సత్యమూర్తికి పచ్చివెలక్కాయ గొంతులో పడినట్లయి"ఆలోచిస్తాను లెండి" అన్నాడు.
"సరే! ఎక్కడికో పనిమీద పోతున్నట్టు వున్నారు, పోయిరండి. తర్వాతః కలుస్తాను. బైబై" అని అతను కారులో ఎక్కి కూర్చుని స్టార్ట్ చేశాడు సత్యమూర్తి రిక్షాలో గంద్రగోళమైన మనస్సుతో ఎక్కి కూర్చున్నాడు.
అతనికి నారాయణరావుని చూస్తే అసూయ, ద్వేషం కలిగాయి. తన కళ్ళముందు బీడీలు కాలుస్తూ తిరిగిన మనిషి, గోల్డుఫ్లాక్ అవలీలగా వూదేస్తూన్నాడిప్పుడు. నూతన వ్యక్తిత్వం సంతరించుకున్నట్లుగా వుంది. ఏదో సాధించినట్లుగా వుంది. తనకంటే కోపం రగుల్కుంటోంది.....ఒక రకము వ్యక్తులు భూమ్మీద వుండకూడదని ప్రతివాడికీ తమ మనస్తత్వాలని బట్టి అనిపిస్తూ వుంటుంది. కని కర్మకొద్దీ అలాంటి వ్యక్తులు వుంటూనే వుంటారు. తారసిల్లుతూనే వుంటారు.
అతను జగన్నాధపురం వొంతెనదాటి, మరో రెండు సందులు తిరిగి, సత్యానందంగారి మేడముందు ఆగేసరికి సాయంత్రము ఆరు అవుతోంది ఇంచుమించు చలిగాలి తరంగాలు. మెల్లిగా సాగుతూ హాయిని గొల్పుతున్నాయి.
అది డచ్చివారు కట్టిన మేడ. అందువల్ల దాని ఆర్కిటెక్చర్ పద్దతి మిగతా భవనాలకు విభిన్నంగా, పూర్వపు అందాన్ని వెదజల్లుతూ గోచరిస్తుంది.
అతన్ని చూసి గేటుదగ్గరకు పనివాడు పరిగెత్తుకుంటూ వచ్చి "అయ్యగారు ఇంట్లో లేరండీ. క్లబ్బుకి వెళ్ళారు" అన్నాడు.
సత్యమూర్తి యిబ్బందిలోపడి "ఇంట్లో ఎవరున్నారు?" అని ప్రశ్నించాడు.
"అమ్మాయిగారు..."
లోపలకు వెడదామా, వెనక్కి వెళ్ళిపోదామా అని అతను సందిగ్ధావస్థలోపడి ఆలోచిస్తూ వుండగా పైనుండి ఓ గొంతు వినబడింది అతను తల ఎత్తి చూసేసరికి సుధ పైన ఆర్చీదగ్గర నిలబడి "ఎప్పుడొచ్చారు? పైకి రండి" అని పిలుస్తోంది చిరునవ్వు ముఖంతో.
అతను సంకోచాన్ని సడలించుకుని లోపలకు దారితీసి, మెట్లు ఎక్కి పైకి వెళ్ళాడు. సుధ గుమ్మం అవతలే నిలబడివుండి "రండి" అంది ఆదరంగా. "డాబాలోనే కూర్చుందామా? చల్లగా, హాయిగా వుంది అంది" మళ్ళీ వెంటనే.
"అలాగే. మీ ఇష్టం" అంటూ అతను ఆమె వెనుకనే నడిచాడు. ఇద్దరూ హాల్లోంచి, డాబాలోకి వెళ్ళి అక్కడవున్న కుర్చీలలో ఆసీనులయ్యారు. అతను సుధవైపు యాదృచ్చికంగా చూశాడు. అంతకుముందే స్నానం చేసినట్లు. మనసుకి ఆహ్లాదం కలిగించే పరిమళాన్ని వెదజల్లుతూ, శుభ్రంగా, స్వచ్చంగా, మనోహరంగా కనిపించింది ఆమె. అతను కాస్త ఉత్తేజితుడయాడు. ఆమె అతని చూపులకు లజ్జితురాలయి కళ్ళు ప్రక్కకి మరల్చుకుని ఎటో వీక్షింపసాగింది.
అతను క్రమంగా తెలివి తెచ్చుకుని తనని తాను సంబాళించుకుంటూ ఏం చేస్తున్నారు ఇక్కడ వంటరిగా కూర్చుని." ప్రశ్నించాడు.
సుధా అతనివైపు ముఖం త్రిప్పి కొంచంగా నవ్వింది. "సాయంత్రాలు సాధారణంగా ఇక్కడే కూర్చుని గడుపుతాను. నాన్నగారు క్లబ్బుకి వెడతారు. ఏదో పుస్తకం పట్టుకుని, నేను కాలక్షేపం చేస్తాను?'
"మీకు తోస్తుందా?"
"నాకు సాధారణంగా తోచక పోవటమంటూ వుండదండీ. వుట్టినే పడుకున్నా కాలం చాలా సులువుగా గడిచిపోతూ వుంటుంది. మనది కాస్త సోమరిపోతు వ్యవహారంలెండి" అని సుధా కిలకిలమని నవ్వింది.
"అయితే చాలా అదృష్టవంతులు" అనిసత్యమూర్తి ఆనవ్వుతో తనూ శృతి కలిపాడు.
"అన్నట్లు...ఈవేళ మీ రిజల్ట్సు వచ్చాయి. ఏమైంది?" అనడిగిందామె హఠాత్తుగా ఆదుర్దా ప్రకటిస్తూ.
"ప్యాసయినాను"
"క్లాసా?"
అతను తల ఊపాడు.
"వెరీగుడ్! కంగ్రాచ్యులేషన్స్. మరి మాకు పార్టీ ఎప్పుడు?" అన్నదామె ఉత్సాహంగా.
"అందుకు ఇన్ వైట్ చేద్దామనే వచ్చా" అన్నాడను తడుముకోకుండా.
"థ్యాంక్స్. ముందుగా మీకు నేను చిన్న పార్టీ యిస్తాను. రెండు నిమిషాలు బుద్దిగా కూర్చోండి. తోచకపోతే యీ పుస్తకం తిరగేస్తూ వుండండి" అంటూ అతను వొద్దు వొద్దని వారిస్తున్నా వినకుండా ఆమె లేచి లోపలకు వెళ్ళిపోయింది.