రమణరావు వికటంగా నవ్వుతూ "జానకిని రక్షిస్తావేం? ముందు నిన్ను నువ్వురక్షించుకో! రాజారావుకు సంగతంతా చెపుతావు కదూ! చెపుదువు కాని, పై లోకంలోంచి చెపుదువు కాని- ఇంతవరకూ నేను హత్యలు చెయ్యలేదు. ఇప్పుడు......."
అనిత మీదకు రాబోతున్న "రమణరావ్" అన్న గర్జన విని అదిరిపడి ఎదురుగా నించున్న రాజారావును చూసి ఆశ్చర్యపోయాడు.
"రాజారావ్!"
ఒక్కక్షణం భయపడి అంతలో తెగించినవాడిలా కటువుగా అన్నాడు.
"ఒక్కడుగు ముందుకు వేశావా......."
పిడికిళ్ళు బిగించి ఉగ్రంగా చూశాడు రాజారావు. రమణరావు నిర్లక్ష్యంగా రొమ్మువిరిచాడు.
"ఏం చేస్తావ్?"
చేతిలో పిస్టల్ రాజారావు గుండెలకు గురిపెట్టాడు.
రాజారావు చేతిలో ఏ ఆయుధమూ లేదు. అయినా నిర్భయంగా అనిత ముందుకొచ్చి "నా కంఠంలో ప్రాణముండగా నిన్ను అనిత దగ్గిరకు రానియ్యను" అన్నాడు.
"అయితే సరే! ముందు నీ ప్రాణాలు తీసుకుంటాను. మీ అనిత తిని కూచుని పులిమీసాలతో ఉయ్యాల లూగింది. పులి నోట్లో పడక తప్పుతుందా?"
రమణరావు పిస్టల్ గురిపెట్టాడు.
అది పేలకముందే అనితను కట్టి తెచ్చిన ఇద్దరు వ్యక్తులూ రమణరావు రెండు చేతులూ విరిచికట్టి క్రింద కూలదోశారు. అతని చేతిలో పిస్టల్ ఎగిరి మూలపడింది.
రమణరావుతో పాటు రాజారావు కూడా దిగ్ర్భాంతుడై చూశాడు.
ఆ వ్యక్తులిద్దరూ తమ ముసుగులు తొలగించారు.
ఒకడు జేమ్స్, రెండవవాడు జేమ్స్ ప్రాణస్నేహితుడయిన పోలీస్ కమీషనర్.
రమణరావు ముఖం నెత్తురుచుక్క లేకుండా పాలిపోయింది.
పోలీస్ కమీషనర్ అన్నాడు.
"జేమ్స్ మీ గురించి చెపితే నమ్మలేకపోయాను. సమాజంలో పెద్దమనిషిగా చలామణవుతున్న మీరు ఇంత దారుణం తలపెడతారా, అనుకున్నాను. మీ అనుచరులిద్దరూ ఇప్పటికే జైల్లో ఉన్నారు. మీరు కూడా నడవండి."
రమణరావు అనిత వంక తిరిగి రెండుచేతులూ జోడించాడు.
"బుద్ది గడ్డితిని ఇలా ప్రవర్తించాను. మీరెలా చెబితే అలా వింటాను. నా పరువు కాపాడండి."
"పరువు-ప్రతిష్ఠ!" విరగబడి నవ్వింది అనిత. "మీరంతా ఈ పదాలు భలేగా వాడుకుంటున్నారు."
పాలిపోయిన ముఖాన్ని క్రిందకు దించుకొన్నాడు రమణరావు.
"జానకిని పెళ్ళి చేసుకోండి జానకి ముఖంచూసి మిమ్మల్ని వదిలిపెడతాం. లేకపోతే...."
"చేసుకుంటాను. తప్పకుండా చేసుకుంటాను జానకి బంగారు బొమ్మ, దేవత...."
తాగినవాడిలా భయంతో పేలసాగాడు రమణరావు. నీరసంగా నవ్వింది అనిత.
23
"ఎంత సాహసం చేశావు అనితా! ఇప్పటికి కలో నిజమో నమ్మలేకుండా ఉన్నాను."
అనితను ఆర్ద్రంగా చూస్తూ అన్నాడు రాజారావు.
అనిత వివరించింది.
"జానకి మెడ్రాస్ లో నాకు పరిచయమయింది. పరిచయం స్నేహంగా మారింది. అప్పుడే జానకి జాలిగాధ విన్నాను. సమాజంలో ఇటీవల చెలరేగిన అస్థిమితను ఆధారం చేసుకుని కొందరు స్వార్థపరులు విజృంభించారు. నానా దుండగాలు చేస్తున్నారు. జానకి మరొక స్నేహితురాలి కోసం సినిమా ప్రోగ్రాం పెట్టుకుంది. ఆ స్నేహితురాలి కోసం పార్కులో ఎదురుచూస్తోంది. జానకి దురదృష్టవశాన ఆ రోజు ఆ స్నేహితురాలి ఇంటిదగ్గర బంధువులు రావటంవల్ల సినిమాకి రాలేక పోయింది. స్నేహితురాలికోసం ఎదురుచూస్తూ జానకికూచుంది. చీకటివడగానే లేచి రాబోయింది. అంతలో దుండగులు జానకిని పట్టుకుని కారులో ఎక్కించుకున్నారు. నిస్సహాయస్థితిలో జానకి గట్టిగా "పోలీస్! పోలీస్" అని అరిచింది.
"అక్కడున్న పోలీస్ చటుక్కున కారునంబర్ నోట్ చేసుకుని కేసు రిపోర్టుచేశాడు.
"జానకి పట్టితెచ్చిన వ్యక్తి సర్కిల్ ఇనస్పెక్టర్ కొడుకూ డబ్బున్నవాడూ అయిన రమణరావు.
"రమణరావు అతనితండ్రి అతి సులభంగా సాక్షుల్ని కొనుక్కుని కేసును ఎదురు జానకిమీదకే తిప్పారు.
"పోలీస్ అని అరిచినందుకు ప్రతిఫలంగా బ్రతుకు నాశనమవటమేకాక బజారు పాలయింది జానకి....
"ఈ గాధ విన్నప్పటినుండీ నా మనసు జానకిపట్ల జాలితో ద్రవించింది. రమణరావు పట్ల కసితో మండింది. ఎలాగైనా రమణరావు జానకిని అంగీకరించేలా చెయ్యాలి. ఇదే నా ఆశయం. ఆ ఆశయసిద్దికోసమే వచ్చాను ఇక్కడికి....."
రాజారావు ఆశ్చర్యంగా విన్నాడు.
"ఇంత తెలిసి నువ్వెందుకు ఆ పార్కుకు వెళ్ళావు?"
"నేను కావాలనే వెళ్ళాను. జానకి ద్వారానే రమణరావుకు గుణపాఠం నేర్పాలనుకున్నాను, కాని అది సాధ్యం కాలేదు. అంచేత నేనే రమణరావు ఇంటికివెళ్ళి నచ్చజెప్పటానికి ప్రయత్నించాను. విషయమంతా నీకు చెప్పేస్తానని బెదిరించాను__
"రుజువులు లేవు. నీ మాటలు రాజారావు నమ్మడు అన్నాడు.
"నీకు కావాలంటే పదివేలు కట్నంగా ఇస్తాను. జానకిని పెళ్ళిచేసుకో! ఆ అమాయకురాలి బ్రతుకు నాశనంచెయ్యకు అన్నాను.
"కొంచెం ఆలోచించి ఇక్కడ అందరూ వింటారు. రేపు పార్కులోకి రాగలవా? మాట్లాడుకుందాం! అన్నాడు.
"వెంటనే 'సరే' అన్నాను".
"నేను అమాయకురాలినని అతను మురిసిపోయాడు. అతని అమాయకత్వానికి నేను నవ్వుకున్నాను. నన్ను పార్కులోకి రమ్మన్నప్పుడే రమణరావు ఉద్దేశం అర్థమయిపోయింది నాకు. ముల్లును ముల్లుతోనే తియ్యాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. అధికార దర్పాన్ని అధికారంతోనే అణచాలి. జేమ్స్ మా పినతల్లి కొడుకు. జేమ్స్ కిక్కడి పోలీస్ కమీషనర్ స్నేహితుడని నాకు తెలుసు. అందుకే జేమ్స్ నిక్కడకు రమ్మని రాశాను, చిన్నతనంనుండీ అన్నాచెల్లెలులా పెరిగిన వాళ్ళం. బంధువులం. నా మాట కాదనలేక వెంటనే వచ్చాడు.