Previous Page Next Page 
భారతి పేజి 24

    భారతి ఊఁ అనదు, ఆఁ అనదు. ఎవరితో  మాట్లాడదు. ఎవరేం చెబితే అది చేస్తుంది .ఎవరన్నా వచ్చి డబ్బు కావాలని అడిగినా, మరే వస్తువు కావాలన్నా  నిశ్శబ్దంగా తీసి ఇస్తుంది.

    మరో కొన్నిరోజులు  గడిచేసరికి  బందువులంతా  ఒకరొకరుగా వెళ్ళిపోయారు. మల్లిక స్నేహితురాలిని కావిలించుకుని, ఏడ్చి సెలవు తీసుకుని వెళ్ళిపోయింది. భారతి బిక్కు బిక్కుమనే  ఆ ఇంట్లో రాధమ్మతో  సహా ఒంటరిగా మిగిలింది.

    ఎప్పుడూ ఆ యింట్లో  నిశ్శబ్దంగానే  వుంటుంది. రాధమ్మకు మాటలు రావు భారతికి మాటలు దొరకవు. ఇతరులెవరైనా  వచ్చినా మూగజీవులయేంతటి  స్తబ్ధవాతావరణం ఏర్పడింది చివరికి.


                                *    *    *


    కాలం మెల్లిగా  గడిచిపోతూంది. గౌరీపతిగారికి  నాలుగెకరాల పొలం వుంది. స్వంత ఇల్లు. మునసబుగారే గౌరీపతిగారి వ్యవహారాలన్నీ  చూసి పెడుతున్నాడు.

    "బావురుమనే  ఈ కొంపలో  ఎన్నాళ్ళని  ఇలా కాలక్షేపం చేస్తావు తల్లీ! తెలివైన పిల్లవు. విధి వక్రించి నీ జీవితం యిలాగయింది గాని, లేకపోతే ఎంత పైకి రాలసినదానివి! డబ్బు గురించి నువ్వు బెంగపడకు. ఇక్కడ నీ పొలంపని నా స్వంతపనిగా  భావించి, ఏ నష్టమో రాకుండా  చూస్తాను. నువ్వు హాయిగా బెజవాడగాని, గుంటూరుగాని పోయి చదువుకో అమ్మా. ఏ వ్యాపకమూ  లేకపోతే  మనసు మరీ పాడైపోతుంది" అని సలహా యిచ్చాడు ఒకరోజు.

    భారతి పెదవులమీద మలిన మందహాస మొకటి  లాస్యం చేసింది. "కొన్నాళ్ళపాటు  ఇక్కడే ఉండనియ్యి బాబాయి. ఇక్కడి నుంచి  కదిలి బయటి ప్రపంచంలోకి  పోవాలంటే  భయంగా వుంది నాకు" అంది.

    మునసబు రామానాయుడిగారి  కళ్ళు  చెమ్మగిల్లినాయి. వాత్సల్యంతో ఆమె శిరసు నిమురుతూ "నీ ఇష్టమమ్మా. నీ తండ్రి పోయాడనుకోకు. నా బొందిలో  ఊపిరున్నంతవరకూ  నిన్ను నా కడుపులో పెట్టి కాపాడుకుంటాను" అన్నాడు.

    కొన్ని రోజులు  గడిచిపోయాక  రామానాయుడుగారు  ఆమె దగ్గరకోసారి  వచ్చినప్పుడు "నీకో విషయం చెప్పాలనుకుంటున్నానమ్మా?" అన్నాడు.

    "ఏమిటి బాబాయి?"

    ఆయన కొద్దిగా సంకోచించి "ఇలా అంటున్నానని  మనసు కష్టపెట్టుకోకు. నిన్నిలా  చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతోంది. ఒకసారి  నూజివీడు పోయి  గంగాధరంగారితో  మాట్లాడి వచ్చేదా?" అన్నాడు.

    క్షణంలో భారతి ముఖం  రంగులు మారింది. "నీ కాళ్ళు పట్టుకుంటానుగాని  ఆ ప్రసక్తి ఎప్పుడూ తీసుకురాకు బాబాయి. నా కిలానే  చాలా హాయిగా  వుంది" అంది కటువుగా  వుండటానికి  ప్రయత్నిస్తూ.

    "నీ యిష్టం తల్లీ!" అని మునసబుగారు  నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి  నెమ్మదిగా  వెళ్ళిపోయాడు.

    ఒక్కోసారి భారతికి రోజు గడవటం కష్టంగా వుంటుంది. తోచదు. పిచ్చెత్తినట్లుగా వుంటుంది. గంటలకు గంటలు పిన్ని కెదురుగా మౌనంగా కూర్చుంటుంది. ఆ గదిలించి  ఈ గదిలోకి, ఈ గదిలోంచి ఆ గదిలోకి పిచ్చిగా తిరుగుతుంది. కాసేపు ఏమయినా  పుస్తకంలో నిమగ్నమౌదామని  ప్రయాసపడి  విఫలురాలౌతుంది. చావడిలోకి వచ్చి నిల్చుంటుంది. పొలాలకు వెళ్ళి వచ్చె జనం, నీళ్ళకోసం బిందెలు పట్టుకుని చెరువు వైపు వెళ్లే  ఆడవాళ్లూ, తనను పలకరిస్తున్నట్లుగా గాలికి ఊగే  పెద్ద పెద్ద  చెట్లూ, దూరంగా కనిపించే కొండలమీద ఆకుపచ్చని అడవులూ, జరీ అంచుతో మెరిసినట్లుండే  ఆకాశంలోని  మబ్బుతెరలూ."తోటలోకి వెళ్దాం, ఆ పువ్వుల మధ్య, మొక్కల మధ్య కొంచెంసేపు గడుపుదాం" అనుకుంటుంది భారతి. ఊరకనే  అలా అనుకుంటుంది, కాని ఇల్లు కదలదు.

    ఒకరోజు ఉదయం  హాల్లో  నేలమీద  కూర్చుని  తల దువ్వుకుంటూంది. రాధమ్మ లోపల వంటపనిలో  వుంది.

    "భారతీ!" అన్న పిలుపు  వినిపించి ఉలిక్కిపడి తల త్రిప్పి చూసింది. గుమ్మంలో నాగరాజు నిలబడి వున్నాడు.

    గౌరీపతిగారు  పోయినప్పుడు నాగరాజు  ఆ ఇంటికి వచ్చాడుగాని, అతనికి భారతిని  పలకరించే ధైర్యం లేకపోయింది. దూరం దూరంగానే తప్పించుకుని తిరిగి, చివరకు వెళ్ళిపోయాడు.

    నాగరాజును చూడగానే ఆమె అసహ్యంతో కుంచించుకు పోయినట్లయిపోయి చప్పున లేచి నిలబడింది. సారథితో తోటలోకి  షికారుకి వెళ్ళిన ఆ రాత్రి, గాలివాన, కారులో తిరిగివస్తూంటే  నాగరాజు తప్పతాగి వానలో  కారుకు అడ్డం రావటం. ఇంటికి చేరటంతోనే  తన మామగారు ప్రళయకాల  రుద్రుడులా  విలయతాండవం  చేయటం....అన్నీ చరచర కళ్ళ ముందు మెదిలాయి.

    "ఎందుకొచ్చావు?" అనడిగింది పెదవులు వణుకుతూండగా.

    "నిన్ను చూడాలని భారతీ!" అని నాగరాజు కుంటుకుంటూ లోపలకు  వచ్చాడు. మనిషి చిక్కిపోయి సగమైనట్లు వుండి, ముఖం పీక్కుపోయి, కళ్ళు గుంటలుపడి  దీనంగా  వున్నాడు నాగరాజు.

    "లోపలకు రాకు" అంది భారతి అసహ్యంగా.

    "భయపడకు, భారతీ! నేను నీకే కీడూ  తలపెట్టను." జాలిగా అన్నాడతను.

    ఆమె పెదవుల మీద మలిన  మందహాసం వుదయించింది. "నా ఇంట్లోకి వచ్చి నాకు కీడు తలపెడతావని భయపడేటంతటి  పిరికిదాన్ని కాదు. నిన్ను చూస్తే నాకేం భయంలేదు. ఉన్నది అసహ్యం" అన్నది.

    నాగరాజు ముఖం  వెలవెలా  పోయింది. ఆమెవంక  దీనంగా  చూస్తూ  మాటలకోసం  తడుముకున్నాడు. "దేవుడు నన్నెంత అంగవైకల్యంగా  పుట్టిస్తే మాత్రం  నేనంటే అంత అసహ్యమెందుకు. భారతీ? నువ్వు నన్ను పెళ్ళాడటానికి  నిరాకరించి ,దూరంగా తరిమికొట్టావు. అయినా  నీ ఏవగింపు పోలేదా?" అన్నాడు.

    "దూరంగా తరిమికొట్టానా? కాని నువ్వు  పోయావా? నన్ను నీడలా వెంబడించి నీ కసి తీర్చుకున్నావుగా"
    "కసి తీర్చుకున్నానా? నువ్వేమంటున్నావు, భారతీ!"

    "ఏమీ తెలియనట్లు  ముఖం  పెట్టకు. నూజివీడులో ఒకనాటి రాత్రి మేము వానలో కారులో వస్తూంటే తాగేసి అడ్డం  వచ్చింది నువ్వు కాదా?" కళ్ళలో ఎర్రనిజీర  వ్యాపిస్తూండగా  భారతి కోపంగా అడిగింది.

    నాగరాజు  నేరం  చేసినట్లు  తల వంచుకున్నాడు. "ఆ మాట నిజమే" అన్నాడు నెమ్మదిగా, తప్పిదం ఒప్పుకుంటున్నట్లు.

    "ఏం చేశావు  ఆ రోజు నువ్వు?"

    అతను మెల్లిగా తలఎత్తి  'నిజం చెప్పమంటావా?' అన్నట్లు  చూశాడు. "నువ్వంటే నాకెంత పిచ్చో నీకు కొంతవరకే తెలుసు భారతీ. మిగతాది నువ్వు ఊహించలేవు. మామయ్య నన్ను తృణీకరిస్తే ఆవేశంలో  ప్రతీకారం తీర్చుకుంటానని  ప్రగల్భాలు  కొట్టి వెళ్ళిపోయిన మాట నిజమే. నీ పెళ్ళయిపోయింది. నాకు జీవితంలో ఎవరూ లేరు. బాగుపడితే సంతోషించేవారు లేరు; చెడిపోతే బాధ పడేవాళ్ళు లేరు దేవుడిచ్చిన ఆస్థి కొంత వుంది. నా దని,నా మంటను నువ్వు  ఊహించలేవు: వెర్రిగా తాగేవాణ్ని. మరో ప్రపంచంతో సంబంధం లేకుండా గడిపేవాణ్ని. అలా చిత్తుగా తాగేసి ఒకసారి మైకంలో నిన్ను చూడాలన్న  కోరిక నణుచుకోలేక  నూజివీడు బయలుదేరి వచ్చాను. ఊరి బయటనే మీ కారు ఆగపడి  అందులో నువ్వూ, మీ ఆయనా ఎటో వెళ్ళిపోవటం  చూశాను. మళ్ళీ వస్తావు, మళ్ళీ చూడాలి అనుకుంటూ అక్కడే ఓపిగ్గా నిలబడ్డాను. చీకటి పడింది. వర్షం వచ్చింది. నేను తడిసిపోతున్నాను. నా ఒళ్ళు నాకు తెలియటం లేదు. అలాగే తూలిపోతూ  ఎంతోసేపు  నిలబడ్డాను. ఇంతలో  దూరంగా  కదిలి వస్తూన్న దీపాలు  కనిపించాయి. నువ్వే వస్తున్నావు ,వస్తున్నావు అనుకుంటూ  ఆ మైకంలో  ఏం చేస్తున్నానో తెలియక  రోడ్డు కడ్డంగా  నిలబడ్డాను. నన్ను చూసి కారైతే ఆగిపోయిందిగాని, కారులో వున్న నువ్వు కనబడలేదు. తరువాత నిరాశతో  కాళ్ళీడ్చుకుంటూ, ఆ రాత్రివేళ, గాలివానలో మా ఊరివైపు వెళ్ళిపోయాను."   

 Previous Page Next Page