Previous Page Next Page 
అనిత పేజి 24


    
    "వాళ్ళెవరో చాలా శక్తిమంతులులా ఉన్నారు. లేకపోతే కటకటాల వెనుక కొండయ్య ఉన్నవాడున్నట్లుగా చచ్చిపోవటం ఎలా సాధ్యం? డాక్టర్ ను కూడా లొంగదీసుకున్నారు. నువ్వు ఇందులో కలిగించుకోకు. నీకేమైనా అయితే..." వ్యాకుల స్వరంతో అంటున్న రాజారావును చూసి అల్లరిగా నవ్వి "అయితే నీకేం బాధ? రాణి తండ్రిగారు బాధపడాలి" అంది.
    రాజారావు ముఖం పాలిపోయింది.
    "నాకు బాధ అని చెప్పటంలేదు. మావయ్యకు సమాధానం చెప్పుకోవాలి నేను."
    "మరేం ఫరవాలేదు. మా నాన్నగారు నన్ను నీ కప్పగించలేదుగా, నిన్ను ప్రశ్నించటానికి?"
    "ఛ! ఛ! నీలాంటి మొండిఘటాన్ని ఎక్కడా చూడలేదు. తరువాత నన్ను  సహాయం రమ్మని పిలిస్తే..."
    "పిలువను"
    "పిలవ్వా?"
    "ఎందుకు పిలవటం? నువ్వు పిలవకుండానే వస్తావు" పకపక నవ్వుతో వెళ్ళిపోయింది అనిత.


                                                                   21

    అనిత ఇటీవల తరచుగా రమణరావు ఇంటికి వెళ్ళివస్తోంది. రాజారావు ఏమాత్రమూ సహించలేకపోతున్నాడు.
    జేమ్స్ తో కూడా జేమ్స్ ప్రెండ్ పోలీస్ కమిషనర్ కూడా తరచు రాజారావు ఇంటికి వస్తున్నాడు. అనిత గంటల తరబడి వాళ్ళిద్దరితో మాట్లాడుతోంది. రాజారావు సహించలేక "ఇలా అడ్డమైన వాళ్ళూ నా యింటికి రావడం నా కిష్టంలేదు." అన్నాడు తీవ్రంగా.
    "వాళ్ళు అన్యాయాలను అడ్డుకునేవారే తప్ప అడ్డమైన వాళ్ళుకారు" అంది అనిత.
    "అంతా నాకనవసరం. వాళ్ళు ఇక మీద నా ఇంటికి రావటానికి వీల్లేదు."
    "సరే! నేనే వాళ్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడతాను."
    "అంతవాళ్లతో మాట్లాడవలసిన అవసరమేమిటి నీకు?"
    "ఈ ప్రశ్న అడగటానికి నీకేమిటి అవసరం?"
    రాజారావు కోపంగా వెళ్ళిపోయాడు.
    ఒకనాడు అనిత వంటరిగా కారులోవస్తూ ఎదురుపడింది.
    "ఎక్కడినుంచీ?"
    "రమణరావుగారి ఇంటిదగ్గిర నుండి...."
    "ఒక్కదానివే వెళ్ళావా?"
    "రహస్యాలు మాట్లాడటానికి పదిమంది వెళ్తారేమిటీ?"
    "రహస్యాలు మాట్లాడతానికా?"
    "అవును."
    "ఏమిటవి?"
    "ఇంత చదువుకున్నావు రహస్యమంటే అర్థం తెలియదా? చెప్పమని అడుగుతా వేమిటీ?"
    పకపక నవ్వి వెళ్ళిపోయింది అనిత.
    మరొకనాడు కూడా అలాగే ఎదురుపడింది.
    "రమణరావు దగ్గిరనుంచేనా?"
    కోపంగా అడిగాడు.
    "కాదు! కాదు! జేమ్స్ దగ్గిరనుంచి..."
    సరిదిద్దింది అనిత.
    "ఛీ! ఛీ! ఒక ప్రక్క రమణరావుగారితో, మరొక ప్రక్క జేమ్స్ తో.....
    "పోలీస్ కమిషనర్ గారి సంగతి మర్చిపోయావు," అందించింది అనిత.
    "ఛ! ఛ! బొత్తిగా సిగ్గులేదు."
    "సిగ్గుపడవలసినవాళ్లంతా రొమ్ము విరుచుకు తిరుగుతోంటే మధ్యన నన్ను సిగ్గుపడమంటావా? ఇలా ఉంది సమాజం."
    "ఛీ! ఛీ! నువ్వంటే నాకు అసహ్యం!"
    "నిజంగా?!"
    "ముమ్మాటికి! చెప్పరానంత, భరించలేనంత అసహ్యం, నిన్ను మా ఇంట్లో ఎందుకు అడుగుపెట్టనిచ్చానా అని బాధపడుతున్నాను. ఎప్పుడు విరగడవుతావా అని తపస్సు చేస్తున్నాను."
    "ఎందుకో చెప్పలేను కాని. తపస్సు చేస్తున్నది నిజమే బావా! ఆ తపసంతా నీ ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది."
    హుంకరించి విసురుగా వెళ్ళిపోయాడు రాజారావు.


                                                           22

    కొండయ్య మరణించటంతో జానకిని నాశనం చేసిన వ్యక్తి ఎవరో తెలుసుకోవటం కష్టమయిపోయింది రాజారావుకు. అతని మనసు అల్లకల్లోల మయిపోయింది.
    అనిత షికార్లు మనసును మరింత మండిస్తున్నాయి. మర్యాదకు భంగమని ఆత్మవంచన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నా మనసునుదహిస్తోన్న ఈర్ష్యకు తట్టుకోలేకపోతున్నాడు.
    అశాంతితో లైబ్రరీలోకి వచ్చిన రాజారావుకు తన బల్లమీద అనిత దస్తూరితో ఉన్న ఉత్తరం కనిపించింది. ఆత్రుతతో చదివాడు.
    "సుశీలా!
    ఊరికి దూరంగా ఉన్న పార్కులోకి అత్యవసరమైన పనిమీద వెళ్తున్నాను. నా కోసం చూడకు. భోజనం చేసెయ్యి. నేను వంటరిగానే వెళ్తున్నాను. అయినా నాకేం భయంలేదు. ఎవరైనా నన్నెత్తుకుపోయినా జానకిని మోసం చేసినట్లు చెయ్యలేరు, నాకోసం చూడకు, భోజనం చేసెయ్యి.    
                                                                                                  నీ
                                                                                                 అనిత...."
    కంగారుతో మతిపోయినట్టయింది రాజారావుకు.
    తిని కూర్చుని ఆపార్కుకి ఈ సమయంలో ఎందుకు వెడుతున్నట్లు?
    వంటరిగా వెడుతోందట.
    ఏదైనా జరిగితే!....
    ఆలోచించలేక పోయాడు రాజారావు. వెంటనే స్కూటర్ మీద బయలుదేరాడు. ఆ కంగారులో సుశీలకు రాసినఉత్తరం తన బల్లమీదకు ఎలా వచ్చిందనే ఆలోచన కూడా రాలేదు.
    అతని గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. అంతకంటే వేగంగా వెళుతోంది స్కూటర్.
    అతను పార్కు చేరకుండానే ఏ ఘోరం జరుగుతుందని భయపడ్డాడో ఆఘోరం అతని కళ్ళెదురుగానే జరిగిపోయింది. ఎవరో ఇద్దరు అనిత నోట్లో గుడ్డలు కుక్కీ, కాళ్ళూ చేతులు కట్టేసి కార్లో పడేశారు. రాజారావు సమీపించేసరికి కారు స్టార్టయిపోయింది.
    చేసేదిలేక కారును అనుసరించాడు. పోయిపోయి ఒక బంగళాలోకి వెళ్లింది కారు. రమణరావు ముందు అనిత కట్లు విప్పారు అనితను తీసుకొచ్చిన వ్యక్తులు.     

 Previous Page Next Page