చూపులు వీరిమీద లేవు......వెంట్రుకవాసిలో చావునుండి తనను రక్షించిన యువకుడి కోసం చూస్తున్నాయి.
    ఆమె కళ్ళు ఓ క్షణం మెరిసాయి-
    అక్కడికి పదిహేను అడుగుల దూరంలో నలుగురైదుగురుతనను రక్షించిన యువకుడికి కట్టుకడుతున్నారు.
    చకచకా అక్కడకు నడిచింది.
    "ఎక్స్ క్యూజ్ మీ ప్లీజ్ " అంది సాహితి.
    ఆ మాటలకు నాగ్ పక్కనున్న యువకులు కాస్త పక్కకు తప్పుకున్నారు.
    ఒంగొని మోకలుని సర్దుకుంటున్న నాగ్ తలెత్తి చూసాడు.
     ఎదురుగా తను కొన్ని నిమిషాల క్రితం రక్షించిన-యువతి తన వేపే కృతజ్ఞతగా చూస్తూ....
    సాహితి ఓ క్షణం ఏం మాట్లాడలేక పోయింది.
    అప్పటికే నాగ్ ఒళ్ళంతా రక్తసిక్తమైపోయింది.
    మెరుపు వేగంతో నాగ్ చేయి పట్టుకొని తన కారు వైపు లాక్కెళ్ళి సీట్లో కూర్చుండబెట్టి స్టీరింగ్ ముందు తనే కూర్చుంది సాహితి.
    కరెక్టుగా ఐదు నిమిషాలకు కారు ఓ ప్రైవేటు నర్సింగ్ హొమ్ ముందాగింది.
    నాగ్ ఏం మాట్లాడలేదు_సాహితి కూడా మౌనంగానే ఉంది.
    ఇద్దరూ హాస్పిటల్ కి చేరిన అరగంటకు నాగ్  ఫ్రెండ్స్, ప్రీమియర్  కంపెనీ  కార్మికులు ఆ నర్సింగ్ హొమ్ కి చేరుకున్నారు.
    సాహితికి, నాగ్ కి-ఇద్దరికీ చెరొక వార్డ్ లో గాయాలు కడిగి కట్టు కట్టేసరికి గంట పట్టింది.
    ఎక్కువ రక్తం పోయిన మూలంగా నాగ్ స్పృహలో లేడు.
    సాహితి ఆందోళనాగా  హాస్పిటల్ సూపర్నెంట్ వైపే చూస్తూ కూర్చుంది.
    తనమీద ఎటాక్ ఎందుకు జరిగిందో-ఎవరా ఎటాక్ సృష్టించారో  సాహితి అప్పటికి గ్రహించగలిగింది.
    తనా ఫ్యాక్టరీకి ఫైనాన్స్ చేయటం ఇష్టంలేని వ్యక్తులు తమ అయిష్టాన్ని ఈ విధంగా తెలియజేసారు....
    అయితే వారూహించని విధంగా అదే కేంపస్ లోకి అప్పటికే యూనివర్శిటీ విద్యార్థులు ప్రవేశించటం___ వారి ప్లాన్ ని తలక్రిందులు చేయటం కేవలం యాదృచ్చికం.
    సాహితి ఈసారి ఉలిక్కిపడింది.
    
        
                                                         *    *    *


    "ప్లాన్ ఎందుకు అప్ సెట్  అయింది......?  తీవ్రస్వరాన మందలిస్తున్నాడు భాగ్యరాజ్ సత్యరాజ్ ని ఫోన్ లో.
    "నా ప్లాన్స్ ఎప్పుడు ప్లాప్ అవ్వవు-అన్నీ సవ్యంగా వున్నప్పుడు " సత్యరాజ్ బదులిస్తున్నాడు-ఎదురుగా తన అనుచరులు నలుగురూ ముఖాలు దించుకొని నిల్చున్నారు.
    "మరెందుకు"
    "అదే టైమ్ కి ఆ కేంపస్ లో  యూనివర్సిటీ విద్యార్థులు క్లీనింగ్ ప్రోగ్రామ్ లో వున్నారు అది మా మనుష్యులకి తెలియదు......."
    "ఏమైనా ప్లాన్ అప్ సెట్  కొట్టింది" భాగ్యరాజ్  కంఠంలో పెరుగుతున్న తీవ్రతను సత్యరాజ్ గమనించకపోలేదు.
    "పోనీ.....కనీసం తనమీద ఆ దాడి చేసింది కార్మికులే  అనన్నా నమ్మిందా?"
    "నమ్ముండవచ్చు___"
    "నీ మనుషుల్ని ఎవరూ గుర్తుపట్టి వుండరుగదా?"
    "గుర్తుపట్టి వుండరు" సత్యరాజ్ నమ్మకంగా చెప్పాడు.
        

                                                            *    *    *

 Previous Page Next Page