ఆ దృశ్యాలు కొత్తకాదు. కానీ తనకు తెలిసిన మాయ అందులో పాల్గొనటం....
అప్పుడు పడింది అతని భుజంమీద చేయి. అదిరిపడి వెనక్కు తిరిగి చూశాడు.
మాయ చిరునవ్వుతో నవ్వుతోంది. "మీరిక్కడికొస్తారని నాకు తెలుసు......"
నవ్వుతూనే వెళ్ళి వి.సి.ఆర్ ఆఫ్ చేసింది.
సురేష్ ఆమెవంకే చూస్తున్నాడు. మాక్సీ ఉన్నా నగ్నంగా ఉన్నట్లే కనబడుతోంది.
"ఏమిటలా చూస్తున్నారు? ఈ బ్లూరంగు మాక్సీనా?" సురేష్ హఠాత్తుగా కోరికలు ఊగించి వేసినయ్. గంటకు వెయ్యి కిలో మీటర్లవేగంతో వీస్తోన్న సైక్లోన్ ఆమె శరీరం, పెదాలూ, తనకు హత్తుకుని విరిగి, కరిగిపోతున్న ఫీలింగ్.....ఆమెను ఎప్పుడూ చేరుకున్నాడో తెలీదు, తివాచీ మీద ఆ ఉధృతం వెల్లువలో మెలికలు తిరిగిపోతూన్నవేళ......సన్నగా నెమ్మదిగా, వినిపించింది ఏడుపు, ఆమె గొంతునుంచి.....
అప్పుడు వయసు సెగల్లోనుంచి కళ్ళు తెరచిచూశాడు.
ఆమె కళ్ళవెంబడి నీరు కారి ఉప్పగా తగులుతోంది తన పెదాలకు....
పెదాలు విడివడినయ్.
"మాయా! ఏడుస్తున్నావా?" కలవరపాటుతో అడిగాడు.
"అంతకంటే ఇంకేం చేయాలో తెలీటంలేదు" దుఃఖం ఆపుకోవటానికి ప్రయత్నిస్తూ అంది.
అతని చేతులు అప్రయత్నంగా ఆమె నడుముని వదిలేసినయ్.
అతని వళ్ళో నుంచి లేచి చప్పున కన్నీరు తుడుచుకుంది.
"నా ఈ చీకటి జీవితం మీకూ, తులసి కీ తెలీకూడదని ఇంతకాలం మిమ్మల్ని ఇక్కడకు ఇన్ వైట్ చేయలేదు. కానీ తులసి ఉత్తరం చదివాక నాకు దక్కని అందమైన జీవితం ఆమెకైనా దక్కాలనీ, అందుకు నాచేతనైనంత సాయం చేయాలనీఅనుకున్నాను. అందుకే రిస్క్ తీసుకుని మీ ఇద్దరినీ ఆహ్వానించాను. అనుకోకుండా మహీధర్ రావడంతో నాకు తెలిసిపోయింది......మీ దగ్గర నా రహస్యందాచటం అసాధ్యమని!"
సురేష్ లేచి పచార్లు ప్రారంభించాడు.
"కానీ మీకిష్టంలేని జీవితాన్ని ఎందుకెంచుకున్నారు?"
"ఫేట్! అంటే! తులసీ నేనూ ఒకేసారి బ్రతుకుతెరువు వెతుక్కుంటూ ప్రపంచంలోకి అడుగుపెట్టాం! తులసికి మీరు దొరకటం వల్ల అదృష్టవంతురాలయింది. నాకు మహీధర్ దొరకటంవల్ల దురదృష్టవంతురాలినయ్యాను. మిమ్మల్ని తులసి పక్కన చూడగానే కనిపించింది......డబ్బు ముఖ్యం అనుకుని నేనువేసిన అడుగులు తప్పటడుగులు అని!"
"ఇలా ఈ భయంకరమైన జీవితం ఇంకెంత కాలంగడపదల్చుకున్నారు?"
"తెలీదు ఇప్పుడింక నా చేతిలో ఏమీలేదు. జీవితం ఎటు లాక్కెళ్తే అటు వెళ్ళిపోవటమే!"
ఇద్దరూ చాలాసేపు నిశ్శబ్దంగా వుండిపోయారు. అతనికి సమీపంగా వచ్చిందామె.
"సురేష్! నాగురించి ఆలోచించి మీ మనసు పాడుచేసుకోకండి. నాక్కావలసింది తులసి చక్కని జీవితం గడపటం. తులసిని మీరెంత ప్రేమగా చూసుకోగలరో నాకు తెలుసు! అందుకే ఐ టూ లవ్ యూ! జీవితాన్ని ఇంత ఈజీగా తీసుకోగలిగేవాళ్ళెంతమంది ఉంటారు? ఉద్యోగం లేకపోయినా, బీదతనం వెంటపడుతున్నా ఇంత జోవియల్ గా ఉండటం నిజంగా ఒక వరం! నేనింకవెళ్తాను!"
బయటకు నడవబోయి, వెనక్కు తిరిగి అతనికి అతి సమీపంగా వచ్చి శరీరాలు తగలకుండా అతని పెదాలమీద చుంబించిందామె.
ఆమె వెళ్ళిపోయిన కొద్ది క్షణాలవరకూ అలానే నుంచుండిపోయాడతను.
ఆ సాయంత్రం స్టేషన్ కొచ్చారిద్దరూ.
"ఉద్యోగంకోసం మళ్ళీ క్రేజీపనులు చేయకు" చెప్పింది తులసి కిటికీ బయట నిలబడి.
"మిగతా వాటికోసం పర్మిషన్ ఇస్తున్నావ్ కదా...."
"షటప్! నేను చెప్పేది సరిగ్గా అర్ధం చేసుకో......"
"ఒకరినొకరు ఆర్ధం చేసుకోవాలంటే మనం అవలంబించే పద్దతి వేరే ఉందిగా......"
అతని మాటలు లెక్క చేయలేదామె.
"గంగాభవానితో గొడవ పెట్టుకోవద్దు"
"నువ్వొచ్చేసరికి పాలూ నీళ్ళలా కలసిపోయి ఉంటాం......"
అతని చెవి పట్టుకుందామె నవ్వాపుకుంటూ.
"అదేవద్దంటున్నాను. హోటల్లో జాబ్ జాగ్రత్త! నీ డైలాగ్స్ లైక్ చేస్తున్నారు కాదని అతి చనువుగా ఉండొద్దు."
"ఉన్నా నీకు చెప్పే ఉంటాను"
"హోటల్ కొచ్చే రిచ్ లేడీస్ తో జాగ్రత్త! నీ డైలాగ్స్ కొంచెం మధ్యవయస్సు వాళ్ళకు నచ్చకపోవచ్చు .....జనరేషన్ గాప్ ఉంటుంది.
"అయ్ లైక్ జనరేషన్ గాప్స్!"
ఆమె కోపంతో పెదాలు బిగపట్టింది.
ట్రైన్ కదిలింది.
ఎందుకో తులసి దూరమవుతోంటే మనసు విలవిలలాడుతోంది కలసి జీవితం ప్రారంభించాక ఇదే మొదటిసారి విడిపోవటం.
ఆమెతో పాటు మాయ కూడా చేయి ఊపుతోంది.
ఇద్దరూ ఒకరిగా పెరిగి, ఒకటిగా జీవితం ప్రారంభించారు.
కానీ ఇద్దరిజీవితాల్లోనూ ఎంతతేడా?
స్త్రీకి లభించే పురుషుడి మీద ఆమె అదృష్టం ఆధారపడి ఉంటుందని ఎంత అద్భుతంగా చెప్పింది మాయ.
"ఏ స్త్రీనిచూసినా ఈ నగ్న సత్యమే కనబడుతుంది. మరీ నగ్నంగా!
ఎంత దారుణమైన విషయం ఇది!
గంగాభవాని ముగ్గువేస్తూండగా ఆటోదిగాడు సురేష్.
చప్పున జారిపోయిన పైటను లాగి కప్పేసుకుంది. ఎంత ప్రౌఢ అయినా నిద్రమత్తుకళ్ళల్లో, రేగిన జుట్టులో వెనక్కు పరుగెత్తటానికి ప్రయత్నిస్తోన్న వయసు కనబడుతోంది.
"హలో గుడ్ మాణింగ్!"
"గుడ్ మాణింగ్!" అయిష్టంగానే అంది.
"మీ ముగ్గులోకి నడవ్వొచ్చా?" అడిగాడు నవ్వుతూ.
ఆమె ముఖం ఎర్రబడింది.
"మీరు ఇల్లుఖాళీ చేయాలని చెప్పిన విషయం గుర్తుందా?"
"ఓ! ఎలా మర్చిపోతాను. మీరేం చెప్పినా జీవితాంతం గుర్తుంచుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. ఏదీ మీ చెయ్యి ఇవ్వండి! ప్రామిస్ చేసేస్తాను" ఓ అడుగు ముందుకి వేస్తూ అన్నాడు.
ఆమె చటుక్కున వెనక్కు జరిగింది.
"ఏం అక్కర్లేదు, వెళ్ళండి!"
"ఓ.కే. కాఫీ రడీ చేయండి! స్నానంచేసి వచ్చేస్తాను."
"అదేం కుదరదు. కాఫీ నాకేం సంబంధం?"
"అదేమిటి? ఇంటికి అద్దె ఇస్తున్నాను కదా!"
"అద్దె కేవలం ఇంట్లో ఉన్నందుకు ఇస్తున్నారు.....కాఫీకి కాదు."
"అన్యాయం! అద్దెకిచ్చేటప్పుడు అన్నీ కలిపి అన్నారు!"
"అన్నీ అంటే నా ఉద్దేశం.....నీళ్ళూ, కరెంటూ కలిపి...."
"నేను అందులో మిమ్మల్ని కూడా కలిపేసుకుని అనుకున్నాడు. ఐ మీన్ ఇలాంటి సమయాల్లో కాఫీ ఇవ్వటంలాంటివి!"
"మీ జాణతనం నాకు తెలుసు. మాటలు తిన్నగా రానీండి! ఆడదాన్ని గౌరవించటం చేతకాని వాళ్ళను మిమ్మల్నేచూశాను."