Previous Page Next Page 
69 సర్దార్ పటేల్ రోడ్ పేజి 25

 

    మెయిన్ రోడ్డు మీద పడ్డాడు తను. రోడ్డు మీద వెళ్ళే జనం ఆ దృశ్యం చూస్తున్నారు గానీ ఎవరూ పట్టించుకోవటం లేదు.
    కింద నుంచి లేస్తుంటే గోడమీద కనిపించినాయి పెయింట్ చేసిన పెద్ద పెద్ద అక్షరాలు.
    "ప్రజాసేవకుడు శ్రీ మార్తాండ గారికే మీ ఓటు.'
    అప్పుడే తెలిసింది..........అయన రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని అందుకే పోలీసులకు అతనంటే భయం.
    తిన్నగా ప్రతికాఫీసుకి నడిచాడు.
    అప్పటికే చీకటి పడుతోంది.
    ఎడిటర్ అతను చెప్పిందంతా విన్నాడు.
    ",మీరు చెప్పిందంతా జరిగిందనడానికి మాకు ఏదో ఋజువు కావాలండీ లేకపోతే పబ్లిష్ చేయలేము.'
    "ఏం ఋజువు కావాలి?"
    "మా జర్నలిస్ట్ ఎవరయినా ఎంక్వయిరీ చేయాలి."
    "ఎప్పుడు చేస్తారు?"
    "ఎప్పుడో మాకు ఖాళీ ఉన్నప్పుడు. అది కూడా మా వాళ్ళు తెచ్చే వార్తలన్నీ పబ్లిష్ చేయాలన్న రూల్ కూడా ఏమీ లేదు. ఇలాంటి క్రైమ్ స్టోరీస్ అన్నీ వారనికోక్కరోజే వేస్తాం! అదీ స్పేస్ సరిపోతే."
    మరో పత్రికాఫీస్ చేరుకున్నాడతను.
    "మాకు పోలీస్ డిపార్ట్ మెంటునుంచి న్యూస్ వస్తుందండీ! అందులో మీదుంటే వేస్తాం లేకపోతే లేదు" అన్నాడు ఎడిటర్.
    తనకు పత్రికల మీద ద్వేషం రగిలిపోతోంది.
    ఇలాంటి సంఘటనల గురించి ఎవరికి ఆసక్తి లేదు. ఈ అన్యాయాన్ని ఎడుర్కొవాలన్న కోరిక లేదు. వాళ్లక్కావలసింది రాజకీయ నాయకులిచ్చే లంచాలు, వాళ్ళిచ్చే గిఫ్టులు, అప్పుడే ఎంత పనికి రాని న్యూస్ అయినా పబ్లిష్ అవుతుంది.
    లేదా సెన్సేషనల్ న్యూసయినా అయ్యుండాలి.
    మర్డర్లు, రెప లు, దొంగతనాలు, ప్రమాదాలు.........అన్నీ యిలాంటివి.
    మూడో పత్రికలో చీఫ్ రిపోర్టర్ తను చెప్పిందంతా సావకాశంగా విన్నాడు. అప్పటికప్పుడే ఓ రిపోర్టర్ ని పిలిచి, ఆ స్టోరీ పబ్లిష్ చేయమని చెప్పాడు. "ఇలాంటివి సిటిలో ఎక్కువయిపోయాయి. న్యూస్ పేపర్ పూనుకుంటే తప్ప తగ్గనివి"అన్నాడు.
    జరిగిందంతా స్పష్టంగా రాసిచ్చాడతను.
    మర్నాడు తను రాసిందంతా పెద్ద అక్షరాలతో పబ్లిష్ చేశాడు పేపర్లో.
    ఆ తరువాత ఏం జరిగిందో తనకు తెలీదు.
    తన కోసం ఇంటికి ఓ కానిస్టేబుల్ వచ్చాడు.
    అతనితో పాటు పోలిస్ స్టేషన్ చేరుకున్నాడు.
    అక్కడ సర్కిల్ ఇన్స్ పెక్టర్ వున్నాడు.
    జరిగిందంతా అడిగి తెలుసుకున్నాడు. మరి కాసేపటిలో తన మీద దాడి చేసిన ఆ నలుగురు గుండాలను తీసుకొచ్చి లాకప్ లో వేశారు. ఆ తరువాత మార్తాండ్ కొడుకుని కూడా అరెస్ట్ చేశారు.
    అయినా గానీ, తనకూ, సీతకు భయం పోలేదు.
    ఆ అరెస్ట్ అంతా ఒక ఫార్సు అని అందరికీ తెలుసు. కొద్ది గంటలు మాత్రమే వాళ్ళని లాకప్ లో వుంచుతారు.
    తను ఇంటికొచ్చేశాడు.
    ఆ మర్నాడే జరిగిందా దారుణం.
    సరిత స్కూలు కెళుతొంటే ఆ మార్తాండ్ కొడుకు ఫ్రెండ్స్ తో ఆమె కెదురుగా వచ్చి అడ్డంగా దారి యివ్వకుండా నిలబడ్డాడు.
    సరితకు ఎక్కడలేని కోపమొచ్చింది.
    అతనామే భుజం మీద చేయి వేయబోయాడు.
    శక్తి నంతా కూడదీసుకుని అతని చెంప మీద బలంగా కొట్టింది వాడి చెంప మీద సరిత చేతివేళ్ళు తెలిపోయినాయి.
    రెండోవాడు చటుక్కున జేబులోంచి యాసిడ్ బాటిల్ తీశాడు.
    "ఆ పోలీసోండ్లకు కంప్లయింట్ ఎండుకిచ్చావే! అళ్ళు నీ ముండాగాళ్ళా" అడిగాడు మూడోవాడు యింకో పెద్ద యాసిడ్ క్యాన్ తీసుకుని ఆమెను సమీపిస్తూ.
    "గిప్పుడు ఈ యాసిడ్ నీ మొహాల మీద కొడతామే..........ఎవళ్ళు నీ మద్దత్ కొస్తారో జూస్తా"
    హటాత్తుగా మూడు వేపుల నుంచీ యాసిడ్ ఆమె మీద వర్షంలా కురిసినాయి.
    ముందు కళ్ళు భగ్గుమన్నాయి.
    తరువాత వళ్ళు........
    మంటల్లో మండిపోతున్న ఫీలింగ్.....
    క్షణాల్లో శరీరమంతా సెగలు పొగలతో నిండిపోయింది.
    రోడ్డు మీద పోయేవారంతా ఆగి దూరంగా నిలబడిపోయారు.
    దగ్గర కొస్తే ఆ యాసిడ్ తమ మీద కూడా పడుతుందేమోనన్న భయం.
    సరిత భాధతో కేకలు వేస్తూ రోడ్డు మీదే పడిపోయింది. ఆ గుండాలు స్కూటర్ల మీద వెళ్ళిపోయాక కొంతమంది గాళ్ స్టూడెంట్స్ ఆమె సహాయనికొచ్చారు.
    వెంటనే ఆమెని దగ్గర్లో వున్న నర్సింగ్ హోమ్ కి తీసుకెళ్ళారు.
    గవర్నమెంట్ హాస్పిటల్ లో అడుగడుగునా నిర్లక్ష్యం. రెండు గంటలు అడ్మిషన్ కోసం ఆమెని ఎలాంటి వైద్యం లేకుండా వరండాలో పడుకోబెట్టారు.
    అప్పుడు తనకు తెలిసిందా విషయం.
    పరుగుతో హాస్పిటల్ కి చేరుకునేసరికి ఆమె అవసాన దశలో వుంది.
    అతికష్టం మీద మాట్లాడ గలుగుతోంది.
    "పోలీస్ రిపోర్ట్ ఇవ్వకండి డాడీ!" వాళ్ళు మిమ్మల్ని కూడా ఏమయినా చేస్తారు....."
    అంతే! అదే ఆఖరి మాట.
    తనలో ప్రతీకార జ్వాల రగిలిపోయింది.
    "మార్తాండ్ మీదా, అతని కొడుకు మీదా, వాళ్ళ గుండా గ్యాంగ్ మీద రివెంజ్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
    కానీ వంతరిగా తను వారినేమీ చేయలేడన్న విషయం కొద్ది రోజుల్లోనే అర్ధమయ్యింది.
    వాళ్ళందరూ ఎప్పుడూ గన్స్ దగ్గర పెట్టుకుని తిరుగుతారు.
    నిద్రపోతున్నా కత్తి వాళ్ళతోనే వుంటుంది.

 Previous Page Next Page