ఈ ఒక్క రోజులోనూ సగం తీసిపోయాడు. ముఖం పీక్కుపోయింది. కళ్ళు ఎర్రగా జ్యోతుల్లాగా తయారయ్యాయి. ఏమీ ధారకం లేక ప్రాణం నీరశించి పోయింది.
నాన్నలేడు, అమ్మలేదు, బంధువులు ఎవ్వరూ దగ్గరలేరు. ఈ స్థితిలో ఈ గదిలో నేను చచ్చిపోతే నా కోసం ఎవరేడుస్తారు. నా శవాన్ని ఎవరు ఖననం చేస్తారు. ఉత్తర క్రియలు ఎవరు జరుపుతారు. నా కోసం ఒక్క కన్నీటి బొట్టు రాల్చేవాళ్ళు ఎవరున్నారు? కుళ్ళి నశించిపోతే ఆ వాసన భరించలేక చుట్టు పక్కలవాళ్ళు లాగి పారేస్తారా? ఈ జీవితానికి ఇదే న్యాయమా? నా జీవితానికి నిష్కృతి ఇదేనా? ఇంత దురదృష్ట భరితుడివా? ఇటువంటి దిక్కులేని చావు లభిస్తుందా నాకు? నేను ఎవర్ని మోసం చేశాను? ఎవరి మనస్సు క్షోభపెట్టాను? ఎవరికి అన్యాయం చేశాను? ఈ దుర్గతి నాకు ఎందుకు పట్టింది? నే నెవ్వరికీ అక్కరలేదా? నాకు ఎవ్వరూ అక్కర్లేదా? ఈ విధంగా నా చరమశ్లోకం నేనే పాడుకోవాలా? నాకు అంతిమ ఘడియలు సమీపించినయ్యా? ఏమిటీ ఆవేదన?
గుండె ఆరిపోయి డెక్కె పట్టినట్లయింది. నాలుక తడారిపోయింది. కళ్ళంటి వెచ్చటి కన్నీరు తిరిగి చెంపల వెంట కారి రెండూ తడిసినయ్యి.
దుఃఖం, ఆవేదన, నిరాశ పొంగి పొర్లు కొచ్చి నయ్యి.
తనలో తనే వెక్కి వెక్కి ఒకటే ఏడుపు. ఎవరు ఆదరిస్తారు? మనస్సులో ఏర్పడిన భీతాహాన్ని ఎవరు పోగొడతారు?
గడియారం తొమ్మిది కొట్టింది. గంటలు వినబట్టేమేగాని పొద్దు కూడా తెలీటంలేదు.
రెండు చేతుల్తోనూ బరువెక్కిన కళ్ళు తుడ్చుకుని తలుపు నెత్తిన చప్పుడైతే అటు చూశాను. ప్లాస్కు చేత్తో పుచ్చుకుని జయలక్ష్మి వచ్చింది.
ప్రశాంతమైన ఆమె ముఖంలో ఆ పరమేశ్వరిని చూసినట్లయింది అతనికి. ఏమిటో తెలియని తృప్తి పోగొట్టుకున్న ధైర్యమూ వచ్చినట్లయింది.
"కాలేజీకి వెళ్ళకుండా నువ్వొచ్చావా జయా" అన్నాడు.
ప్లాస్కు పక్కనున్న బల్లమీద పెట్టి, మంచం మీద కూర్చుని నుదుటి మీద చెయ్యివేసి చూసింది జయలక్ష్మి. జ్వర తీవ్రత అట్లాగే ఉంది. పొంగి పొర్లు కొచ్చిన దుఃఖాతిశయాన్ని వెనక్కునెట్టి, అనుకోని ఆనందంలో మనస్సు ఉప్పొంగి కళ్ళల్లో నీరు తిరగ్గా.
"నన్ను చూడటానికి వచ్చావా జయా" అంటూ తన తలను ఆమె ఒళ్ళోకి చేర్చి ఆమె నడుమును తన రెండు చేతులతోనూ చుట్టేసి బావురుమని చిన్న పిల్లవాడు తల్లిని కావిలించుకుని ఏడ్చి నట్లుగా ఏడ్చాడు మురహరి. ఆ ఏడుపుకు మితిలేదు. తనలోని సమస్త భయాలన్నీ, ఆరాటాలనీ, అనుమానాలనీ తన కన్నీటితో క్షాళితం చేసి తననుంచీ దూరం చేసుకున్నట్లుగా ఉన్నదతని మనస్సు.
అప్పటికిగాని అతని హృదయ వేదన తగ్గ లేదు. ఆ స్థితిలో కొచ్చి తన్ను తాను తెలుసుకున్నాక జయలక్ష్మిని అంత సన్నిహితంగా తను కావిలించుకోటం ఏమిటా, ఈ సంఘటనకు ఆమె ఏ అపార్ధం చేసుకున్నదోనని ఆదుర్దాతో భయపడిపోయాడు.
ఆ స్థితిలో ఆమె ముఖంలోకి చూస్తే అతనికి భయం మరీ ఎక్కువయింది. జయలక్ష్మి కళ్ళు కూడా కన్నీటితో ఎర్రబారినయ్యి. స్థబ్దురాలై లేచి వెళ్ళి పక్కనున్న కుర్చీలో కళ్ళు మూసుకుని కూర్చుంది.
అనాలోచితమైన ఈ సంఘటనతో ఆమె మనస్సు దెబ్బ తిన్నట్లయింది. ఏదో తప్పు చేసి నట్లు ఆవేదన. ఏ ప్రలోభమూ ఎవ్వరితోనూ లేకపోయినా, ఇంత నిర్లిజతగా సంచరించినందుకు స్త్రీత్వంలోని ఆమె పవిత్ర భావాలను కించపరిచి నట్లుగా మధనపడ్డది. ఈ జరిగిన సంఘటనలో జ్ఞాన పరిరక్షకుగాని, విచక్షణా జ్ఞానానికిగాని, మంచి చెడ్డలతో కూడిన సుఖ దుఃఖాల అంచనాలకుగాని తావు లేకుండా పోయింది.
మరో పది నిమిషాలకుగాని జయలక్ష్మి కళ్ళు తెరువలేదు. ముభావకమైన దృక్కులతో కళ్ళార్పకుండా అతని వైపు చూస్తూ,
"మందు తెచ్చినట్లులేదు. ఆస్పత్రికి వెళ్ళి రానా" అన్నది జయలక్ష్మి.
"నీ క్షమాపణ నాకు మందు. మానసిక బాధకూ ఆవేదనకూ, జ్వర తీవ్రతకూ తట్టుకోలేక అట్లా చేశాను జయా. నన్ను క్షమించు" అన్నాడు.
"పైకి అసందర్భంగా కనిపించినా, స్వార్ధ రహితమైన దురుద్దేశ్యంలేని ఏ సంఘటనా మనకు ఏ పాపాన్నీ అంట గట్టలేదు. నీ స్థితిలో ఉన్న ఎవ్వరయినా అంతే. కాని ఆ అనాలోచిత సంఘటన కూడా ఆ వ్యక్తి యందు మనకు గల బాధ్యత, గౌరవాన్ని బట్టే ఉంటుంది. క్షమించరాని నేరమేమీ లేదు. ఆ మాటల సందర్భంలో మర్చిపోయాను ప్లాస్కుతో కాఫీ తెచ్చాను తాగు" అని ప్లాస్కులో కాఫీ గ్లాసులోపోసి ఇచ్చింది. ఆప్యాయంగా తాగాడు మురహరి.
"నేనూ వస్తాను, ఆస్పత్రికి వస్తావా. లేకపోతే జ్వర తీవ్రత చెప్పి నన్నే మందు పట్రమ్మంటావా" అన్నది.
"నువ్వే వెళ్ళి మందు తెచ్చిచ్చి కాలేజీకి వెళ్ళు జయా. నాకోసం నువ్వూ కాలేజీ మానుకోటం ఎందుకూ? "పరీక్షలు కూడా దగ్గర పడుతున్నయ్యి" అన్నాడు.
"ఇవాళ ఒక్క రోజున శలవు పెట్టినంత మాత్రాన ముణిగిపోయిందేమీలేదు. కాకపోయినా నిన్నట్నుంచి మంచానికి అంటుకుపోయిన నిన్ను ఎవరు చూసేటట్లు? ఇవాళ కాలేజీకి వెళ్ళను" అన్నది జయలక్ష్మి.
మురహరి మనస్సు ఒక అనిర్వచనీయమైన అనుభూతితో నిండిపోయింది. సృష్ట్యాదిలో ప్రతి జీవికీ ఒక విశిష్టత ఉన్నప్పుడు మానవ జీవితానికీ ఉన్న విశిష్టత ఉన్నత మైనది. ఆదర్శాలకు కట్టుబడి, అనుభవాలను చవి చూచి, సుఖ దుఃఖాలను జీర్ణింపచేసుకుని వయస్సుకు మించిన సంఘటనలకు తలొగ్గి నిలబడగలిగిన వారి జీవితాలు కొనియాడ తగినవి. పైకి సామాన్యంగా గోచరించినా, అసాధారణమైన ప్రజ్ఞా విశేషమూ, దయార్ద్ర హృదయతా వారి హృదయాం తరాళంలో దాగి ఉంటుంది. అలాంటివారు ఎదుటివారు బాధపడుతుంటే ఆ బాధలో తమకూ భాగం ఉందని మనస్సాక్షిగా అనుకొని ఆచరణలో పెట్టటమనేది ఒక్క జయలక్ష్మి లాంటి వాళ్ళకే తగిపోతుంది.
జయలక్ష్మి తనే అలమారులో ఉన్న మందు సీసా తీసి దాన్ని శుభ్రంగా కడిగి డాక్టరువద్దకు వెళ్ళింది. రోగి లక్షణాలన్ని చెప్పి మందుతీసుకున్నది. డాక్టరు సలహాప్రకారం పళ్ళు కొన్నది. అన్నీ తీసుకుని పదకొండు గంటలకు ఎండలో మురహరి గదికి వచ్చింది. డాక్టరు చెప్పినవన్నీ చెప్పి కొన్నమందుతో డాక్టరు మందు ఇచ్చి మురహరి అవి తాగింతరువాత తృప్తిగా తనూ కుర్చీలో కూర్చుంది.
"జయా! నీ ఋణం నేనెన్నడు తీర్చుకోలేను. ఇవ్వాళ కనుక నువ్వు రాకపోయివుంటే రేపటికి నన్ను ఏ స్థితిలో చూసేదానివో. దేవుడులా వచ్చి నన్ను కాపాడావు. నీ ఋణం నేను ఎట్లా తీర్చుకోగలుగుతాను నాకు అర్ధం కావటంలేదు" అంటూ రెండు చేతులూ జోడించి పడుకునే జయలక్ష్మికి దణ్ణం పెట్టాడు. పరాయి స్త్రీకి ఇంత శ్రమ కలిగించాను కదా అని మనస్సులో కుమిలిపోయాడు.
"నువ్వుకాకపోయినా ఇంకొక పరాయి వ్యక్తయినా ఈ స్థితిలో ఎవర్ని నేను చూడ్డం తటస్థించినా ఈ రీతిగా నా బాధ్యత నేను నిర్వహించుకునేదానినే మురహరీ! ఇందులో పెద్దగా చెప్పుకోదగిన విషయమేమీ లేదు. కేవలంగా పరాయివారయితే సానుభూతి కనబర్చటానికి సాయంచేస్తాను. ఆప్తులయితే ఆదుర్దాకొద్దీ ఆ వ్యక్తిని రక్షించుకోవాలనే ఆదుర్దాతో, ప్రేమతో వాత్సల్యంతో వారికీ సేవ చేస్తాం. మనం ప్రేమతో పెంచే కుక్కపిల్లకు సైతం జబ్బు చేస్తే ఆదుర్దాగా చికిత్సచేయిస్తామే, అటువంటి ఆత్మానుభూతిని ప్రసాదించిన నీకుకాక మరెవ్వరికీ సేవచేస్తాను మురహరి. నీకైనా ఎక్కువైనవారు నాకు ఎవ్వరున్నారో నీకు తెలీదూ" అన్నది జయలక్ష్మి.
ఆమె కదలకుండా ఈ మాటలని, అట్లాగే కూర్చుంది. విషాదభావాలు ఆమెముఖంలో ద్యోతకమై వున్నయ్యి. కొన్నాళ్ళు కనబడనీయక పోయినా ఆమె మాటల్లోని తొట్రుబాటును మురహరి అర్ధం చేసుకోలేక పోలేదు.
మెల్లిగా మంచంమీదనే లేచి కూర్చున్నాడు మురహరి.
"జయా"
ఇటుతిరిగి అతనివైపు చూసింది. విషాద భావాలతో మునిగి కళ్ళొత్తుకుంది జయలక్ష్మి.
"మన బాగోగులు ఆలోచించి మనకర్తవ్యాన్ని మనకు బోధించి మనల్ని నలుగురిలోనూ పడెయ్యటానికి మన ఇద్దరికే తల్లిదండ్రులు లేరు. సంఘమనే ఈ మహాసముద్రంమీది అలల్లో మనం చుక్కానిలేని రెండు పడవలను వేసుకొని వయనిస్తున్నాం. ఏ పడవ ఏ తీరానికి చేరుతుందో, రెండు పడవలూ ఒకే తీరానికి చేరుతయ్యో మనకు తెలియదు. ఈ స్థితిలో ఉన్నమనం ఒకరినొకరం కూడాబలుక్కుని గమ్యస్థానం చేరాలి. మనం గమ్యస్థానమే చేరుతామో, నట్టనడి సముద్రంలో మునిగిపోతామో! మన మనోధైర్యం మీద ఆధారపడి ఉంటుంది. అవునుకదూ" అన్నాడు.
"మురహరీ, నువ్వన్నది నిజమే. చాలాబాధాకరమైన విషయాన్నే మనం మాట్లాడుతున్నాం. ఈ బాధలు ఎవరివి? ఈ మనోవేదన ఎవరిది? ఇందులో ఎవరయినా భాగం పంచుకుంటారా? ఎవ్వరూ పంచుకోరు. అదే ఎల్లకాలం మన హృదయాల్లో గూడుకట్టుకుని ఉండవలసిందే. నిశ్చల ప్రేమ, సుఖదుఃఖాలు ఇవన్నీ నా జీవితంలో ఒక పక్కనుంచి ఇంకో మలుపుకు చెప్పుకోలేనివి. సంఘంతో ఉంటూ సంఘాచారాలు పాటించమని అంతా చెపుతారు. ఉద్రేకహృదయులయితే సంఘాన్ని ఎదిరించమని చెపుతారు. ఎదిరించటమనేది తేలికరకమైన బరువునెత్తటం వంటిదికాదు. మనస్సుకు చైతన్యం రావాలి. అప్పుడే హృదయం పరిపక్వత చెందాలి. అప్పుడే నిజమైన జీవితాన్ని గడపగలిగినవాళ్ళవుతారు. లేకపోతే ఏ కాలుజారినా అంతా మనవైపే చూసి నవ్వుతారు. నా జీవితం ఒక సనాతన, శాశ్వత, ప్రాచీన సమస్యగా ఉంది. ఆ మార్గంలోనేపోతూ, జీవితంకోసమే జీవించి ఉండాలా లేక భవిష్యత్తులో పొడగట్టే ఏదో ఆశారేఖని చూపెట్టుకుని అ వాంఛనీయ మైన తెగింపుకు రావాలా అనేదే సమస్య. ఆధ్యాత్మిక చింతనతో హృదయాన్ని కుదించి కుమిలిపోతూ జీవించాలా! పారలౌకిక ప్రలోభాలతో జీవితాన్ని అనుభవింపచేసుకుని ఆధ్యాత్మికచింతన కోసం మరో రూపకల్పన చేసుకోవాలా అనేదే నా ఆలోచన." అన్నది జయలక్ష్మి.