విశారద!
తనకి దేవుడు ప్రసాదించైనా ఓ అపురూపమైన వరం ఈ వరాన్ని అవమానిస్తే తనకన్నా పాపాత్ముడు ఉండడు.
ఆరయింది, ఏడయింది, ఎనిమిదయింది.
విశారద అతనికి రెండోసారి కూడా కాఫీ తీసుకొచ్చి మౌనంగానే వెళ్ళిపోయింది.
ఇహ ఉండలేకపోయాడు. మెల్లగా లేచి కిచెన్ లోకి వెళ్ళాడు.
కిచెన్ లో విశారద గ్యాస్ స్టవ్ దగ్గర నిలబడి టిఫెన్ తయరుచేస్తుంది. అతను వచ్చినట్లు అలికిడిని బట్టి తెలుసుకుందిగాని తల పక్కకి తిప్పి చూడలేదు.
ఒక్కక్షణం తటపటాయించి "విశారదా" అని పిల్చాడు.
అతనెప్పుడూ ఆమెను నోరారా "విశారదా" అనే పిలుస్తాడు. ముద్దు పేరు పెట్టి పిలవడం కానీ, ఇదిగో అనీ, ఇంకేమేమో అనీ పిలవడం అతనికి అసహ్యం.
ఆమె జవాబు చెప్పలేదు.
"విశారదా" అన్నాడు మళ్ళీ.
ఈసారి తల తిప్పి తన విశాలమైన కళ్ళతో ఒక్కసారలా చూసి "ఏమిటో చెప్పండి" అంది.
"ఐ యామ్ సారీ."
"దేనికి?"
"రాత్రి... నీకు కష్టం కలిగించాను"
"నేను దాన్ని గురించి ఆలోచించడంలేదు"
"నువ్వాలోచించకపోవచ్చు. కానీ నేనాలోచిస్తున్నాను. ఎందుకంటే హర్ట్ చేసింది నేను కాబట్టి."
విశారద అతని మాటలకూ జవాబివ్వకుండా "మీరు ఇడ్లీలోకి చట్నీ తింటారా, కారప్పొడి తింటారా లేకపోతే సాంబార్ చెయ్యమంటారా?" అంది.
"నేను ఇడ్లీ కారప్పొడీ వగైరాల గురించి అడగడం లేదు. అంతకన్నా చాలా ముఖ్యమైన విషయం గురించి ముచ్చటిస్తున్నాను."
"అదంత ముఖ్యమైన విషయమని నేను భావించడం లేదు."
"చూడు?"
"చూశాను"
"నువ్వెంత కాదని చెప్పినా నేను నిన్ను హర్ట్ చేశాను అని నేననుకుంటున్నాను. అనుకోవడం కాదు నమ్ముతున్నాను అవునా?"
"ఏమో మరి?"
"నీ పరిస్థితిలో నేనుంటే, అంటే నువ్వు నాలా ప్రవర్తించి ఉంటే నేను డెఫినెట్ గా బాధపడతాను. ఇదివరకు నేను కోరినప్పుడు నువ్వు మూడ్స్ లో ఉన్నా లేకపోయినా సహించి ఊరుకున్నావనీ, అంతేగాక కోఆపరేట్ చేశావనీ తెలుసు. అలా నేను చెయ్యలేకపోయాను."
"సరే చెయ్యలేకపోయారు. అయితే ఏమిటి?"
"నిన్ను హార్ట్ చేశాను. ఒప్పుకో?"
"సరే ఒప్పుకుంటున్నాను అయితే ఏమిటి?"
"అయితే ఏమిటా?" అని అటూ ఇటూ చూసి "నన్ను క్షమించెయ్యి" అని రెండు భుజాలమీదా చేతులు వేసి ముఖానికి ముఖం ఆనించాడు.
"ఏమిటిది? పిల్లలు చూస్తారు"
"వాళ్ళప్పుడే లేవరులే నాతో మాట్లాడతానను?"
"ఆఁ! మాట్లాడతానులెండి వదలండి"
"మామూలుగా ఉంటానను?"
"ఆఁ! సరేలే."
* * *
రాత్రి పదకొండు దాటింది. విశారద, రాజాచంద్ర అలసిపోయినట్టు కూర్చుండిపోయారు.
"రేపు షార్జాలో ఇండియాకు, పాకిస్తాన్ కీ ఫైనల్స్! ట్రై మండ్రస్ గా ఉంటుంది"
"మీరు క్రికెట్ గురించి ఆలోచించినట్టుగా పిల్లల గురించి పట్టించుకోవడం లేదు"
"పట్టించుకుంటున్నాను. వాళ్ళగురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉన్నాను."
"ఆలోచించి ప్రయోజనమేమిటండీ? క్రియలో చూపించాలిగానీ?"
"ఉండు, ఉండు ఒక పాయింట్ నాకర్ధం కావడంలేదు. వాళ్ళేం తప్పు చేస్తున్నారంటావు?"
"అదేమిటండీ అలా అంటారు? రాత్రి పదకొండయింది. ఇంతవరకూ వాళ్ళింటికి చేరలేదు. ఇది తప్పు కాదంటారా? మీరు చిన్నప్పుడు ఇలాగే ఆలస్యంగా ఇల్లు చేరేవారా?"
"అవును తప్పే" అని రాజాచంద్ర మళ్ళీ కొంచెంసేపు ఆలోచించాడు. "ఇక్కడో పాయుంటుంది. ఆ రోజులకీ ఈ రోజులకీ చాలా తేడా ఉంది.
"ఎంత తేడా ఉంటే మాత్రం! పిల్లలు కొంత కంట్రోల్ లో ఉండాలి. రాజేష్ సిగరెట్లు కాల్చేస్తున్నాడు."
"ఈ రోజుల్లో సిగరెట్లు కాల్చడం వగైరాలు సీరియస్ గా తీసుకోకూడదు మరి."
విశారద రెండు చేతులతో తల పట్టుకుంది. "అలా అని ఊరుకుంటే ఎలాగండీ? ఇవేళ సిగరెట్ అవుతుంది. రేపు ఇంకోటి అవుతుంది"
"ఇంకోటి అంటే?"
"డ్రింక్ చెయ్యడం దాకా వెడుతుంది" ఆ మాటకొస్తే ఆ పని వాళ్ళిప్పుడు చెయ్యడం లేదని నేననుకోవడంలేదు"
"ఆఁ! మన పిల్లలు అలాంటి పనులు చెయ్యరులే"
ప్రతి తల్లీ తండ్రీ తమ పిల్లల్ని గురించి అలాగే అనుకుని మోసపోతూ ఉంటారు. పెద్దవాళ్ళకి తెలీకుండా వాళ్ళెంత ఎడ్వెంచర్స్ చేస్తూ ఉంటారో ఊహకి కూడా అందదు."
అతనికి స్నేహితుడు జగదీశ్వర్ మాటలు గుర్తుకొస్తున్నాయి. ఇలాంటివి మననం చేసుకోవడమతని కిష్టం ఉండదు. అది ఓ రకం ఎస్కేపిజం అయితే అయి వుండవచ్చు. కాని అతను దానికి అతీతుడు కాలేకపోతున్నాడు.