Previous Page Next Page 
ఎండమావులు పేజి 25


    మురహరి ఏం మాట్లాడలేక తలపట్టుకుని కూర్చున్నాడు. అతని మనస్సు సుళ్ళు తిరిగి పోతున్నది. తలవంచుకుని ఆలోచిస్తూ కూర్చున్న జయ లక్ష్మిని ఆపాదమస్తకమూ చూశాడు. ఎన్నడూ ఆ వ్యక్తిని చూడని కొత్తవారిలా ఆమె ఉనికిలో ముఖ వర్చస్సులో, వితంతు ఛాయ ఎక్కడా కనబడలేదు, సంపూర్ణ యవ్వనవతియైన కన్యలానే కనబడింది. సుఖ సంతోషాలకు అంకితమవవలసిన ఆమె జీవితం రెండు విభాగాలయినట్లుగా గుర్తించాడు. ఆంతర్యంలో ఆమె వితంతువు. బాహ్య రూపంలో ఆమె కన్యారత్నము. ముగ్ధ మోహన సౌందర్యరాసి. ఈ బాహ్య అంతః సౌందర్యాలు రెండూ సమ్మిళితమైనప్పుడే ఆమె పరిపూర్ణ సౌందర్యవతి. ఈ రెండూ రెండుగా ఉన్నప్పుడు ఆమె ముఖంలో విషాదకరమైన తెలి మబ్బులు దోగాడు తూనే ఉంటయ్.
    ఆమె జీవితంలో ఆనందకుసుమాలు ఆకాశం లోనే ఎప్పుడో అంతర్హితమై పోయినవి. హృదయాంతరాళంలో చెలరేగే ఈ పెనుగాలికి ఆ ఆనంద కుసుమాలలో కొన్నయినా రాలిపడితే వాటిని తనే ఏరుకుని ఆస్వాదించాలనుకున్నాడు మురహరి.
    "నేను భోజనం చేసి మళ్ళీ వస్తాను మురహరీ. ఈలోగా ప్లాస్కులో కాఫీ ఉన్నది. కావాలిస్తే తాగు. నేను మళ్ళీ గంటలో వచ్చేస్తాను" అని వెళ్ళింది జయలక్ష్మి.

                                      18

    జయలక్ష్మి భోజనంచేసి వచ్చేసరికి మురహరి నిద్రపోతున్నాడు. ఎండ తీవ్రంగా ఉన్నది. ముఖం మీద ముత్యాలలాగ పోసిన స్వేదవిందువులను తుడ్చుకుంటూ కుర్చీలో కూర్చున్నది జయలక్ష్మి. కాఫీ తాగాడో లేదో నని ఫ్లాస్కు తీసి చూస్తే కాఫీ అంతా అట్లాగే ఉన్నది. కాఫీ తాగినట్లు లేదు. ఈ స్థితిలో నిద్రపోతున్న మురహరిని చూసేసరికి జయలక్ష్మికి ఆదుర్దా కలిగింది. అది నిద్రా లేక సోష వచ్చి కళ్ళు మత్తుగా మూతలు పడ్డయ్యో అని. ముఖంమీద చెయ్యివేసి చూస్తే జ్వరం పేలిపోతున్నది. ఖంగారుపడ్డది జయలక్ష్మి. రెండు, మూడుసార్లు మెల్లిగా పిలవగా కళ్ళు తెర్చి చూశాడు.
    "కాఫీ తాగకుండానే పడుకున్నావేం మురహరీ. జ్వరం బాగా ఉన్నది. కాస్త స్త్రాణగా ఉంటుంది కాఫీ ఇవ్వనా" అన్నది జయలక్ష్మి.
    "జయా వళ్ళంతా పొగలూ, సెగలూ తేలు తున్నది. ఈ జ్వరం ఇప్పట్లో తగ్గుతుందనే ఆశ నాకేమీ కనిపించటంలేదు. అమ్మా, నాన్నా ఎట్లాగూ లేరు. ఆప్తురాలివైనా, ఆత్మబంధువైనా నువ్వే. నేను కన్ను మూశాక నాకోసం ఒక్క కన్నీటిబొట్టు రాలుస్తావు కదూ" అన్నాడు దీనంగా జయలక్ష్మివైపు చూస్తూ. ఎర్రబారిన అతని కనుకొలుకుల్లోని అశ్రుకణాలు దిండులో ఇంకినయ్యి.
    జయలక్ష్మి గుండె ఝల్లుమన్నది. మురహరి మాటల్లోని ఆవేదన, అతని చూపుల్లోని భయమూ చచ్చిపోతానేమోననే దిగులుతో పడే అతని ఆత్మఘోష, తనయందు అతను చూపించే కృతజ్ఞతా భావమూ పూర్తిగా అర్ధం చేసుకున్నది జయలక్ష్మి.
    మెల్లిగా అతని పక్కలో కూర్చుని కన్నీరు తుడుస్తూ,
    "అంత నిరాశ, దిగులూ పనికిరాదు మురహరీ, జ్వరాలనేవి మానవులకు రాక మరెవ్వరి కొస్తాయి? జ్వర తీవ్రతలో నాకు భయం కలిగి ఉండొచ్చు. అంతమాత్రంచేత ఇంత దిగులుపట్టం మంచిదికాదు. శరీరంలో అస్వస్థత ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడే భీతాహమూ, దిగులూ వాటంతటవే ప్రవేసిస్తయ్యి. ఆప్తులైనవారూ, ఆత్మ బంధువులూ అందరికీ ఉండరు. అందుకూ అదృష్టం ఉండాలి. ఆత్మను అర్ధం చేసుకుని తమ ఆత్మలో విలీనం చేసుకున్నవారే ఆత్మబంధువుల కింద లెక్క, చుట్టా లయినంత మాత్రాన అంతా ఆత్మబంధువులు కారు. నే బ్రతికుండగా నీకోసం కన్నీటిబొట్టు రాల్చే దుర్దశ ఎవ్వరికీ రాదు. నీ జ్వరం తగ్గి పథ్యం తీసుకునే వరకూ ఇక్కడే ఉంటాను. సరేనా" అన్నది జయలక్ష్మి.
    ఆ క్షణంలో పసివాని హృదయంలా అతని మనస్సు తెలియని తృప్తితో నిండిపోయింది. ప్రతివారి జీవితంలోనూ ఆప్తులయినవారు కొంత మంది ఉంటారు. అలాంటి ఆప్తులైనవారి సానుభూతి కోసం, అనునయ వాక్యాల కోసం ఆ బాధ పడేవారి హృదయం ఆక్రోశిస్తుంది. అలాంటి ఆప్తులైనవారు నాకు ఎవ్వరూ లేరే అని విచార పడి, దిగులుపడి ఉన్న మురహరి జీవితంలో జయ లక్ష్మి అత్యంత ఆత్మీయురాలుగా దగ్గరకు రావటం తల్చుకుంటే అతని మనస్సుకు అంతకన్న తృప్తి కరమైన విషయం మరొకటి లేకపోయింది.
    జయలక్ష్మి అట్లా మాట్లాడుతుంటే కుదుట బడిన మనస్సుతో ఆమెవైపు కళ్ళార్పకుండా చూస్తూ పడుకున్నాడు. మురహరి.
    అప్రయత్నంగానే ఆమె చేతులు తన గుండెల మీదికి తీసుకుని,
    "జయా, సాధారణంగా సామాన్య జీవితంలో మానవ మనస్తత్వాలు ఒక హద్దుకు మించి అర్ధంకావు. అర్ధం చేసుకునేందుకు అవకాశం ఉండనూ ఉండదు. కష్టాలొచ్చినప్పుడే భగవంతుడు మన మనస్సులో కదలాడినట్లుగా ఇలాంటి సుస్తీల సమయంలోనే ఆప్తులైనవారి సహాయ సానుభూతులు పొందటానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ తల్చుకుంటే నాకూ జ్వరం రావటం ఒకందుకు మంచిదే నేమో" అన్నాడు.
    జయలక్ష్మి ఈ మాటలకు పకపకా నవ్వింది. అంత సంతోషంగా ఆమె నవ్వటం మురహరి ఎప్పుడూ చూడలేదు.
    "నా మాటలు అంతగా నవ్వొస్తున్నయ్యా జయా"
    "కాదా మరి నా మనస్సును అర్ధంచేసుకుని నాచేత సేవ చేయించుకోవాలంటే నీకు జ్వరం రావటం ఒక్కటే మార్గ మన్నమాట. ఎంత పిచ్చివాడివి మురహరీ. పోనీలే, ఇప్పటికైనా నన్నొక ఆప్తురాలిగా గుర్తించావ్. అంతేచాలు" అన్నది జయ లక్ష్మి నవ్వుతూ.
    ప్లాస్కు తీసి కాఫీ పోసి యిచ్చింది. లేని వోపికా తెచ్చుకుని హితవు లేకపోయినా ఆమె యిచ్చిన కాఫీని తాగాడు మురహరి. ఒక్కసారి త్రేణువు వచ్చి తాగిన కాఫీ అంతా కక్కేశాడు. తన బట్టలూం, పక్క బట్టలూ, జయలక్ష్మి చీరె అంతా కాఫీతో పాడయిపోయినయ్యి. అతనా విధంగా మననం చేసుకుంటుంటే చెవులు రెండూ గట్టిగా మూసి కణతలు అదిమి పట్టుకుంది. జయలక్ష్మి.
    మురహరికి తల తిరిగిపోతున్నది. లేచి కూర్చునే స్థితిలో లేడు. మెల్లిగా అతన్ని పొదివి పట్టుకుని కుర్చీలో కూర్చోబెట్టింది జయలక్ష్మి. పక్క బట్టలు తీసేసి మంచి దుప్పటి వేసి మళ్ళా అతన్ని కూర్చోబెట్టింది. అతని పెట్టె తీసి బట్టలు తీసిచ్చి మెల్లిగా కట్టుకోమన్నది. ఈలోగా తను బాత్ రూంలోకి వెళ్ళి తన చీరెమీద పడ్డ కాఫీ మరకలను కడిగి అతడి బట్టతోనే వచ్చింది. బట్టలు మార్చుకుని పక్కమీద ఖిన్నుడై కూర్చున్నాడు మురహరి.
    "వాంతి తగ్గిందా మురహరీ. తలనొప్పి ఎక్కువైందా."
    "వాంతి తగ్గింది. శాంతి మాత్రం లేదు జయా. నీకు అనవసరమైన శ్రమ ఇస్తున్నాను. నా కక్కులు ఎత్తిపొయ్యటానికి, ఇంత హడావుడి చేసి నిన్ను బాధపెట్టటానికే నన్ను భగవంతుడు బ్రతికిస్తున్నాడు కామాలు. ఈ జ్వరంలో నేను పోతే ఎంత బావుండేది" అన్నాడు వెక్కు పుట్టే టట్లుగా వచ్చే దుఃఖాన్ని దిగమింగుకుని.
    "ఈ చిన్న విషయానికే ఇంత బాధగా మాట్లాడతా వెందుకు మురహరీ. ఒక్క సంఘటనకే నిన్ను నేను అసహ్యించుకోవాలంటావా? మానవ జన్మ ఎత్తింతరువాత కుక్కలూ, వాంతులూ రాకమానవు. వాటినుంచి ఏ వ్యక్తీ దూరంగా పోలేడు. నేను హాస్టలుకు వెళ్ళి నాబట్టలు తెచ్చుకుని ఇక్కడే ఉంటాను. అంతవరకూ మనస్సులో ఏ కలతా పెట్టుకోక విశ్రాంతి తీసుకో." అన్నది జయలక్ష్మి.
    ఆ సాయంకాలమే జయలక్ష్మి తన బట్టలు చిన్న పెట్టెలో పెట్టుకుని కాలేజీ పుస్తకాలు తీసుకుని మురహరి గదికి వచ్చేసింది. అతనికి జ్వరం తగ్గి పథ్యం తీసుకునేటంత వరకూ అక్కడ ఉంటానికే నిశ్చయించుకుంది.
    జయలక్ష్మి రాగానే,
    "జయా, నా శ్రేయస్సు కోరి నాకు సేవ చెయ్యటానికి నువ్వు ఇక్కడికి వచ్చినా లోకం దృష్టిలో ఇది తగినపని కాదేమో. ఈ కారణంగా నువ్వు అపనిందలపాలు కావలసి వస్తుందేమో" అన్నాడు మురహరి.    
    బట్టల పెట్టె, పుస్తకాలూ ఒకపక్కన పెట్టి కుర్చీలో కూర్చుంది జయలక్ష్మి.
    "ఎవరికీ మురహరీ అపనింద. ఆ వేసే అపనిందకు అర్ధం ఏముంది? అపనింద వెయ్యాలంటే నేను పెట్టే బేడా సర్దుకుని వచ్చి ఇక్కడే ఉండాలంటావా? అంతమాత్రంచేతనే అపనింద వేస్తారంటావా? పోనీ వెయ్యనీ, నిందలూ, అపనిందలూ భరించనిదే కొందరి జీవితాలు వెళ్ళవేమో?" అన్నది.
    మురహరి ఏమీ చెప్పలేకపోయాడు.
    కొంతమంది మనస్తత్వాలు చిత్ర విచిత్ర రీతుల్లో ఉంటయ్యి. వారి హృదయంలో జాలి, సానుభూతి, దయ దాక్షిణ్యాలూ ఉన్నా, ఎదుటివారి కష్టసుఖాలను ఆదుకోవాలని అనుకున్నా తాము చేసేపని నలుగురూ హర్షించదగింది కాదేమోనని మనస్సులో ఆందోళన పడతారు.

    ఆ రాత్రి జయలక్ష్మి భోజనానికి వెళ్ళలేదు. రెండు పళ్ళు తిని కాఫీ తాగింది. రోగికి కావలసిన కాఫీ, పాలు హోటలు నుంచి తెచ్చింది. పళ్ళు తెచ్చింది. టైముకు మందు ఇచ్చింది. రాత్రి గడవాలి. జ్వర తీవ్రతవల్ల మురహరి నిద్ర పోయాడు. జయలక్ష్మికి నిద్ర పట్టలేదు. ఏమిటో ఆలోచన. తనకు మురహరి చుట్టమా? ఆప్తుడా ఆప్తబంధువా? అతనికి సాయపట్టానికి ఎంతో మంది కాలేజీ విద్యార్ధులుండగా తనే ఎందుకు పూనుకోవాలి? కాలేజీ విద్యార్ధుల్లో ఎంత మందికి జ్వరాలు రావటంలేదు? అందరిళ్ళకూ వెళ్ళి తను సాయం చెప్తున్నదా? వంటరిగా ఉన్న యీ గదిలో మురహరికి సాయంగా తనెందుకుండాలి? ఈ సంఘటన, సందర్భమూ, నలుగురూ వింటే ఏమనుకుంటారు? ఎన్ని విషయాలు కల్పిస్తారు? అస్సలు మురహరి మీద తనకెందుకింత అభిమానం? ఎందుకింత ఇష్టత? అతన్ని చూడకుండా ఒక్కరోజయినా ఉండలేదే? తను అతన్ని ప్రేమిస్తున్నదా? ప్రేమించేటట్లయితే ఆ రోజున మురహరి పెళ్ళి చేసుకుంటానని చెప్పినప్పుడు తనెందుకు అంగీకారం చూపకపోవాలి? నేను వితంతువుని అని ఎందుకు చెప్పాలి? పెళ్ళి ఇష్టపడనప్పుడు అతనితో ఇంత సన్నిహితంగా ఉంటం ఎందుకు? ఇది ప్రేమించటం కాదా? అసలు ప్రేమంటే ఏమిటి? ఒక వ్యక్తి యందు మనకుగల సదభిప్రాయాలతో కూడిన ఇష్టతని ప్రేమ అనకూడదా? సుఖలాల సత కోసం, పెళ్ళిచేసుకుని దాంపత్య జీవితం అనుభవించటంకోసం, శారీరకంగా ఒక వ్యక్తితో ఏర్పర్చుకోవలసిన సన్నిహిత సంబంధాన్ని దృఢతరం చేసుకోవటానికి ఏర్పర్చుకునే రాచబాటని ప్రేమ అంటారా ఈ దృష్టితో నేనతన్ని చూట్టంలేదే? అతనిలో ఉన్న కలుపుకోలుతనాన్ని, మంచితనాన్ని, సహృదయతనూ నేను అర్ధం చేసుకుని అతనిమీద ఒక సద్భావాన్ని ఏర్పరుచుకున్నాను. ఆ సద్భావం లోనుంచే అతను కష్టపడుతున్నాడనే జాలి, బాధ పడుతున్నాడనే బాధ, నా అన్నవాళ్లు దగ్గిర లేక పోవటంచేత అతనికి సాయంచెయ్యాలనుకునే ఉద్ధేశమూ కలిగినయ్యి. ఈ రకమైన సద్భావాలతో కలయికతో ఏర్పడిన మెత్తని మనస్సును ఇతరులు ప్రేమ అనుకుంటే దానికి నేను బాధ్యురాలనా? నలుగురూ అపోహపడగలిగే రకమైన ప్రేమతత్వం నాలోలేనపుడు ఇతరులు అనుకున్నారని నేనెందుకు బాధపడాలి? ఆస్పత్రిలో నర్సు రోగులకు సేవ చేస్తున్నది. వారందరినీ ఆమె ప్రేమిస్తున్నట్లేనా?

                              *    *    *

 Previous Page Next Page