కానీ జంతువులు, పశు, పక్ష్యాదులు, క్రిమికీటకాలు అలా కాదు. ప్రేతత్వమో, పిశాచత్వమో పొందటం మనుష్యులకే కానీ ఇతర జీవులకు లేదు.
చచ్చిన వెంటనే అవి మరొక గర్భంలో ప్రవేశించి జన్మనెత్తుతాయి. స్కాందంలో మహేశ్వర ఖండంలో ఈ విషయం స్పష్టంగా చెప్పబడింది.
పుణ్యాత్ములైన వ్యక్తులు అనాయాసంగా మరణిస్తారు. అంతో ఇంతో పుణ్యం చేసినవాళ్ళు కూడా పదిరోజుల ప్రేతత్వనని తప్పించు కోవటం కష్టం. ఆ తరువాత పుణ్యఫలితంగా ఊర్ధ్యలోకాలకు వెళితే వెళ్ళవచ్చు. ఇక పాపాత్ముల సంగతి చెప్పనవసరం లేదు. గరుడ పురాణంలోని ప్రేతఖండంలో పాపులగు ప్రాణులకు వివిధ గతులు చెప్పబడ్డాయి.
మరణం దగ్గరపడ్డ మనుష్యునికి ఒక క్షణం ఒక యుగంలాగా బాధాభరితంగా వుంటుంది.
నూరు తేళ్ళు కుట్టిన బాధతో నురుగులు కక్కుతూ ముఖం చొంగతో తుడుస్తుంటే, పాపాత్ముల ప్రాణాలు ఆసన ద్వారం నుంచి పోతాయి.
జీవుడు హాహాకారం చేస్తూ దుఃఖంతో తన దేహాన్ని చూస్తూనే బయటికి లాగబడతాడు. ఆ తరువాత వచ్చేది యాతనీ దేహం. అంగుష్ట ప్రమాణం గల ఈ జీవుణ్ణి యమభటులు పట్టుకుని తమోమయమైన భయంకర మార్గాన యమపురికి తీసుకువెడతారు. అక్కడ యమభటులు పాపికి నరకయాతనలను పెట్టి యముని ముందు నిలబెడతారు.
యముని ఆజ్ఞచేత మళ్ళీ ఈ జీవి అంతరిక్ష మార్గంలో భూమిపై తన శరీరం దగ్గరకు చేర్చబడతాడు. యమపాశబద్దుడై, ఆకలిదప్పులతో పీడింపబడి ఏడుస్తూ వుంటాడు.
చనిపోయిన తర్వాత - జీవుడు శరీరంలోంచి బయటకి వచ్చాక కొన్నిసార్లు, యమదూతలకు పేచీలు వచ్చిన సంఘటనలు పురాణాలలో కనిపిస్తూ వుంటాయి. ఎంత పాపాత్ముడైనా ఏ దివ్యక్షేత్రంలోనో మరణిస్తే ఆ జీవి కోసం రెండు వర్గాలవారు వాదించుకోవటం, సహజంగా దేవదూతలు ఎక్కువ శక్తి కలవారు కనుక యమదూతలను ఒప్పించి ఆ జీవిని తీసుకెళ్ళటం జరుగుతుంది.
కొన్ని జీవులు కొంతకాలంపాటు స్వర్గానికి, నరకానికి వెళ్ళకుండా అంతరిక్షంలో ప్రేతాలై తిరుగుతూ వుంటాయి. ఆ విధంగా తిరిగే ప్రేతాలే మాంత్రికుల ఆవాహనకు దొరికేది. ఇతర లోకాలకు వెళ్ళిపోయిన జీవులు మాంత్రికులకు దొరకరు.
ఆకాశంలో తిరిగే ఈ ప్రేతాలకు తమ క్రింద వున్న భూలోక వాసులను చూడగల శక్తి మాత్రమే వుంటుంది తప్ప, పైన మరికొన్ని లోకాలున్నాయన్న సంగతీ, వాటిలో మరింత అధికశక్తి సంపన్నులైన దేవగణాలుంటాయన్న సంగతీ తెలియదు.
మనుషులకి ఏవిధంగా ఇతర జీవులను చూసే శక్తి లేదో ప్రేతములకు కూడా తమ పై లోకములలో వుండేవాళ్ళను చూచే శక్తి వుండదు. ఈ లోకము ఎంత చిత్రమైనదంటే కొందరు దేవుని నమ్ముతారు. దయ్యాలు, భూతాలు లేవంటారు. మరికొందరు వీటిని విశ్వసించి, సర్వశక్తివంతుడైన పరమేశ్వరుని ఉనికిని తెలుసుకోరు. నమ్మరు.
మృతిచెందిన తరువాత అంగుష్ట మాత్ర దేహుడైన జీవుడు తన శరీరాన్ని తాను చూస్తూ, చుట్టూ చెరి అందరూ తనవాళ్ళు దుఃఖిస్తూ వుండగా తాను దుఃఖిస్తూ వుంటాడు. అతనికి పిశాచత్వం రాకుండా వుండటం కోసం సంతానం కర్మచేయాలి.
పదిరోజులపాటు చేసే పిండోదశ దానాల వలన మరో శరీరము పుట్టి జీవుడు దాంట్లో ప్రవేశిస్తాడని గరుడపురాణం పలుకుతుంది.
పదిరోజుల కర్మ పూర్తయ్యేసరికి హస్తమాత్ర ప్రమాణం గలిగిన దేహంతో పదకొండవ, పన్నెండవ రోజులు ఆకలిదప్పులతో పిండ దానాదులు తింటూ పదమూడవ రోజు యమకింకరుల పాశముల చేత కట్టబడి హాహాకారం చేస్తూ ఒక సంవత్సరం ప్రయాణం చేసి, యమ లోకమైన నరకం చేరుకుంటాడు జీవుడు. తన కర్మసారానుసారం సుఖ దుఃఖాల ననుభవించి మళ్ళీ భూలోకం చెరి జన్మనెత్తుతుందా జీవి.
'మరి మంత్ర పూరితమైనటువంటి కర్మ చేయబడనివాళ్ళ గతి ఏమిటి? వాళ్ళకు సద్గతులు రావా?" అని ప్రశ్నించాను నేను.
అప్పుడు ప్రభాతస్వామి యిలా బదులిచ్చాడు-
'లోకంలో దరిద్రుడైన వ్యక్తికి ధనవంతుడైన మిత్రుడో, దాతో సహాయం చెయ్యవచ్చు. తాను స్వయంగా సంపాదించింది కాకపోయినా, స్నేహ, దానముల ద్వారా వచ్చిన ధనాన్ని దరిద్రుడనుభవించినట్లే, స్వయంగా పుణ్యకార్యములు చేయని జీవుడికి కూడా తన పుత్రులు చేసే శ్రాద్ధకర్మల ఫలితంగా ప్రేతాత్మ విముక్తి పాపవిమోచనము లభించి కాస్త మంచి స్థితికి పోగలుగుతాడు.
పుణ్యం చేసుకున్న జీవుడికి పుణ్యలోకములు, సద్గతులు ఎలాగూ లభిస్తాయి. తపోనిష్టులైన మహర్షులు కనిపెట్టిన అద్భుత ఉపకార పద్ద్తఃయ్ యిది. ఈ మార్గాన్ని అనుసరించి తమని కని పోషించినందుకు పెద్దల రుణాన్ని పిన్నలు తీర్చుకోగలుగుతారు.
కర్మకాండ లేనివారు దానము, శ్రాద్దము, జల తర్పణము లభింపక ప్రేతరూపమును పొంది నిర్జనారణ్యమునందు బహుదుఃఖితులై కల్పాంతము తిరుగుచుందురు. చేసిన కర్మ అనుభవింపక కోట్ల కల్పములు గడిచినను ఆ జీవుడికి విముక్తి వుండదు. ఏ ప్రాణికైననూ కర్మ అనుభవించకుండా యతనా దేహము పోదు- మనుష్య దేహము రాదు.
ప్రేతత్వ ప్రారంభదశలో జీవుడు స్వప్నావస్థ వంటి స్థితిలో వుంటాడు. తాను శరీరాన్ని విడిచిపెట్టాను, చనిపోయాను అన్న సంగతి అర్ధం చేసుకోవటానికి కొంతకాలం పడుతుద్న్హి. ఆ జీవి ఏ స్థితిలో, ఏ కారణం వల్ల మరణించాడో ఆ బాధ, భయము, దుఃఖము వదలవు.
అయితే ఎల్లకాలమూ అలా వుండదు. ప్రకృతి సహజమైన పరిణామం చెంది, మరణాంతరపు తన స్థితిని తెలుసుకోగలుగుతాడు. మనుష్యులను, పాంచభౌతిక ప్రకృతినీ చూడగలుగుతాడు. తనలాగా గాలిలో తిరిగే ప్రేతజీవులను చూడగలుగుతాడు. వాటితోను మాట్లాడ గలడు. అంతవరకే! ఆపైన వుండే జీవులను గురించి అతడికేమీ తెలియదు.
ప్రేతత్వం వదలక తమ పూర్వస్మృతుల కల్లోలపు సుడిగుండాలలో పడి కామ, క్రోధ, లోభ, మోహ, మధ, మాత్సర్యవశులై, తీవ్రస్వభావులై, ఆకలిదప్పికలు, విపరీత వాంఛలతో నియతశక్తి గలిగిన మానవ శరీరం దాటి వాయు శరీరంలో వుండటం చేత వందలరెట్లుగా మనసు సృష్టించుకున్న బాధా, భయం, భూమికల నుండి ఇంద్రియ వికారాల నుండి బయటపడలేక చిత్రవధను అనుభవిస్తూ వుంటాడు.