బాగా డిమాండ్ వున్న ఒక స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరకు ఒక పేషెంట్ వచ్చాడు.
"మీ టోకెన్ నెంబర్ త్రీ నైంటీ టూ" అందా రిసెప్షనిస్ట్.
"ఆ! త్రీ నైన్టీ టూనా? టోకెన్ వద్దులే తల్లీ- వస్తా-" అంటూ వెనక్కు తిరిగాడతను. "అలా వెళ్ళిపోతారేంటి సార్! డాక్టర్ ని చూడకపోతే మీ ప్రాబ్లెమ్ ఎలా సాల్వ్ అవుతుంది" అడిగిందా అమ్మాయ్ ఆత్రుతగా.
"ఇక్కడ నా నెంబర్ కోసం వెయిట్ చేస్తూ చచ్చిపోవడం కంటే ఇంటి దగ్గర నేచురల్ గా పోతే బావుంటుంది కదా-" అంటూ వెళ్ళిపోయాడతను.
ఓ పెద్దమనిషి తనుంటున్న పాత ఇల్లు అమ్మేసి ఒక కొత్త ఇల్లు కొనుక్కోవాలని అనుకున్నాడు. వెంటనే ఒక రియల్ ఎస్టేట్ డీలర్ ని పిలిచి ఆ విషయం చెప్పాడు. రెండోరోజునే ఆ డీలర్ ఆ ఇల్లు అమ్మకానికి ఉన్నట్లు పేపర్లో ఆకర్షణీయమైన ప్రకటన ఇచ్చాడు.
ఆ ప్రకటన చదివి ఇంటి ఓనర్ వెంటనే డీలర్ కి ఫోన్ చేశాడు.
"నా యిల్లు అమ్మకానికి ఉన్నట్లు నువ్ పేపర్లో ఇచ్చిన ప్రకటన చూశానోయ్. అది చదివాక ఆ ఇల్లు అమ్మాలన్న నిర్ణయాన్ని మార్చుకున్నాను. నేను లైఫ్ లాంగ్ ఆ ఇంట్లోనే ఉండి పోవాలనుకుంటున్నా"
"అదేంటి సార్! ఇంత సడెన్ గా ఎందుకలా నిర్ణయం మార్చుకున్నారు?"
"నా యిల్లు ఎంత అందమైనదో- అందులో ఉన్న సౌకర్యాలు ఇప్పుడు కడుతున్న కొత్త ఇళ్ళల్లో కూడా ఉండవనీ, ఎంతో అదృష్టవంతులైతేనే ఆ ఇంట్లో ఉండే యోగం సమకూరుతుందనీ- ఆ ఇల్లు కొనుక్కొనే అరుదయిన అవకాశం ఇంకెప్పటికీ రాదనీ- నువ్ ప్రకటనలో రాశావ్ కదా! అదంతా చదివాక నిజంగానే నా యిల్లు చాలా గ్రేట్ అనిపించింది. అందుకే దానిని అమ్మగూడదని డిసైడ్ చేసుకున్నా-"
ఒక టీ స్టాల్లో చిరిగిపోయిన బట్టలతో ఓ వ్యక్తి వచ్చి కూర్చుని టీ ఆర్డర్ చేశాడు. అప్పటికే ఆ టేబుల్ దగ్గరున్న మరో ముష్టివాడు అతనిని పలుకరించాడు.
ఇద్దరూ మాట్లాడుకున్నారు.
"కానీ- నువ్ బిజినెస్ మేన్ నంటున్నావు కదా! ఇంత దారుణమయిన స్థితికి ఎలా వచ్చావ్?" అడిగాడొకడు రెండోవాడిని-
"నిజం చెప్పాలంటే నేనింత దౌర్భాగ్యస్థితికి రావటానికి కారణం ఏంటో తెలుసా? సలహాలు! ఎవరు ఎంతమంచి సలహా ఇచ్చినా ఛస్తే లెక్క చేసేవాడిని కాదు-" అన్నాడతను.
మొదటి అతను చిరునవ్వు నవ్వాడు.
"నాదీ అచ్చం అలాంటి పరిస్థితే! కాపోతే నీకూ నాకూ తేడా ఎక్కడ వచ్చిందంటే ఎవడే సలహా ఇచ్చినా నేను హాపీగా అందుకుని, ఆ సలహాలన్నీ అమలు చేసేవాడిని-"
ఓ అమ్మాయీ అబ్బాయీ ఓ రెస్టారెంట్ లో కాసేపు వాడిగా, వేడిగా డిస్కస్ చేసుకున్నాక ఆ అమ్మాయి అమాంతం లేచి అతని చెంప పగులగొట్టి వెళ్ళిపోయింది.
షాకయి నిలబడ్డ ఆ అబ్బాయి దగ్గరకు పక్క టేబుల్ వ్యక్తి వచ్చాడు.
"గాళ్స్ తో చాలా ప్రాబ్లెమ్ బ్రదర్! వాళ్ళను కరెక్ట్ గా హాండిల్ చేయడానికి నాదగ్గరో మంచి ఉపాయం ఉంది-" అన్నాడతను.
ఆ అబ్బాయి ఆశపడ్డాడు.
"ఏమిటది?"
అతనేం చెప్తాడా అని రెస్టారెంట్ లో ఉన్న వారంతా అతని చుట్టూ మూగారు.
ఆ వ్యక్తి చటుక్కున కిందకు వంగి ఓ పెద్ద బాగ్ లో నుంచి ఓ హెల్మెట్ బయటకు తీశాడు.
"ఇదిగో- ఇది! ఈ హెల్మెట్ పెట్టుకుంటే ఏ అమ్మాయీ కూడా మిమ్మల్ని చెంపదెబ్బ కొట్టలేదు. ఒకటి కొంటే ఎనిమిదొందలు- రెండు కొంటే పన్నెండొందలే-గొప్ప అద్భుతమైన అవకాశం సార్- ఎవరికి సార్. లవ్ గాడ్గెట్-"
రాజేష్ ఓ ఉంగరం తీసుకుని ఒక జువెలరీ షాపుకొచ్చాడు హడావుడిగా.
"చూడవోయ్- ఈ ఉంగరం మీద- 'నా డార్లింగ్ మల్లిక' అని రాసి ఉంది. అది చెరపేసి, 'నా డార్లింగ్ అంజలి' అని రాయించాలి. ప్లీజ్! చాలా అర్జెంట్! అరగంటలో ఇవ్వగలరా?"
షాపతను అతని అవస్థచూసి జాలిపడ్డాడు.
"ఇలా ఎన్నిసార్లని పేర్లు మార్పిస్తారు సార్- మీకో మంచి అయిడియా ఇవ్వనా?"
"చెప్పండి- ఏమిటది?"
"మరేం లేద్సార్-ఉంగరం మీద 'ప్రేమతో - నీ రాజేష్' అని రాయించారనుకోండి! అప్పుడది ఎవరికిచ్చినా గొడవుండదు-"
రాజేష్ హాపీగా ఫీలయ్యాడు.
"అయిడియా - చాలా బావుందోయ్! అయితే అలా రాయించిన ఉంగరాలు ఓ అరడజను రడీ చేయండి!"
భర్తగారు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చేసరికి భార్య హాపీగా రెండువేపులా రెండు టేబుల్ ఫాన్ లు ఆన్ చేసుకుని ఆ బ్రీజ్ ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
"అదేమిటి డియర్- రెండు ఫాన్లెందుకు వేసుకున్నావ్? బోలెడు కరెంట్ బిల్లవుతుంది కదా!" అడిగాడతను.
భార్య అతని తెలివితక్కువ తనానికి నవ్వింది.
"నాకు తెలుసు మీరిలా తెలివితక్కువగా ఆలోచిస్తారని! ఇదిగో- ఈ రెండు ఫాన్లలో ఒకటే మనది- రెండోది పక్కింటి వాళ్ళది- కరెంట్ బిల్ ఎక్కువచ్చినా వాళ్ళకే కదా నష్టం-"
తండ్రీ కొడుకులు రేస్ కోర్స్ కెళ్ళడానికి బస్సెక్కాడు. రేస్ కోర్స్ చేరుకునే వరకూ నాలుగు ఆర్టీసీ బస్ లూ, రెండు లారీలూ ఒకదాని నొకటి ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నిస్తూ, ఒకదాని కొకటి అడ్డం వస్తూ దూసుకుపోతూంటే ప్రయాణీకులంతా గుండెలు చేత్తో పట్టుకున్నారు.
చివరకు బస్ దిగాక కొడుకు తండ్రిని అడిగాడు.
"డాడీ! గుర్రాలు ఫాస్ట్ గా వెళ్తాయా లేక బస్ లు ఫాస్ట్ గా వెళ్తాయా?"
"ఒకప్పుడు గుర్రాలే ఫాస్ట్ గానీ ఇప్పుడు పవర్ ఫుల్ ఇంజేక్షన్స్ తో బస్ లు వచ్చాయ్ కదా!"
"అయితే మరి -మీరూ మీ ఫ్రెండ్సూ అందరూ- ఆర్టీసీ బస్సుల మీద, లారీల మీదా రేసులాడొచ్చుకదా-"
రాంరెడ్డి భీమ్ రెడ్డి పార్కులో కలుసుకున్నారు.
"ఏంటి రాంరెడ్డి! మీ అబ్బాయిని పోలీసులు అరెస్ట్ చేశారట కదా- ఎందుకు చేశారు?" అడిగాడు భీంరెడ్డి.
"ఈ పోలీసుల సంగతి నీకు తెలీందేముందన్నా! ప్రతివాడినీ ఏదొక కేస్ లో ఇరికించటం మామూలే కదా!"
"ఇంతకూ మీ వాడేం చేశాడని వాళ్ళంటున్నారు?"
"సంక్రాంతి పండుగనాడు షాపింగ్ చేశాడంట! అది తప్పని అరెస్ట్ చేశారు-"
"ఛ! ఎంత దారుణం! పండగకి షాపింగ్ చేయడం నేరమా?"
"నేనూ అదే ఆర్గ్యూ చేశాను గానీ వాళ్ళు వింటేనా? వాళ్ళ వితండవాదం ఏంటంటే మావాడు షాపింగ్ చేస్తున్న సమయంలో ఆ షాప్ షట్టర్స్ ఇంకా తెరవలేదంట! షట్టర్స్ తెరవటం కొంచెం వెనుకా ముందూ అయినంతమాత్రాన అలా షాపింగ్ చేస్తున్న వాడిని అరెస్ట్ చేసేయటమేనా భీంరెడ్డీ? ఎంత అన్యాయమో చూడు-" అని పక్కకు చూసేసరికి భీంరెడ్డి కనిపించలేదు.
ఇరవై నాలుగ్గంటలూ దెబ్బలాడుకునే- భార్యాభర్తలిద్దరూ న్యూ ఇయర్ డే రాత్రి 'హాపీ న్యూ ఇయర్' అంటూ గ్రీట్ చేసుకున్నాక ఒక అండర్ స్టాండింగ్ కొచ్చారు.
"ఇవాళ్టి నుంచీ మనిద్దరం దెబ్బలాడుకో కూడదు డియర్ - ఏమంటావ్?" అంది భార్య.