Previous Page
అనిత పేజి 26


    
    "రమణరావు నన్ను పట్టుకోడానికి నియమించిన గుండాలను కమిషనర్ అరెస్ట్ చేశారు. వాళ్ళద్వారా రమణరావు రహస్యాలన్నీ తెలుసుకున్నారు. తరువాత వాళ్ళే గూండాలలా ముసుగులు వేసుకొని నన్ను తీసుకొచ్చారు. ఆ తరువాత నీకు తెలుసు..."
    "ఎంత సాహసం"
    విస్తుపోతూ అన్నాడు రాజారావు.
    "చేతిలో ఆయుధం లేకపోయినా, తన ప్రాణాలు పోయినా నా వంటిమీద ఈగ వాలనివ్వని బావ నాకుండగా నాకేం భయం?"
    "నేను వస్తానని నీకెలా తెలుసు?"
    "ఆ ఉత్తరం చదివాక రాకుండా ఎలా ఉంటావు?"
    "నువ్వు ఆ ఉత్తరం రాసింది సుశీలకి కాదా?"
    "నువ్వు చదవాలని నీ బల్లమీద పెట్టాను."
    "చదివానే అనుకో! ఒక వేళ రాకపోతే?"
    "తప్పకుండా  వచ్చితీరుతావు. మీ ఇంటిదగ్గిరనుండి పార్కుకి వచ్చేలోగా మానసికంగా ఎంత కలవరపడి ఉంటావో వూహించగలను."
    "ఎలా  తెలుసుకున్నావు?"
    "ఆడదాన్ని గనుక!"
    అల్లరిగా నవ్వింది అనిత_
    "నన్ను అపార్థం చేసుకున్నావు కదూ!" అంది కొంటెగా__
    "ఏనాడూ చేసుకోలేదు___" గంభీరంగా అన్నాడు రాజారావు.
    తెల్లబోయింది అనిత.
    "మరి, ఆ మాటలన్నీ......."
    "నీ అల్లరి భరించలేక  కలిగిన చిరాకు___నువ్వు ఆపదలో చిక్కుకుంటావేమోనని కలిగిన కలవరం. నీ నిర్మలమయిన కళ్ళలోకి చూస్తూ నిన్ను అపార్థం చేసుకోగలిగే శక్తి నాకు లేదు అనితా!"
     "రాణిని చూశాక కూడా...."
    "ఏం చూసినా, ఎవరు చెప్పినా,  నమ్మను. అనిత అల్లరిది- చిలిపిది- కొంటెది- రాలుగాయ.... కానీ తెలివితక్కువది మాత్రం కాదు.... ఏ నాడూ ఏ అడుగూ జారనియ్యదు."
    అనిత కళ్లు వెలిగాయి.....

    
                                                           *    *    *


    ఏ జానకికోసం అనిత ఇంత విశ్వప్రయత్నం  చేసిందో ఆ జానకి సమాధానం అందర్నీ దిగ్ర్భాంతుల్ని చేసింది.
    "ఇంత ప్రయత్నించి నువ్వు సాధించింది నా మెడలో తాళి బొట్టు మాత్రమేనా అనితా? ఒక గృహిణిగా నన్ను నిలబెట్టాలని సంఘద్రోహిని సంఘంలో నిలవనిస్తావా? నా ఒక్కదాని ఆనందంకోసం తెలిసి తెలిసి అలాంటి చీడపురుగును పచ్చని మన కుటుంబాలమధ్య విచ్చలవిడిగా వదలి పెట్టమంటావా? ఈనాడు విధిలేక రమణరావు నన్ను భార్యగా అంగీకరిస్తున్నాడు. కానీ  నేను మాత్రం ఏ సందర్భంలోనూ అతడిని నా భార్తగా అంగీకరించలేను. లోకమంటే తెలయని నా రాణిని ఆ విషవాయువుల మధ్య పెంచటం నా కిష్టంలేదు"
    "రాణి నీ కూతురా?"
    ఆశ్చర్యంగా అడిగాడు రాజారావు.
    "అవునన్నయ్యా! ఈ ఊళ్ళో రేగిన  అలజడికి భయపడి మెడ్రాస్ పారిపోయాను. ఆనాడు అనిత 'నీది కాని తప్పుకు నువ్వు భయపడి పారిపోతున్నావు నన్ను చూడు! సమాజాన్ని ఎలా ఎదుర్కొంటానో?' అని నన్ను, రాణిని తనతో తీసుకొచ్చింది."
    జేమ్స్, పోలీస్ కమిషనర్ ఇద్దరూ ఆ జానకిని అభినందించారు.
    "అనితగారు విడుదల చెయ్యమని కోరినా, నేను రమణరావుని అరెస్ట్ చెయ్యకుండా ఉండలేకపోయాను. అది నా విధి. ఈ వార్త మీకు ఎలా చెప్పాలా అని మధన పడుతున్నాను. జానకిగారు నాకు శ్రమ తప్పించారు."
    జానకిని జాలిగా చూస్తూ అన్నాడు పోలీస్ కమిషనర్ అందరి దగ్గిరా సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు.
    "నువ్వేం చెయ్యదలచుకున్నావు జానకీ?" అనిత అడిగింది.
    "నాకు డాక్టర్ ని  కావాలని ఉంది కాని అది సాధ్యపడదు. ఏదైనా  ఉద్యోగం సంపాదించుకుంటాను."
    తులశమ్మ తనకిచ్చిన డబ్బు జానకి చేతిలో పెట్టింది అనిత.
    "నువ్వు మెడిసిన్ చదువు. కనీసం ఇదైనా సాధించు". అంది
    "అనితా........"
    జానకి ఏదో అభ్యంతరం చెప్పబోతుండగానే అనిత అడ్డుకుంది.
    "అది మీనాన్నగారి డబ్బు. న్యాయంగా దానిమీద అధికారం నీదే! కాదు బావా!"
    "అవును జానకీ! ఆడబ్బు నువ్వు తీసుకుని మెడిసిన్ చదువు. నాకూ కాస్త ఊరట కలుగుతుంది...."
    రాజారావు ఆమోదంకూడా లభించడంతో జానకి మళ్ళీ అభ్యంతర పెట్టలేదు....
    అనితను ఏకాంతంలో కలుసుకుని రాజారావు "ఆ డబ్బు మీ అమ్మగారు నీకిచ్చారు. కేవలం నీ కుటుంబానికే వినియోగపడాలని విల్లులో రాశారు. నువ్వు మా క్రింద ఖర్చు పెడుతున్నావు" అన్నాడు.
    "ఈ ఇంట్లో అడుగుపెట్టిన మరుక్షణంనుంచీ ఇది నా కుటుంబంగానే భావించాను బావా!"
    అనిత సిగ్గుపడటం మొదటిసారిగా చూశాడు. రాజారావు ముగ్ధుడయ్యాడు....
    "కానీ, అనితా! నేను అనేక బాధ్యతలు మోస్తున్నవాడిని. సుశీలకు పెళ్ళి చెయ్యాలి. అప్పులు తీర్చాలి."
    "మా జేమ్సు మీ సుశీలను సారీ మన సుశీలను చాలా ఇష్టపడుతున్నాడు నీ కభ్యంతరం లేకపోతే........."
    "సంతోషంగా వాళ్ళ వివాహానికి వప్పుకుంటాను!"
    "ఒక బాధ్యత తీరిపోయినట్లేగా! మిగిలిన బాధ్యతలు నీవూ నేనూ పంచుకుందామనుకుంటున్నాను. నాకు ఆ అవకాశం ఇయ్యవా?"
    చిరునవ్వుతో చేతులు జాపాడు రాజారావు.
    ఆ చేతులలో వాలిపోయింది అనిత.

                                                         * శుభం *

 Previous Page