Previous Page Next Page 
నల్లతంబి పేజి 23

"మరి?"
"వచ్చాక చెబుతాను" అని ఆమెకు మరోకమాట మాట్టాడే అవకాశమే ఇవ్వకుండా విసురుగా వెళ్ళిపోయాడు అధికారి.
రెండు శరీరాలు తెలిసో తెలియకో ఏకమైనా ఇద్దరు మనసులూ కలవడం లేదు. అందునా అతని రాతి హృదయం అసలే కరగడంలేదు!
అతని ప్రవర్తనకు సంజీవి స్థాణువులా నిలచిపోయింది.
ఆ రాత్రి అతనితో పొందిన సుఖాన్ని తలచుకుంటుంటే ఆమె శరీరం పులకించిపోతున్నది. ఎలా ఈవిషయం అతనితో తెలియ చెప్పేది? పరోక్షంగా అతనిని గెలుచుకున్నా, వాస్తవానికి తనవానిగా చేసుకోవడానికి ఇంకెంత కాలం వేచి చూడాలో!

                                           *    *    *
"అన్నా....! నీకోసం విజయవాడ నుంచి ఇన్స్పెక్టర్ ధీరజ్, ఆయన హార్య వచ్చారు"
మురుగన్ వైపు విచిత్రంగా చూశాడు రాజశేఖర్.
"భార్యాభర్త లిద్దరూ కలసి నా దగ్గరకు రావడమేమిటి?"
"ఏమోనన్నా.....వెంటనే మిమ్మల్ని కలవాలంటున్నారు."
అలాగేనన్నట్టు మౌనంగా తలూపాడు రాజశేఖర్.
నిమిషం తరువాత దంపతుల నిద్దరినీ వెంట బెట్టుకొచ్చాడు మురుగన్.
రాజశేఖర్ ఇద్దరికీ సీట్లు ఆఫర్ చేశాడు. అనుపమ సంకోచిస్తూనే కూర్చుంది.
ధీరజ్ దృష్టి రాజశేఖర్ చేతి వైపుకు మరలింది అతని చేతికి డిమాండ్ రింగ్ వుంది.
అది గమనించిన రాజశేఖర్ కనుబొమలు ముడివడ్డాయి.
తను చేసిన ఎంక్వయిరీలో ఎనిమిది లక్షలు ఖరీదుచేసే వజ్రపుటుంగరం చుట్టుప్రక్కల రాత్రాలలో కూడా ఎవరివద్దా లేదు. ఎవరూ కొనడం కానీ చేయించడం కానీ జరగలేదని తెలిసింది.
ఒకవేళ ఆ ఉంగరాన్ని కాజేసిన దొంగను రాజశేఖర్ తెచ్చి సంస్కరించిన నేపధ్యంలో దానిని తను తీసుకుని వుంటాడనుకోవడానికి కూడా అవకాశమేలేదు.
చందన చేతికి మరొక రింగ్ వుంది.
అదెలా సాధ్యమో ఎంత ఆలోచించినా అతని బుర్రకు తట్టడం లేదు.
"అసలు ఆ కెనడా జంట పోగుట్టుకున్న ఉంగరం ఇప్పుడు ఎవరి వద్దా వుందో?"
ఎవరికివారే మౌనంగా వున్నారే కాని, ముగ్గురిలో ఎవరూ పెదవివిప్పి ముందుగా పలకరించుకోలేదు. తాము ఎంచుకున్న పిల్లలను అడగాలని వచ్చిన అనుపమ అతని హోదా పరిసరాలు చూశాక అడగలేక మాటమరచి మూగబోయినట్టు మౌనంగా వుండిపోయింది.
రాజశేఖర్ ఆమె వైపు ఏమిటన్నట్టు చూశాడు.
"సంకోచిస్తున్నారెందుకు....ఏం పనిమీద వచ్చారో చెప్పండి?"
ఇన్ స్పెక్టరు ధీరజ్ కు ఒకవైపు అతన్ని ప్రాధేయపడి అడగడం అవమానంగా వుంది. మరొకవైపు భార్య పడుతున్న వేదనను అర్ధం చేసుకుని మౌనం వహించాడు.
"నా కొడుకు వయస్సు వున్న నిన్ను అర్ధిస్తున్నాను. చిన్నవాడివి-చేతులెత్తి దండం పెడితే ఆయుక్షీణమవుతుంది. నీ గురించి మా వారు చెప్పారు. మా ఆయుష్షు కూడా పోసుకుని నిండు నూరేళ్ళు చల్లగా జీవించు బాబూ! ఇరవై సంవత్సరాలనుంచీ పిల్లలు లేక తపించిపోతున్నానయ్యా...ఎవరినైనా తెచ్చుకుని పెంచుకుందామని అనాధశరణాలయంలో ఇద్దరిని చూసి వచ్చాం. వారిని నువ్వు తెచ్చినట్టు తెలిసింది. ఆ ఇద్దరినీ మాకు అప్పగించు బాబూ....!"
రాజశేఖర్ భ్రుకుటి ముడివడింది. అతని కళ్ళల్లో ఎర్రజీర తొంగి చూసింది.
"బాబూ రాజశేఖర్...వేరే విధంగా భావించవద్దు. నీ గురించీ నువ్వు అనాధ పిల్లలను తెచ్చి ఏం చేసేది నాకు తెలుసు....ఒక విధంగా మాలాంటి వారి ఇంట్లోకన్నా నీవద్ద వుంటేనే వారికి మంచి జరుగుతుందని నేను ఒప్పుకుంటాను. కానీ! అనుపమ దీనంగా అభ్యర్ధించింది.
"మీరు అంతగా ప్రాధేయపడనవసరం లేదు. విజయవాడ నుంచి తెచ్చిన పిల్లలను ఇంకా ఎక్కడకూ పంపలేదు. వారిలో ఎవరు కావాలో తీసుకెళ్ళండి. ప్రక్క గదిలోనే వున్నారు."
ఆ మాటలినడం ఆలస్యం అనుపమ ఆతురతగా ఆ గదిలోకి నడిచింది. ధీరజ్ మౌనంగా ఆమెను అనుసరించాడు. వాళ్ళు వెళ్ళినవైపే చూస్తుండిపోయాడు రాజశేఖర్.
అనుపమ ఆ ఇద్దరు పిల్లలను గుర్తుపట్టింది.
ఆమెను చూడడంతో ఆ ఇద్దరూ పులిని చూసి బెదిరే లేడిపిల్లల్లా పరుగెత్తుకొచ్చి రాజశేఖర్ చెరొక కాలుని బలంగా వాటేసుకున్నారు.
వారి వెనుకనే నీళ్ళు నిండిన కన్నులతో అనుపమ...
"అన్నా.....నిన్ను వదిలి మేం వెళ్ళం....నీతోనే వుంటాం."
ఇద్దరూ కోరస్ లా ఒకేమాట చెప్పారు.
ఆ మాటలకు ఆ దంపతుల ముఖాలు నల్లబడ్డాయి.
"తప్పమ్మా! అలా అనకూడదు. వాళ్ళ వెంట వెళ్ళండి....మిమ్మల్ని బాగా చూస్తారు. చదివిస్తారు"
"వద్దన్నా! వాళ్ళతో వెళ్ళడం మాకు ఇష్టం లేదు."
"ఎందుకని బాబూ....మీకు అమ్మానాన్నా అవసరం లేదా?"
"ఉహూ వద్దు....మాకు నువ్వే కావాలి."
"తప్పు బాబూ....ఎవరయినా తల్లితండ్రుల్నే కోరుకోవాలి" అనునయంగా అన్నాడు రాజశేఖర్.
"కానీ, మాకు ఇలాంటి తల్లిదండ్రులువద్దు. ఆయన చెప్పింది ఈమె వినదు. ఈమె చెప్పింది ఆయన వినడు. అసలు ఇద్దరికీ పిల్లలమీద ప్రేమ వుందో లేదో....ఉంటే అప్పుడు ఎందుకు వదిలి వెళ్ళిపోయారు? మమ్మల్ని తీసుకెళ్ళినా రేపు మా గతి ఏమిటి? అప్పుడు వచ్చేది నీ దగ్గరకే కదా - అందుకే ఇప్పటినుండే నీ దగ్గర వుండిపోతాం..."
దంపతులిద్దరికీ ఆ చిన్నారుల మాటలు కొరడాపెట్టి చరిచినట్టు తాకాయి.
తాము చేసిన తప్పేమిటో అప్పటికికాని వారికి అర్ధం కాలేదు.
బరువెక్కిన మనస్సుతో ఏమని మాట్టాడాలో మాటలు సయితం పెగలక నిస్తేజంగా వుండిపోయారిరువురూ.
"మీ మీద ప్రేమ లేకపోతే అంత దూరం నుంచి మీ కోసం వస్తారా? వారి వెంట వెళ్ళండి. మిమ్మల్ని కన్న కొడుకుల్లాగే చూసుకుంటారు."

 Previous Page Next Page