Previous Page Next Page 
నెత్తుటిబొట్టు పేజి 24

    తిరిగి పెద్దవుతున్నా ముఖం చాలా అందంగా వుండి యితరుల్ని ఆకర్షిస్తూ వుండేవారు గాని లోలోపల అనారోగ్యంతో బాధపడేవారు. తన అనారోగ్యం, మాటకారి కాకపోవడం, పదిమందిలో వున్నా ఒంటరితనంతో బాధపడే మనస్తత్వం, జీవితంలో ఏమీ  చెయ్యలేకపోవడం _ ఇవన్నీ లోపల లావాలా ఉడికి. సంవత్సరాల మధన అనతరం కొత్త వ్యక్తిత్వంతో కొత్త తేజస్సుతో, కనులు మిరుమిట్లు కొలుపుతూ బయటపడింది.ఆ తర్వాత అతను పూర్తిగా మారిపోయాడు. ఎన్నో ప్రదేశాలు సంచారం చెయ్యడం వల్ల మనుషుల మనసుల్ని పూర్తిగా ఆకళింపుచేసుకున్నాడు. ఏ మాట మాట్లాడినా మధుర ధ్వనితో కూడి,  నోట్లోనుంచి  ముత్యాలు రాలినట్టు వుండడం, కేవలం అయిదు నిమిషాల పరిచయంతో ఎలాంటి స్త్రీ అయినా సరే, వశమైపోవడం అతనికి సర్వసాధారణమైపోయింది. ఒకరు కాదు ఇద్దరు కాదు...ఆ సంఖ్యలకు మితం లేకుండా పోయింది. పెళ్ళయినవారు, పెళ్ళికానివారు, మరీ లేత వయసులో వున్న వారు, సమాజంలో ఉన్నత స్థానంలో వున్న వారి భార్యలు ఎందరితోనో అతను సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు. అతని జీవితం ఓ అద్భుత శృంగారమయ కావ్యంలా గడవసాగింది. ఒక రకంగా చెప్పాలంటే ఏడెనిమిదేళ్ళ కాలపరిమితిలో యిరవై ముప్పై ఏళ్ళ జీవిత మకరందాన్ని జుర్రిపారేశాడు. అలా చేయడంలో అతన్లో ఓ విశేషం వుండేది. ఎంతమంది ఆడవాళ్ళతో సంబంధమున్నా, ఎంత వాళ్ళ జీవితాల్లోకి దూసుకుపోయినా అతనికెవరిమీదా ఎటాచ్ మెంట్ వుండేది కాదు. ఎప్పుడూ మెంటల్ గా ఫీలయ్యేవాడు కాదు. ఆ స్త్రీలు మరెవ్వరితోనైనా తిరగడం, సంబంధాలు పెట్టుకోవడం కళ్ళబడినా అతనికి చీమ కుట్టినట్టయినా వుండేది కాదు. క్రమంగా ఇలా విచ్చలవిడిగా శృంగార జీవితం  గడపడం లోంచి అతనో కొత్త సిద్దాంతం లేవదీసి తన సంభాషణల్లో  చొప్పిస్తూ వుండేవాడు. ఆ సంభాషణలు చాలా ఆసక్తికరంగా, జనరంజకంగా వుండేవి. రాను రానూ అవి రసవత్తరమైన ఉపన్యాసాలుగా తయారై  అవి  ఎదుటివాళ్ళ  హృదయాల్లోకి చొచ్చుకుపోయి _ అతనంటే ఓ గురుభావం కలిగిస్తూ వుండేది. అలా కొన్ని సంవత్సరాలు గడిచేసరికి తనకి తెలియకుండానే అతనో ఆచార్యుడైపోయాడు. కోటికి పడగలెత్తినవారు అతనికి శిష్యగణంగా తయారయ్యారు. అతనికో అద్భుతమైన, రమణీయమైన ఆశ్రమం సిద్దమై పోయింది. అతని సిద్దాంతాలు, విప్లవాత్మకమైన భావాలు దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఒక తరంవారిని విపరీతంగా ఆకట్టుకొని ఎక్కడెక్కడినుంచో వచ్చి అతని శిష్యగణంలో చేరసాగారు  అతని నూతన శృంగారమయ సిద్దాంతానికి స్వేచ్చా శృంగారం! అనడంకన్నా స్వేచ్చా ప్రణయం అని పేరు పెట్టాడు. అలా వుంటే దాని పరిధులు కుచించుకుపోకుండా వుంటాయనీ, విశ్వజనీనత్వం వుంటుందనీ అతని నమ్మకం. రోజురోజుకూ అతని సిద్దాంతానికి 'స్వేచ్చా ప్రణయంలో నుండే దైవాన్ని దర్శించగలం' కొన్ని వర్గాలనుండి విపరీతమైన ఆదరణ అతని ఆదాయం పెంచసాగింది. బహుశ అతని కున్నంత విలాసవంతమైన కార్లు ప్రపంచంలో ఏ వ్యక్తికీ వుండనంతటి స్థితికి తీసుకెళ్ళింది.


            *                   *                 *



    ఆషా లోపలకు వచ్చింది. ఉపన్యాసం అయిపోయాక రెండోసారి స్నానం చేసి రావడం వల్ల స్వచ్చంగా, కొత్త కాంతితో ఆమె  శరీరం మెరుస్తూ ఆమె చుట్టూ వింత పరిమళాలు వ్యాపిస్తున్నాయి.

    "ఏమిటి ఆషా !"

    "ఇవేళ మన ఆశ్రమంలో మీ శిష్యరికం స్వీకరించడానికి ఓ కొత్త స్త్రీ వచ్చింది. పేరు విద్యుల్లతాదేవి మీతో ఓసారి మాట్లాడాలని"

    "ఎక్కడ వుంది?"

    "బయట నిరీక్షిస్తోంది."

    "సరే. అతిధుల్ని ఇంటర్యూ చేసే  గదిలో  వుండమను. పది నిమిషాల్లో వస్తాను."

    సరిగా పది నిమిషాలయ్యాక ఆచార్య జగదీష్ అతిధులుండే గదిలోకి ప్రవేశించాడు. ఆ గదిలో ఓ విలాసవంతమైన  సోఫాలో కూర్చుని విద్యుల్లతాదేవి అతని కోసం ఎదురుచూస్తోంది  ఆ గదిలో ఆమె ఒక్కతే వుంది. అది ఆశ్రమం నిబంధన. కొత్త వ్యక్తులకి ప్రవేశం కల్పించేటప్పుడు, వాళ్ళకి ఇంటర్వ్యూ   ఇచ్చేటప్పుడు మూడో వ్యక్తి వుండడానికి వీల్లేదు.

    అతన్ని చూసి ఆమె లేచి నిలబడింది __ఆమె శరీరం కొద్దిగా వణుకుతోంది.

    దగ్గరగా వెళ్ళి ఆమెకు అభిముఖంగా నిలబడి ముఖంలోకి చూస్తూ "విద్యుల్లతాదేవీ!" అన్నాడు.

    "నన్ను....గుర్తించారా?" తడబడే కంఠంతో అడిగింది.

    అతను నవ్వాడు. అతని ముఖంలో ఆశ్చర్యంకాని, అద్భుతంకాని ఎలాంటి భావమూ లేదు.

    "మనం...గతంలో ఎప్పుడయినా కలుసుకున్నామా?" చాలా తేలిగ్గా అడిగాడు.

    "కలుసుకున్నామా అని కాదు _ అన్ని విధాలా కలిశాం."

    అతను మళ్ళీ నవ్వాడు. "బహుశా...చాలా సాధారణంగా జరిగిపోయివుంటుంది."

    "అది సాధారణమే అయివుంటుంది. అది నా జీవితంలో తొలిసారి..."

   

 Previous Page Next Page